అమ్మకి ఓ సహాయకురాలు కావలయును

75 ఏళ్ళు పై బడ్డ మా అమ్మగారికి ఇంట్లో వుంటూ అన్ని విధాలా చేదోడు వాదోడుగా వుండగలిగే ఒక సహాయకురాలు కావలయును. మా అమ్మగారు హైదరాబాదులో LB నగర్ లో వుంటుంది. తన పనులు తాను చేసుకోగలుగుతుంది. ఈమధ్య కాస్త మతిమరుపు సమస్య మొదలయ్యింది. హైదరాబాదులోనే మా అక్కయ్యలు వుంటున్నా కూడా వారి ఇండ్లల్లో  ఇప్పుడే నివసించడానికి ఇష్టపడటం లేదు. మరీ ఇబ్బంది అయినప్పుడు వెళ్ళి వుంటానులే అంటుంది.

మీకు తెలిసిన పేదవారు, ఆసరా కోసం చూస్తున్న యువతులు, అమ్మాయిలు ఎవరయినా వుంటే వారికి ఇది ఉపయోగపడవచ్చు. తిండి, బట్ట మరియు కొంత డబ్బు ఇవ్వగలము. మీకు ఎవరయినా తెలిస్తే నా ఈమెయిల్ ఐడి sarathn at hotmail dot com కి మెయిల్ ఇవ్వండి. ఇంకా ఏమయినా సమాచారం కావాలంటే కామెంట్ అయినా మీరు ఇవ్వొచ్చు.

సెక్సీ శారదా శ్రీనివాసన్!


శారదా శ్రీనివాసన్ గారిని సెక్సీ అని పిలవడం కొంతమందికి నచ్చకపోవచ్చు... కానీ చలం 'ఊర్వశి'ని సెక్సీ అనకుండా వుండగలనా? చిన్నప్పుడు ఆమె మధురమయిన కంఠం వింటూ పెరిగాను. కుర్రాడినయ్యాక నేనో పురూరవుడిని అయిపోయి ఆమెలో ఓ ఊర్వశిని విన్నాను.  నా గాత్ర సుందరి ఎలా వుంటుందా గాత్రం వున్నంత మధురంగా మనిషి వుంటుందా లేదా అనే అనుమానంతో ఇన్ని ఏళ్ళూ గడిపాను. ఇన్నాళ్లకి, ఇన్నేళ్ళకి ఆమె ఫోటో చూసే అవకాశం  కలిగింది. ఇప్పటి ఫోటోలే కాదు ఊర్వశి కాలం నాటి ఫోటోలు చూసే అవకాశం కలిగింది. శారద గారు ఎంత అందంగా వున్నారు! నా స్వప్నం చిరిగిపోలేదు. గాత్రం ఎంతో బావున్నా మనిషి బాగోకపోతే నాకు జీర్ణించుకోవడం కష్టమయ్యేదే. 

నా చిన్నప్పుడు ఇప్పటిలా టివిలు, FM లు లేనందున ఆకాశవాణి మీదే ఆధారపడేవారం. అందులోని ఆర్టిస్టులే మాకు సెలబ్రెటీలు. ఒక్కొక్కరి వాచకం, స్వరం ఎంత బావుండేదని. వార్తలు, వ్యాఖ్యానాలూ ఆడా, మగా ఎవరు చదివినా వారి గాత్ర సౌందర్యాన్ని లేదా గాత్ర గాంభీర్యాన్ని రసాస్వాదన చేస్తూ మైమరచిపోయేవాడిని. ఇన్నాళ్ళకు శారదా శ్రీనివాసన్ గారి నా రేడియొ అనుభవాలు జ్ఞాపకాలు అనే పుస్తకం ద్వారా అప్పటి ఆకాశవాణి గురించి ఎన్నో విషయాలు తెలిసాయి. వారి ముచ్చట్లు చదువుతుంటే సమయమే తెలియలేదు. అందులో వారి ఫోటోలు కూడా వున్నాయి. అలా చూసానన్నమాట నా కలల స్వర సుందరిని. ఎన్నాళ్ళుగా వేచివిన్నా నా ఊర్వశి ఫోటో కోసం! వారు పుస్తకం వ్రాసేరని తెలిసి ఇండియా వెళ్ళినప్పుడు తప్పక కొనుక్కోవాలనుకున్నా. ఈలోగా కినిగే సైటులో లభ్యం అవడంతో అక్కడ తీసుకొని చదివేసాను.  

