"థైరాయిడ్ మందు పాపకి పడట్లేదు కదా, ఏం చేద్దాం?" అని ఆలోచించారు మా డాక్టర్. మా చిన్నమ్మాయికి ఊబకాయం. దానికి కారణం లో మెటబాలిజం దానికి కారణం థైరాయిడ్ తక్కువగా పనిచెయ్యడం అని తెలుసుకున్నాం కానీ థైరాయిడ్ మందులు తనకి పడకపోవడంతో వచ్చిందీ సమస్య. ఆ మందులు వాడితే బాగా దగ్గు వస్తోంది. అందుకే ఆపేసాం. "అయోడైన్ లోపం వుండొచ్చు, అది పరీక్షిద్దాం" అని మా హోలిస్టిక్ డాక్టర్ అన్నారు. అయోడోఫోబియా వున్న నేను ఉలిక్కిపడ్డాను. (అయోడైన్ అంటే బెదిరిపోయే గుణాన్ని అయోడోఫోబియా అనొచ్చని డాక్టర్ గుయ్ అబ్రహాం ప్రకటించారు.) అయోడైన్ ఎక్కువ వాడితే థైరాయిడ్ సమస్యలు కదా అని అనుకున్నా కానీ ఊరుకున్నా.
అయోడైన్ లోడింగ్ టెస్ట్ జరిపించాం. పిల్లలకి 25 మిల్లీ గ్రాముల అయోడైన్, అయోడైడ్ కలిసిన టాబ్లెట్ ఇచ్చాక 24 గంటలు మూత్రాన్ని సేకరించి మెడికల్ ల్యాబుకి ఇవ్వాలి. పెద్దలకు అయితే 50 మిల్లీగ్రాముల ట్యాబ్లెట్లు ఇవ్వాలి. అయోడైన్ చర్మ పరీక్ష, రక్త పరీక్ష, ఉమ్మి పరీక్షలు కూడా వుంటాయి కానీ అవి అంత నమ్మకమయినవి కావు. ఈ లోడీంగ్ టెస్టులో విడిచిన మూత్రంలో ఎంత అయోడైన్ విసర్జించారో చూస్తారు. ఎక్కువ విసర్జిస్తే మంచిది. అందువల్ల శరీరంలో మంచి మోతాదులో అయోడైన్ వుందన్నమాట. తక్కువ విసర్జిస్తే అర్ధం తగినంత అయోడైన్ లేక శరీరం అల్లల్లాడుతోందన్నమాట. మా అమ్మాయి చాలా తక్కువ విసర్జించింది.
అయోడైన్ లోపం తీవ్రంగా వుందని చెప్పి 6.25 మిల్లీగ్రాముల అయోడోరాల్ (Iodoral) టాబ్లెట్ రోజూ వాడమన్నారు మా ఆస్టియోపాత్ (డాక్టర్). మూడు వారాలు వాడాక మళ్ళీ సమస్య మొదలయ్యింది. దగ్గు. దాంతో డోసేజ్ ఎక్కువయ్యిందేమోనని రెండు రోజులకు ఒకసారి ట్యాబ్లెట్ వేసుకొమ్మని చెప్పాను. అయోడోరాల్ హాఫ్ లైఫ్ ఒకటి నుండి రెండు రోజులు. కొంత తగ్గింది కానీ పూర్తిగా దగ్గు తగ్గలేదు. నెట్టులో వెతికితే కొంతకాలం ఆపి మళ్ళీ మొదలెట్టొచ్చు అని సూచనలు కనిపించాయి. ఆపేసాం దగ్గు తగ్గింది. మళ్ళీ మొదలెట్టాం - మళ్ళీ వారానికి మొదలయ్యింది. వారానికి రెండు సార్లు మాత్రమే వేసుకొమ్మని చెప్పాను. ఈలోగా వేరొక సందర్భంలో మా డాక్టరుని కలిసినప్పుడు దగ్గు విషయం చెప్పాను. అతను అయోడిజం (అయోడైన్ టాక్సిసిటీ) ఏమో అనుకొని ఖంగారు పడి మందు మానేసి మళ్ళీ టెస్ట్ చేయించమన్నారు. కానీ అది అయోడిజం కాదని నాకు తెలుసు. అయోడైన్ వాడుతున్నప్పుడు బ్రోమైడ్ తదితర విషపదార్ధాలు శరీరంలోంచి బయటకి వెళుతూ కొంతమందికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కలిగిస్తాయి.
