భువనగిరి గుట్ట మీద (ఆత్మ)హత్య - పార్ట్ 2




(యదార్ధ సంఘటణ ఇది. భువనగిరి లేదా పరిసర ప్రాంతం చదువరులు ఎవరయినా వుంటే ఈ ఘటణ మీకు తెలిసే వుండవచ్చు - స్పందించండి. ఆ గుట్ట ఎక్కిన వారు వున్నా స్పందించండి. వ్యక్తుల అసలు పేర్లు ఉపయోగించలేదు. ఇవాళే సందీప్ తో ఫోనులో మాట్లాడి తన కథ బ్లాగుతున్నానని చెప్పా. వైదేహి ట్రేస్ కొంచెం తెలిసిందనీ ఎలాగయినా ఆమెను కలుస్తానని చెప్పాడు. )

సందీప్ చాలా విచారగ్రస్తుడయ్యాడు. భోనగిరి గుట్టమీద గుండంలో విశాల శవం బయటపడిందని నాకు తెలుసుగానీ ఖచ్చితంగా గుట్టమీద ఏ ప్రాంతమో, ఏ గుండమో నాకు తెలియదు. అదే విషయం సందీప్ కు చెప్పాను. ఇంకా పై గుట్టమీద కొన్ని కొలనులు, గుండాలు వున్నాయని ఒకవేళ అక్కడేమయినా బయటపడిందేమో నాకు తెలియదని చెప్పాను. చాలావరకు ఇక్కడి గుండాల్లోనే ఏదో ఒకటి అయ్యుంటుందని చెప్పాను.

ఇద్దరం కలిసి అక్కడవున్న గుండాల్లో ఏ గుండంలో విశాల ఆత్మహత్యకి పాలుపడివుండవచ్చో లేదా ఆమె హత్య జరిగివుండవచ్చో పరిశీలించాము. ఒక రెండు గుండాలు అటువంటి పరిస్థితులకు అనువుగా అనిపించాయి. అలా చర్చ జరుగుతునంతసేపు అతని ముఖాన్ని జాగ్రత్తగా గమనించాను. ఏమో ఎవరు చెప్పొచ్చారు? ఈ సందీప్ నే ఆ అమ్మాయిని హత్య చేసి వుండవచ్చుకదా. చెప్పలేం. నా దగ్గర అమాయకత్వం నటిస్తున్నాడేమో. చాలా దగ్గరి స్నేహితుడే కానీ ఇటువంటి విషయాలలో అందరూ నిజం చెబుతారా?

ఒకవేళ సందీప్ నే ఆ హత్య చేసివుంటే ఆ గుండాల్లో నన్నూ తోస్తాడేమో - నామీద అతనికి కొన్ని అనుమానాలున్నాయని తెలుసు. లేక నన్నూ అతను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడేమో! కొంపదీసి ఈ హత్య చేసింది నేనే అని సందీప్ అనుకోవడం లేదు కదా. అలాంటి ఏ మూర్ఖపు అనుమానంతోనో లేక నిజంగా తనే హంతకుడు అయివుండి తనలో వున్న అనుమానాలతోనో, మరెందుకో నన్ను ఈ గుండాల్లో తోసినా తోస్తాడు అని ఎందుకయినా మంచిది అని అక్కడ వున్నంతసేపు వళ్ళు దగ్గరపెట్టుకొని జాగ్రత్తగా వున్నాను. అతని కదలికల్ని ఓరకంటా గమనిస్తూ మరీ గుండాలకి దగ్గరగా వెళ్ళకుండా అప్రమత్తంగా వున్నాను. అసలే వేరే ఎవరికీ చెప్పకుండా ఈ గుట్ట ఎక్కాము మేము. చుట్టూ చూసాను - వేరే ఎవరూ లేరు - గుట్టమీది ఆ ప్రాంతంలో.

మరి అతను కూడా అలాగే నాపట్ల సందేహంతో వుండి జాగ్రత్తగా మసలుకుంటున్నాడేమో తెలియదు. ఒకవేళ నిజంగానే సందీపునే హంతకుడయితే విశాలలాంటి చక్కటి అమ్మాయిని హత్యచేసినందుకు గానూ అతన్ని ఆ గుండాల్లోకి తోసినా తప్పులేదు! నేను తనని అనుమానిస్తున్నానని సందీపుకి తెలుసు.

