అభిప్రాయాల ప్రభావం

కెనడాకి కొత్తగా వచ్చిన రోజులవి. 1997 చివర్లో కొంతమంది తెలుగు వారితో కలిసి ఒక ఇంట్లో వుంటున్నాను. కుటుంబానికీ, కన్న దేశానికీ దూరంగా, బ్రతుకు తెరువు కోసం వెతుక్కుంటూ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ళబుచ్చుతున్న రోజులవి. మా వాళ్ళదెవరిదో జూనియర్ వేణుమాధవ్ మిమిక్రీ క్యాసెట్టులో హాస్య సన్నివేశాలుంటే అందరం తరచుగా కలిసి వింటూ నవ్వుకుంటూ, తుళ్ళుకుంటూ మా బాధలనీ, భయాలనీ మరచిపోయేవాళ్ళం.

కొన్ని వారాలకి మా రూమ్మేట్స్ యొక్క మరో స్నేహితుడు ఇండియా నుండి దిగాడు. ఓ రెండు రోజులయ్యాక వేణు మాధవ్ క్యాసెట్టు బావుందనీ, అప్పుడప్పుడు వింటుంటామని ఆ క్యాసెట్టు వినిపించారు. అతనూ మా అందరిలాగే విని నవ్వుతే అతని గొప్పదనం, ప్రత్యేకత ఏముంటుంది? కొద్దిసేపు విని ముఖం చిట్లించాడు. చీప్ కామెడీ అనేసి మరో పనిలో మునిగిపోయాడు. మా వాళ్ళు మరికొద్దిసేపు విని ఆక్యాసెట్టు మూసివేసారు. 

కొద్దిరేజులయ్యాక మా (పాత) రూమేట్లను సరదాగా ఆ క్యాసెట్టు విందామా అని అడిగాను. ఆ ఏం కామెడీ లెండి అది అని ముఖం చిట్లించారు. ఇప్పుడు వాళ్ళు ఆ క్యాసెట్టు వింటామంటే వారి స్నేహితుని ముందు చులకనయిపోరూ? అంతేకాకుండా వారి అభిప్రాయాన్ని వారి స్నేహితుని అభిప్రాయం ప్రభావితం చేసివుంటుంది. వార్నీ అనుకున్నా. వీరికి స్వంతంగా ఓ వ్యక్తిత్వం లేదనుకున్నా. నా మానాన నేను ఆ క్యాసెట్టు వినేసుకున్నా. ఎవడేమనుకుంటే నాకేం, ఎవడి అభిప్రాయం ఏదయితే నాకేం? చక్కటి హాస్య సన్నివేశాలవి. అప్పుడప్పుడు నేనొక్కడినే వింటూ ఎంచక్కా ఆనందించేవాడిని. 

అలాగే మనలో చాలమందికి స్వంత వ్యక్తిత్వాలూ, అభిప్రాయలూ వుండవు. ఒహవేళ వున్నా కూడా ఎంతో కాలం నిలబడవు.  పక్కోడో లేదా ఓ ప్రముఖుడో ఓ అభిప్రాయం వ్యక్తం చెయ్యగానే అదే నిజమే అనుకుంటాం. మన భావాన్ని తుంగలో తొక్కేస్తాం. అలా మనకంటూ ఓ వ్యక్తిత్వం లేదని నిరూపించుకుంటూనే వుంటాం. ఎంతటి స్నేహితుడయినా, ఎంతటి గౌరవనీయుడే అయినా కూడా అతగాడు అన్నిట్లో పరిపూర్ణుడు కాడనీ, కొన్నిట్లోనే అతని అభిప్రాయాలు గణనీయమయినవిగా వుంటాయనీ మనం గుర్తించం. ఈజీగా ఇతరుల ప్రభావానికి దాసోహం అవుతాం.

అలా అని ప్రతియొక్క సలహానూ, అభిప్రాయాన్ని తిరస్కరించాలని కాదు. ఏది సరి అయిన సలహానో కాదో నిర్ణయించుకోగల సత్తా మనకుండాలి. అందరి సలహాలను, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి కానీ నిర్ణయం, వ్యక్తిత్వం మనదయివుండాలి. మనం వీజీగా ప్రభావితం అయిపోతున్నామని తెలిస్తే ఇతరులు మరింత ఉత్సాహంగా మనల్ని, మన భావాలని ఆజమాయిషీ చేయడానికి ప్రయత్నిస్తూనేవుంటారు.  అలా క్రమంగా మనం ఇతరుల చెప్పుచేతల్లోకి వచ్చి మనం వారికి అనుయాయుల్లాగా అయిపోతాము. ఇహ మనకంటూ ఓ స్వంత వ్యక్తిత్వం వుండబోదు కనుక ఇక మనం వారికి చెంచాలు అయిపోతాం. ఎవరినెక్కడ, ఏ భావాన్ని ఎక్కడ నిరోధించాలో తెలిస్తేనే నిలదొక్కుకోగలుగుతాము.     

