మనలో మనం ఏం మాట్లాడుకోవాలీ?

ఈ విషయంపై Shad Helmstetter ఒక చక్కని పుస్తకం వ్రాసారు. అది What to say when you talk to your self. గత ఏడాది ఒక గొప్ప వ్యక్తి నాకు ఓ చక్కని రెండు పుస్తకాలు సూచించారు. అందులో ఇది ఒకటి. అవి నా జీవితాన్ని మలుపు తిప్పాయి...తిప్పేస్తూవున్నాయి. ఈ పుస్తకం గురించి కొన్ని రోజులు మీతో చర్చిస్తాను. ఎందుకంటే మీతో చర్చిస్తూవుంటే నా మనస్సుకి బాగా వంటపట్టేస్తుంది. మీకేమోకానీ అలా కనీసం నాకు అయినా ఈ పోస్టులు ఉపయోగకరంగా వుంటాయండీ. 

***

మా పెద్దమ్మాయి మొట్టమొదటగా తన జీవితంలో నేర్చుకున్న పదం ఏమిటో తెలుసా? మరీ మొట్టమొదటిది కాకపోయినా 'వద్దు' అన్నపదం బహుశా మూడోది అయినా అయ్యుంటుంది. అంతగా మనం ప్రతి పనికీ వద్దు వద్దు అని నూరిపోస్తుంటాము. ఈకాలం తల్లితండ్రులు అయితే మరీనూ. ఎంత సున్నితంగా సుకుమారంగా పిల్లాల్ని పెంచేస్తున్నారో. ప్రతీ దాన్నీ వద్దు అనడమే చదువులో తప్పా. అలా అలా మొదటినుండీ ఒకరినుండి మరొకరికి నెగెటివ్ సజెషన్స్ అందుతూ వుంటాయి. అలా మనకు ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా మనకి నిరుత్సాహాలు ఎదురుపడుతూవుంటాయి. ఎంతోమంది మనని నిరుత్సాహపరుస్తూ వుంటారు. సరదాకు అన్నా నిజంగా అన్నా అవి మన మనస్సులోకి ఎక్కేస్తాయి.  కొంతమంది జోకుగా అన్నామూ అనుకుంటారు కానీ అవి ఎదుటి మనిషి మీద ఎంత ప్రభావాన్ని చూపుతాయో అర్ధం చేసుకోలేరు. 

ఒక చక్కని కుక్కని పట్టుకొని పిచ్చి కుక్క, పిచ్చి కుక్క అని పది మందీ అన్నారనుకోండీ ఆ కుక్కకీ సందేహం వస్తుంది - ఆ అనుమానం పెనుభూతం అవుతుంది. అలాంటి చిన్నవో పెద్దవో సందేహాలు మనమీద మనకు కలిగినా లేక వేరే వాళ్ళు కలిగించినా మనలో మనం గింజుకోకతప్పదు. 

ఉదాహరణకు మా ఇంట్లో మా ఆవిడ మా చిన్నమ్మాయితో ఇలా పదేపదే అంటూవుంటుంది "నువ్వు ఈ మధ్య ఏమీ పని చెయ్యకుండా తయారవుతున్నావూ" అనీ.  అలా పదేపదే అంటే తను అలాగే నిజంగానే తయారవుతుందే అంటే మా ఆవిడ వినిపించుకోదు. అలా అలా పదే పదే అనగా అనగా ఆ భావన మా చిన్నమ్మాయిలో నాటుకుపోయిందనుకోండీ - ఎప్పుడన్నా ఏదన్నా పని చెయ్యాలనుకున్నా కానీ ఆ బిలీఫ్ సిస్టం తనను పని చెయ్యనివ్వదు. 'ఓహ్, నేను పనులేమీ చెయ్యను కదా' అని తనను తాను జస్టిఫై చేసుకుంటుంది. ఇలాంటి విషయాలు మన ఇళ్ళల్లో చాలా జరుగుతుంటాయి. తెలిసో తెలియకో ఇతరులకి మనం నెగటివ్ సజెషన్స్ ఇస్తూ వుంటాము. 

