పెరుగులో నెయ్యి - రివర్స్ ఇంజినీరింగ్

కొన్ని టపాల క్రితం నా యుక్తవయస్సులో నేను లావుకావడానికి చేసిన ప్రయత్నాలు చెప్పా కదా. మీకు గుర్తుండేవుంటాయి. అందులో భాగంగా పెరుగులో నెయ్యి వేసుకొని అన్నం తింటే నేను లావుకావడం మాట అటుంచి బుల్లి పొట్ట మాత్రం తయారయ్యిది. ఇప్పుడిక కొంత వయస్సు వచ్చింది కాబట్టి ఆ బుల్లి బొజ్జను తగ్గించకపోతే ముందుముందు భయంకరమయిన డయాబెటిస్ (ఎయిడ్స్ అన్నా భయపడనేమో కానీ అదంటే నాకు భయ్యం) మొదలయినవి రావచ్చని అక్కడా ఇక్కడా చదవుతున్నా. ఆ క్రమంలో అహార మార్పులు, శారీరక శ్రమ గట్రా చేసేస్తున్నాను.

వరి అన్నం తగ్గించి గోధుమ రొట్టెలు/ చపాతీలు తినడం మొదలెట్టాను. వాటికంటే పళ్ళు తినడం బెటరని తెలిసి పళ్ళు ఎక్కువ చేసాను. వాటికంటే కూరగాయలు మంచిదని తెలుసుకొని కూరగాయలు ఎక్కువ చేసాను. ఇక్కడ వచ్చింది చిక్కు. పచ్చి కొరగాయలు ఎలా తినాలి? సరే, మైక్రోవేవ్ ఓవెన్ లో ఉడికించుకుంటూ తింటున్నా. పదేపదే కూరగాయలు కోయమంటే మా ఆవిడ విసుక్కుంటోంది. అలా లాభం లేదని గ్రోసరీ షాపుల్లో నుండి కట్ చేసిన కూరగాయ ప్యాకెట్టులు తెచ్చుకొని లాగిస్తున్నా. ఇంతవరకూ బాగానే వుంది కానీ అలా ఉడికించిన కూరగాయలు రుచికరంగా వుండవు కదా. అక్కడొచ్చిందీ సమస్య!

మీరయితే ఏం చేస్తారేమిటి? నేను సమస్యా పరిష్కారం కోసం తపస్సు చేసా. అప్పుడు నాకు కలలో ఒక అందమయిన దేవత కనిపించి చిన్నప్పుడు లావుకావడానికి పెరుగులో నెయ్యి కలుపుకొని తాగిన నా వైనం గుర్తుకుచేసి దాంట్లోనే పరిష్కారం దొరుకుతుందని తెలియజేసి అంతర్ధానం అయిపోయింది. చప్పున కళ్ళు తెరచి తపస్సులోంచి బయటకి వచ్చా. పెరుగు - నెయ్యి - నెయ్యి - పెరుగు అనుకుంటూ ఆలోచిస్తూ పోయా. అప్పుడు జ్ఞానోదయం అయ్యింది.

ఉడికించిన కూరగాయలకి చట్నీ అద్దుకొని తినడం మొదలెట్టాను. ఇంకా అలా కాదని ఆ కూరగాయల గిన్నెలో ఇంట్లో ఏదుంటే అది కూర, చారు, చట్నీ, పచ్చళ్ళు అన్నీ పడేసుకోని తింటూ వుంటే నా సామి రంగా రుచికి రుచీ, ఆరోగ్యానికి ఆరోగ్యం. అలా తింటూ వుండటాన్ని మా ఆవిడ వింతగా చూసి కూరగాయల సాంబారుకీ, దీనికీ ఏం తేడా వుందని పొరపాటున అడిగింది. అప్పుడు నాకు ఒక దివ్యమయిన ఆలోచన వచ్చింది. అప్పటినుండీ మా ఇంట్లో ఎప్పుడు సాంబార్ చేసినా నేను అందులో కూరగాయల ముక్కలు మిగలనివ్వడం లేదు. నా ఈ ఆరోగ్యవ్రతాన్ని ఇంట్లో కొంతమంది సహించక కుట్ర పన్ని వంటకాగానే కొంత సాంబార్ దాచేసుకుంటున్నారని అభిజ్ఞవర్గాల ద్వారా అనగా అమ్మలు అనగా మా చిన్నమ్మాయి ద్వారా భోగట్టా.