మళ్ళీ పరీక్ష చేయిస్తే తన శరీరంలో కొద్ది మోతాదులో మాత్రమే అయోడైన్ పెరిగింది అని అర్ధం అయ్యింది. మొదటిసారి 25 mg లలో 12 mg లు విసర్జిస్తే ఈసారి 14 mg లు విసర్జించింది. అయోడైన్ లోపం ఇంకా తీవ్రంగా వుంది కాబట్టి మళ్ళీ మందు మొదలెట్టమన్నాడు. మూడు రోజుల క్రితమే మొదలెట్టాం. మళ్ళీ దగ్గు రావొచ్చు కానీ ఒకటి నుండి మూడువారాల్లో అది తగ్గే అవకాశం వుంది. అయితే అంతకు ముందు రెండు నెలలు అటూ ఇటూగా వాడినప్పుడు చక్కటి ఫలితాలు అందాయి. రెండు కిలోల బరువు తగ్గింది. ఇంకో ఊహించని పరిణామం. తనకు మైల్డ్ అలెర్జీలు వుండేవి. అది ప్రస్థుతానికి అయితే దూరం అయ్యింది! అయోడైన్ లోపానికి అలెర్జీలకు సంబంధం వుందా అని చూస్తే... వుంది. అస్థ్మా తదితర ఊపిరితిత్తుల వ్యాధులు రావడానికి ఈ లోపం కూడా కారణం కావచ్చు.
ఆ రెండు ఫలితాలతో అచ్చెరువొందిన నేను అయోడైన్ గురించి బాగా తెలుసుకొని అయోడోఫోబియా దూరం చేసుకున్నాను. మన జనాల్లో పలు కారణాల వల్ల ఆ లోపం ఎంత వుందో అవగాహన వచ్చింది. దాని వల్ల ఎన్ని ప్రయోజనాలు వున్నాయో, అది ఎంత ముఖ్యమో అవగతం అయ్యింది. నేనూ ఆ పరీక్ష చేయించుకున్నాను. నాకూ ఆ లోపం తీవ్రంగా వుంది. మా అమ్మాయి కంటే నాలోనే ఎక్కువ లోపం వుంది. మా డాక్టరు దగ్గరికి వచ్చేవారిలో నాలోనే లోపం ఎక్కువగా వుందిట. 50 మిల్లీగ్రాములు వాడితే 24 మిల్లీగ్రాములు మాత్రమే విసర్జించాను. మా ఆవిడక్కూడా హైపోథైరాయిడిజం వుంది కనుక తనకి కూడా పరీక్ష చేయించాను కానీ ఫలితం ఇంకా తెలియలేదు. 97 శాతం మందిలో అంతో ఇంతో లోపం వుంటుందని డాక్టర్ డేవిడ్ బ్రవున్స్టీన్ అంటారు.
కేవలం అయోడైజ్డ్ ఉప్పు వాడకం వల్ల గాయిటర్ తదితర కొన్ని సమస్యలు రాకపోవచ్చు కానీ ఆ మోతాదు శరీర అవసరాలకి ఏమాత్రం సరిపోదు అని అర్ధం అవుతోంది. హైదరాబాదులో అయోడైన్ లోడింగ్ టెస్టులు జరుపుతారా? ఈ పరీక్షలు ఏ ల్యాబుల్లో అందుబాటులో వున్నాయో దయచేసి తెలియజేయగలరు. అక్కడ కొంతమందికి ఈ పరీక్ష జరిపించాల్సివుంది. అలాగే మీరు అయోడైన్ మాత్రలు కానీ ద్రవం కానీ వాడుతున్నట్లయితే మీ అనుభవాలు, అభిప్రాయాలు తెలియజేయండి.
మీకు అయోడైన్ మీద ఆసక్తి వుంటే ఈ క్రింది లింకులోని వ్యాసాలు చదవండి మరి. మీ అనారోగ్యానికి కారణం అయోడైన్ అయివుండొచ్చేమో మరి.