అయితే ఈ విషయాలకో మినహాయింపు వుందండోయ్. బిడిఎస్సెం (Search: BDSM) జీవిత విధానంలో మనం కావాలనే మన మనస్సు మీద, శరీరం మీద అధికారాన్ని, ఆజమాయిషీనీ  ఇచ్చెయ్యవచ్చు. అప్పుడు మన వ్యక్తిత్వాన్ని ఇష్టపూర్తిగా దాసోహం చేస్తామన్నమాట. అలాగే మనం ఆరాధించే వ్యక్తులు ఏమి చెప్పినా, ఏది చెప్పినా, తప్పు చెప్పినా, అది మనకు తెలుస్తూనే వున్నా అది మనకు మధురంగానే వుండి వింటూనే వుంటాం, ఆచరిస్తూనేవుంటాం. ఆరాధనలో, ప్రేమలో ఏదయినా (దాదాపుగా) సరి అయినదే కాబట్టి, ప్రియురాలి వ్యక్తిత్వమే మన తత్వం అయిపోతుంది కాబట్టి ఈ లెక్కలేమీ అక్కడ వేసుకోనఖ్ఖరలేదు. మనకు ఇష్టం అయినవారికి పూర్తిగా, సంపూర్తిగా, సంతృప్తిగా సమర్పించుకోవడమే బావుంటుంది. అక్కడ భేషజాలకు, పట్టింపులకూ పోనవసరం లేదు. అయితే బిడిఎసెంలో రక్షణ పదాలు ఎలాగయితే వుంటాయో ఈ ధోరణికీ కొన్ని మినహాయింపులు వున్నాయి, వుంటాయి. ఎందులోనయినా అతి అనేది మితంగానే వుండాలి కదా :)  

నేనూ కొంతమందిని ఆరాధిస్తూవుంటాను. వారు చెప్పింది సాధారణంగా వింటూ వుంటాను. అలాంటివారి దగ్గర నాకో వ్యక్తిత్వం వుందనే విషయం గుర్తుకుతెచ్చుకోను. అజెర్టివ్ గా అస్సలే వుండను. విషయాలు మరీ మించిపోతున్నాయంటే మాత్రం స్పృహలోకి వస్తుంటాను. అయితే నా భావాలకు తగ్గ వారినే ఆరాధిస్తుంటాను కాబట్టి వారు చెప్పేవన్నీ, ఆజ్ఞాపించేవన్నీ సాధారణంగా నాకు మోదాన్ని కలిగించేవే అయివుంటాయి. మరీ కాంఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్ ఏర్పడితే అప్పుడో పని చేస్తాను - అప్పుడు నాకో మనస్సంటూ వుందనేది గుర్తుకు తెచ్చుకుంటాను. ఆ ప్రియురాల్ని పీకి పడేసి  మరో ప్రియురాలిని వెతుక్కుంటాను. అందులో సందేహమేమీలేదు - ఎంతయినా సరే తనకు మాలిన ధర్మం, ఆరాధన పనికి రాదు కదా.

4 comments:

 1. 2007 నా మొదటి బ్లాగులో సేం ఇలాగే అంటే ఇదే అర్థం వచ్చేవిధంగా "ఆలోచనలు ఎవరివయినా కావచ్చు నిర్ణయం మాత్రం మనదే కావాలి" అని ఒక పోస్ట్ రాసాను. మళ్ళీ అది గుర్తు తెచ్చారు నాకు. మొదటినుండి చివరిదాకా ఆసక్తిగా చదివించారు.. చివరి పేరా మటుకు నవ్వు తెప్పించింది.. ఒహో ఇదంతా ప్రియు"రాళ్ళ" (కిడింగ్) కోసమా అని.. :-) కనీసం మీ మనసు, వ్యక్తిత్వం వాళ్ళ దగ్గర ఉంచారు సరే, వాళ్ళకే మాత్రం వ్యక్తిత్వం ఉందో గమనించారా? వాళ్ళెంత చెప్తే అంత అని మనసు, కళ్ళు మూసేసుకున్నారా? (అదే చెప్పినట్లున్నారు కదా) ప్రియురాళ్ళకి వెరసి అందరి ఆడవాళ్ళకి వ్యక్తిత్వం ఉంటుంది శరత్ గారు.. పీకెయడానికి పక్కన పెట్టేయడానికి వాళ్ళు వస్తువులు కారు..

