పెల్లెటూరి కోడలితో పెళ్ళి ప్రయత్నాలు


ఈ అమ్మాయి పేరు మంజరి అనుకుందాము. మంజరి మా కజిన్ చిన్న బిడ్డ. బావుంటుంది, మర్యాద, మన్నన, మంచితనం. నాకు బాగా దగ్గరి చుట్టాలమ్మాయే కావడంతో ఆ అమ్మాయి నాకు బాగా తెలుసు. వారి కుటుంబం కూడా చాలా చక్కనిది. తనకు తండ్రి చిన్నప్పుడే పోయారు. అక్క పేదరికంతో పిల్లలని ఎలాగోలా నెట్టుకువస్తోంది. ఈ అమ్మాయిని పెళ్ళి చెసుకోవడం ద్వారా వాళ్ళ కుటుంబానికీ కొంత అండగా వుండవచ్చు అనుకున్నాను. మనకు కట్నాల పట్టింపులు ఏమీ లేవు కాబట్టి అలా కూడా వారి సమస్య తీర్చినట్లుంటుంది.

ఊరికి వెళ్ళినప్పుడల్లా వారింటికి వెళ్ళి తప్పక గడుతుండేవాడిని. ఆ ఇంట్లోని పిల్లలూ, పెద్దలూ నన్ను బాగా ఆప్యాయంగా చూసుకుంటారు. మా అందరి మధ్య మంచి అనుబంధం వుంది. వారి ఇంటికి వెళ్ళినప్పుడల్లా వారి ఇంటిలో ఒక సభ్యుడిగా కలిసిపోయేవాడిని. నా చిన్న కోడలు మంజరితో సహా పెద్ద కోడలు, అల్లుడు కూడా వాళ్ళ చిన్నప్పటినుండీ నాతో ఆడుతూ, పాడుతూ తిరిగిన వారే. వాళ్ళింటికి వెళితే నన్ను ఇక వదలనే వదలరు. బ్యాక్ గ్రవుండ్ అంతా బావుంది - భేష్ కదూ.      

...కానీ వారి నుండి పెళ్ళి ప్రస్థావన మాత్రం ఒక్కసారి కూడా రాలేదు. మరి స్థాయి, హోదా, ఆస్థి గట్రాలలో అంతరాల వల్ల ధైర్యం చేయలేదా మరేదన్నానా అనేది నాకు తెలియదు. ఆ విషయం తెలుసుకోవడానికని నా క్లోజ్ ఫ్రెండ్ వేణుని వురమాయించాను. అతను మా ఊరెళ్ళి మా కజిన్ కుటుంబంతో మాట్లాడి వ్యవహారం అంతా దాదాపుగా చక్కబెట్టుకొని వచ్చాడు. భేష్. ఇంకా బావుంది. వాళ్ళకీ నేను బాగా ఇష్టమే కానీ పెళ్ళి గురించి అడగడానికి మొహమాటపడుతున్నారంట. సో, అన్ని సమస్యలు తీరాయి. కాదు - ఇంకో సమస్య, ముఖ్యమయిన సమస్య వుంది.   

కొన్నిట్లో నావి రాడికల్ భావాలు. అవి నాకు ముఖ్యం. వాటితో ఆ అమ్మాయి ఏకీభవించాలి కదా. ఆమెతో చక్కటి స్నేహం వున్నా ఈ టాపిక్ మా మధ్య ఎప్పుడూ రాలేదు. అమ్మాయి ఎంత చక్కటిదయినా నా భావాలతో ఏకీభవించలేకపోతే ప్రయోజనం లేదు. అందుకే మంజరితో ఏకాంతంగా మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. అయితే పరిష్కరించుకోవాల్సిన సమస్య ఇంకొకటి వుంది. అది ఎత్తు.

అవును. ఎత్తు. నేను కాస్త పొట్టి. అమ్మాయి నాకంటే ఎత్తు వుంటే నాకు ఇష్టం వుండదు. ఆ రోజుల్లో మా ఫ్రెండు వేణునే కాకుండా ఇంకొక దగ్గరి బంధువు కూడా తమ కంటే ఎత్తయిన పెళ్ళాన్ని చేసుకొని పడుతున్న అష్టకష్టాలు నాకు తెలుసు. ఎత్తు వున్న భార్యను గమనించకుండా ఎటన్నా నడిచివెళుతున్నపుడు తమ భార్యలని మూడు అడుగుల దూరంలో నడవమని ఆదేశించేవారు వాళ్ళు! ఎత్తు వున్న పెళ్ళాంతో వచ్చే కష్టాలు పగవాడిక్కూడా వద్దని నాకు మా ఫ్రెండు వేణు ఎప్పుడూ సినిమా స్కోప్లో చెబుతుండేవాడు (అప్పుడు ఐమాక్స్ లు లేవు మరి).  తన జీవితం ఎలా అయిపోయినా తన మిత్రుడి - అనగా ఈ శరత్తు జీవితం అయినా సరి అయిన ఎత్తులో వుండాలని మా వేణు కంకణం కట్టుకొని ఒక టేప్ పట్టుకొని తిరుగుతుండేవాడు.  

