పిల్లులు: మేమొక పిల్లి రాజావారిని తెచ్చుకున్నమని, వారికి 'పోక్ (పోకిరి)' అన్న పేరు పెట్టేసుకున్నామన్న శుభవార్త మీకు తెలిసే వుంటుంది. మల విసర్జన విషయంలో, మూత్ర విసర్జన విషయంలో పిల్లులకు వున్న శ్రద్ధ, పరిశుభ్రత చూస్తే ముచ్చటేస్తుంది. ఇసుకలాంటి ప్రదేశాన్ని తవ్వి అందులో విసర్జించి పైన మట్టిని కానీ, ఇసుకని కానీ కప్పివేస్తాయి. ఇంట్లో ఇసుక, మట్టి వుండదు కాబట్టి ఇక్కడివారు సాధారణంగా అందుకోసం ప్రత్యేకంగా లిట్టరునూ, లిట్టర్ బాక్సునూ ఏర్పాటుచేస్తారు. మేమూ అలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేసాము. మనుషులెవరన్నా ఆరుబయలు మలవిసర్జనకు గానీ, మూత్ర విసర్జనకు గానీ వెళ్ళినప్పుడు అంత జాగ్రత్త పడుతారా? మనది మనం శుభ్రపరచుకోవడమే ఎక్కువనుకుంటారు - సమాజ సేవ అనుకుంటారు!
గాడిదలు: సూర్యాపేటలో వున్నప్పుడు ఒకసారి పనిలేక తీరికగా గాడిదలని పరిశీలించాను. ఒక చోట గుంపుగా గాడిదలున్నాయి. ఒకటి రోడ్డు పక్కగా మూత్ర విసర్జన చేసింది. దాని పని అయిన తరువాత వెనకే ఇంకో గాడిద వచ్చి అంతకుముందు గాడిద మూత్ర విసర్జన చేసిన స్థానంలోనే అది కూడా పోసింది. దాని వెనకే ఆ మందలో వున్న మరొక గాడిద కూడా సరిగ్గా అదే స్థానంలో విసర్జన చేసింది. అలా ఆ గుంపులోని అన్ని గాడిదలూ అలాగే విసర్జించాయి. అలా అన్ని గాడిదలకూ ఒక్క సారే ఎలా మూత్రం వస్తుందబ్బా అని ఆశ్చర్యపోయాను. ఇందులోంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమయినా వుందా అని బుర్ర గోక్కున్నాను.
కుందేళ్ళు: కెనడాలోని నయగరా ఫాల్సులో నివసిస్తున్నప్పుడు రెండు కుందేళ్ళని పెంపకానికి తెచ్చుకున్నాము. వాటికి లిట్టర్ బాక్స్ ట్రైనింగు ఇవ్వడం మా వల్ల అయ్యింది కాదు. వాటికి లిట్టర్ బాక్సులోనే మల మూత్ర విసర్జన చేసేలా శిక్షణ ఇవ్వడం కష్టమయిన విషయమేనని నెట్టులో తెలుసుకుని నెత్తీ నోరూ కొట్టుకున్నాను కూడా. మా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ చేసిపారేసేవి. కాస్త నయమేమిటంటే అది తడిగా వుండక గుండ్రంగా గోళీల్లాగున వుండేవి. ఇంట్లో ఎక్కడెక్కడో ఆ గోళీలు పెట్టేవి. ఆ గోళీలను వెతికి వేటాడలేక నాకు ఆయాసం వచ్చేది. మొత్తం మీద ఎంత శుభ్రం చేసినా, ఎన్ని శుభ్రం చేసినా అక్కడో ఇక్కడో కొన్ని గొతికలు కనపడకుండా మిగిలిపోయేవి. ఆ గొతికల వల్లనే ఏమో మా పెద్దమ్మాయికి వంటి నిండా స్కిన్ ఎలెర్జీ కూడా వచ్చేసింది. వాటి మల బద్ధకాన్ని భరించలేక హ్యూమేన్ సొసయిటీకి వాటిని ఇచ్చివేసి దులిపివేసుకున్నాము. మేము ఆ ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడు బేస్మెంటు ఖాళీ చేస్తుండగా కూడా ఆ మలగోళీలు సామానుల వెనుకాల చాలానే కనిపించాయి. మొత్తం మీద ఇకముందెప్పుడూ ఇంటిలోపల కుందేళ్ళని పెంచడానికి తీసుకురాకూడదని డిసైడ్ అయ్యాము.