ఓ చిన్న విజయం

ఇవాళ ఆమె నాకు ఫోన్ చేసి 1200 డాలర్లకు గాను నా పేరిట చెక్ పంపిస్తున్నట్లుగా చెప్పింది. సంతోషం వేసింది. వెంటనే మా ఆవిడకి ఫోన్ చేసి ఓ చిన్న గుడ్ న్యూస్, ఆ వచ్చే వారం వెళ్ళి బంగారు ఆభరణాలు కొనుక్కుందువు గానీ అని చెప్పాను. ఎందుకంటే అవి ఆమెకు చెందాల్సిన డబ్బులు.

గత నెల 13 వ తారీఖున ఒక ప్లాజాలో మా ఆవిడ బంగారమూ, డబ్బూ పోగొట్టుకుందని చెప్పాను - మీకు గుర్తే వుంటుంది. వాటి మొత్తం విలువ అప్పుడు $2500 కంటే పైగా వుంటుండొచ్చు. అంత విలువయినవి పోయినప్పుడు చాలామంది పోలీసు రిపోర్ట్ ఇస్తారు కనుక మేమూ రిపోర్ట్ ఇచ్చి వచ్చాము. చాలా అరుదుగా ఎప్పుడయినా దొంగలు పట్టుబడితే ఎంతో కొంత మనవి మనకు తిరిగి రావచ్చు. మావేవో తిరిగి వస్తాయనే నమ్మకం లేకపోయినా ఫార్మలుగా, మా బాధ్యతగా, ఇలాంటి దొంగతనాలు జరుగుతున్నట్లుగా వారికీ తెలియాలి కాబట్టి ప్లాజా సెక్యూరిటీకీ, పోలీసుకీ రిపోర్ట్ ఇచ్చి వచ్చేసాము.

మా ఇంటికి రెంటల్ ఇన్సూరెన్స్ వుంది. అలాంటి భీమాలలో ఇంట్లో దొంగలు పడ్డా కవర్ అవుతుంది. ఆ విషయం చాలా మందికి తెలియదనుకుంటా. మా పక్కింటతనికి చెబితే అతనికి ఆ విషయమే తెలియదన్నారు.  మరి మా నగలు, డబ్బులు దొంగలు ఎత్తుకెళ్ళారు కానీ మా ఇంట్లో ఎత్తుకెళ్ళలేదే! ఎలా భీమా క్లెయిం చెయ్యడం చెప్మా? భీమా వివరాలు జాగ్రత్తగా చదివాను. ఇంట్లోనే అఖ్ఖరలేదు, ప్రపంచంలో ఎక్కడ మీ వస్తువులు పోయినా ఎంతో కొంత ఇచ్చెస్తామని ఏదేది ఎంత ఇస్తారో లెక్కేసి వుంది. హింకేం. దర్జాగా క్లెయిం చేసాను. మా భీమా ప్రకారం నగదు ఎంత పోయినా కూడా $200 వరకే ఇస్తారు. మా ఆవిడ అందాజాగా $300 పోగొట్టింది. ఆభరణాలు ఎంత విలువ అయినవి పోయినా కూడా $1000 మాత్రమే ఇస్తారు. మా ఆవిడ దాదాపుగా $2200 విలువయైన ఆభరణాలు పొగొట్టుకుంది. ఆ లెక్కన మాకు ఎక్కువలో ఎక్కువ $1200 అయినా రావాలి. అంటే మేము పోగొట్టుకున్న వాటిల్లో సగం విలువ మాకు తిరిగి రావచ్చు. మరి వస్తాయా లేదా?  వస్తే ఎన్నాళ్ళకి వస్తాయి. ఇలా రెంటల్ భీమా కోసం దరఖాస్తు చెయ్యడం  ఇదే మొదటి సారి. అలా చేసి వున్నవారు కూడా మాకు తెలియదు. చూద్దాం అనుకున్నాం.