  ReplyDelete
 2. వ్యక్తిత్వం కి సంబంధించి ఒక చిన్న సంఘటన చెప్తాను.. 2 సంవత్సరాల క్రితం తెలుగు సినిమాకి నేను మా పిల్లలు వెళ్ళాము. సినిమా మా పిల్లలికి తెగ నచ్చేసింది.. (దీనికి కారణం అంతకుముందే మా బంధువుల పిల్లలు చూసి సినిమా గురించి అంచనాలు ఎక్కువ చెప్పడం.. వాళ్ళకి నచ్చింది కాబట్టి.. అనే తత్వం) మా పాప "అమ్మా! అక్కవాళ్ళకి మటుకు సినిమా నచ్చలేదని చెప్పకు బాగోదు అంది" అప్పుడు మా పాపకి చిన్న సైజ్ క్లాస్ తీసుకున్నా.. మన అభిప్రాయలు మనవి నాన్న.. ఇంకొకళ్ళవి మనవి చేసుకోకూడదు.. మనకి నచ్చలేదు అంటే నచ్చలేదు ఎందుకు నచ్చలేదో కూడా మనదగ్గర కారణం ఉంది.. ఇంకొకళ్ళ కోసం మన అభిప్రాయలను నిర్ణయాలను మార్చుకోకూడదు అని... అది ఏదయినా కావచ్చు సినిమా కావచ్చు జీవితానికి సంబంధినంతవరకు ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టకుండా మన అభిప్రాయలను , నిర్ణయాలను గౌరవించుకోవాలి " అని..

  కొసరు: వాళ్ళ పిల్లలికి ఈ సినిమా తెగ నచ్చేసింది కాబట్టి మా బంధువుల parents కి కూడా సదరు సినిమా సూపర్.. ఈ విషయమై( నేను బాలేదు అని అన్నందుకు) వాళ్ళెవరు నాతో ఒక రెండు నెలలు మాట్లాడలేదు.. :-)

  అలాగే ఈమధ్య చూసిన ఖలేజా... ఇదే దోరిణి.. పిల్లలికి నచ్చింది కాబట్టి మనకీ నచ్చేయాలి అంటారు.. :(

  ReplyDelete
 3. @ రమణి
  :)

  వారి పర్సనాలిటీస్ నచ్చుతాయి కాబట్టే ప్రియురాళ్ళుగా చేసేసుకుంటాను కదండీ. అందుకే అంకితం అయిపోతూవుంటాను. అలా అని నన్ను బొత్తిగా అడ్వంటేజ్ తీసుకుంటే మాత్రం హెచ్చరిస్తుంటాను. అయినా సరే అలాగే చేస్తుంటే మాత్రం పక్కనపెడతాను. నా టపాలో మరీ పీకేస్తాననకుండా పక్కన పెట్టేస్తా అనుండాల్సింది. వాళ్ళూ నన్నూ అనవసరం అనుకున్నప్పుడు పక్కన పడేస్తుంటారు లెండి. ప్రియురాళ్ళు ఏమయినా పెళ్ళాలా అలాగే పట్టుకొని వేళ్ళాడటానికి? బాగా నచ్చితే ప్రియురాలిగా చేసేస్కుంటాం, మామూలుగా నచ్చితే స్నేహితురాలిగా వుంచేస్తాం, అసలే నచ్చకపోతే ఆమెడ దూరంలోకి నెట్టేస్తాం. వాళ్ళూ అంతే. అలాగే వుండాలి కూడానూ. అంతేకాని ఓ ఇష్టపడ్డామని చెప్పి వాళ్లతో నష్టపడ్డా మొహమాటానికి పోయి అలాగే ప్రేమ నడిపించొద్దు, నటించొద్దు.

  ReplyDelete
 4. @ రమణి
  పిల్లలకి చక్కగా చెప్పారు.

  పిల్లలకి నచ్చితే మనకూ సినిమా నచ్చాలంటారా వాళ్ళూ :)) అలా అయితే మా అమ్మలుకి శక్తి నచ్చింది. దాన్ని నేనూ నచ్చుకోవాలంటే బాప్రే బాప్!

  ReplyDelete