విశాలను హత్యచేసిన వెంకట్ ను ఇక్కడే బొందపెట్టాలని ఆవేశంగా మాట్లాడాడు సందీప్. అతన్ని అనునయించాను నేను. ఆ తరువాత గుట్ట పై భాగం మీదికి వెళ్ళాము. అక్కడ రాజభవనం, కొలనులు, గుండాలు వున్నాయి. నా స్నేహితురాళ్లతో, స్నేహితులతో అక్కడ గడిపిన క్షణాలు గుర్తుకువచ్చాయి. అక్కడ వున్న గుండంలోంచి ఏనుగులతో నీళ్ళు తోడించేవారు అని ప్రతీతి. ఆ మధ్య కూడా ఇద్దరు అబ్బాయిలు ఆ గుండంలో మునిగి చనిపోయారు. పక్కనే వున్న కొలను చూసాము. అక్కడే నా చిన్నప్పుడు ఫ్రెండ్సుతో పిక్నిక్ చేసుకున్నాను. ఆ కొలనులోనే విశాల చనిపోవడానికి అవకాశం వుందన్నాడు సందీప్. అలా అయివుండకపోవచ్చు అన్నాను నేను. ఆమె చనిపోయినప్పుడు గుండంలో చనిపోయిందని విన్నాను కానీ కొలనులో అని కాదు. కొలను అంత లోతుగా వుండకపోవచ్చు - పైగా ఏటవాలుగా, విశాలంగా వుంది - తేలిగ్గా అందులోనుండి బయటకు రావచ్చు.

తరువాత అక్కడ వున్న గుండం శ్రద్ధగా పరిశీలించాము. అక్కడ ఇంకా కొంతమంది సందర్శకులు కూడా వున్నారు. విశాల చాలావరకు ఇక్కడే పోయివుండవచ్చని సందీప్ తీర్మానించాడు కానీ నేను అంతగా కన్విన్స్ కాలేదు. నా అనుమానం అంతా గుర్రాల శాలల దగ్గర వున్న గుండాల మీదే. ఈ టపాలో వున్న ఫోటోలు ఆ గుండాలవే. విశాల చెల్లెలు వైదేహి మాతో పాటు గుట్టమీదికి వచ్చివుంటే తన అక్కయ్య ఎక్కడ చనిపోయిందో మాకు సరిగ్గా చూపించివుండేది. ఆమెకోసం భోనగిరిలో వెతికాము కానీ దొరకలేదు.


ఎత్తయిన గుట్టమీద వున్నాం కనుక చల్లగాలి రివ్వున వీస్తోంది. వర్షం వచ్చే సూచనలు కనిపించాయి. తరువాత రాజభవనం అంతా తిరిగిచూసి అక్కడ గోడల మీద కూర్చొని భువనగిరి టవునును చూస్తూ విశాల గురించి మాట్లాడుకుంటూ అమె స్మృతులలోకి వెళ్ళిపోయాము.

వచ్చే టపాలో ఫ్లాష్ బ్యాక్.

4 comments:

  1. ఇది మీరు కధలాగ కాసేపు,కాసేపు తెలిసిన విషయాన్ని చెపుతున్నట్టు రాస్తున్నారు.ఎలా ఫాలో అవ్వాలో తెలియట్లేదండి.అన్నట్టు మొన్న వేర కధ ప్రారంభం చదివాను.అది ఇప్పుడు కనిపించట్లేదు.అది రాయడం ఆపేసారా?

    ReplyDelete
  2. ఇది అంతా గతకాలంలో జరిగినా అక్కడక్కడా వర్తమానంలా వ్రాసాను - సవరించుకుంటాను.

    అవునండీ - వేరే ధారావాహిక సూక్ష్మగ్రాహి బాగా రాలేదని తీసివేసాను. కొంతకాలం సీరియల్స్ కి విరామం ఇస్తున్నాను.

    ReplyDelete
  3. మొదటి భాగంలో 'వైదేహి' అని... రెండో భాగంలో 'వైశాలి' అని ప్రస్తావించారు.... ఇద్దరూ ఒకరేనా?

    ReplyDelete
  4. @ చైతన్య
    ఇద్దరూ ఒకరేనండి. సవరించాను. ధన్యవాదములు.

    ReplyDelete