శుక్రవారం 27 జనవరి 2012

ఆ అమ్మాయినే చూస్తూ చదివేసేవాడిని

ఇంకో రకంగా చెప్పాలంటే ఆమె చూస్తుండగా నేను చదివేసేవాడిని. ఈ రోజు ముందు టపాలో మా ఇంటిముందు ఇంట్లో వుండిన లంబాడా సిస్టర్స్ గురించి వ్రాసాను కదా. వారు మొత్తం అయిదుగురు అక్క చెల్లెళ్ళు.  ఆ సునీతకీ, పెద్దామెకీ  మధ్య ఇంకో సోదరి వుండేది. అయితే ఈ టపా పెద్ద సోదరి గురించే లెండి. ఓ ఆమే, నేనూ తెగ చూసుకునేవారం కానీ... ఏమీ చేసుకొనేవారం కాదు. ఆమె అంతగా నాకేసి పరిశీలనగా ఎందుకు చూసేదో నాకు అర్ధం కాకపోయేది. నేను ఇంటిముందు నిలిచివున్నా చూసేది, డాబా మీదికి ఎక్కినా చూసేది.  ఆమెని ఏదయినా అడుగుదామంటే ధైర్యం చిక్కేది కాదు. అలా వారాలు, నెలలు, ఏళ్ళు  గడుస్తుండేవి. 

నా డిగ్రీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే రోజుల్లో మా డాబా మీద తిరుగుతూ పుస్తకాలు చదివేవాడిని. ఆమె అలా చూస్తుంటే చాలా బాగా చదవబుద్ధి అయ్యేది. అలా ఆ పరీక్షల్లో ప్రధముడిగా కాకపోయినా కనీసం ఉత్తీర్ణుడిని అయ్యాను. డిగ్రీ నేను సరిగ్గా చదివేవాడిని కాదులెండి, సోషల్ సర్వీసుకి వెళ్తా అంటే మా నాన్న డిగ్రీ పూర్తి చేసి వెళ్ళమన్నాడు. అందుకే కాలేజీకి కూడా సరిగా వెళ్లకుండా కష్టకష్టంగా  చదివేవాడిని. ఆమే గనుక చూస్తూ వుండకపోయినట్లయితే ఆ మాత్రం కూడా చదవక ఫెయిల్ అయివుండేవాడిని. నేను పాస్ అయ్యాక నా క్లోజ్ ఫ్రెండ్స్ చాలా ఆశ్చర్యపడ్దారు - నేను ఫెయిల్ కాకుండా ఎలా పాస్ అయ్యానని! అప్పుడు నా విజయ రహస్యం వాళ్లకి చెప్పాను. 

అలా చుట్టూవున్న అవకాశాలని మనకు అనుకూలంగా వినియోగించుకోవడం కొన్ని సార్లు సాధ్యం అవుతుంది. నాకయితే ఇలా డ్యూటీని, బ్యూటీని కలిపేసి పరస్పర ప్రోత్సాహంతో కృషికి వినియోగించడం అంటే ఎంతో ఇష్టం. తెల్లగా, సన్నగా, పొడుగ్గా వుండేది ఆ అమ్మాయి. ఆమె పెళ్ళికి నన్ను ఆహ్వాన పత్రిక ఇచ్చి ఆహ్వానించినట్లు గుర్తుకు వుంది కానీ నేను ఆ పెళ్ళికి వెళ్ళింది మాత్రం అస్సలు గుర్తుకు రావడం లేదు. ఎందుకబ్బా! ఏదయిన పనిబడి ఆ రోజుల్లో వేరే ఊరిలో వున్నానేమో తెలియదు. 

ఇహ ఆ సిస్టర్సులో మూడో ఆమె అయిన సునీతతో నాకు మంచి స్నేహం ఏర్పడింది అని చెప్పా కదా. ఆమె నాకు నచ్చేది గానీ గొంతే బర్రె గొంతులా వుండేది. ఆమె పాదాలు మాత్రం తెల్లగా బొద్దుగా భలే మొద్దొచ్చేవి. ఆమెని ప్రేమిద్దామనుకున్నా కానీ కాస్త చిన్న పిల్ల అని వదిలేసాను.

రోజూ మీ ఇంటిపక్కనే ఎందుకు ఉ...(బీప్) పోస్తారు?!

ఇది ఇదివరలో వ్రాసానో లేదో గుర్తుకులేదు. మా సూర్యాపేట ఇంటికి కొద్ది దూరంలో ఎదురుగా వున్న ఇంట్లో కొంతమంది లంబాడా సిస్టర్స్ వుండేవారు. వాళ్ళ నాన్న ఉపాధ్యాయుడు. వాళ్ళ పెద్దమ్మాయి అస్తమానం ఇంటిగడప మీద నిలబడి వచ్చేపోయెవారినీ అలాగే ఎదురింటివారినీ అనగా నన్నూ చూస్తుండేది. ఆమె చూస్తున్నప్పుడు నేను కూడా చూడకపోతే ఆమె మనోభావాలు గాయపడక మానవని జాలి తలంచి పాపం నేనూ చూస్తూవుండేవాడిని. అలా ఆమే, నేనూ ఊరకే చూస్తుండటం తప్ప ఎవరం అడ్వాన్స్ అయ్యింది లేదు. ఇలా పని కాదని ఇంకో వైపు నుండి కాస్త నరుక్కువచ్చే ప్రయత్నాలు చేసాను. 

