భువనగిరి గుట్ట మీద (ఆత్మ)హత్య - పార్ట్ 5

విక్రం వాళ్లకి ఇచ్చిన మరో మాట ప్రకారం విశాల మరణం విషయం నా స్నేహితుడు మరియు విశాల మాజీ భర్త అయిన సందీపుకి నేను చెప్పలేదు. అప్పట్లొ అతను నాకు పెద్దగా టచ్ లో కూడాలేడు. దానికి ఒక కారణం వుంది. విశాలను సందీపు అతను పెళ్ళి చేసుకొని వచ్చాక వాళ్ళ ప్రేమకి సహకరించిన నన్ను, మరో మిత్రుడినీ అతను కొంత దూరంగా వుంచుతూ వుండడముతో మేమూ అతడిని అప్పట్లో పెద్దగా పట్టించుకోవడం మానివేసాము. సందీప్ అలా ఎందుకు కాస్త దూరంగా వుంటున్నాడో మాకు పెద్దగా అర్ధమయ్యేది కాదు. బయట బయటనే కలిసేవాడు, ఇంటికి పిలిచేవాడు కాదు. సంకుచిత మనస్థత్వంతో అలా ప్రవర్తిస్తున్నాడని అనుకున్నాం.

అయితే అసలు విషయం కొన్నాళ్ళ తరువాత తెలిసింది. విశాల భోనగిరిలో వుంటున్నరోజుల్లో విశాల అమ్మగారు అయిన వాణి ఆంటీ అవో ఇవో పనుల నిమిత్తం సూర్యాపేటకి వస్తుండేది. ఒకరోజు నన్ను ఆమె కలిసి విశాలకీ, సందీపుకీ జరిగిన గొడవల గురించి చెప్పింది. అందులో ముఖ్యంగా జరిగిన గొడవ గురించి విని నేను అవాక్కయ్యాను. ఆ విషయం మీకు వెళ్ళడించడం సముచితంగా వుంటుందో లేదో అని తటపటాయిస్తూ ఈ భాగం వరకు ఆగాను. మీరు వాస్తవ పరిస్థితి అర్ధం చేసుకోవడం కోసం ఇప్పటికీ తటపటాయిస్తూనే వెళ్ళడిస్తున్నాను.

విశాలకీ, సందీపుకీ ముఖ్యంగా గొడవ నా గురించే జరిగేదట! నాతో విశాల చాలా సన్నిహితంగా వుంటుండేదని అతని అనుమానమట!! అలా నామీది అనుమానాలతో విశాలను అతను చాలా వేధించాడట. అతని వేధింపులకి తట్టుకోలేక, విసిగిపోయి విశాల ఒకసారి అతని అనుమానాలని అంగీకరించి 'అవును, శరత్ తో సన్నిహితంగా వుండేదానిని. సరేనా! ఇక ఏం చేస్తావో చేసుకో' అని అక్కడనుండి వచ్చేసిందిట.

సందీప్ అనుమానం వాస్తవమేనా అని అడిగింది వాణి ఆంటీ. ఏమాత్రమూ వాస్తవం లేదని చెప్పాను. అటువంటి విషయాలు అప్పట్లో నాకు సాధారణమే అయినా విశాలతో అంత సాన్నిహిత్యం లేదు నాకు. ఆమె నాకు ఓ చక్కటి మిత్రురాలు అంతే. ఇలాంటి అనుమానం వున్నవాడు మరి విశాలను ఎందుకు పెళ్ళిచేసుకున్నాడో అర్ధం అయ్యింది కాదు. పెళ్ళి చేసుకున్నాక ప్రేమ మత్తు దిగి ఏవేవో సందేహాలు బయల్దేరి వుంటాయి. వాళ్ళిద్దరూ విడిపోక ముందు సందీపు నన్ను అడిగితే అతని అనుమానాలని నివృత్తి చేసివుండేవాడిని.