ఆమె స్వరం ఎంత బావుంటుందని, ఎంత తియ్యగా వుంటుందనీ. రేడియో నాటకంలోనీ ఏ పాత్ర అయినా ఎంత బాగా వేస్తుందనీ. ఆ రోజుల్లో ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చే ఓ గంట నాటకం కోసం అన్ని పనులూ మానుకొని ఎదురుచూసేవారం. అలా ఆమె హీరోయినుగా వేసిన ఎన్ని నాటకాలు విన్నానో. అవన్నీ గుర్తుకులేవు కానీ రచయిత చలం నవల ఉరూరవలో ఆమె వేసిన ఊర్వశి పాత్ర బాగా గుర్తుండిపోయింది. ఆ నాటకంలో రెండే రెండు పాత్రలు. పురూరవ రాజు మరియు దేవకన్య ఊర్వశి. (నాకు ఆ కథ అంతగా గుర్తుకులేదు). మన ఫేవరెట్ హీరోయిన్ను సినిమాలో సగం వేషం వేస్తే ఎంత ఆనందం పొందుతామో ఆ నాటకం విని అంత సంతోషం అనుభవించాను.  అవును మరీ, ఆమెది మామూలు గొంతా? ఎంత సెక్సీగా వుంటుంది ఆ గొంతూ! పదహారేళ్ళ అందమయిన అమ్మాయి యవ్వనం ఆ గొంతులో తోణికిసలాడుతూవుంటే నాకు పిచ్చెక్కిపోయేది. అదే సమయాన ఆమె ఆకారం కూడా అంత అందంగా వుంటుందో లేక చుప్పనాతిలా వుంటుందో అనే అనుమానాలు పట్టిపీడించేవి. మొత్తానికి ఆ అనుమానం ఇన్నాళ్లకి తీరింది. ఆ గొప్ప స్వరానికి తగ్గట్టే ఆమె కూడా ఓ గొప్ప సుందరే. ఆమెకు ఎన్నో సినిమా అవకాశాలు వచ్చినా తిరస్కరించిందట.

నా కొవ్వు ఇంత. మరి మీదెంత?

వంటిలో కొవ్వు కొలిచే సాధనం తెప్పిస్తున్నా అని చెప్పాకదా. మొన్నే వచ్చిందది. నిన్న చూసుకున్నా. 22% వుంది నాకు. ఆరోగ్యకరమయిన శాతంలోనే వున్నా. నా వయస్సుకు, జెండరుకూ 12 నుండి 22% వుంటే బావుంటుంది. గత ఏడాది కాలం నుండీ కూడా 21 - 22 మధ్య నా కొవ్వు దోబూచులాడుతోంది. ఈమధ్య బరువైన వ్యాయామాలు చేస్తున్నా కాబట్టి ఇహ ఆ కొవ్వును తగ్గించే విషయమై నేను దృష్టి పెడుతున్నాను. ముందు 20 శాతానికి లోపుగా తగ్గించాల్సి వుంది.

వంట్లో కొవ్వు ఎక్కువయితే పలు వ్యాదులు వస్తాయిట. మధుమేహం, గుండె జబ్బులు వగైరా, వగైరా. అందుకే వంట్లోని కొవ్వు శాతం అదుపులో ఉంచుకుంటే కండ ఆటోమేటిగ్గా పెరుగుతుంది. మరో విధంగా చెప్పాలంటే  శరీరంలో మజిల్ శాతం పెంచితే కొవ్వు తగ్గుతుంది. కొవ్వు తగ్గాలని కడుపు మాడ్చుకుంటే ప్రొటీన్లు గట్రా శరీరానికి సరిపడినన్ని అందక  కొవ్వుతో పాటూ కండ కూడా కరిగిపోయీ అలా కూడా రోగాల పాలవుతాం.   ఎందుకంటే డైటింగ్ చేస్తున్నప్పుడు సరిపడినన్ని ప్రొటీన్లు అందక మన మజిల్ నుండి శరీరం వాడుకుంటుంది. అలా కండ క్షీణిస్తుంది.