ఆమెకు తొమ్మిదో తరగతి చదివే చెల్లెలు వుండేది. పేరు సునీత అని అనుకుందాం. ఆమె సరదాగా, ఉత్సాహంగా వుండేది. గలగలా మాట్లాడుతుండేది. ఆ అక్కకు క్లోజ్ కావాలంటే ఈ చెల్లెలికి క్లోజ్ కావాలని నిశ్చయించాను. మరి ఆ చెల్లెలికి సన్నిహితం అవడం ఎలా?  ఆమెకూ ఓ ఇద్దరు చెల్లెళ్ళున్నారు. వారు మూడో, నాలుగో చదుతుండేవారు. నెమ్మదిగా ఆట, పాటలతో వారికి దగ్గరయ్యాను. అలా వారి చిన్నక్క దారిలోకి వచ్చింది. ఆమెతొ క్లోజ్ ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఆమెను ప్రేమిద్దామా అని కూడా ఆలోచించాను కానీ ఎందుకో ఆగిపోయాను. ఆ పెద్దక్క మాత్రం కాస్తంత సన్నిహితం అయ్యిందంతే. 

సునీతతో బాగా స్నేహం చేస్తున్న రోజులవి. (ఒఠ్ఠి స్నేహమే లెండి, అడ్వాన్స్ తీసుకొవడానికి ఎందుకో అవకాశం దొరకలేదు). అప్పట్లో మా ఇంటి పక్క స్థలం ఖాళీగా వుండి చెత్త, చెట్లు, పొదలు వుండేవి. అందువల్ల నేను గానీ, మా ఇంటికి వచ్చిన నా స్నేహితులు గానీ మా ఇంటి పక్కకు వెళ్ళి కుక్కల్లాగా కాలు లేపి వచ్చేవారం. ఆ దృశ్యాలు ఎన్ని సార్లు చూసి డోక్కుందో కానీ  ఆమె ఓ రోజు మమ్మల్ని అనగా నన్నూ, మా మిత్రులని కలిపి నిలదీసింది రోజూ ఎందుకు మీ ఇంటి పక్కనే మూత్రం పోస్తారూ?! అని. పోనీ మీ ఇంటి పక్కకొచ్చి పొయ్యమంటావా? అని ఆమెని అడిగేసాను. వాళ్ళింటి పక్కన కూడా ఖాళీ స్థలం వుండేది లెండి. ఆమె నా జవాబుకి షాక్ తిని యాక్ అని చెప్పి ఆమె చెల్లెళ్లతో కలిసి వాళ్ళింటికి తుర్రుమన్నది. మళ్ళెప్పుడూ ఆ ప్రశ్న మమ్మల్ని అడగలేదు. మేము నిరభ్యంతరంగా మా పక్కింటోడు ఇల్లు కట్టేదాకా ఆ నేలని ఎంచక్కా పావనం చేస్తూపోయేం.

గురువారం 26 జనవరి 2012

మీతో లాభం లేదు గానీ...

ఈ మధ్య నా బ్లాగుల్లో ఓ చిన్న ప్రయోగం చేసి చూసా కానీ ఫలితాలు ఏమీ రాలేదు. నన్ను విజయపథంలో నడిపించడానికి, ఆ విషయాల్లో నా ఆలనా పాలనా చూడటానికి, ప్రోత్సహించడానికి, విమర్శించడానికి బ్లాగుల్లో ఎవరయినా ఆసరా దొరుకుతారేమో అని చూసా. అజ్ఞాతంగా నయినా ఎవరికయినా నామీద అలాంటి ఆసక్తి వుంటుందేమోనని చూసా కానీ అంతటి దృశ్యం లేదని తొందర్లోనే అర్ధమయ్యింది. విజయాల పట్ల ఆరాటం వున్న వారెవరయినా ఆయా విషయాలు చర్చిస్తూ నాకు తోడుగా వస్తారేమో చూసా కానీ అంత సీను లేదు. ఓక్కెక్కే. ఎన్నో ప్రయోగాలు చేస్తుంటాం - అందులో ఎన్నో విఫలం అవుతుంటాయి - కొన్నే సఫలం అవుతాయి. ఫర్వాలేదు - నా బ్యాకప్పులు నాకున్నాయి :)

ఈమధ్య కొన్ని ఏళ్ళుగా ఏదో జీవితాన్ని బాగానే ఈడ్చేస్తున్నా కానీ అలా సంతృప్తి పడకూడదు కదా. ఏడాదికేడాదికి మన గ్రాఫ్ పెరగకపోతే ఎలా? మన జీవితాన్ని ఒక స్థాయి దగ్గర పార్క్ చేసినట్లవదూ? ఇదివరలో చాలా ఆంబిషియస్సుగా వుండి ఉత్సాహంగా కదనుతొక్కుతూవుండేవాడిని. ఏంటో ఈమధ్య మరీ తాపీగా ఓ తడిగుడ్డ వేసుకొని బ్రతికేస్తున్నాను. ఒరే, అలాక్కాదురా, లేవరా అని నా అంతరాత్మ ఘోషిస్తున్నా పలు కారణాల వల్ల దాన్నీ నా పక్కనే బజ్జోపెట్టి లాలిపాట పాడేసాను. ఆ మధ్య పట్టుదలగా నన్ను నేను తన్నుకొని ఉరికి బోర్లాబొక్కల పడి తేరుకుంటున్నాను. వ్యాయామం గట్రా ఎక్కువై  ఓవర్ ట్రైనింగ్ సిండ్రోం లో పడి కొన్నాళ్ళు డవున్ అయ్యాలెండి. దాన్నుండి తేరుకుంటున్నా కాబట్టి మళ్ళీ మునపటి ఉత్సాహం వస్తోంది. 

