నిన్న చేసిన నటరాజ ధ్యానం

ఈమధ్య ధ్యానం మీదికి బాగా ధ్యాస మళ్ళుతోంది అని చెబుతూ వస్తున్నాను కదా. అలా అని నా ఆసక్తి దైవ సంబంధమయినది అనుకోకండి. సెక్యులర్ మెడిటేషన్ నాది. ఇదివరలో ధ్యానం అంటే ఆస్తికులకు సంబంధించినది అనుకొని సెల్ఫ్ హిప్నటిజం లాగా చేస్తుండేవాడిని. అందులో మన మనస్సుకి మనమే సూచనలు ఇస్తూ, బంగారు భవిశ్యత్తు గురించి స్వైర కల్పనలు చేస్తూ వుండాలి. అందువల్ల కొంత విశ్రాంతి లభించినా మనస్సుకి అలసటగా కూడా అనిపించసాగి పెద్దగా సాగలేదు. పోనీ ధ్యానం చేద్దామన్నా కూడా ఏదో ఒక విషయం మీద మనస్సు లగ్నం చెయ్యాలనుకొని విసుగ్గా అనిపించేది. భావాతీత ధ్యానం గురించి కాస్త తెలిసాక అది బావుందనిపించింది. మనస్సుని అలా గాలికి వదిలెయ్యడమే. దేనీ మీదా ఏకాగ్రత నిలపాల్సిన అవసరం లేదు ఆ పద్ధతిలో. ఇంకేం, హాయిగా కూర్చొని అలా మనస్సుని వదిలెయ్యడమే కాబట్టి హాయిగా అనిపించేది కాబట్టి అప్పుడప్పుడూ చేస్తూ వచ్చాను. క్రమం తప్పకుండా చెయ్యాలనుకుంటూనే సరి అయిన సాంగత్యం, మార్గ దర్శకత్వం లేక సరిగ్గా సాగలేదు. 

చాలా ఏళ్ళ క్రితం ఒక సెమినారుకి వెళ్ళినప్పుడు కూడా ధ్యానం గురించిన ఆవశ్యకత గురించి తెలిపారు. మీకు దేవుడి మీద నమ్మకం లేకపోతే మీకు ఇష్టమయిన వ్యక్తినో లేదా మీ ప్రియురాలినో అయినా ధ్యానించుకోండి అని చెప్పారు. అలా నా ప్రియురాళ్లని ధ్యానించుకుంటూ వుండేవాడిని. మనకు ఒక్కళ్ళు కాదు కదా. నన్ను ధ్యానించుకో, నన్ను ధ్యానించుకో అని నా మనస్సులో పోటీ పడేవారు. టాస్ లు వేసో, అప్పుడు వున్న మూడ్ ను బట్టో ఎవరితోనో ఒకరితో మొదలేట్టేవాడిని కానీ ఆ ఆలోచనలు ఎక్కడికో దారితీసి మనస్సులో ప్రశాంతత బదులు తాపం పుట్టించేవి. అలాకాదనుకొని నాకు నచ్చిన నాయకులను ఎవరినయినా ధ్యానించుకుందామంటే బోరుగా అనిపించేది. ఇలా ధ్యానించుకోవడానికి దేవుడు మీద గురి లేక, నా దేవతలు పనికిరాక అలా మెడిటేషను పక్కన పడేస్తుండేవాడిని. ట్రన్స్డెంటల్ మెడిటేషన్ గురించి తెలిసాక నాకు హాయిగా అనిపించింది. దేవుళ్ళనూ, ప్రియురాళ్ళనూ, నాయకులనూ పక్కన పడేసి నా మనస్సుని నేను నడిపిస్తూ, గమనిస్తూ వచ్చాను. అదీ అప్పుడప్పుడే లెండి. అలా ధ్యానించిన రోజు చాలా హాయిగా వుండేది. అది నిత్యజీవన అలవాటుగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతో వుందని తెలిసీ కూడా నిర్లక్ష్యం చేస్తూ వచ్చాను. సమయం ఎక్కడిదండీ? పోచుకోలు కబుర్లకూ, టివి షోలకూ, నెట్టుకూ, పనికి మాలిన సినిమాలకే సమయం సరిపోవడం లేదు మరి. 