సాధారణంగా సగటు మనిషికి రోజుకి 2000 క్యాలరీల శక్తికి తగ్గ ఆహార పదార్ధాలు కావాలి. దానిని 1200 లకో, 1300 లకో తగ్గించుకుంటే ఎక్కువకాలం బ్రతకొచ్చట. అలా తగ్గించాలంటే ఇలా ఏవో కష్టాలు పడాలి మరి. నలభై ఏళ్ళు వచ్చిన తరువాత మెటబాలిజం తక్కువవుతుంది కాబట్టి వ్యాయామం తో పాటు క్యాలరీలు తగ్గించాలి మరి. యుక్తవయస్సు వారు ఈ టపాని లైటుగా తీసుకొని నవ్వుకొవచ్చేమో గానీ మీకు నలభై దాటి కూడా నవ్వుకొని వదిలేసారనుకోండి - ప్చ్, లాభం లేదు.

15 comments:

  1. > నా ఈ ఆరోగ్యవ్రతాన్ని ఇంట్లో కొంతమంది సహించక కుట్ర పన్ని వంటకాగానే కొంత సాంబార్ దాచేసుకుంటున్నారని

    అయినా వాళ్లకు దాచేసుకునే అవకాశం ఎందుకు ఇస్తున్నారు?
    మీరే సాంబార్ చేసుకుంటే పోలా! :-P

    ReplyDelete
  2. డయాబెటీస్ మీరనుకుంటున్నంత భయంకరమేమీ కాదనుకుంటా. డాక్టర్లు చెప్పేది - It won't hurt you. It does not bring down your longevity. But it necessitates a few life-style changes. నిజమేననిపిస్తోంది, లక్షలాదిమంది డయాబెటిక్కులు యథాప్రకారంగా జీవితాన్ని లాగించెయ్యడం చూస్తూంటే ! శరీరంతో లిబర్టీస్ తీసుకోవడం, ఓవర్లూ, ఎక్స్ ట్రాలూ చెయ్యడమంటారా ? అది డయాబెటిక్కులకే కాదు, ఆరోగ్యవంతులక్కూడా మంచిది కాదు.

    ReplyDelete
  3. హ హ హ శరత్ గారు మీరొక నమ్మలేని నిజం చెప్పాలా ఇప్పుడు, సాంబార్ తింటె లావవుతారు :)

    ReplyDelete
  4. అడవుల్లో సన్యాసుల్లాగా ఇప్పటినుంటే ఆకులు, అలములు, కందములాలు తినడం అలవాటు చేసుకున్నారా...!! బాగుంది బాగుంది...ఫ్యూచర్ లో అవసరానికి ఉపయోగపడుతుంది.

    ReplyDelete
  5. ఎంతైనా మీకు కొంచెం ముందుచూపు ఎక్కువే ..

    ReplyDelete
  6. అన్ని రకాల కూరగాయ ముక్కలూ కొద్దిగా ఉడికించుకుని చిటెకెడు ఉప్పూ, మిరియాలపొడి, కొంచం నిమ్మ రసం (ఇది ఆప్షనల్) వద్దనుకుంటే పెరుగు కలిపి తినోచ్చు.గ్రేవీ లేకుండా తినాలి. సాంబారు లాగిస్తే ఏమీ ఉపయోగం ఉండదు.

    ReplyDelete
  7. అన్నాయ్!!
    నా బ్లాగులో ఎడమచేతివైపు పైన "నా నడక" అని పెట్టా చూడు.
    నా నిన్నటి వర్క్ ఔట్ -
    http://www.mapmyfitness.com/view_workout?w=590124900684816233

    Type: Regular Walk
    Date: 07/30/2009
    Start: 21:03:42
    End: 22:19:46
    Time Taken: 01:16:04
    Total Distance: 4.42 mi.
    Pace: 17:12 (avg)
    Speed: 3.49 (mi/hr) (avg)

    ఒక సాధారణ అడల్ట్ కి రోజుకి సరాసరి 2000 కేలరీలు కావాలి. కాకపోతే ఇది సరాసరి మాత్రమే. ఇది మనిషికి మనిషికి మారుతుంది. ఎత్తు,వయసు, లావు లాంటివి దీన్ని ప్రభావితం చేస్తాయ్.

    నేను రోజుకి -
    మూడు ఇడ్లీ లేక రెండు దోస బ్రేకుఫాస్టుకి.
    మధ్యాహ్నం - మూడు పుల్కా, కూర (బీన్స్ గట్రాలతో చేసింది)
    స్నాక్స్ కి ఒక యాపిల్, పీచ్, రెండు పెద్ద రా క్యారెట్లు. నాలుగింటప్పుడు ఆకలి వేస్తే ఓట్మీల్.
    సాయంత్రం మూడు పుల్క, ఏదోక కూర.
    పడుకోబోయే ముందు ఓ కప్పు క్రొవ్వులేని పాలు (fat free milk).
    దాదాపు రెండునెలల నుండి ఇలా చేస్తున్నా. ఇప్పటికి పది పౌండ్లు తగ్గా.
    ఇక వ్యాయామం -
    పొద్దున్నే -
    యాబ్స్ (ఒకరోజు అప్పర్యాబ్ చేస్తే ఇంకోరోజు లోయర్ యాబ్ చేస్తా, మెడిసిన్ బాల్ తో)
    100 పుష్ అప్స్
    సాయంత్రం ఓ గంట నడక.

    ReplyDelete
  8. @ భరద్వాజ్
    :)
    @ పానీపూరీ
    హ్మ్
    @ అజ్ఞాత
    చక్కెర వ్యాధి వస్తే చిన్న చిన్న కాంప్లికేషన్స్ చాలా వస్తుంటాయని చదివి, చూసి అది అంటే దడ పట్టుకుంది. అది వచ్చాక మారడం కంటే ముందే అది రాకుండా జాగ్రత్త పడదామని ప్రయత్నం.
    @ శ్రావ్య
    హ్మ్
    @ సునీత
    నేను అవగొట్టేది సాంబార్ కాదండీ - అందులోని కూరగాయల ముక్కలు మాత్రమే. మంచి సలహాలు ఇచ్చారు. కూరగాయల్లో అవి కలుపుకొని చూస్తా!
    @ ఏకలింగ
    బాగా కనిపెట్టారు ;) - ఎందుకయినా మంచిది ప్రిపేర్ అయివుంటే మంచిది కదా.
    @ రామరాజు
    మీ ప్రోగ్రెస్ చూస్తుంటే నాకు షై అవుతుందన్నా. అందుకే నేన్ జూడ.

    ReplyDelete
  9. బ్రదరూ!! షై ఎందుకూ?? నన్నుచూసి నువ్వు ఇన్స్పైర్ అవుతావని చెప్పా బ్రాదరూ!!
    స్పూర్తి పొందుతావని నా ఆశ!!

    ReplyDelete
  10. రివర్స్ ఇంజనీరింగ్ బాగుంది.
    http://www.youtube.com/watch?v=UdqrK4rvqzI&feature=related

    పార్ట్ 2 : http://www.youtube.com/watch?v=duPPKIZ0pQ0&feature=related

    part 3: http://www.youtube.com/watch?v=bgsCVdoYqh4&feature=related

    ReplyDelete
  11. నేను పోస్టిన youtube videos చూసారా ?

    ReplyDelete
  12. @ అజ్ఞాత
    ఇంకా ఆ వీడియోలు చూడలేదండీ. చూడాలి. ఇంతకూ అవి వేటి గురించీ?

    ReplyDelete
  13. హయ్యో, చూడలేదా !కనీసం క్లిక్కితే తెల్సిపోయేది కదండీ.ఆరోగ్యంగా బరువు తగ్గటం ఎలా అనే అంశం మీద మేము పాటించి,ఫలితం పొందిన అద్భుత చిట్కాలు.

    ReplyDelete
  14. @ అజ్ఞాత
    ఆ వీడియోలు కొద్దిగా చూసానండీ. ధన్యవాదములు. మళ్ళీ తీరికగా వివరంగా చూస్తాను.

    ReplyDelete