ఆ ఇచ్చావులే బోడి సలహాలు

ఈ మధ్య మార్స్ నుండి మగాళ్ళూ - వీనస్ నుండి ఆడాళ్ళు (Men Are from Mars Women Are from Venus) అన్న పుస్తకం చదువుతున్నా అని చెప్పా కదా. అందులో ఒక అధ్యాయం చదివేసాను. అందులో మగవారికి ఆడవారు సలహాలు చెబితే ఎలా వుంటుందీ అలాగే ఆడవారికి మగవారు సలహాలు చెబితే ఎలా వుంటుందీ అన్నది వివరించారు. అడక్కుండా సలహాలూ, విమర్శలూ చేస్తే మగవారికి కాలుతుందిట. అందుకే పురుషులకు ముందుబడి సలహాలు ఇస్తే బోడి సలహాలు అయి కూర్చుంటాయని, నిగ్రహించుకొమ్మని చెబుతాడా రచయిత John Grey. అలా ఉచిత సలహాలు ఇస్తూపోతే మగాడి అహం దెబ్బతింటుందిట. అలా మగ ఇగో దెబ్బతినకుండా ఎలా సోపేస్తూ పనులు సాగించుకోవచ్చో ముందుముందు అధ్యాయాల్లో చెబుతా అన్నాడు.

నిజమే మరి. డ్రైవింగ్  చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా దారి తప్పామనుకోండి. మళ్ళీ సరి అయిన  రోడ్డు ఎక్కడానికి మనం కిందామీదా పడుతుంటామా. పక్కనుండి ఉచిత సలహాలు వచ్చేస్తూనేవుంటాయి. అలా వెళ్ళొచ్చు కదా, ఇలా వెళ్ళొచ్చు కదా, ఆ రోడ్డెక్కొచ్చు కదా, ఈ మలుపు తిరగొచ్చు కదా అని. అప్పుడు సర్..న కాలుతుంది. అప్పుడు నిరసనగా కారు దిగి అసెంబ్లీలోనుండి వాకవుట్ చేసినట్లుగా చెయ్యాలనిపిస్తుంది. లేకపోతే మనం ఏదన్నా రిపేర్ చేస్తున్నామనుకోండి. వీళ్ళు మనపని మనని చెయ్యనిస్తారా - వెనకనుండి దర్శకత్వం వహిస్తారు. దాంతో నాకు చిరాకెత్తిపోయి పానాలు జారవిడిచి నువ్వే చేసుకో అని వెళ్ళిపోతాను. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో, ఎన్నెన్నో. అంచేతా ఓ మహిళామణులారా, మేము చేసే పనులని చూస్తూవుండండంతే, ముందుబడి ఓ సలహాలు మామీద విరెయ్యకండి. మా మగాళ్లకి మండుతుంది.

అలా అని మనం అనగా మగ మహారజులం ఊరుకుంటామా? అబ్బే, అదేం లేదు. మన ఆడాళ్ళు ఏవయినా చిన్న సమస్య చెప్పారంటే చాలు - ఉచిత సలహాలు వరదల్లా వదులుతాము. అది మనం వారి పట్ల చూపించే శ్రద్ధ అనుకుంటాము. అది తప్పంటాడు ఆ రచయిత జాన్. అప్పుడు వాళ్ళు కోరేది మన బోడి సలహాలు కాదుట. వారి సమస్య పట్ల సానుభూతిట. మా ఆవిడ ఎప్పుడన్నా ఏదన్నా శారీరక సమస్య అందనుకోండి. వ్యాయామం, అహారం పట్ల తీసుకోవాల్సిన శ్రద్ధ పట్ల లెక్చర్లు దంచేస్తాను. నేను కొద్దిగా మొదలెట్టగానే నేనేం చెప్పబొతున్నానో ఆమే చెప్పేసి ఇక చాల్లే అంటుంది. ఎంత చెప్పినా తలకెక్కించుకోకుదుకదా అని ఆమె సమస్యలని పట్టించుకోవడం తగ్గిస్తుంటాను. ఇలాంటి ఉదాహరణలు కూడా ఎన్నో చెప్పుకోవచ్చు.

మనం మగాళ్ళం అలా చెయ్యకూడదంట. వారి సమస్యలని సానుభూతితో వింటూపోవాలంట అంతే కానీ అప్పుడు మాత్రం సలహాలు, సూచనలు, విమర్శలు చేస్తూపోవద్దంట. అలాచేస్తే వారు ఆశాభంగం పొంది మనపట్ల నిరసన పెంచుకుంటారంట. ఆల్రైట్. అలాగే చేద్దాం. మరి అలా సలహాలు ఇవ్వకుండా మనం చెప్పాల్సింది ఎలా చెప్పాలో మున్ముందు చెబుతాను అన్నాడు ఆ రచయిత. సంతోషం. అందాకా వారు చెప్పింది నోరు మూసుకొని వింటూ ఊ కొట్టమన్నాడు. ఊ అనండి మరీ. ఊ...

ఇలాంటివే ఇంకా ఎన్నో విషయాలు చర్చిస్తున్నాడు ఆ రచయిత. అన్నీ ప్రస్థావించడం కుదరదు కాబట్టి ఆసక్తి వున్నవారు ఆ పుస్తకం చదివెయ్యండి. ఇక్కడ ఎక్కువగా ఉదాహరణలు మా ఆవిడ గురించే ఇస్తున్నా ఆలోచిస్తుంటే ఇవే పద్ధతులు మా అమ్మాయిల పట్ల కూడా పాటించాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది. వారు ఎప్పుడన్నా ఏదన్నా సమస్య చెప్పుకోవడానికి వచ్చినప్పుడు తెగబారెడు సలహాలు ఇస్తూ పోకుండా వారు చెప్పేది సావధానంగా వింటూ పోవాలని నిర్ణయించుకుంటున్నాను - ఇప్పుడే. ఆడవారి, మగవారి ఆలోచనాధోరణుల్లో చాలా తేడాలుంటాయని వాటిని గుర్తించి వాటికి అనుకూలంగా ప్రవర్తిస్తూపోతే  అన్యోన్యత పెరుగుతుందని ఆ పుస్తకం చెబుతుంది.

2 comments:

  1. bhale cheppaarandi

    ReplyDelete
  2. @ అజ్ఞాత
    మీకు నచ్చినందుకు సంతోషంగా వుంది.

    ReplyDelete