ప్రతీ విషయంలోనూ మనకో తోడు వుంటే ఎంత బావుంటుందో ఈ విషయాల్లో కూడా తరచుగా చర్చిస్తూ వుండే ఓ తోడు వుంటే ఎంతో ఉత్సాహంగా కృషి చెయ్యబుద్ధి అవుతుంది. అందుకే ఓ తోడు కోసం బ్లాగుల్లో ఆహ్వానించా కానీ ఎవరూ ముందుకు రాలేదు. సో, నాకున్న స్నేహాలనే ఇలా ఉపయోగించుకోబోతున్నాను. కొన్నేళ్ళ క్రితం ఓ చక్కటి స్నేహితురాలిని ఇందుగ్గాను ఉపయోగించుకున్నాను. ఆమె బ్యుజీ అయిపోవడంతో పక్కన పెట్టాల్సి వచ్చింది. అయితే ఆమెతో కాస్సేపయినా మాట్లాడటానికి నాకు ఒక విండో దొరికింది. ఇంతకుముందు టపాలో ఉదయం ఆరింటికి జిమ్ము కోసం రైలెక్కుతా అన్నా కదా. అప్పుడు ఇండియాలో సాయంత్రం 5:30 అవుతుంది. అప్పుడు తను తీరికగానే వుంటుంది. ఎంచక్కా కాసేపు ఈ విషయాలు మాట్లాడెసుకొని ఆమె సలహాలూ, సూచనలూ తీసుకోవచ్చు. ఆమెకు నన్ను మందలించేంతటి చనువు కూడా వుంది కాబట్టి ఏవయినా పొరపాట్లు చేస్తే దులిపెస్తుంది కూడానూ. ఆమెది నిండయిన, ధాటి అయిన వ్యక్తిత్వం కాబట్టి నాకు ఆజ్ఞలూ ఇచ్చెయ్యగలదు. సరే, ముందు ఆమెకు పేరు పెట్టేద్దాం. మీరే చెప్పండి. వద్దులెండి - ఏ ఎల్లెమ్మో, పుల్లమ్మో లేక మమైత్ ఖానో అని సెలవిస్తారు. నేనే పెట్టేసుకుంటా.  

బిందు. నాకు ఇష్టమయిన పేర్లలో బిందు ఒకటి. అందుకే ఇకపై ఆమెని బిందుగా వ్యవహరిస్తాను. నిజానికి ఇవాళ ఆరింటికి రైలెక్కి ఆమెకు ఫోన్ చెయ్యాలనుకున్నా కానీ రైలే ఎక్కలేదు. నేనొకటి అనుకుంటే మీ దేవుడు మరోలా అనుకునేట్టుగా వున్నాడు. రాత్రి సరిగా నిద్రపట్టక ఉదయమే లేవలేకపోయాను. ఇహ రేపు చూడాలి. బిందు బావుంటుంది. మంచి వ్యక్తిత్వం, ఉత్సాహం, తెలివి, అందం, ఆత్మవిశ్వాసం ఆమెలో మూర్తీభవించి వుంటాయి.  కంఠస్వరం కోయిల లాగే వుంటుంది. తన స్థాయిలో ఎన్నో విజయాలను సాధించి పరిపూర్ణ జీవితాన్ని గడిపేస్తోంది. తను చక్కటి వృత్తిలో స్థిరపడింది.  నా గురించి ఆమెకు తెలియదనిదంటూ ఏమీలేదు. చక్కని సలహాలతో ప్రోత్సాహం ఇస్తుంది. అయితే ఆమెతో ఈమధ్య మాట్లాడి కొన్ని నెలలు అవుతోంది. దాదాపుగా అయిదు నెలలు అవస్తోంది. కారణం ఆమెకు తీరిక వున్నప్పుడు నాకు తీరికలేకపోవడం, నాకు వున్నప్పుడు ఆమెకు లేకపోవడం.

ఇహ ఈమె కాకపోతే ఇంకో అమ్మాయి వుంది. ఆమే నా ముద్దుల కోడలు సంజన, ఆమె గురించి ఇదివరలో కొన్ని టపాలు వ్రాసాను. ఆమె గురించి మళ్ళీ త్వరలో వ్రాస్తాను. ఇకపై బిందుతో నా కృషిని గురించి ఏమని చర్చిస్తున్నానో, వారి సూచనలేంటో, వాటిల్లో నేను అమలు చేస్తున్న వేంటో తెలియజేస్తుంటాను.  ఓ యజ్ఞం లాగా చేసేద్దాం. ఇది ఒక ప్రయోగంగా చేసి చూద్దాం.   ప్రయత్నిస్తే నాకు పొయ్యేదేమీలేదు కదా, పొరపాటున వర్కవుట్ అయితే విజయాలే నా స్వంతం కావా?