మరేం చెయ్యాలి. నాలాగా బరువులు ఎత్తాలి!  వ్యాయామన్నీ, ఆహార నియంత్రణనూ సమతూకం చేసుకోవాలి. అప్పుడే సరి అయిన విధంగా కొవ్వు తగ్గుతూ, కండ దెబ్బతినకుండా వుంటుంది.  ప్రొటీన్ల విలువ తెలియనప్పుడు అనగా సగటు మనిషికి రోజుకి 60 గ్రాముల ప్రొటీన్లు అవసరం అని తెలియనప్పుడు నేనూ గొప్పగా ఆహార నియంత్రణ చేసి ఫ్యాట్ కరిగించాను కానీ దానితో పాటూ మజిల్ కూడా దెబ్బతినివుండొచ్చన్నది గుర్తించలేకపోయాను. ఇప్పుడు ఆయా విషయాలపై అవగాహన పెరిగింది కాబట్టి అది మీకూ అందిస్తున్నాను.

నా జ్యోతిష్యం - భావి భారత ప్రధాని అఖిలేశ్

ఒహవేళ నేను ఊహించింది ఎప్పటికయినా నిజమయితే కనుక అప్పుడు ఈ టపాని రిపబ్లిష్ చేసి ఎప్పుడో నే చెప్పానహో అని చంకెలెగరొయ్యొచ్చు. నిజం కాకపోతే గప్‌చిప్గా టపా తీసెయ్యొచ్చు.  అప్పటికి మీకు ఈ టపానే గుర్తుండదూ. 

అఖిలేశును చూస్తుంటే ముచ్చటేస్తుంది. మాంఛి తెలివితేటలు, సమర్ధత, మంచితనం వున్నవాడనిపిస్తుంది. అతని ముఖం కూడా తాజాగా, ఆకర్షణీయంగా వుంటుంది. భారత రాజకీయ యవనిక మీద వెల్లివిరిసిన ఈ కొత్త పుష్పం తన సుగంధసౌరభాలని ఇలాగే వెల్లివిరుస్తుంటుందని నాకయితే ఆశావహంగా వుంది. అతనితో పోలిస్తే యువరాజా రాహుల్ గారి వ్యక్తిత్వం వెలవెలబోయినట్లే అనిపిస్తోంది. అతనింకా తల్లిచాటు బిడ్డగానే అనిపిస్తోంది. మొత్తమ్మీద 'యువరాజా గర్వభంగం' అయిపోయింది. లేకపోతే దేశాన్ని పాలించడానికి తమ కుటుంబం తప్ప వేరే ఎవరూ పనికి రాడంటాడా?    ఇదివరలో యువరాణి ప్రియాంకా అంటే కాస్త ఆసక్తి కలిగేది, ఏదో ఇందిరమ్మని చూసిన అనుభూతి కలిగేది కానీ ఈమధ్య నాకయితే అలా అనిపించడం లేదు.  

ఉత్తరప్రదేశ్ తాజా రాజకీయాల్ను మన రాష్ట్రంలో అన్వయించి చాలామంది లోకేషుకూ, అఖిలేశుకూ పోలికలు చేస్తున్నారు కదా. నాకయితే ఇప్పటివరకూ లోకేశ్ ప్రదర్శించిన వ్యక్తిత్వం ఏమంత ఆసక్తికరంగా అనిపించదు. ముఖం కూడా జిడ్డు ముఖంలా అనిపిస్తుంది. నగదు బదిలీ పథకం వెనుక అతగాడే అని అర్ధమయ్యాక అతని మీద వున్న కొద్దిపాటి గౌరవం కూడా తగ్గింది. పైగా పేదలకు డబ్బులు ఇచ్చే ఆ మా గొప్ప పథకం స్టడీ చెయ్యడానికి విదేశాలకు వెళ్ళొచ్చాడని తెలిసాక ప్చ్ అనిపించింది. ఆ మాత్రం తేరగా డబ్బులు పంచే తెలివితేటల కోసం హక్కడిదాకా వెళ్ళి రెసెర్చ్ చెయ్యాలా? నన్నడిగితే నే చెప్పనూ? నా అభిప్రాయంలో అయితే ఇతగాడికంటేనూ అతని భార్య బ్రాహ్మిణి చాలా బెటర్ అనిపిస్తుంది. బాలక్రిష్ణ కూతురయిన బ్రాహ్మిణి ముఖంలో ఏదో తేజస్సు తెలివితేటలూ ఉట్టిపడుతుంటాయి. చంద్రబాబునాయుడు కొడుకుకంటే కోడలిని రాజకీయాల్లొకి తీసుకువస్తే బ్రాహ్మిణి ప్రభావం వలన బ్రహ్మాండమయిన ఫలితాలు వుంటయ్ కానీ వారంత గొప్పగా ఆలోచించలేరులెండి. 

