హ హ. వీళ్ళ అభ్యుదయం అంతవరకే! - 2

కొంతమంది స్త్రీ బ్లాగర్లు ఆలోచించే విధానం, వారి భావాలు ముచ్చటగా అనిపిస్తుంటాయి. కాస్త ప్రొగ్రెసివ్ గా అనిపించి హమ్మయ్య స్త్రీ బ్లాగర్లలో అందరూ బూజు పట్టిన భావాలే వున్న వారే కాకుండా కొద్దిగా మార్పు దిశగా ఆలోచించే వారు కూడా వున్నారే  అని సంతోషంగా అనిపిస్తుంది. కానీ ఏంటో కానీ హోమో మరియు లైంగిక హక్కుల విషయానికి వచ్చే సరికి మాత్రం సైలెంట్ అయిపోతారు. వచ్చి పోరాటం చెయ్యమనట్లేదు కానీ కనీసం - కనీస మద్దతు కూడా తెలపాలనే స్పృహ వారికి వున్నట్లు అనిపించదు.

అలా అని వారిని ఒత్తిడి చేయడం కాదు - ఎవరి ఇష్టాలకి ఎవరి ప్రవర్తనకి ఎవరు బాధ్యులు? కానీ నాకు అందుగ్గాను విస్మయం చెందే హక్కు వుంది కదా. ఫస్ట్రేషన్ వ్యక్తపరిచే వీలు వుంది కదా. అందరూ పోలో మంటూ మద్దతు ఇవ్వాలని కాదు కానీ ఒక్కరంటే ఒక్కరు ఈ విషయాలని, కనీసం వారి లింగానికి సంబంధించిన లెస్బియన్ విషయాలకయిన, స్పందించడమో, వ్రాయడమో చెయ్యరేం? వారిలో ఆ విషయాల మీద స్పష్టత లేకపోతే ఓ టపా పెట్టి చర్చించవచ్చు, లేదా నాలాంటి బ్లాగుల్లో చర్చల్లో పాల్గొనొచ్చు. ఏమంటే ఎప్పుడూ సెక్సేనా అంటారు? ఏం ఎంతమంది వ్రాస్తున్నారేంటి సెక్స్ గురించి? నేనొక్కడినే ఏదో అప్పుడపుడే కదా. ఎప్పుడయినా, ఏనాడయినా ఇలాంటి విషయాలను బ్లాగుల్లో టచ్ చేసారా మీరూ అప్పుడే ఈ విషయాలపై వైముఖ్యం రావడానికీ?

ఒక్కొకరు తెగ పుస్తకాలు చదువుతారు, చలాన్నీ చదువుతారు. కరివేపాకులా అంతే. నమిలి అవతల పడెయ్యడమే. అంతకు మించి ఆ పుస్తకాలు పనికి రావాయే. ఇలాంటి విషయాలంటే ఎందుకు చిన్న చూపు? స్త్రీలకు ఏదయినా అవమానం జరిగితే ఓ ఘొల్లున మొత్తుకుంటారే! నిస్పృహ ప్రకటిస్తారే! ఇలాంటి విషయాలు, తిండి బట్ట తరువాత ముఖ్యమయిన ఇలాంటి విషయాల్లో కనీసం ఒక్కరయినా స్పందించేవారు ఆడ బ్లాగర్లలో లేకపోవడం, అంత ఆధునిక భావాలు పుణికిపుచ్చుకున్న వారెవ్వరూ లేకపోవడం చూస్తుంటే నిరాశగా అనిపిస్తుంది. బ్లాగుల్లో వున్న ఆడ బ్లాగర్ల అభ్యుదయం అంతా ఒక్క అడుగు ముందు మాత్రమే. సాంప్రాదాయిక ఆలోచనా ధోరణి నుండి ఏ ఒక్క బ్లాగరూ అంతకు మించి ముందుకు వచ్చినట్లు నాకు అనిపించదు. మిగతా విషయాల గురించి ఈ టపా కాదు అని గుర్తుంచుకోవలయును. ఈ టపా విషయానికి సంబంధించి మాత్రమే నేను వ్రాస్తున్నాను. ఈలో ఏ ఒక్కరికయినా ధైర్యం వుంటే లెస్బియన్ ఆంశం గురించి పాజిటివ్ గానో, నెగటివ్ గానో చర్చించండి. అంత దృశ్యం లేదు. మనకెప్పుడూ సొరకాయల కోతలు కావాలి.

