రండి... కలిసి నడుద్దాం!

అమ్రికాకి వచ్చినప్పుడూ, కంప్యూటర్ కళాకారుడిని అయినప్పుడూ ఏదో పొడిచేసేనని అనుకున్నా. అలక్కాదనీ కొన్నేళ్ళలో అర్ధమయ్యింది లెండి. అందరూ వచ్చేసి అందరూ అయిపోయి అందరూ పొడిచేస్తున్నారు. మా ఫిఫ్టీన్ మినట్స్ ఆఫ్ ఫేమ్ పూర్తయ్యింది. కంప్యూటర్ ముందూ, సూర్యుడు కూడా కనపడని నాలుగ్గోడల లోపలా కూర్చొని కూర్చొని పని చేసీ చేసీ థూ ఇదా జీవితం - ఎదవ జీవితం అనుకుని ఎంచక్కా ఆశ్రమానికి వెళ్దామనుకున్నా కానీ కుమార్తెలను దృష్టిలో వుంచుకొని ఆ ఆలోచన ఇప్పటికయితే మానివేసా. ముందు ముందు చెప్పలేం.  అయితే ప్రత్యామ్నాయం ఆలోచిస్తూ వచ్చా. అప్పుడు దొరికిందిదీ.

డబ్బు సంపాదిస్తున్నంత కాలం మనం ఏం పని చేసినా పెద్దగా ఎవరు ఏమీ అనరు. ఎంత మోసం చేసి, అన్యాయం చేసి, అవినీతి చేసి సంపాదిస్తే అంత తెలివిగలవాడివంటుంది ఈ సమాజం. అన్ని తెలివితేటలు మన్దగ్గర లేవు కదా ఎలా? నాకు తెలిసిన విద్య ఒహటి వుంది. అదే రచనలు చెయ్యడం. తెలుగులో రచనలు చేసి సంపాదించేకన్నా కాటికాపరి ఉద్యోగం వెలగబెట్టి ఎక్కువ సంపాదించొచ్చు అనుకుంటా.  పదేళ్ళ క్రితం రామోజీరావు తన మాస పత్రిక చతురలో నా 'ఎవరు?' నవల వేసి ఓ అయిదువేల రూపాయలు చేతిలో పెట్టారు. అదే ఇంతవరకు నా నవలాదాయం. ఆదాయం అటుపోనీండు - నవళ్ళు వ్రాసీ, బ్లాగులు వ్రాసీ కొంతమంది ఆప్తులనీ, అభిమానులనీ సంపాదించుకున్నాను. అది చాలదూ? చాలదు! ఇంట్లోవాళ్ళకి అస్సలు చాలదు. మరి మాకేంటి అంటారు. 

అందువల్లా...ఆశ్రమం అయినా వుండాలె లేదా ఆదాయం అయినా వుండాలే అని డిసైడ్ చేసిన. ఆశ్రమం అప్పుడేనా ఇంకా ఆనందించాల్సింది చాలా వుంది కనుక ఆదాయం వుండాలి. ఎలా? ఎవరికి వుండదూ - సన్నాసులకు తప్ప - ఓ సంపాదించెయ్యాలనీ. అప్పుడు దైవదూత లాగా ఓ మిత్రుడు రెండు మార్గాలు చెప్పాడు. అవి రెండూ నాకు ఎప్పటినుండో తెలిసినవే కాకపోతే రెండింటినీ కనెక్ట్ చేసుకోలేకపోయాను. హర్రే అనుకున్నా. ఇంకేం విజయరహస్యం తెలిసింది. ఇక అందుకోవడమే తరువాయి. 

చిన్న కేవియట్. అవి పనిచెయ్యలేదూ - పోయిందేముందండీ  - ఈ కప్యూటర్ కళ ఎలాగూ వుంది కదా. వంటింటి ఆడపడుచులు కూడా చేసే టెస్టింగ్ జాబ్ చేసో లేదా Uber తొక్కి అయినా సరే బ్రతుకు లాగించెయ్గల్ను. సో, ఇక అలాంటి పేదమాటలు మాటలు మానేసి దర్జాగా ఎలాగో బ్రతుకొచ్చో చూద్దాం.  బ్రతకడమంటే అలా ఇలా కాదు. మామూలుగా బ్రతకడానికి ఇప్పుడు చేస్తున్నది  చాలు. 