ఇహ మన రాష్ట్ర యువనేత సంగతి తీసుకుంటే అతన్ని కాంగ్రెస్సులోకి తీసుకోవడం తప్ప ఆ పార్టీకి గత్యంతరం లేనట్లుంది. ఉప ఎన్నికల తర్వాత ఇంకా స్పష్టత వస్తుంది కదా. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో  ఇక్కడ జగనూ, అక్కడ అఖిలేషూ స్వైరవిహారం చేస్తే ఇతర రాష్ట్రాలలో కాంగ్రెస్ ఏమయినా కొద్దిగా సీట్లు సాధిస్తే జగన్ ఆసరా మీద ఆ పార్టీ అధికారంలోకి రావచ్చేమో. అప్పుడు యువనేతవారి కరుణా కటాక్షాలు ఎవరివైపు వుంటాయో ఎవరికి తెలుసు. ఏమో, అప్పుడు జగను కనుక నక్కతోకని తొక్కినట్లయితే ప్రధానమత్రి పదవికి తను కూడా అభ్యర్ధులను సూచించే కెపాసిటీలో వుండొచ్చు. అప్పుడు అఖిలేష్ వాళ్ళ నాన్న ములాయమ్ని ప్రతిపాదిస్తే ఇతగాడు తన అమ్మగారు విజయమ్మని ప్రతిపాదించవచ్చు. ఏమో, భవిశ్యత్తు చిత్రపటాన్ని ఎవరు పక్కాగా చిత్రీకరించగలరూ? ఈలోగా జగను అరెస్టు కావచ్చు కదా అంటారేమో - అలా అయితే అతని పార్టీకే మంచిది కదా. సానుభూతి పవనాలంటూ వుంటయ్ కదా. ఏమాత్రం గాలి అటువైపు వున్నా కూడా ఇది కూడా తోడయ్యి అది రాష్ట్ర ఎన్నికల వాతావరణంలో పెద్ద తుఫానే సృష్టించగలదు. 

అలా ములాయం ప్రధాని అయితే అప్పుడు అఖిలేషుకి యువరాజాగా గౌరవం దక్కుతుంది కాబట్టి తదుపరి ప్రైం క్యూలో అతనే ముందుంటాడు. అలా కాకుండా అప్పటికి జగన్ కెపాసిటీ కూడా బావుండి ఇతర పార్టీలు కలిసివస్తే మన యువనేత కూడా ఉత్సాహపడుతుండొచ్చు. అతనికెలాగూ రాహుల్ని ఓ ఆట ఆడిచాలని మాహా ఆరాటంగా వుందని చూచాయగా అర్ధమవుతూనేవుంది. జరిగేది జరుగుతుంది కానీ మన ఊహాగానాలు మనం చేద్దాం. ఏమో, రాజకీయాలల్లో ఏదయినా జరగవచ్చూ - కాదనగలరా?!
ఇప్పుడే అఖిలేశ్ ఫోటోల కోసం వెతుకుతుంటే అతని భార్య డింపుల్ ఫోటోలు కూడా కనిపించాయి. ఆమె గురించి తెలిసినా కూడా ఆమెను చూడటం ఇదే ప్రధమం. ఎంత బావుందీ! అందుకే నా జ్యోతిష్యాలని అర్జంటుగా సవరిస్తున్నా. డింపుల్ కానీ, అఖిలేష్ కానీ ఇండియా ప్రైం మినిస్టర్ అవుతారు. అవుతారు బాబు గారూ, తప్పకుండా అవుతారు. ఖళ్..ఖళ్..