ఇక కవులూ, కళాకారులూ, రచయితలూ. వారూ అంతే ఇలాంటి విషయాలని నన్నంటుకోమాకు నామాల కాకీ అన్నట్టుగా ఛీత్కరిస్తారు. వుంటానికి వున్నారు ఓ పెద్ద పండితులూ, మేధావులు. అరిగిపోయిన రికార్డుల్లా పిడివాదాలని తిప్పి తిప్పి వ్రాయడానికీ, ఎప్పుడో 1930 ల్లొ వ్రాసిన పుస్తకాలు చదివి తాద్మాత్యం చెందడానికి. ఆ పుస్తకంలో ఏం గొప్పాగా వ్రాసాడూ, ఈ సినిమాలో ఏం గొప్పగా తీసాడూ అని తత్వ విచారణ చేయడం మినహా సమకాలీన ఆంశాలు ఏమిటీ, వ్రాటిమీద స్పందిద్దాం, వ్రాద్దాం, కవితలల్లుదాం, పాటలు కడదాం, కథలు వ్రాద్దాం అన్నది వుండదు.

ఎప్పుడూ పాడిందే పాటరా పాసుపళ్ళ దాసరీ అన్నట్లుగా చెప్పిన విషయాలనే, తెలిసిన విషయాలనే తిప్పి తిప్పి చెబుతూ తన్మయత్వం చెందుతుంటారు. ఎందుకు ఇతరులకి ఇలాంటి విషయాలు పట్టవు? ఒకసారి కాకపోతే ఒకసారయినా అసలు ఈ విషయం ఏమిటీ, ఈ విషయాల మీద మన స్టాండ్ ఏమిటీ ఎవ్వరయినా తెలిపారా? వారంతా గొప్ప గొప్ప మేధావులు, కళాకారులు కాబట్టి ఇదంతా వారికి స్లీజీ టాక్. నేను అంటున్న విషయాలకి అరకొర మినహాయింపులు లేవని కాదు కానీ అవన్నీ స్వల్పం. వీరందరి కన్న సామాన్య జనం నయం. వారికి అభిజాత్యాలు వుండవు కాబట్టో ఏమో కొందరు అనామకులు, అంతగా పేరు లేని వారు వచ్చి పాజిటివ్ గానో, నెగటివ్ గానో స్పందించి వెళతారు. కొంతమంది ఎంచక్కా భుజం తట్టి వెళతారు.

ఈ అభ్యుదయ దృక్పధం వున్నవారికంటే సాంస్కృతిక దృక్పధం వున్నవారే నయం అనిపిస్తుంది ఇలాంటి విషయాల్లో. సరదాగా నయినా ఇలాంటి విషయాలను ఏక్సెప్ట్ చేస్తూ కామెంట్లలో వ్యక్తపరుస్తుంటారు. ఈ అభ్యుదయ వాదులకు సరదాగా తీసుకునేంత స్పోర్టివ్‌నెస్ కూడా వుండదు. ఇలాంటి స్లీజీ విషయాలా అని ముఖం గంటు పెట్టుకొని, సీరియస్సు ఫోజుల్లో వుంటారు. బ్లాగుల్లో నాకు వున్న మిత్రుల్లో ఎక్కువమంది భారతీయ సంస్కృతిని ఎక్కువగా గౌరవించేవారే అయినా వారిలో హోమోఫోబియా కనిపించదు. ఎవరు భావాలు వారివి అని ఏక్సెప్ట్ చేసి సరదాగా నాతో ఆ విషయాలు ప్రస్థావిస్తుంటారు. ప్రొగ్రెసివ్గా ఆలోచించేవారు చాలామంది సరదాగా కూడా ఆ ఆంశాల్ని టేకప్ చేయగా చూడలేదు.
 
ఇతర బ్లాగర్లని ప్రశ్నించడానికి నీకున్న అర్హత, స్థాయి ఏమిటి అని ఎవరయినా నన్ను అడగవచ్చు. అంత లేదు అని నాకూ తెలుసు. ఇక్కడ ఒకరు చెబితే మరొకరు వినడం వుండదని తెలుసు. ఏదో నా నిరాశ, నిస్పృహ ఇలా వ్యక్తం చేసుకుంటున్నానంతే.
 
