విక్రం ఇంటిలోకి వెళ్ళాను. జరిగినదంతా తెలుసుకున్నాను. అయిదురోజుల క్రితం రోజూలాగే స్కూల్ కి వెళ్ళిన విశాల ఆరోజు ఎంతకూ తిరిగిరాలేదట. వారినీ వీరినీ విచారించగా ఒకరిద్దరు గుట్టమీదికి ఎక్కుతుండగా చూసామని చెప్పారంట. విక్రం గుట్ట మీదికి ఎక్కి వెతికాడు. ఒకచోట గుండం వద్ద చెప్పులు మాత్రం కనిపించాయట - మనిషి మాత్రం కనిపించలేదు. అప్పటికే చీకటి పడటముతో భయం వేసి వెతుకులాట ఆపి విక్రం క్రిందకు వచ్చాడట.
మరుసటి రోజు ఉదయం అందరూ వెళ్ళి వెతికితే విశాల ఎక్కడా కనిపించలేదు. ఈతగాళ్లని పెట్టించి చెప్పులు కనిపించిన దగ్గరి గుండంలో వెతికించితే విశాల శవం బయటపడింది. పోలీసులు విచారణ జరిపి అనుమానంతో వెంకటును అరెస్ట్ చేసారు. విశాల కనిపించకుండా పోయిన రోజు విశాలతో పాటుగా వెంకట్ కూడా గుట్ట ఎక్కాడని పుకారు. వీరిద్దరి మధ్య ఎప్పటినుండో ప్రేమ నడుస్తున్నదనీ, ఏవో తేడాలు వచ్చి విశాలని వెంకట్ హత్య చేసాడనీ అభియోగం. విశాలతో గుట్టమీదికి ఎక్కిన విషయం నిజమేననీ, వాదులాట జరిగాక తాను తిరిగివచ్చాననీ, విశాలను తాను హత్య చేయలేదనీ వెంకట్ ఒప్పుకోలు. ఇది అయినా నిజమేనా లేక పోలీసుల టార్చర్ భరించలేక ఇంతమాత్రమయినా ఒప్పుకున్నాడా అనేది మనకు తెలియదు.
ఆ రోజు సాయంత్రం విక్రం వాళ్లతో కలిసి వారి దగ్గరి బంధువుల ఇంటికి వెళ్ళాను. అక్కడ ఆందరు నన్ను బ్రతిమలాడి ఒక విషయాన్ని నాతో ఒప్పించారు! విశాల సందీపుల ప్రేమ, పెళ్ళి వ్యవహారం భోనగిరిలో ఎవరికీ తెలియదు. ఇప్పుడు నేను ఆ విషయం ఇక్కడ ఎవరికయినా బయటపెడితే విశాలకు చెడుపేరు వస్తుంది - వెంకట్ మీది అభియోగం తేలిక అవుతుంది - కేసు పక్కదారి పడుతుంది. సందీపు గురించి మౌనంగా వుండటానికి నేను అంగీకరించాను.
మరుసటి రోజు నేను వెళతానంటే విశాల వ్యవహారం ముగిసేదాకా నన్ను అక్కడే తోడుగా వుండమని అందరూ అన్నారు. వారి ఇంటిలోనే కొద్దిరోజులు వున్నాను. వెంకట్ వాళ్ళు వీరితో రాజీకి వచ్చారు. నష్టపరిహారంగా కొంత డబ్బు ఇస్తామన్నారు కానీ విక్రం వాళ్ళు ఒప్పుకోలేదు. నాలుగయిదు రోజులు అలా రకరకాల చర్చలూ, వాదోపవాదాలు, వ్యూహాలూ జరిగాయి. మహిళా హక్కుల సంఘం వారు కూడా వచ్చి విచారించారు. అప్పటి భోనగిరి మేయర్ (పేరు నాగేందర్ అనుకుంటా) కూడా పరామర్శించడానికి వచ్చి తమ సంతాపం, సహకారం ప్రకటించారు. ఆశ్చర్యకరంగా ఆ పట్టణ మేయర్ మా నాన్న గారి ప్రియ శిష్యులలో ఒకరు! విశాల వాళ్ళు మాకు బాగా తెలిసినవారు అని అర్ధం అవడముతో ఈ విషయంలో మేయర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.
చివరికి అందరూ కలిసి వెంకట్ వాళ్లకీ, విక్రం వాళ్లకీ రాజీ కుదిరించారు. నష్టపరిహారం క్రింద వెంకట్ వాళ్ళు కొంత డబ్బు చెల్లిస్తారు - విక్రం వాళ్లు వెంకట్ మీద కేసు తీయించేస్తారు. వెంకట్ ప్రభుత్వ ఉద్యోగి/ టీచర్ కాబట్టి ఈ విధంగా తన ఉద్యోగం ఊడకుండా వుంటుంది. ఇలా విషయాలన్నీ ఒక కొలిక్కి రావడంతో నేను భోనగిరి నుండి సూర్యాపేటకి తిరిగివచ్చాను.
అయితే ఇంతకీ విశాలది హత్యనా, ఆత్మహత్యనా? హత్య అయితే చేసింది ఎవరు? వెంకట్ మాటల్లో నిజం వుందా? అతను చెప్పిందే నిజమయితే అతను గుట్ట దిగి వెళ్ళిన తరువాత ఒంటరిగా వున్న విశాలను మరెవరన్నా ఎందుకన్నా హత్య చేసారా? లేక విశాలనే వెంకటుతో జరిగిన గొడవతో కలత చెంది ఆత్మహత్య చేసుకుందా? ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి వేరే బలీయమయిన కారణాలు వున్నాయా? ఈమె మరణంలో సందీప్ పాత్రం ఏమయినా వుందా? లేక స్వంత అన్న విక్రం పాత్ర ఏమయినా వుందా? ఇలాంటి శేష ప్రశ్నలు వున్నాయి. మరణించడానికి కొద్దిరోజులకు ముందు హతురాలు కొన్ని క్లూస్ విడిచిపెట్టింది. ఆ వివరాలన్నీ వచ్చే భాగంలో.
ఇప్పటికీ ఆ హత్య వెనక రహస్యం తెలియలేదు అన్నారు... మరి వెంకట్ గారికి హత్యతో సంబంధం ఉందని నిరూపణ కానప్పుడు వాళ్ళు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఏముంది? అసలు నష్టపరిహారం ఎందుకు ఇచ్చారు?
ReplyDelete@ చైతన్య
ReplyDeleteహత్యాభియోగం వున్నందున అది తేలడానికి చాలా కాలం పడుతుంది. అతను ప్రభుత్వోద్యోగి కాబట్టి ఉద్యోగానికి చిక్కులు వస్తాయి. అతనే చంపినా, చంపకపోయినా గుట్ట మీదికి ఆమెను అతడే తీసుకువెళ్ళాడు కాబట్టి బాధ్యత చాలావరకు తనదే వుంటుంది. ఇటువంటి కారణాల వల్లే వారు రాజీకి వచ్చి పరిహారం చెల్లించారు.