వంట్లోని కొవ్వు కొలిచే సాధనం తెప్పిస్తున్నా

హమ్మయ్య, జిమ్ములో నా వ్యాయామం మళ్ళీ ఓ దారికి వచ్చేసింది. క్రమ తప్పకుండా తగినంత విశ్రాంతి ఇస్తూనే బరువులు ఎత్తుతున్నాను. ఇదివరకు దెబ్బతిన్నా కాబట్టి జాగ్రత్తగా, నెమ్మదిగా దూకుడు లేకుండా, అన్ని విషయాలను గమనించుకుంటూ వెళుతున్నా కాబట్టి వారం మొత్తమ్మీద ఓ రెండు గంటలు బరువులు, ఓ గంట ఎరోబిక్సూ చేస్తున్నా. ఈ వారం నుండీ సెకండ్ గేర్ వేసేసా. అంటే బరువు, సమయం, ప్రొటీన్ పెంచేస్తున్నా. ఇప్పటిదాకా 30-50 పౌండ్ల బరువు ఎత్తుతున్నవాడినల్లా ఈ వారం నుండీ క్రమంగా 50 - 80 కి పెంచేస్తున్నా. ఇవే కాకుండా సాల్సా మొదలయిన లాటిన్ నృత్యాలు కూడా వీలయితే ఈ వారం నుండే మొదలెట్టాలి. 

జిమ్ములో వెయిట్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు మన శ్రద్ధ ముఖ్యంగా ఫ్యాట్ పరెసెంటేజ్ తగ్గించడం మీద పెడితే మిగతా ప్రయోజనాలు అన్నీ వాటంతట అవే సమకూరుతాయని  తెలిసింది. అందుకే నా వంట్లో కొవ్వు శాతం తగ్గించడం మీద దృష్టి సారిస్తున్నా. కొన్ని నెలల క్రితం అది పరీక్షించినప్పుడు నాకు తగిన రేంజిలోనే 20 శాతం చుటుపక్కల వుంది అని గుర్తుకువుంది. నా వయస్సుకి అది 12 నుండి 21 శాతాలకు మధ్యలో వుండాలి.  దానిని క్రమంగా 12% తీసుకువస్తే ఎంతో బావుంటుంది.  నా వయస్సుకు ఆ మాత్రం కొవ్వు కనీసం నా వంట్లో వుండాల్లెండి. కావాలంటే 10 వరకూ వెళ్ళొచ్చేమో కానీ అది చాలా కష్టం అనుకుంటాను. 12 కి తీసుకురావడనికే చాలా శ్రమ పడాల్సి వుంటుంది. 

వంట్లో కొవ్వు శాతం ఎంత వుందో తెలుసుకోవడం కోసం నిన్ననే అమెజాన్ సైటులో ఫ్యాట్ అనలైజర్ ఆర్దర్ చేసాను. పైన ఫోటోలో కనిపిస్తున్న పరికరం అదే. చాలా సింపుల్గా పనిచేస్తుందది. రెండు చేతులా దాన్ని పట్టుకొని పది క్షణాలు వుంటే చాలు - మనకు కొవ్వు ఎంత వుందో తెలియజేస్తుంది. అవసరమయిన దానికంటే వంట్లో ఎక్కువ ఫ్యాట్ వుంటే గుండె జబ్బులు, చెక్కెరలాంటి ఎన్నో ఆరోగ్య సమస్యలకి అది దారితీస్తుంది.   అందుచేత అందరూ దాన్ని దృష్టిలో పెట్టుకోవడం మంచిది. ఆ పరికరం వచ్చాక తరచుగా మాఇంట్లో వారి కొవ్వు కొలవడమే కాకుండా మా బంధుమిత్రులవి కూడా లెక్కేస్తాను. 

