'విల్లా' గేటు దూకి 'మసాలా' మధ్యలోకి వచ్చి పడ్డాం - కి కి కీ

విల్లా (పిజ్జా 2 ) సినిమా సమీక్షలు చూస్తే బానే వున్నాయి. హరర్స్ కాదుగానీ థ్రిల్లర్స్ అంటే నాకు ఇష్టం. అయితే ఇది హరరో థ్రిల్లరో లేక రెండు కలిపినదో నాకర్ధం కాలేదు. రెంటికీ తేడా ఎంటని నన్నడక్కండేం. పిజ్జా చూట్టం కుదర్లేదు కాబట్టి ఇదయినా చూడాలని తీర్మానించేసుకున్నా. మా అమ్మలుకీ (చిన్నమ్మాయ్)  థ్రిల్లర్స్ అంటే ఇష్టం. విల్లాకి వెళదామా అంటే సై అంది. మా ఆవిడ్ని అడిగా - చక్కటి సినిమాలు తనకి నచ్చవు కాబట్టి రాను పొమ్మంది. టిక్కెట్టు డబ్బులు మిగుల్తున్నాయ్ కదా అని సంతోషించా.  తీరా చూస్తే మా నగరంలో తెలుగు వర్శను రిలీజు అయినట్టు లేదు. తమిళం వుంది. అయినను సరే విల్లాకు పోవలె అని మేమిద్దరం తీర్మానించుకున్నాం. సబ్ టైటిల్స్ వుంటయ్ కదా డేడీ అంది - వుండొచ్చు అన్నా. వున్నా లేకపోయినా విల్లాకి వెళ్ళి తీరాల్సిందే అని డిసైడ్ చేసినం.

ఆలస్యం అవడంతో ఉరుకులు పరుగులతో 6 గంటల షోకి వెళ్ళాం. లోపట ధూం 3 ట్రైలర్ నడుస్తోంది. ఆ సినిమా రిలీజ్ అయితే తప్పకుండా థియేటరుకి వెళ్ళి చూస్తాం - ఎంతయినా మా షికాగోలో చిత్రీకరించేరు కదా! సినిమా హాల్లోకి వెళ్ళి చూసి "ఓ బోయ్" అనేసా. మా అమ్మలు ఖంగారు పడి ఏంటని అడిగేసింది. ఏం చెప్పనూ? థియేటర్లో ఒక్కరు లేరు! అసలే ఇది హరర్ సినిమా అని అనుమానంగా వుంది. వద్దులే ఈ సినిమా అంది. టికెట్లు కొని మరీ సినిమా చూడకుండా వెళ్ళడం బావోదేమో అని "ఇంకా జనాలు వస్తార్లే" అని సర్ది చెప్పా. ధూం ట్రైలర్ చూస్తూ ఎవరయినా జనాలు వస్తారేమో అని వేచి చూసాం. ఊహు - ఎవరూ రాలేదు. 

ఈ సినిమా వద్దు - పక్కనే వున్న మసాలాకి వెళ్దాం అంది. నాకు పౌరుషం వచ్చింది - తండ్రిగా నా బాధ్యత గుర్తుకు వచ్చింది. "ఏం పర్లేదు - ధైర్యంగా ఈ సినిమా చూడు - నేను వున్నాగా నీ పక్కన" అని మేకపోతు గాంభీర్యంతో ధైర్యం చెప్పా. సినిమా మొదలయ్యింది - మాకు వణుకు మొదలయ్యింది. హీరో తల్లి ఏక్సిడెంట్ సీన్. హ్మ్. అలా అలా సినిమా విల్లాలోకి వెళ్ళింది.  అయినా సరే ఒక్క ప్రేక్షకుడూ రాడే. చచ్చింది గొర్రె అనుకున్నా. విల్లాలో వింతవింత శబ్దాలు మొదలయ్యాయి. నా గుండెలో కూడా అంతే. మా అమ్మలు పరిస్థితీ అంతే. జీరబోయిన కంఠంతో "మసాలాకి వెల్దామా మరి" అని అడిగేసా. పద పద అంది. అంతే బయటకి వచ్చి పడ్డాం. 