భీమా వారు ఆధారాలు, రిసీట్లూ సమర్పించమన్నారు. ఒక్క జత చెవి రింగులకు ఇక్కడి రసీదు తప్ప ఇతర ఆభరణాలు ఇండియాలో కొన్నవి కనుక రసీదులు లేనే లేవు. వున్న వరకు పంపించి మిగతావి ఇండియాలో కొన్నామనీ, రసీదులు లేవనీ చెప్పాం. వాళ్ళు అడిగిన ఆధారాలు సమర్పించాం. ఇండియాలో కొన్నా, ఇక్కడ కొన్నా మీ ఆభరణాల రసీదులు జాగ్రత్తగా పెట్టుకోండి. ఇలాగే ఎప్పుడన్నా మీకు అవసరం పడవచ్చు. 

ఇవాల మా భీమా కంపెనీ మేనేజర్ ఫోన్ చేసి ఈ రోజే $1200 కు గానూ చెక్కు పంపిస్తున్నామనీ 4,5 రోజుల్లో అందుతుందనీ చెప్పింది. సంతోషం. అన్నట్లు ఒక విషయం ఇక్కడ ప్రస్థావించాలి. మేము క్లెయిం చెసాక భీమా ఎసెస్మెంట్ ఏజెంట్ నాకు ఫోన్ చేసి మేము ఏదో దొంగలమా అన్నట్లుగా గట్టిగా మాట్లాడాడు. అప్పటికి తమాయించుకున్నాను. నేను మళ్ళీ ఫోన్ చెసినప్పుడు అతనితో ఆ విషయం ప్రస్థావించి మెల్లగా మాట్లాడమని సూచిద్దామనుకున్నాను. అప్పుడు అతను దొరకకపోతే అతని మేనేజరుతో మాట్లాడాను. మా క్లెయిం గురించి మాట్లాడాక ఆ భీమా ఏజెంట్ మాట్లాడె విధం గురించి ఆమెతో ప్రస్థావించాను (ఫిర్యాదు కాదు). అతను మా ఆవిడ స్టేట్మెంట్ తీసుకునేటప్పుడు అతనిని స్మూత్ గా మాట్లాడమని చెప్పమని ఆమెను కోరాను. మా ఆవిడ బెదిరిపోకుండా చూడమని కోరాను. ఆవిడ నాకు క్షమాపణలు తెలియజేసి అతనికి న్యూయార్క్ ఏక్సెంట్ అనీ, మానుకోలేకపోతున్నాడనీ తెలియపరచింది. అతనికి తెలియజేస్తా అని చెప్పింది. ఆ తరువాత అతనెప్పుడూ మా ఆవిడతో గానీ, నాతో గానీ కర్కశంగా మాట్లాడలేదు. మా క్లెయిం కూడా స్మూత్ గా పరిష్కరించాడు.  

అన్నట్లు మేము రెంటల్ ఇన్సూరెన్స్ కోసం నెలకు $12 చెల్లిస్తాము. మా ఇంటికి ఆ భీమా తప్పని సరి. అందుకే తీసుకున్నాం - అది ఈ విధంగా అయినా ఉపయొగపడింది. వచ్చే ఏడాది మళ్ళీ భీమా రెన్యూయల్ చేయిస్తున్నప్పుడు ఒక క్లెయిం చేసాము కాబట్టి  నెల సరి భీమా కొంత పెరగవచ్చు.

2 comments:

  1. ఇది విజయ౦ ఎలా అవుతు౦ది అని మొదట అనిపి౦చి౦ది. బెనిఫిట్ ఆఫ్ డవుట్ క్రి౦ద కొ౦చె౦ కటువుగా మాట్లాడి మీ నిజాయితీ కి పరీక్ష పెడతారు కదా.ఆ అడ్డ౦కి ని దాటారు కాబట్టి విజయమే.

    వివరాలు ఆసక్తికర౦ గా ఉన్నాయి

    ReplyDelete
  2. You can claim the non-reimbursed amount as a deduction on 2011 income tax, provided you itemize your deductions.

    ReplyDelete