ఓషో గురించి తెలుసుకుంటూవుంటే వారి చురుకయిన ధ్యానాలు తెలిసి నాకు చురుకు ముట్టింది. పతంజలి  యోగా పద్ధతులు గట్రా ఎప్పుడో ప్రాచీన కాలంలో ఇంతగా బ్రతుకుల్లో వేగం, ఒత్తిడీ లేనికాలంలో వచ్చాయి - అవి ఈ కాలానికి సరిపోవు అని కొన్ని ఏక్టివ్ మెడిటేషన్స్ సూచించారు. ధ్యానించడానికి ముందుగా శరీరాన్ని కొన్ని పద్ధతులలో అలసటకి గురిచేస్తే మనస్సు మరింతగా సంసిద్ధం అవుతుంది అన్నది వారి వివరణ. వారు సూచించిన ఏక్టివ్ ధ్యానాల్లో నాకు బాగా నచ్చింది నటరాజ్ ధ్యానం. అందులో మంచి సంగీతం వింటూ మొదట 40 నిమిషాలు కళ్ళు మూసుకొని తన్మయత్వం చెందుతూ మనకు నచ్చిన విధంగా, తోచిన విధంగా నర్తించడమే. ఆ తరువాత ఎంచక్కా 20 నిమిషాలు శవాసనం వెయ్యడం. శవాసనం వెయ్యడం ఏముందండీ, చాలా తేలిక కదా - అలా చచ్చినట్లు పడుండడమే కదా. ఈ ధ్యానానికి తగ్గ సంగీతం వింటూ కళ్ళు మూసుకొని నచ్చిన విధంగా నాట్యం చేస్తూ అలౌకిక ఆనందం పొందాను.

నాతో పాటు మా అమ్మలు కూడా సంతోషంగా అలా ఆ నాట్యం చేసేసింది. ఇందుగ్గానూ మేము ఆనంద్ రిచా అనే అమ్మాయి సంగీతం పెట్టుకున్నాం. ఆ అమ్మాయి, ఆమె పాటలూ, నటరాజ ధ్యానమూ అమ్మలుకి బాగా నచ్చేయి.  అయితే నిన్న సమయం లేక శవాసనం కుదరలేదు. ధ్యాన నాట్యం అని చెబితే మీలాగే మా ఆవిడ నన్ను విచిత్రంగా చూసేస్తుంది కనుక ఆమెను నాట్యానికి ఆహ్వానించలేదు. మా పెద్దమ్మాయి వేరే గ్రహం అనగా ఇంటర్నెట్టులో జీవిస్తుంది కాబట్టి ఇప్పుడే  అలా అంతరాయం కలిగించదలుకోక పిలవలేదు. ముందు అమ్మలూ, నేనూ ఈ నాట్య ప్రయోగాలు చేసి అప్పుడు ఇతరులని ఆహ్వానిస్తాం. వస్తే వచ్చారు - లేకపోతే లేదు.  చిన్నమ్మాయి అమ్మలుకయితే ఇలాంటి కొత్త విషయాల పట్ల ఆసక్తి మెండు కనుక నాతో పాటు ఉత్సాహంగా డ్యాన్స్ చేసింది. చాలా ఫన్నీగా డ్యాన్స్ చేస్తున్నావ్ డాడీ అని అంది. ఇక్కడ విషయం డ్యాన్స్ చక్కగా చెయ్యడం కాదనీ, ఫ్రీ డ్యాన్సింగ్ అనీ వివరించాక బుద్ధిగా అర్ధం చేసుకుంది. మీకూ అర్ధం అయ్యింది కదా? అలా సేక్రెడ్ డ్యాన్స్ నడిపించేసాం.  

'రిచా'కరమయిన పాటలు ఇక్కడ వినండి మరి.
http://anandricha.com/music.html

మీకూ చురుకయిన ధ్యానాల మీదకు ధ్యాస మళ్ళితే ఇక్కడ చూడండి మరి.

11 comments:

  1. శరత్, ఈ పాటలు దేవుడి పాటలు కదా? మీరు వినకూడదండి ;-) JK

    మీ మనసుకు ప్రశాంతతచేకూరాలని కోరుకుంటున్నాను.

    ReplyDelete
  2. @ భారారే
    :)

    మీ ప్రశ్నకి వివరణ నా వచ్చే టపా 'మా నాన్న నేర్పని నడకలు' లో వుంటుంది.

    ReplyDelete
  3. ధ్యానం చేయడం లో చాలా రకాల పద్దతులు చెప్పారు ఓషో
    http://anvvapparao.blogspot.com/2010/08/blog-post_21.html

    ReplyDelete
  4. @ అప్పి
    :))

    నిత్యానంద దగ్గర మీకు ఎంత కర్సయ్యిందో చెప్పారు కాదు!