 అన్నిరోజులు ఆ అమ్మాయితో స్నేహంగా వున్నా ఈమధ్య తాను ఎత్తుపెరిగిందేమో అని సంశయం. ఆమె దాదాపుగా నా ఎత్తో, నాకంటే ఎత్తో వుండే సూచనలు వున్నాయి. నా ఎత్తు అయితే ఎలాగోలా కష్టకష్టంగా అడ్జస్ట్ చేసుకొవచ్చు కానీ నాకంటే ఎత్తయితే? బాప్ రే బాప్.. వద్దు వద్దు. మరి ఎత్తు సంగతి ఏం చేద్దాం అని వేణుని అడిగాను. నేను వున్నా కదా అని నన్ను మేము వుంటున్న సూర్యాపేట నుండి మా స్వంత ఊరు తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక మిత్రుని ఇంట్లో నన్ను కూర్చోబెట్టి టేప్ తీసుకొని మంజరి ఇంటికి వెళ్ళాడు. 

మా ఫ్రెండు ఇంట్లో కూర్చొని వున్న నాకు తెగ సస్పెన్స్. ఎత్తు సరిపోతుందో లేదో అని. అక్కడున్న మా ఫ్రెండు వెంకట్ రెడ్డితో దీని గురించే చర్చలు. కొద్ది సేపు అయాక ముఖం వేళాడేసుకొని వచ్చాడు వేణు. విషయం అర్ధమయ్యింది. నాకంటే దాదాపు రెండు అంగుళాలు ఎక్కువ ఆ అమ్మాయి. దీర్ఘంగా నిట్టూర్పు విడిచాను.  హ్మ్మ్

ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా అనుకుంటాను - చక్కటి అమ్మాయిని మిస్సయ్యానని. ప్చ్!    ఆ తరువాత ఆ అమ్మాయికి ఒక పేద అబ్బాయితో పెళ్ళి అయ్యింది. కొంతకాలం నుండి కొద్దిగా జీవితంలో పైకి వచ్చినట్లున్నారు. నా గురించి ఆ అమ్మాయి మనస్సులో ఏం వుండేదో ఎప్పుడూ కనుక్కోలేకపోయానే అనిపిస్తుంటుంది. ఎందుకో చాలా స్నేహితంగానే వున్నా కూడా ఆమె మనస్సులోకి తొంగిచూడలేకపోయాను. ఒకవేళ చూసివుంటే - ఒకవేళ అమ్మాయికీ నా మీద అనురాగం వుండివుంటే ... ఎత్తుని త్యాగం చేసేవాడినేమో!...ఏమో? ఏంటో కొన్ని కొన్ని బంధాలు ఇలాగే అస్పష్టంగా మిగిలిపోతుంటాయి - ఎందుకిలాగా? అర్ధం కాదు. అదీ జీవితాల్లో ఒక భాగం కాబోలు.

3 comments:

  1. bagundi mee katha
    bagundi mee reactions idea

    ReplyDelete
  2. ప్చ్! పాపం ఎన్ని కష్టాలండి మీకు మీ ప్రేమైక పెళ్ళిచూపుల ప్రహసనంలో ఎత్తు.. ఒక అడ్డయినందుకు నేను చింతిస్తున్నాను. కాకపోతే నాకు ఈ పోస్ట్ వల్ల జ్ఞానోదయం అయింది, మావారు నన్ను మూడడుగుల ముందు కాదు వెనక కూడా నడవమనరు.. అసలు నాతోనే రారు ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే మా... మా.. ఆఫీసులనుండి వేరు వేరుగా బయల్దేరి గమ్యస్థానంలో ఇద్దరం కలుసుకుంటాము. ఇదంతా నా ఎత్తు మహిమే అంటారా? :(

    ReplyDelete
  3. @Maddy
    ధన్యవాదాలండీ

    @ రమణి
    మీ వారికంటే మీరే ఎత్తా?! హ్మ్. ఇంకేం, అయిపోయారు.

    'ది డైరీ ఆఫ్ మిసెస్ రమణి' ఈమధ్య వస్తున్నట్లు లేదు?

    ReplyDelete