(అయిపోయింది)

2 comments:

  1. శరత్, నువ్వు ఆదేశాం లో కూచొని ఇటువంటి విషయాల మీద టపాలు రాసి అభిప్రాయలు అడుగుతావు. నా వరకైతె ఇతరులని,తల్లిదండృలని, పక్కింటి వాళ్ళని విసిగించకుండా గేలు /లేస్బియన్ లు వారి మానా వారు కాపురం చేసుకుంటె వ్యతిరేకించ వలసిన అవసరం ఎమీ లేదు. కాని ఇటువంటి బందాలు ఎంత కాలం ఉంటాయో, వారి మధ్య ప్రేమ ఆవిరి ఐతె సంబంధాలు ఎలా దారి మళ్ళుతాయో ప్రస్తుతానికి చెప్పలేము. కారణం వారి గురించి ఇటువంటి పెళ్ళిలు చేసుకున్న వారి డేటా పెద్దగా లేదు కనుక. వారిరువురు కొట్టుకొని కోర్ట్ కెక్కి తల్లిదండృలను, మిత్రులను మధ్యలోకి లాగ కుండా ఉంటె చాలు. మా అపార్ట్ మెంట్ లో ఉన్న పేళ్ళి కాని వారు వీకేండ్ కి బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కలసి జంటలు జంటలుగా ఆనందిస్తుంటారు. ఎవరికి ఎవరు ఎమౌతారో తెలియదు. అసలికి వీరు నిజం గా ప్రేమికులా లేక ఆ రకం వాళ్ళ అని అనుమానం వచ్చినా చుట్టు పక్కల ఇళ్ళ వారు నోరు మెదపరు. ఇదంతా ఎందుకు చెపుతున్నానటె అబ్బయిలు అమ్మయిలది ఉప్పొంగే వయసు, ఒకరి మీద ఒకరు ,ఒకరి వోళ్ళొ ఒకరు కుక్క పిల్లలా పండుకొని ఉద్దేశ పూర్వకం గా తమను అందరు చూడాలని తలుపులు తీసి ఉంచుతారు. పెద్దగా పాటలు పేట్టి తాగి తందనాలాడినా పక్క ఇళ్ళ వారు ఎరగ నట్టు ఉంటారు. కారణం వీరు ఎటువంటి వారో, రౌడి మూకో అని భయం. ఇక ఇల్లు గలవాడు వీరిదగ్గరనుంచి నెలకి 20,000 బాడుగ వస్తుంది కనుక వాడు పెద్దగా వీరిని గురించి పట్టించుకోడు. నలిగేది చుట్టు పక్కల వారు. అదే మీరు చెప్పె గేలు ఉంటె ఇద్దరు మగ వాళ్ళు కలసి ప్రశ్నించే పిరుగు పొరుగు వారిని కొడితే ఎమీ గాను :-)
    Lot of issues are there Sarat. It is not only marriage.

    Sri

    ReplyDelete
  2. @ అజ్ఞాత

    ఇక్కడ కూర్చొని టపాలు వ్రాస్తున్నా అంటున్నారు కానీ నా గే అనుభవాలన్నీ ఇండియాలో వున్నప్పుడో లేక ఇండియాకి వచ్చినప్పుడు జరిగినవే. ఇక్కడ ఇంతవరకూ ఒక్క అనుభవం కూడా జరగలేదు. ఎందుకంటే సమయం, సందర్భం, నచ్చిన వ్యక్తీ కలిసిరాలేదు. కుటుంబ బరువు బాధ్యతల వల్ల కూడా ఇలాంటివి ఎక్స్‌ప్లోర్ చేసే తీరికా, ఓపికా, ఆసక్తీ ఎక్కువగా వుండవు.

    మామూలు జనభా అంతా మంచి వారే వుంటారని ఎలాగయితే సెర్టిఫికెట్టు ఇవ్వలేమో అలాగే గే, లెస్బియన్లు కూడా అందరూ మంచి వారే వుంటారనుకోనక్కరలేదు. కొంతమంది రౌడీలు వుండవచ్చు, చెడ్డవారూ వుండవచ్చు. అలాటి వారితో కొన్ని ఇబ్బందులు వుండకపోవు. అవన్నీ ఓ మంచి మెడిసినుకు వుండే చిన్న చిన్న సైడ్ ఎఫెక్టుల్లాంటివి ఇవి. అలాంటి ఎఫెక్టులని మినిమైజ్ చెయ్యడానికి ప్రయత్నిస్తూ వుండాల్సిందే.

    ఇలాంటి విషయాలు సింపుల్ కావు అని తెలుసు. అవన్నీ మొదలయితే అవే అడ్జస్ట్ అయిపోతుంటాయి, అవే సర్దుకుంటాయి. పెళ్ళి అనే పెద్ద విషయాలకే ఆమోదం వచ్చేస్తే ఇహ మిగతా విషయాలెంత?

    ReplyDelete