కొవ్వు శాతమే కాకుండా అది BMI కూడా కొలుస్తుంది. ఇంకా మెటబాలిజం, విసెరల్ ఫ్యాట్ కొలిచే పరికరాలు కూడా వున్నాయి కానీ వాటికి ఇంకాస్త ఖర్చు అవుతుందని ఇప్పటికిది చాల్లే అని పై పరికరంతో తృప్తి పడుతున్నాను. ఇలాగే ఆరోగ్యం విషయంలో ముందడుగులు వేస్తుంటే మిగతావి మున్ముందు కొనుక్కోవచ్చులెండి.  పై పరికరానికి అంతా కలిపి $29 అయ్యింది.

ఎన్నాళయ్యింది చలి కాచుకొని...

నా చిన్నతనంలో ఎంచక్కా పల్లెటూరిలో పెరిగాను. చలికాలం వచ్చేసిందంటే చాలు మా తాత పెందరాళే పడుకొని చలిపెట్టినప్పుడు నిద్రలేచి మా జీతగాడిని లేపి చలిమంట వేయించేవాడు. ఆ హడావిడికీ, వెలుగుకీ మగాళ్ళం లేచేసేవారం. మిగతా పనివాళ్ళు కూడా లేచేవారు. అందరం ఆ మంట కాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఎంతోసేపు గడిపేసేవారం. అయితే ముందువైపు నుండి చలికాగుతూ వుంటే ముందు వైపు బాగానే వుండేది కానీ వెనుకవైపు నుండి బాగా చలిపెట్టేది. మళ్ళీ ఎవరికి నిద్ర వస్తే వారు అక్కడి నుండి లేచి వెళ్ళి పడుకునేవారు.

క్రమంగా పట్టణాలకూ, నగరాలకూ ఆపై విదేశాలకూ వచ్చి ఎంతో అభివృద్ధి సాధించాము కదా. శీతాకాలం చలిమంటలు మోటయ్యాయి కాదూ. ఇప్పుడు మనకందరికీ ఎయిర్ కండీషన్లాయే.   ఇంట్లో ఎంత వేడి పెట్టుకున్నా, ఫైర్ ప్లేసుల ముందు చలికాగినా ఆరుబయట అలా ముచ్చట్లాడుకుంటూ మంట కాగేంత ఆనందం వస్తుందీ? అయితే ఆ అదృష్టం మాకు అప్పుడప్పుడు తటస్తిస్తుంటుంది.  క్యాంపింగుకు అప్పుడప్పుడు వెళుతూవుంటాము కదా.  అప్పుడు వేసుకుంటాము చలిమంట. మాతో పాటుగా వచ్చిన బంధుమిత్రులతో కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ ఆ మంట ముందు కాలక్షేపం చేస్తుంటాము.  గత ఏడాది క్యాంపింగుకి వెళ్ళాం. మళ్ళీ ఈ ఏడాది కాస్త వాతావరణం బాగా అయిపోగానే వెళతాం. 

వచ్చేవారాంతం చికాగోలోని ఒక గుడిలో హోళీ జరుగుతోంది. దానికి మేమూ వెళుతున్నాం. అక్కడ ఓ రెండు గంటల సాంస్కృతిక ప్రదర్శనల తరువాత రంగులు చల్లుకోవడం వుంటుంది. ఈదేశాలకి వచ్చాక హోళీ వేడుకలో పాల్గొనడం మాకు ఇదే మొదటిసారి అవుతుంది. ఆ తరువాత సాయంత్రం ఆరు గంటల నుండీ బాన్‌ఫైర్ ఏర్పాటు చేస్తున్నారక్కడ. ఇంకేం ఎంచక్కా అక్కడ చలి కాగుతూ కాలక్షేపం చేస్తాం. మా బంధుమిత్రులకి కూడా ఆ సమాచారం ఇచ్చాను. వారందరూ కూడా వస్తే మాకు ఇంకా సందడిగా, సరదాగా వుంటుంది.

మీరు ఈ ఏడాది హోళీ ఆడుతున్నారా లేదా?మరి ఆ రోజు చలిమంటేసుకుంటున్నారా లేదా?