బుధవారం 25 జనవరి 2012

సరైన ఫలితాలు రాకపోతే ప్రాసెస్లో మార్పు తీసుకురావాలి

మనం ఎంత ప్రయత్నించినా అనుకున్న ఫలితాలు రాకపోతే ఆ ప్రాసెస్ లోనో, సిస్టంలోనో మార్పు తేవాలనుకుంటాను. ఉదాహరణకి గత కొన్ని నెలలుగా ఆఫీసు లంచ్ అవర్లో వ్యాయామానికి వెళుతున్నాను. అయితే మీటింగుల వల్లనో, మూడు బాగాలేకో, అలసట వల్లనో, ఇతర పనుల వల్లనో ప్రతి రోజూ వెళ్ళడానికి వీలు అవదు. అలా క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యలేకపోతున్నాను. ఇహ మరో వైపు ధ్యానమూ రోజూ చెయ్యడానికి సమయం కెటాయించలేకపోతున్నాను. ఆలోచించగా ఈ రెండింటికీ ఓ పరిష్కారం దొరికింది. ఉదయం అయిదున్నరకే లేచేసి ఓ చాయ్ తాగేసి ఆరుగంటల రైలు అందుకొని ఏడింటికలా ఆఫీసుకి వచ్చెయ్యాలని ప్లాను చేస్తున్నా. 

ఏడింటికే ఆఫీసు పని మొదలెట్టాలనే! అంతలేదు. మా ఆఫీసు బ్యుల్డింగులోనే జిమ్ము వుంటుంది. అందుకోసం. ఓ గంట వ్యాయామం చేసి అక్కడే స్నానం చేసి శుబ్బరంగా ఆఫీసుకి రావాలని అనుకుంటున్నాను. ఇహ లంచ్ అవర్లో మధ్యాహ్న భోజనం అయ్యాక నా ఆఫీసు గది తలుపు మూసివేసి కాస్సేపు ఎంచక్కా ధ్యానమో ఆ పేరిట ఓ కునుకో తీసిపడెయ్యొచ్చనుకుంటున్నాను. ఎలా వుంది నా ప్లాన్? ప్రణాళికలకేముంది భేషుగ్గానే వుంటాయి - అవి అమలు చేసినప్పుడు కదా సంగతి. మర్రదే మండుద్ది. అందుకే కదా మీకు చెప్పడం. నాలో నేను అనుకుంటే లైట్ తీసుకుంటాననే మీకు చెబుతూంట. బ్లాగుల్లో నా శ్రేయోభిలాషులంటూ ఎవరయినా వుంటే నా బాగోగులు అప్పుడప్పుడయినా కామెంట్ల రూపేణా కనుక్కోండి బాబయ్యా.

విజయం సాధించాలంటే ముందు మన మాట మన మనస్సు వినాలి. అలా మనస్సు మెడలు వంచడానికి ధ్యానమూ, వ్యాయామమూ బాగా ఉపకరిస్తాయి. అవి రెండూ చేస్తున్నప్పుడు మనలో ప్రశాంతతా, చురుకుదనం వెల్లివిరుస్తాయి. బద్దకం తగ్గుతుంది. ఏవన్నా పనులుంటే ఇప్పుడేం చేస్తాములే బాబూ అనుకోకుండా ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తాం.  అలా ఒకదాని తరువాత ఒకటి పనులు పూర్తిచేసుకుంటూ, ఉప లక్ష్యాలను అందుకుంటూ అసలయిన వేదికలను అందుకోవచ్చు. అందుకే ఆ రెండింటి మీద శ్రద్ధ వహిస్తుంటాను కానీ పలు కారణాల వల్ల క్రమం తప్పకుండా చెయ్యలేకపోతుంటాను. అందుకే ఈ ప్రాసెస్ లేదా సిస్టం ఛేంజ్.   చూద్దాం. చేసి చూద్దాం. ఉదయమే కాస్త నన్ను నేను తన్నుకొని లేవగలిగితే మిగతా పనులు వాటంతటవే దాదాపుగా జరిగిపోతాయి.

శరత్తుగాడి ఉమ్మి కథ

కెనడాలో వున్నప్పుడు కొద్దిరోజులు ఒక తెల్ల వనిత ఇంట్లో పేయింగు గెస్టుగా వున్నాను. ఆమె చూడటానికి బావుండేది కాదు లెండి. గది ఇచ్చేముందు కొన్ని సూచనలు చేసింది. మీ మగాళ్లందరూ స్నానాల గదిలో ఊంచుతూ వుంటారు - అలా ఊంచవద్దు అని చెప్పింది. అలాగే అని అడ్డగాడిదలా తల ఊపాను కానీ ఆ తరువాత నాకో సందేహం వచ్చింది -  అందులో ఏమయినా ద్వందార్ధం వుందా అని. ఆమె నోట్లో నుండి ఊంచడం గురించి చెప్పిందా లేక మరో చోట నుండి ఊంచడం గురించి చెప్పిందా అనేది నాకు అర్ధం కాలేదు. ఆమె మాటలకు తాత్పర్యార్ధాలూ, నానార్ధాలూ ఏం కోరతాం? దానికి పెడార్ధాలు తీసి పెడితేనో. ఆమె మనస్సు అంత మంచిది కాదు కూడానూ. 