అంచేతా నేను విజయవంతమయిన రచయితను అయి తీరాలి. అప్పుడు ఏ బాదరాబందీలు, హడావిడులు లేకుండా క్రూయిజులల్లో ప్రయాణం చేస్తూ పగలు నేలమీది నక్షత్రాలనీ, రాత్రి ఆకాశంలోని నక్షత్రాలనీ చూస్తూ నన్ను నేను మైమరచిపోతూ రచించాలి. అదీ ప్రస్తుతానికి నా కలా, లక్ష్యమూనూ. ఆ తరువాతా ఇంకా చాలా చాలా ఆలోచనలు వున్నాయిలెండి. అబ్బో - సూపర్ ఆలోచనల్లెండి. అన్నీ నెరవేర్చుకుందాం. అటు ఆదాయమూ రావాలి - ఇటు ఆనందమూ పొందాలి. అదో నేనో తేలాలి. నాది ఇక మామూలు జీవితంగా వుండదు లెండి. ఇక ఇంకా కొన్ని నెలలే. ఎన్నో ఎన్నెన్నో ప్రయోగాలు, సాహసాలు. అవి నెరవేర్చుకునే దమ్మూ, ఆత్మవిశ్వాసమూ నాకున్నాయి. మీకూ కలలున్నాయా? నెరవేర్చుకోవాలనుకుంటున్నారా లేక ఇప్పుడున్నట్టే బ్రతుకుబండి లాగిద్దామనుకుంటున్నారా? మీలో కూడా ఉత్సాహమూ, ఉత్తేజమూ, మీలో మీకు విశ్వాసమూ వుంటే...రండి.. కలిసి నడుద్దాం. అలాంటి ఇలాంటి జీవితాలు మనకు వద్దు. ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సమృద్ధిగా బ్రతికేద్దాం. 

అందుకు ముఖ్యంగా మనం చెయ్యాల్సింది ఒక్కటే. మన మనస్సును మన బానిసగా చేసుకోవడం. కొన్ని నెలల దాకా నా మనస్సుకి నేను బానిసనై వుండిపోయా. అప్పటికీ ఇప్పటికీ అదీ తేడా మిత్రమా! దేన్ని ఏది కంట్రోల్ చేస్తోందో చూసుకోండి మరీ. మనస్సు అనే పొగరుబోతు అశ్వాన్ని అంత సులభంగా మచ్చికచేసుకోలేం.  అదెలాగో నాకు తెలుసు. అందుకే నా మీద నాకీ విశ్వాసం. మీమీద మరి మీకు ఆ నమ్మకం వుందా?    

3 comments:

  1. మీరు చాలా( ఒక జీవిత కాలం) లేటండీ...యండమూరి ఎపుడో చెప్పారు కదా ..మీరు ఇపుడు నడక మొదలుపెడతానంటున్నారు. నేను ఆఖరి మజిలీ లో (ఒక్క అడుగే )ఉన్నాను.

    ReplyDelete
  2. You have a nice writing style and attitude.Definitely you can fulfill your dream.All the best.

    ReplyDelete
  3. @ నీహారిక
    ఆ సర్లెండి. ఇంకా చాలామంది ఇంకెప్పుడో చెప్పారు. ఎప్పుడు ఎవరు చెప్పారన్నది ముఖ్యం కాదు - ఎప్పుడు మన తలకు ఎక్కిందనేది ముఖ్యం. నిజానికి నాకీ విషయాలు ఎప్పటినుండో తెలుసు. కేవలం తెలిసివుండటం వల్ల ప్రయోజనం శూన్యం. మీది ఆఖరి మజిలీ అయితే నాది అంతం కాదిది ఆరంభం :)

    @ అజ్ఞాత
    ధన్యవాదాలండి. మీలాంటి వారి ప్రశంసలు, ప్రోత్సాహాలే నాలో ఉత్సాహాన్నీ, నమ్మకాన్నీ కలిగిస్తాయి.

    ReplyDelete