    ReplyDelete
  5. అన్నా
    ఎంత ఖర్సు అయినా పర్లేదు అని అనిపించింది
    సరుకు నికార్సు అయినప్పుడు పర్సు లోంచి తీసి ఖర్సు పెట్టడానికి ఏముంది అన్నా ?

    కాకపొతే క్రెడిట్ కార్డులు అనుమతిస్తే భలే ఉండేది

    వెయ్యి రూపాయలు వదిలింది ( ఖర్చులు ఫ్రెండ్ వి )
    స్టూడెంట్స్ కి అయితే ఫ్రీ ఫ్రీ ఫ్రీ (విందు, వినోదం, ధ్యానం )


    ఓషో మీద కూడా కొన్ని అభాండాలు ఉన్నాయి అనుకుంటా
    అయినా పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు
    (ఓషో , నిత్య, శరత్, అప్పి )

    ReplyDelete
  6. సెక్యులర్ మెడిటేషన్ ఏంటండి.

    మీ ధ్యానం గురుంచి వింటుంటే కొతి తపస్సు గుర్తుకు వస్తొంది! మీ మెడిటేషన్ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను

    ReplyDelete
  7. @ అప్పి
    మన ఖర్చులు పక్కోళ్ళు పెట్టుకున్నప్పుడు ఇంకా ఆనందం వస్తుంది.

    భాండాగారాలు మన వద్ద వున్నప్పుడు అభాండాలు మామూలే కదా.

    @ అజ్ఞాత
    ఇదివరలో ధ్యానం అంటే దైవ సంబంధమయిన పని అనుకునేవారు. ఆ ధోరణి మారింది. మానవాతీత శక్తులను నమ్మకుండానే చేసే ధ్యానాలను సెక్యులర్ మెడిటేషన్స్ అంటారుట.
    Secular forms of meditation were introduced in India in the 1950s as a Westernized form of Hindu meditative techniques and arrived in the United States and Europe in the 1960s. Rather than focusing on spiritual growth, secular meditation emphasizes stress reduction, relaxation and self improvement.

    http://en.wikipedia.org/wiki/Meditation


    కోతి తపస్సు నాకు గుర్తుకురావడం లేదు. ఆ కథేంటో చెబుదురూ.

    ReplyDelete
  8. you become that upon which you meditate అని సో కాల్డ్ డెఫినిషన్. ఇలా ప్రేయసుల మీద ధ్యానం చేసి మీరు అతి త్వరలో ఆ ప్రేయసులే అయి పోవాలని ఆశీస్సులు. ఇక సేక్యులార్ ధ్యానం - మంచి గార్బేజ్ పదం. చాల బాగుంది. ఇది కూడా మన భారాద్దేశం లాంటి 'సేక్యులరిజమా ?

    చీర్స్ చెప్పుకుంటూ , నేను జిలేబి మీద ధ్యాన ముద్ర లోకి వెళ్లి పోతున్నాను. ఆహా నేను జిలేబి అయిపో తూ తూ తూ తూ తూ తూ తూ ఉన్నాను

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  9. కొతి కథ

    అనగా అనగా ఒక కొతి తపస్సు చేసి మొక్షం సంపాదించాలి అని అనుకుంది. వెంటనే ఒక అడవి లొకి వెల్లి తపస్సు ప్రారంభించింది. కొద్ది సేపు అయిన తరువాత దాహం వేసి నీళ్లు తెచిపెత్తుకుంది. ఇంకా కొద్ది సేపు అయిన తరువాత బాగా ధ్యానం చేస్తె అలసి పొయి తినగలుగుతనొ లెదొ అని కొన్ని పండ్లు ఫలాలు తెచి దగ్గర పెట్తుకుంది, ఇంక కొద్ది సెపు అయిన తరువాత ధ్యానం అయిపొయిన తరువాత తినగలిగే ఒపిక ఉంటుందొ లెదొ అని తెచుకున్నవి అన్ని తినేసింది, బాగ తినెసరికి నిద్ర వచ్చి ధ్యానం సంగతి మర్చిపొయి నిద్ర పొయింది. అది simple గా story

    ReplyDelete
  10. @మా ఆవిడ నన్ను విచిత్రంగా చూసేస్తుంది ...మొగుళ్ళు ఏం చేసినా వాళ్ళకి విచిత్రమే..పట్టించుకోనక్కర్లా మనమ్..

    ReplyDelete
  11. ee link chudagalaru

    endukoemo.blogspot.com/2011/12/alchemist.html

    thanks
    ?!

    ReplyDelete