సరేలే వర్క్ టూ రూల్ అనుకొని ఆ స్నానాల గదిలో పైనుండి మాత్రం ఊంచేవాడిని కాదు కానీ క్రింది నుండి మాత్రం క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఉమ్మి వేసేవాడిని. నీళ్లకు కొట్టుకొనిపోయేది కాబట్టి అమెకు కనపడేది కాదు. ఆ తరువాత భుజాలెగరేసి బయటకి వచ్చేవాడిని.

బ్లాగుల్లోకి ఉ...(బీప్) పోయించడానికి వచ్చాను!

మొన్న ముప్పైఆరు డాలర్లు తగలేసి (మా అమ్మలు తిండి అదనం - మేమూ షేర్ తీసుకున్నాం - అది వేరే విషయం) బాంబేలో బ్యుజీమ్యాన్ ఏం చేసేడో చూసి వచ్చేం. చూసి వచ్చాక అనిపించింది - ఆ సినిమా డివిడికి ఎక్కువా, సినిమా హాలుకి తక్కువా అని. తీక్షణమయిన మహేశ్ బాబు కళ్ళు చూసి చూసి, గంభీరమయిన ఉపన్యాసాలు వినీ వినీ తలనొప్పి పుట్టింది. సార్ వస్తారూ అన్నారో, వత్తాడు అన్నారో కానీ నాకు ఆ పాట అసలు అర్ధం కాలేదు కానీ  ఆ పాట అయితే వినడానికీ, చూడ్డానికీ బావుంది. కాజల్ మిల్క్ బేబీని, మహేశ్ మిల్క్ బాయ్ నీ కలిపి చూడ్డానికి బావుంది. ఇహ మిల్క్ బాయ్ మరో మిల్క్ బేబీ తమన్నాతొ జత కడితే చూడాలని వుంది.  మరి అదెప్పుడో. 

సినిమా విడుదల అయ్యాక పూరి వెళ్ళి నర్సీపట్నం (అనుకుంటా) లో తన స్నేహితులతో కలిసి సినిమా చూస్తే ఆ సినిమా సూపర్ హిట్టవ్వుద్దని మహేశ బాబు కూడా పూరిని నర్సీపట్నంలోనే ఈ సినిమా కూడా చూడమని చెప్పేడుట. అందుకే ఈ సినిమా హిట్టయ్యింది కానీ మన మహేశ్ ప్రతిభ వల్ల మాత్రం కాదుట. ఓ హిట్టు హిట్టని నాలాంటి బకరాలు కూడా ఓ కుటుంబాన్ని వెంటేసుకొని వెళితే మరింత హిట్టవక ఛస్తుందా? మరో సినిమా ముప్పయి రోజుల్లో రీళ్ళు చుట్టేసి మళ్లీ పూరీ గారు ఆ ఊర్లో సినిమా చూస్తే చాలు - ఈ సారి పూరితో మహేశుకి హ్యాట్రిక్కు గ్యారెంటీ.  ఇప్పటికే పూరి గారి పైత్యం పెరిగిపోయిందని, తానో రాం వర్మ లాగా ఫీల్ అవుతూ స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారని తెలుస్తోంది. మహేశుడితో మూడో సినిమా వరకు ఇంకా ఆ పైత్యం ముదిరిపోయి తన సినిమాలో ఇంకెన్ని లెక్చర్లు దంచుతాడో. ఈ సారి ఏ రేపిస్టు కోణంలోనో సినిమా తీసి జీవితంలో ప్రతి ఒక్కరూ ఇంకో ఒక్కరినయినా బలాత్కారం చెయ్యకపోతే ఆ బ్రతుకు వృధా అని మళ్ళీ నీతోపదేశాలు ఇప్పించెయ్యగల్డు.

సరే సినిమాని మాఫియా ఏంగిల్లో తీసాడు - విభిన్నంగా వుందని అడ్జస్ట్ అయిపోదాం కానీ చివర్లో ఆ మెసేజులేంటీ? నాకయితే చిర్రెత్తుకొచ్చింది. ఇప్పుడు ఇండియాలో బూతు పుస్తకాల్లో  కథలు ఎలా వుంటున్నాయో తెలియదు కానీ మేము అవి చదివిన రోజుల్లో కథలన్నీ పసందుగా వుండి కథ చివర్లో అంత్యతృప్తి కలుగుతున్నదనంగా ఓ నీతి ప్రబోధం వుండేది. ఫెడేల్మని ఎవరో మనల్ని ఓ చెంపదెబ్బ కొట్టినట్టు ఆ కథ చదువుతున్న ఆనందం ఆవిరి అయ్యేది (అలా నీతి బోధ లేకపోతే ఆ పుస్తకాలు ప్రభుత్వం బ్యాన్ చేస్తుందని ఆ పబ్లిషర్ల భయం లెండి).  అలాగే ఈ సినిమాలో మహేశు ఏదో మాఫియా దందా చేసుకొని బ్రతికేస్తున్నాడులే అని వదిలేస్తే చివరికి మనకే నీతిపాఠాలు చెప్పేసరికి నన్నెవరో నెత్తి మీద గాఠ్ఠిగా ఓ పీకుడు పీకినట్లనిపించింది. మా ఆవిడ ఏమయినా నన్ను ఓ పీకుడు పీకిందేమోనని తిరిగి చూసా. అబ్బే, ఆనందంగా ఆ మహేశుడి మెసేజు వింటోంది. నా బాటం లైన్: ఫర్వాలేదు కానీ సినిమా హాలు కెళ్ళి ఈ సినిమా చూసేంత దృశ్యం లేదు.