బయటకి వచ్చి తికెట్లు తీసుకునే అతనితో "మా అమ్మాయి భయపడుతోంది. మసాలా సినిమాకి వెళతాం" అని చెప్పాను. మా అమ్మాయి నా ముఖమే చూస్తోంది! వెళ్లమని చెప్పాడు. అప్పటికి ఇంటర్వెల్ అయిపోయింది. 'బోల్ బచ్చన్' అప్పటికే చూసేసాం కాబట్టి కథ గురించి కంఫ్యూజన్ ఏమీ లేదు లెండి. షాజన్ పదంసీ ఆరెంజ్ సినిమా చూసినప్పుడు కొద్దిగా నచ్చింది కానీ ఈ సినిమాలో డొక్కుడొక్కు అనిపించింది. అంజలి కూడా అంతే. సీతమ్మ వాకిట్లో...సినిమాలో ఎంత నచ్చింది అనీ. పాపం సీతమ్మ వారికి ఎన్ని కష్టాలో! అందుకేనేమో ఈ సినిమాలో కళ తప్పింది. టోకుగా మసాలానే రుచి తప్పింది. చూసామంటే చూసామని ఆ సినిమా చూసి ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చి చూస్తే మా ఆవిడ టివిలో గౌరవం సినిమా చూస్తోంది! అదృష్టవశాత్తూ అది ముగింపుకి వచ్చేసింది.

ఇంతకీ విల్లా ఎవరయినా చూసేరా? ఎలా వుందేంటీ? బాగుందని చెప్పకండేం - నా మనస్సు మూల్గుతుంది మరి.

అన్నట్లు సినిమా నుండి కారులో తిరిగి వస్తున్నప్పుడు ఓ దృశ్యం గుర్తుకువచ్చింది. 'రాత్రి' సినిమాలో థియేటర్ దృశ్యం. ఇంకా నయ్యం హాల్లో వుండగా అది గుర్తుకురాలేదు!

గమనిక: దయ్యాలు అంటే నాకు నమ్మకం లేదు కానీ భయం వుంది. ఎందుకంటే దయ్యాలు లేవు అని నాకు తెలుసు కానీ వాటికి తెలీదు కదా!

6 comments:

  1. బాగుంది. దయ్యాలంటే నాకూ నమ్మకం లేదు కానీ అలా అని బయటికి చెప్తే ఎక్కడ వాటికి కోపం వచ్చి కనిపించేస్తాయేమోనని భయం ఉంది.

    ReplyDelete
  2. బాగుంది. రాతలో రాటుదేలిపోయారు. చేయితిరిగిన రచయితో, కాలమిస్టో రాసినట్లు ఉంది. జర్నలిస్టునైన నాకే అసూయకలిగించేటట్లుగా ఉంది.

    ReplyDelete
  3. its really a nice movie. Its more of thriller than horror.. Watch it. One of the decent movie among recent so called Block Busters.

    ReplyDelete
  4. మీ "'విల్లా' గేటు నుండి 'మసాలా' మధ్యలోకి వచ్చి పడ్డాం ..." పోస్ట్‌పై అజ్ఞాత క్రొత్త వ్యాఖ్యను ఉంచారు:


    అనా బాగున్నావా . మళ్ళుచ్చావు.
    మళ్ళి మనం ఒకళ్ళని ఒకళ్ళూ పొగుడుకుంటూ జబ్బలు చర్చుకుంటూ [Edited] ఉండే పాతకాలపురోజుల్లోకి పోదామా?

    ReplyDelete
  5. @ అజ్ఞాత
    నిజమే.

    @ అజ్ఞాత
    :)

    @ మదర్ ల్యాండ్
    అయితే మంచి సినిమా మిస్సయ్యానన్నమాట. డివిడి వచ్చాకా చూడాలి ఇహ.

    @ అజ్ఞాత
    ఏదో ప్రశాంతంగా ఎవరి గోలలో వారం వుంటున్నాం. మళ్ళీ అవన్నీ ఇప్పుడు ఎందుకులే బ్రదర్.

    ReplyDelete