మన విజయాలకూ, అపజయాలకూ మూలం మన మనస్సులో బలంగా నాటుకుపోయిన విశ్వాస వ్యవస్థ. మన మనస్సులోని ఆయా విశ్వాసాలు మంచివా చెడ్డవా సరి అయినవా కావా అనే విషయం పక్కన పెట్టేస్తే మనం మనలోని బిలీఫ్ సిస్టం ని బట్టి నడుస్తూవుంటాం. మనలోని విశ్వాస వ్యవస్థ ఎలా ఏర్పడుతుంది? చిన్నప్పటి నుండీ మనకు మనం లేదా మనకు ఇతరత్రా అందే సూచనలు, అనుభవాలను బట్టి అది ఏర్పడుతుంది. మనం విజయాలు సాధిస్తూ వున్నామూ, సంతోషంగా వుంటున్నామూ అని అనుకుంటున్నట్లయితే చాలావరకు బిలీఫ్ సిస్టం బాగానే వుంటుండొచ్చు. లేదూ జీవితంలో ఇబ్బందులు వుంటుంటేనూ ఎదురవుతుంటేనూ లోపం చాలావరకు మనలోని బిలీఫ్ సిస్టం లో వుంటుండొచ్చు.
అంటే అస్సలు మన గురించి మనకు ఏం అంచనా వుంది? అస్సలు మన గురించి మనం ఏం అనుకుంటున్నాం. మన గురించి మన ఇంట్లో వాళ్ళకి ఏం ఇమేజ్ వుంది? మన చుట్టూరా వున్న వాళ్ళలో ఏం ఇమేజ్ వుంది? ఇతరత్రానూ, ఇంట్లో వాళ్ళనూ కాస్సేపు పక్కన పెట్టేస్తే మన గురించి మనలో ఏం నమ్మకం వుంది? ఆగండి. ఒక రెండు నిమిషాలు తర్కించుకోండి. డబ్బే ప్రధానం కాదు కానీ ఉదాహరణకు ఇప్పుడు డబ్బునే తీసుకుందాం. మీ జీవిత కాలంలో ఎంత డబ్బుని సంపాదించగలరు? సరదాగా వ్యాఖ్యల్లో చెప్పండేం. షద్ హెమిస్టెట్టర్ వ్రాసిన పుస్తకం చదవక ముందూ, లా ఆఫ్ ఎట్రాక్షన్ పుస్తకాలు చదవకముందు నన్నే గనుక ఇలాంటి ప్రశ్న వేస్తే మీలో చాలామందిలాగా ఒక రెండు నిమిషాలు బుర్ర గోక్కొనీ కనాకష్టంగా ఓ యాభం కోట్లు సంపాదిస్తానేమో అని గొణిగేవాడిని. మరి ఇప్పుడు? ఒక 5000 కోట్లు. ఎలా? ఏమో నాకేం తెలుసూ? నా నమ్మకం అలాంటిది. నా ఆత్మ విశ్వాసం అలాంటిది. నాలో సరికొత్తగా బలపడుతున్న నమ్మకపు వ్యవస్థని బట్టి ఆ అంకె ఇంకా ఎంతో మారవచ్చును.
ఎలా అన్న సంగతి తరువాత. మనలో అంత కెపాసిటీ వుందనే నమ్మకం వుంటే మనం చాలా వరకు ఆ అంచనాలను అందుకోగలం. ఆ నమ్మకం మనలో ఏర్పడాలి అంటే ఏం చెయ్యాలి? మనలోని ప్రోగ్రామింగ్ మార్చుకోవాలి. గత ఏడాది కాలంగా నేను చేస్తున్నదీ, పరీక్షిస్తున్నదీ అదే. డబ్బు విషయాల్లో ఇంకా కాదు గానీ మిగతా విషయాల్లో ఈ సిద్దాంతాలని పరీక్షిస్తూ అద్భుతమయిన విజయాలని నాకు నేనే నమ్మని విధంగా సాధిస్తూ వస్తున్నా. పరీక్ష కోసం చిన్న చిన్న విషయాలనే ఎంచుకున్నా కానీ అవి చక్కటి ఫలితాలు సాధించడంతో నాలో నాకు మంచి నమ్మకం ఏర్పడింది. ఇక 2017 నుండీ సంపాదనలో ఈ ప్రోగ్రామింగ్ పద్ధతులు ఉపయోగిస్తా. చూద్దాం, అవి ఎలా జరుగుతాయో. ఇవాలంటే రేపే ఫలితాలు సిద్ధిస్తాయి అనికాదు. మనలో చిన్నప్పటినుండీ నాటుకు పోయిన నెగెటివ్ వ్యవస్థ మారడానికి కొంత సమయం పడుతుంది, అవి ఫలితాలు ఇవ్వడానికి ఇంకొంత సమయం పడితే పట్టొచ్చు కానీ మనం సరి అయిన దారిలోనే వున్నామా లేదా అన్నది మనకు తెలుస్తూనే వుంటుంది.
కొన్నిసార్లు ఈ పద్ధతులు పాటిస్తూ అనుకున్న విధంగా జరగట్లేమిటా అనుకునేవాడిని. కొన్ని ప్రయత్నాల తరువాత ఊహించని ఫలితాలు ఎదురయ్యేవి. ఏంటా అని చూస్తే మిగతా ప్రయత్నాల్లో నేను లక్ష్యానికి చేరువ అవుతూ వస్తున్న సంగతి బోధపడింది. ఈ రకంగా నేను ఈ విషయాల గురించి బ్లాగులు వ్రాయడం కూడా నాలోని నమ్మకపు వ్యవస్థను బలీయం చేసుకోవడానికే. ఎవరికయినా ఈ వ్రాతలు ఏమాత్రం అయినా ఉపయోగపడితే అది నాకు బోనస్ క్రింద లెక్క. పోస్టులు వ్రాయాలంటే ఎంతో కొంతా ఆయా విషయాల గురించి ఆలోచించాలీ, పుస్తకాలు తిరగెయ్యాలీ అలా అలా నాకు ఉపయోగకరం. వ్రాస్తూ వుంటే, వ్రాయడం కోసం పరిశోధిస్తూ వుంటే నాలో నాకు ఈ విషయాల గురించి ఇంకా ఇంకా స్పష్టత వస్తుంది.
సో, మనలోని నెగెటివ్ నమ్మకపు వ్యవస్థలను మైండ్ ప్రొగ్రామింగ్ ద్వారా మార్చుకోవచ్చు. అదెలాగో తరువాయి పోస్టుల్లో చర్చిద్దాం.