కైరోప్రాక్టర్ కోసం కొలీగ్ తీసిన నా ఫోటో మరియు విశ్లేషణ

నిన్నటి టపాలో నా చేతులు చల్లబడటం, చేతుల నొప్పి సమస్య గురించి చెప్పాకదా. మా కైరో వైద్యుడు ఆఫీసులో నేను పనిచేస్తుండగా తీసిన ఫోటో పట్రమ్మన్నాడు.  అదీ నాకు తెలియకుండా తీసిన ఫోటో అయితే సహజంగా నేను ఏ పద్దతిలో శరీరాన్ని పెట్టి పనిచేస్తున్నదీ తనకి అర్ధం అవుతుందని చెప్పేడు. నాకు తెలియకుండా నా ఫోటో తియ్యమని నా కోలీగుకి చెప్పాకానీ అతను తీస్తుండగా ఆఖరి క్షణాన అటువేపు చూసేసా. అయినా పర్లేదు లెండి. నా పోస్ సహజంగానే వచ్చింది. 

మీలో ఎవరికయినా ఎర్గానమిక్స్ గురించి అవగాహన వుంటే నేను పనిచేస్తూ నా శరీరాన్ని ఉంచిన విధానంలో ఏవయినా పొరపాట్లు వుంటే ఎత్తిచూపండి. మా కైరో కూడా ఈ ఫోటో చూసి ఆ సలహాలు సూచిస్తాడు. అయితే ఈ ఫోటో కొంత బ్లర్ గా వచ్చింది లెండి. నిన్న ఎర్గానమిక్స్ గురించి చదివి కొన్ని సవరించుకున్నాలెండి. మన చేతుల కన్నా మణికట్లు క్రిందికి వుండాలిట. నేను చేసిన సవరణల వల్లో లేక నిన్న మా కైరో డాక్టర్ చేసిన చికిత్స వల్లో లేక ప్లేసిబొ ఎఫెక్ట్ వల్లో కానీ నా చేతులు ఇవాళ అంత చల్లగానేలేవు, అంత నొప్పీ లేదు! గత కొన్ని వారాలుగా వుంటున్న సమస్య ఈ రోజయితే అంత లేదూ!  

ఇదివరలోనే మా కైరో చెప్పగా పాటించిన కొన్ని సవరణలు మీకు ఇందులో గోచరిస్తాయి. నా వెన్నెముకలోని మెడబాగం కర్వ్ వుండాల్సినంతగా లేదు కాబట్టి నా సిస్టం చాలా పైకి పెట్టుకోమన్నాడు. మానిటర్ క్రింది భాగం నా కళ్ళకు సరిసమానంగా వుండేలా పెట్టుకోమన్నాడు. అందువల్ల నా మెడ భాగం నుండి వచ్చీ వెళ్ళే నరాలకు ఒత్తిడి వుండదని చెప్పాడు. నేను మరీ అంతగా ఎత్తు పెంచలేకపోయాను కానీ సగం అయినా పెంచేసాను. అందువల్ల నా సెర్వికల్ కర్వ్ చాలా మెరుగుపడింది. మరి ఈ ఫోటోలోని కంప్యూటర్ ఎత్తు చూసి మెచ్చుకుంటాడో లేక తిడతాడో చూడాలి.  నేను ఇలా మా కైరోకి దొరికిపోతానని అనుకోలేదు. ఎత్తు పెంచేసావా అంటే ఆహా ఫుల్లుగా పెంచేసా అనే చెబుతూ వస్తోన్నా :(  

ఈ చిత్రం చూసాక నేను కొంచెం ముందుకు వంగి కూర్చుంటున్ననేమో అనిపిస్తోంది. అది సవరించుకోవాలంటారా?

ఇది నా ఆఫీసు గది, ఇది నా ఒక్కడికే ప్రత్యేకం. అప్పుడప్పుడు లంచ్ సమయంలో తలుపులు మూసేసి ఓ ఇరవై నిమిషాలు అలా కునుకూ తీస్తుంటా. ఈ ఫోటోలో అదో ఆ మూలన బుల్లి చెట్టు పక్కన కనిపిస్తోందే... అదే నా జిమ్ము బ్యాగ్. మధ్యాహ్నమే జిమ్ముకి వెళ్ళివచ్చాలెండి.