ప్చ్. నేను చేసిన పెళ్ళి నా వల్లనే పెటాకులవడం నాకు బాధ కలిగించింది. నా పొరపాటు వున్నా లేకున్నా నా వల్ల ఆమెకు తీరని అన్యాయం జరిగింది కాబట్టి దీనికి పరిష్కారం ఒకటి అప్పట్లో ఆలోచించాను. నావి ఎలాగూ విశాలభావాలే కాబట్టి నేను స్థిరపడిన తరువాత ఆమెకు ఇష్టమయితే పెళ్ళి చేసుకోవాలని. అయితే నా వుద్దేశ్యాన్ని ఆమెకు ఎప్పుడూ తెలియపరచలేదు. అంతలోకే ఆమె మరణించడం జరిగింది. ఇలా ఎందుకు చేసావంటూ సందీపునీ నేను ఎప్పుడూ అడగలేదు. వాళ్ళు విడిపోయాక ఇవన్నీ తవ్వుకొని ఏం ప్రయోజనం అనుకొని, అతని నిజ స్వరూపం తెలిసి కాస్త దూరంగా వుంటూ వచ్చాను. విశాల మరణ వార్త అతనికి చెప్పకపోవడానికి కారణం ఇదీ.

రెండు మూడు నెలల తరువాత విశాల మరణవార్త సందీపుకి చేరి నిజమా కాదా తెలుసుకోవడానికి నా దగ్గరికి వచ్చాడు. నిజమే అని చెప్పాను. ఈ పరిస్థితులల్లో భోనగిరికి వెళ్ళి ఈ విషయాలని కలబెడితే పోలీసులు అనుమానంతో నిన్నే అరెస్టు చేసే అవకాశం వుంటుందని చెప్పి అతనిని అటువైపు వెళ్ళకుండా ఆపాను. విశాలను హత్య చేసిన వెంకట్ మీద ఎలాగయినా ప్రతీకారం తీర్చుకోవాలని ఆవేశపడ్డాడు. తరువాత కూడా అప్పుడప్పుడూ వెంకట్ మీద ప్రతీకారం తీర్చుకొని విశాలకు ఆత్మశాంతి కలిగించాలని అంటుండేవాడు.

సందీప్ నన్ను తన ఇంటికి పిలిచాడు. విశాల భోనగిరిలో వుంటున్నప్పుడు తమ మధ్య మళ్ళీ నడిచిన ప్రేమాయణం, లేఖల గురించి చెప్పుకువచ్చాడు. చివరి లేఖలో ఆమె కోడ్ పద్ధతిలో వ్రాసిన సందేశం చెప్పాడు. దానికి డీకోడ్ చేయడం అతని వల్ల కాలేదు. ఆ లేఖ నాకూ చూపించాడు. 'బావా ఒక రహస్యం చెబుతున్నాను. కనుక్కో' అని వ్రాసింది. డీకోడ్ చేయడానికి నేనూ శత విధాలా ప్రయత్నించాను కానీ అర్ధం కాలేదు. ఆమె మరణించిన కాలంలో గర్భవతి అయి వుండవచ్చు. ఆ విషయం ఏమన్నా చెప్పిందా? లేక వెంకట్ గురించి ఏమయినా చెప్పిందా? ఆ కోడ్ ఛేదిస్తే తన మరణ రహస్యం ఏమయినా బయటపడుతుందా?


ఆ కోడును నేను భద్రంగా వ్రాసుకొని జాగ్రత్త చేసాను. యు ఎస్ కు వచ్చిన తరువాత చాలా ఏళ్ళకు ఆ కోడుని చిన్నపాటి హ్యాకర్ అయిన నా మేనల్లుడికి, అతని మిత్రులకీ ఇచ్చి ఛేదించమన్నాను. వాళ్ల వల్ల కూడా కాలేదు.
నేను కెనడా నుండి, యు ఎస్ నుండి ఇండియాకు సెలవుల్లొ వచ్చినప్పుడు సందీపుని కలుస్తుండేవాడిని. మళ్ళీ బాగా సన్నిహితం అయ్యాడు. విశాల మరణించిన ప్రదేశానికి వెళ్ళి శ్రద్ధాంజలి ఘటించి రావాలని ఎప్పుడూ అనుకునేవారం. అది ఇప్పుడు కుదిరింది.


ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది.

హతురాలు ఇచ్చివెళ్ళిన కోడ్, విశాల మరణంపై ఇతర సందేహాలు/పుకార్లు , ఇంకా ఏమయినా మరచిపోయిన ముఖ్యవివరాలతో ముగింపు వచ్చే భాగంలో.

2 comments:

  1. తరువాయి భాగం కోసం ఎదురు చూస్తున్నాం !

    ReplyDelete
  2. కోడ్ ఈ భాగంలో చెప్తానన్నారు... మళ్లీ వచ్చే భాగం వరకు ఆగాల్సిందేనా.... సరే కానివ్వండి !

    ReplyDelete