ఆ చిత్రం చివర్లో మాఫియా మహేశ్ గీతోపదేశం లాగా నీతోపదేశం ఇచ్చాక నాలో అంతర్మధనం మొదలయ్యింది. ప్రతి వ్యక్తికీ ఓ లక్ష్యం వుండలానో ఏమో చెప్పినట్లున్నాడు. అప్పటికే నాకొచ్చేసిన తలనొప్పికి నాకదేం పెద్దగా జీర్ణం కాలేదు కానీ కొద్దిగా అయ్యింది. అందరూ మిగతావాళ్లనందరినీ ఉ..(మళ్లీ బీప్) పోయించాలని మాత్రం తెలిసివచ్చింది. మరి నాకంత దృశ్యం వుందా? అది పోయించడానికి నేనేమీ కనీసం ఒ రౌడీనో, దాదానో అయినా కాకపోతిని. నేను మహేశ్ బాబుని కాకపోతిని - ఉట్టి శరత్ బాబుని అయిపోతిని.

మనం అనగా నేను బ్లాగులు తప్ప వేరే సాధిస్తున్నది ఏమీ లేదు. నేనూ మహేశ్ బాబులా గర్వపడేదెలా అని ఆలోచించి చించాను. అప్పుడు నాకు బుర్రలో తళుక్కున మెరిసింది. నేనూ బ్లాగుల్లో మరీ అందరితో కాకపోయినా చాలా మందితో ఉ...( పదే పదే బీప్ లు చెప్పలేను, అడ్జస్ట్ అయిపోండేం) పోయిస్తున్నానని అర్ధమయ్యింది. బాబు గారయితే కేవలం ఉ... పోయించాడేమో కానీ నేనయితే ఉ (పదే పదే చుక్కలు కూడా పెట్టలేనని మనవి) కూడా విమర్శకులతో వేయించుకుంటున్నా మరి. 


అయితే మహేశ్ బాబు గారి ఉ వేరు శరత్ బాబు గారి ఉ వేరూ.  నాది ఉమ్ము. ఓ సారి మళ్ళీ వేసి వెళ్ళి రండి.

మంగళవారం 24 జనవరి 2012

ఒక దేవత కోసం...

జీవితాన్ని కాలక్షేపం చేస్తూవెళ్లాలనుకుంటే పెద్దగా కృషి అక్కరలేదు. అదే అదో ఇదో ఏదో ఒకటి జీవితంలో సాధించాలనుకుంటేనే వస్తుంది చిక్కు. ఎప్పటికప్పుడు మనల్ని మనం విజయానికి దగ్గరగా తరుముతూ పోవాల్సిందే. అలా మనల్ని మనం తరుముకోవడం బోర్. అదే మన ప్రేయసో, గల్ ఫ్రెండో ప్రోత్సహిస్తూపోతే మన కృషిలో అలుపు సొలుపే కనిపించదు.   అయితే అందుకు తగ్గ చక్కటి వ్యక్తిత్వం ఎదుటివారికీ వుండాలి మరి. లేకపోతే పేనుకి పెత్తనమిస్తే నెత్తంతా బరికేసినట్లు అవుతుంది. నేను అలా కొన్ని సార్లు పెత్తనం ఇచ్చి ఇది జరిగేపని కాదనుకొని వెనక్కి వచ్చేశాలెండి.
నాకు నేను సజెషన్స్ ఇచ్చుకోవడం కంటే నాకు ఇష్టమయినవారు నాకు సూచనలు ఇస్తుంటే ఎంచక్కా పాటించబద్ధి అవుతూ వుంటుంది. అందుకే హిప్నటిజంలో ఆటో సజెషన్స్ కన్నా హెట్రో సజెషన్స్ ప్రభావితంగా వుంటాయని అంటారు. తియ్యనైన కంఠస్వరంతో ఎవరయినా ఏదయినా చెబితే ఠక్కున చెయ్యబుద్ధి అవుతుంది. దానికితోడు ఎదుటివారిది తియ్యనైన వ్యక్తిత్వం అయితే ఇహ చెప్పఖ్ఖర్లేదు.   అలాంటి సామ్రాజ్ఞికి పూర్తిగా దాసొహం అయిపోయి వారికి ఆజ్ఞాబద్ధుడినయిపోయి ఎంచక్కా వారు చెప్పినట్లే వినిపోవాలనిపిస్తుంది. 

అయితే ఒకప్పటి నా ప్రేయసిది చక్కటి వ్యక్తిత్వం కాబట్టి ఆ రోజుల్లో అనీ ఎంచక్కా ఆమె ఆదేశాలకు అనుగుణంగా చేస్తూవెళ్ళేవాడిని.  అలా చాలా చక్కగా వర్కవుట్ అయ్యింది కానీ కొన్నేళ్ళకి ఆమెలోనే ఆత్మవిశ్వాసం మరీ ఎక్కువయిపోవడంతో  విభేదాలు వచ్చివిడిపోయాం. ఆ తరువాత ఇంకో గల్ ఫ్రెండ్ చెప్పినట్లు వినేవాడిని. నెమ్మదినెమ్మదిగా ఆమెకు తీరిక తక్కువవడంతో  నా సమస్యలు, పరిస్థితులు సవివరంగా చర్చించే అవకాశం లేకపోవడంతో మానివేసాను. ఆ రకంగా ఇప్పుడు శూన్యతలో వున్నాను. 

చనువు వున్న వారు ఎంతమందో వుండొచ్చు కానీ మనని ఆజమాయిషీ చేసేంత  వ్యక్తిత్వానికి తోడుగా వారికి తీరికా, ఓపికా, ఆసక్తీ వుండాలి కదా. అలాంటి వారు వుండి మనల్ని తియ్యగా ప్రోత్సహిస్తుంటే ఎంతయినా కృషి చెయ్యబుద్ధి అవుతుంది. అందుకే కొత్త దేవత కోసం వెతుక్కుంటూ వున్నాను. ఎవరూ దొరక్కపోతే మళ్ళీ పాత దేవతకే కనెక్ట్ అవుతాను. బ్లాగుల్లో నయినా నన్ను ప్రోత్సహించేవారు దొరికితే ఎంత బావుండును :)  ఉదాహరణకి రేపు పొద్దున నుండి ఉదయం 5 గంటలకే లేచి కాలకృత్యాలు తీర్చుకొని 6 గంటలకు ఓ అరగంట ధ్యానం చెయ్యాలని అనుకుంటున్నాను.  అనుకోవడం వరకు బాగానే వుంది. మనం ఎన్నో అనుకుంటాం - అవి అమలు కావద్దూ? నేను అలా అనుకున్నవాటిని ఎవరయినా కనుక్కునేవారుంటే ఎంత బావుంటుంది!  నాలో బాధ్యత పెరుగుతుంది. అలా లేవలేకపోతే తియ్యగా తిడుతూ ప్రోత్సహించేవారుంటే ఎంత మధురంగా వుంటుందో కదా. 

మీకో దేవత లేకపోతే ఒకరిని మీరు చూసుకోవడం బావుంటుంది. మనకు ఇష్టమయిన వారి చేతిలో మన జీవితాన్ని పెట్టి వారి కనుసన్ననలో జీవించడం అంటే నాకయితే ఇష్టం మరి. మీకూ అలాగే ఇష్టం అయితే  ఆ పని చేసెయ్యండి. అలాగే ఆడవారు కూడా తమకు ఇష్టమయిన వ్యక్తికి ఆజమాయిషీ ఇవ్వండి. ఠాఠ్, ఒకరు చెప్పినట్లుగా వినడమా అని మీరనుకుంటే అలా అయినా సరే మరి. ఏనీ వే, రేపు ఉదయం అయిదుగంటలకి నేను లేచి ధ్యానం చెయ్యడం అన్నది నాకు జరిగేపనే అంటారా? ఎవరయినా ఎంకరేజ్ చేద్దురూ. ఈ ధ్యానం అన్నది ఉదాహరణకు చెప్పాను కానీ ఇలా ఇలా ముందు ముందు ఇంకా ఎన్నో స్టెప్పులు వేసేది వుంది.  

విజయం, విజయం - అదో విజయ సూత్రం

సక్సెస్ సూత్రాలలో Win - Win టెక్నిక్ నాకు బాగా నచ్చుతుంది. ఏ విషయంలోనయినా నా కృషిలో ఆ సూత్రాన్ని వీలయినంతంగా ప్రవేశపెట్టాలనుకుంటాను కానీ అన్ని సార్లూ కుదిరి చావదు. అలా వీలయిన ఆంశాల్లో మాత్రం చక్కగా ఫలితాలు వుంటాయి. రొమాంటిక్ విషయాల్లో కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తుంటాను. అలా గొప్ప గొప్ప ఆనందాలు పొందేస్తుంటాను.  సక్సెస్ సాధించడమంటే ఏదో నీళ్ళ మీది నడకలాంటి మహత్మ్యాలు ఏమీ సాధించనఖ్ఖరలేదు గానీ మన ఎంచుకున్న పరిధిలో ఎంతో కొంత పురోగతి సాధించినా చాలు అనిపిస్తుంది. నేను చదువుల్లో గోల్డ్ మెడల్స్ ఏమీ సాధించలేదు కానీ దాదాపుగా ప్రతి పరీక్షలోనూ ఆ తరగతిలో మొదటి మూడు స్థానాల్లో అయితే వుండేవాడిని. అయితే ఇంటరులో మాత్రం బోల్తా కొట్టాలెండి. దాని గురించి మరో సారి వ్రాస్తాను.

నా డిగ్రీ అయిపోయాక ఖమ్మంలో కంప్యూటర్ కోర్సులో చేరాను. అప్పుడు ఈ టెక్నిక్కును బాగా ప్రయోగించాను. కంప్యూటర్లు అంటే ప్రజలకు అంతగా తెలియని రోజులవి. అందువల్ల ఉత్సాహంగా అందులో చేరాను. నా తోటి వారికి సందేహాలను తీరుస్తుండేవాడిని. అందువల్ల నాకు కంప్యూటర్ కాన్సెప్టులలో బాగా క్లారిటీ వచ్చేది. అందువల్ల నాలో ఇంకా ప్రతిభ పెరిగింది. నా తెలివిని గుర్తించిన మా ప్రిన్సిపాల్, లెక్చరర్లు డిప్లొమా విద్యార్ధులకి పాఠాలు చెప్పమని ఉరమాయించారు. ఒక వైపు పోస్ట్ గ్రాజుయేషన్ విద్యార్ధిగా వుంటూ మరో వైపు డిప్లొమా విధార్ధులకు అధ్యాపకుడిగా వుండేవాడిని. 

కంప్యూటర్ ల్యాబులో కూడా అందరికీ సహకారం ఇస్తుండేవాడిని. అలా అలా ఆ ల్యాబ్ తాళాలూ నా చేతికి వచ్చాయి. ఎవరికయినా ప్రాక్టికల్స్ ఎక్కువగా కావాలంటే శరత్తుతో సమన్వయం చేసుకోమని ఆ శిక్షణా కేంద్రం చెప్పేది. అలా ఏ రాత్రి రెండు మూడింటి వరకో లేకపోతే ఉదయం నాలుగు గంటలకో లేచి అడిగిన వారికి ప్రాక్టికల్స్ చేయిస్తుండేవాడిని. శిక్షణా కేంద్రానికి దగ్గర్లోనే నా గది వుంటుండటంతో నన్ను లేపి అక్కడికి తీసుకువెళ్ళడానికని కొంతమంది విద్యార్ధులు ఉదయం నాలుగు గంటలకే నా గదికి వచ్చి లేపేవారు. అలా అలా అటు యాజమాన్యానికీ, ఉపాధ్యాయులకూ, విధ్యార్ధులకూ, స్టాఫుకూ అందరికీ తలలో నాలుక అయిపోయాను. అలా నాకు చక్కని విజ్ఞానమూ అబ్బింది, అందరితో చనువూ పెరిగింది. అలా నేను ఆ శిక్షణా సంస్థకు ఉపయొగపడ్డాను - నాకు ఆ సంస్థ ఉపయోగపడింది. ఇద్దరమూ లాభం పొందాము. 

అది మెగాబైట్స్ కంప్యూటర్స్ వారి శాఖ. జాతీయ స్థాయిలో కూడా పరీక్షలు వుండేవి. జాతీయ స్థాయిలో ప్రధముడిగా రావాలని కృషి చేసాను కానీ ఆ శాఖలో ప్రధముడిగా వచ్చాను. కేవలం ఆ శాఖలోనే ప్రధముడిగా రావాలని ప్రయత్నించివుంటే అంత ఫలితం కూడా వచ్చివుండేది కాదు. అందుకే మన లక్ష్యాన్ని కాస్త ఎక్కువగా పెట్టుకుంటే గానీ కనీస లక్ష్యాన్ని సాధించలేము. అయితే ఇప్పుడు చేస్తున్న ఉద్యోగంలో ఆ Win-Win టెక్నిక్ ప్రయోగించడానికి అవకాశం లేకుండా వుంది. కొన్ని కారణాల వల్ల అలా చిక్కుబడిపోయాను. ఇంతకు ముందు ఉద్యోగాల్లో ఇది ప్రయోగించి మంచి ఫలితాలు సాధించాను. 

మీకు ఈ విజయ సూత్రం తెలుసా? దీనిని మీ కృషిలో అప్లయ్ చేసారా? ఎటువంటి ఫలితాలు సాధించేరేంటీ?

సోమవారం 23 జనవరి 2012

ఇకనుండి కొంతకాలం నా సెక్స్ కథలకు కామా పెట్టి,


, నా సక్సెస్ స్టోరీస్ వ్రాస్తాను. అంటే నేనేదో జీవితంలో గొప్పగా విజయవంతం అయ్యానని కాదు గానీ నా పెళ్ళయ్యేదాకా ఎందులోనయినా విజయం కోసం కాస్తంత కిందా మీదా పడుతుండేవాడిని. వివాహా విద్యా నాశాయా అన్నట్లుగా పెళ్ళయ్యాక నేను విద్యలోనూ, విజయంలోనూ బొక్కబోర్లాపడ్డాను. అలా అలా నా పెళ్ళికి ముందూ, పెళ్ళికి తరువాతా విజయం కోసం ఆ ఆరాటాలూ, పోరాటలూ, అందులో నేను నేర్చుకున్న పాఠాలూ, గుణపాఠాలూ కొన్ని మీకు వ్రాస్తాను. ఇలా ఎంత కాలం? కొంత కాలం. కొంత అంటే...? ఏమో. 

మీ విజయగాధలూ, అపజయగాధలూ కూడా మా అందరితో కనీసం ఈ బ్లాగులో కామెంట్ల రూపేణా అయినా మీరూ పంచుకుందురూ.