నా ఆఫీసు గదిని నీటుగానే కాకుండా ఎంతో సింపుల్గా, ఆర్డరుగా ఉంచేస్తానో మీరు గమనించే వుంటారు.

ఎర్గానమిక్స్ గురించి:

అమ్మలు స్నేహితురాలికి డిస్లెక్సియా

తన స్నేహితురాలికి డిస్లెక్సియా వుందని నిన్న మా అమ్మాలు (మా చిన్నమ్మాయి) చెప్పింది. తారే జమీన్ పర్ హిందీ సినిమా పుణ్యాన నాకు డిస్లెక్సియా అంటే ఏమిటో తెలిసినా కూడా తెలియనట్టే అదంటే ఏమిటని అడిగాను. w లు m గానూ, b లు d లు గానూ కనపడతాయని చెప్పింది. అది చెప్పడమే కాకుండా తను చదువుతున్న పుస్తకంలోనుండి ఆ అక్షరాలని మార్చి పదాలను చదువుతూ వెళ్ళింది. మీ క్లాస్‌మేట్ స్నేహితురాలికి డిస్లెక్సియా వుందని ఎలా తెలిసింది అని ఆశ్చర్యంగా అడిగాను. వారికి చదివేటప్పుడు అలా అక్షరాలు కనిపించడమే కాకుండా వారు రాసేటప్పుడు కూడా ఆయా పదాలలోని ఆ అక్షరాలను తిరగరాస్తారని చెప్పింది.

పాఠశాలల్లోని అధ్యాపకులకు డిస్లెక్సియా లక్షణాలను గురించి అవగాహన వుంటుందనీ అందుకనే ఆ స్టుడెంట్ వ్రాతలను మా టీచర్ గమనించి ఆమెకు డిస్లెక్సియా వుందని గుర్తించిందని నాలుగవ తరగతి చదువుతున్న మా అమ్మాయి వివరించింది. ఆమెకు ఆ సమస్య వున్నందుకు గాను ఇంట్లో ఆమె తల్లితండ్రులు  చదవడంలోనూ, వ్రాయడంలోనూ సహకరిస్తున్నారని తెలిపింది.  అంతేకాకుండా టివిలో డిస్నీ ఛానల్లో వచ్చే ఒక సీరియల్లోని నాకు (శరత్ కి) అస్సలే నచ్చని ఓ అమ్మాయికి కూడా ఈ సమస్య వుందనీ, ఆమె కిండర్‌గార్టెన్ లోనే లేదా మొదటి తరగతిలోనో ఆ విషయం తెలుసుకున్నారని చెప్పింది. ఆ సీరియల్ పేరూ, ఆ అమ్మాయి పేరూ నాకు గుర్తుకులేవులెండి. ఎందుకో ఆ అమ్మాయి నాకు అస్సలే నచ్చదు. 

అప్పుడూ అమ్మలుకి తారే జమీన్ సినిమా గురించి చెప్పి ఆ సినిమా నువ్వు కూడా చూసివుంటావని అన్నాను. అవును, ఆ సినిమా చూసాను, ఓసారి ఇండియా నుండి వస్తుంటే కూడా ఫ్లయిటులో ఆ సినిమా పెట్టారు అని ఆ సినిమాలోని కొన్ని దృశ్యాలను గుర్తుకు తెచ్చుకుంది. అది చాలా చక్కని చిత్రమనీ, ఎంతోమంది విమర్శకుల ప్రశంసలు పొదిందనీ, ఎన్నో అవార్డులు వచ్చాయనీ చెప్పాను.

ఇప్పటికీ మీకు డిస్లెక్సియా అంటే తెలియకపోతే, ఆ సినిమా చూడకపోతే ఇప్పటికయినా చూసెయ్యండి. ఓ చక్కని చిత్రం మిస్సవకండి. మనచుట్టూ వున్న వారిలో ఆ లక్షణాలు వున్నాయేమో గమనిస్తూవుందాం. ఆ సినిమా గురించి వివరాలు: 

డిస్లెక్సియా గురించి: