మూడు రాజధానుల కంటే కూడా రిలే రాజధానులు లేదా సంచార రాజధానులు బావుంటాయి

మూడు రాజధానుల ఆలోచన అసలు అమలులోకి వస్తుందో లేదో తెలియదు కానీ ఆసక్తికరంగా అనిపించింది. ఆ తరువాత మరీ మూడేనా అనిపించింది. కొందరు ఒక్కో జిల్లాకి ఒక్కో రాజధాని ఇస్తే పోలా అన్నారు కానీ అందువల్ల ఖర్చు ఎక్కువవుతుంది. అలా కాకుండా నాకు మరో ఆలోచన వచ్చింది. అదే రిలే రాజధానులు. హిప్పీలు మొదలయిన సంచార జాతుల వారు ఒక దగ్గర వుండకుండా తమ నివాస స్థలాలని మారుస్తూ వుంటారు. అదే విధంగా రాజధానిని కూడా ఎప్పుడూ ఒకే చోట వుంచకుండా నెలకి ఒక జిల్లాకి మారిస్తే ఎలా వుంటుంది? ఇలాంటి సంచార రాజధాని వల్ల చాలా లాభాలు వున్నాయి. శాశ్వత భవనాలు, వగైరా ఖర్చులు వుండవు. ఎంచక్కా అప్పటికే వున్న R&B భవనాలో, PWD గెస్ట్ హవుజుల ముందటో టెంట్లు వేసుకొని నడిపించేయవచ్చు.

ముఖ్యమంత్రి గారు మాత్రం ఆయా భవనాల్లో ఆ నెల పాటూ నివసిస్తే సరి.  మిగతా సెక్రటెరియట్, హైకోర్ట్, అసెంబ్లీ, శాఖలు మొదలయినవి పెద్ద పెద్ద టెంట్లు, షామియానాలు వేసి లాగించొచ్చు. కానీ అలా ఒక్కో జిల్లాలో అలా అన్నీ ఒక్కో నెలా తిష్ఠ వేసుకొని కూర్చుంటే మిగతా జిల్లాల వారికి కోపం రావొచ్చు. అలాంటప్పుడు అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టులు విడివిడిగా ఒక్కో జిల్లాకి మారుస్తూ వుండాలి. అయితే ఇందులో కూడా ఒక సమస్య వుంది. ఒక క్రమ పద్ధతిలో ఒక్కో జిల్లాకి వరుసగా ఇవి మారుస్తూ వుంటే చివరి జిల్లాల వారు అసహనం చెందవచ్చు. ఆ ఇబ్బంది లేకుండా లాటరీ పద్ధతిలో ర్యాండమ్‌గా ఒక్కో జిల్లాకి ఇవన్నీ మారుస్తూ వుంటే గనుక ఎవరికీ ఏ ఇబ్బందీ అనిపించదు. అన్ని జిల్లాల వారు, అన్ని ప్రాంతాల వారు తమకి తగిన ప్రాధాన్యం లభించిందని ఆనందపడిపొవొచ్చు.

మరీ సంచార జాతుల వలె టెంట్లు ఏం బావుంటాయని మీరు అనుకుంటే గనక దానికి పరిష్కారం వుంది. టెంట్లకు బదులుగా కారవాన్లు, మొబయిల్ హోమ్‌లు లేదా రిక్రియేషన్ వెహికల్స్ (RV) వినియోగిస్తే సరీ.

గమనిక: నేను ఏ పార్టీ లేదా ఏ హీరో అభిమానిని కాదు. ఇది జస్ట్ నాకు వచ్చిన ఆలోచన మాత్రమే.