అంతెందుకూ ఇలాంటి ఋణాత్మక సూచనల సంగతి నాకు తెలియక ముందు మా ఆవిడని "ఎందుకలా పదేపదే టివి  చూస్తూ కోచ్ పొటాటో లా తయారవుతావూ" అని అంటుండేవాడిని. ఇంకా అలాంటివే తెలిసో తెలియకో ఎన్నో. నా పొరపాటు తెలుసు కున్నాక తనకే గానీ, పిల్లలకే కానీ, వేరే వాళ్ళకే కానీ అలాంటి నెగటివ్ సజెషన్స్ ఇవ్వడం మానుకున్నాను. వీలయితే ప్రోత్సహిస్తుంటాను వీలుకాకపోతే మౌనంగా వుంటాను లేదా నెగెటివ్ సజెషన్ ని పాజిటివ్ గా మార్చేస్తుంటాను. ఈ విషయాలు తెలుసుకున్నాక ఇంటా బయటా నాకు తగిలే నెగెటివ్ సజెషన్స్ ని నా మనస్సులో నవ్వుకుంటూ నెట్టి పారేస్తూ వుంటాను. 

ఇతరుల సంగతి వదిలెయ్యండి. మనకు మనం ఎన్ని సార్లు, ఎన్ని విధాలుగా దద్దమ్మ అనుకుంటాం? తెలిసో తెలియకో మనకు మనం నెగటివ్ సజెషన్స్ ఇచ్చుకుంటాము. చాలా విషయాల్లో అసలు అది మనం గుర్తించలేము కూడా. అలా మనం కాస్త ఊహ తెలిసిన దగ్గరి నుండీ తల్లిదండ్రులూ, బంధుమిత్రులూ, ఉపాధ్యాయులూ, కోలీగ్సూ, మేనేజర్లూ అలా అలా మనకు తెలిసిన ప్రతి ఒక్కరూ మనకు తెలిసో తెలియకుండానే మనలో ఎన్ని విషపు భావాలు నాటేసి వుంటారో ఒక్కసారి ఆలోచించండి. ఇహ పెళ్ళయ్యాక డబుల్ బోనాంజా! మిమ్మల్ని ఎంతమంది ఎన్నిసార్లు ప్రోత్సహించివుంటారు? కొన్నిసార్లు. ఎన్ని సార్లు మిమ్మల్ని విమర్శించి వుంటారు? నిరుత్సాహ పరచి వుంటారు? చెడుగా మాట్లాడి వుంటారు? ఎన్నో సార్లు. 

సరే, ఇతరుల సంగతి వదిలేద్దాం. మనలో మనం ఎన్ని సార్లు కించపరుచుకొనివుంటామూ? ఎన్ని సార్లు విమర్శించుకొనివుంటామూ? ఎన్ని సార్లు తిట్టుకొని వుంటామూ? ఎన్నో సార్లు. ఇలా ఇంటా బయటా మనలో పలు విధాలుగా నాటుకున్న విషపు భావాలు మనలో ఒక ఋణాత్మక విశ్వాస వ్యవస్థ లాగా తయారయ్యీ మన ఎదుగుదలని, సంతోషాన్ని ఎంత దిగజార్చివేస్తున్నాయో ఎప్పుడయినా ఆలోచించారా? ఆలోచిస్తే భేష్. ఆలోచించకపోతే ఒకసారి మీ అంతరంగాన్ని తరచి చూడండేం. ఇలా చిన్నప్పటినుండీ మనలో ఒక బిలీఫ్ సిస్టం నాటుకుపోయింది. దాని నుండి బయటపడటం ఎలా? సింపుల్. మన మనస్సుని రిఫార్మాట్ చెయ్యడమే. మనతో మనం సరి అయిన విధంగా మాట్లాడుకోవడం ద్వారా.  అది ఎలా? అందువల్ల మనకు కలిగే లాభాలేంటీ? ఎన్నెన్ని వ్యక్తిత్వ వికాసపు పుస్తకాలు చదివినా, ప్రయత్నించినా ప్రయోజనం ఎందుకు వుండటం లేదూ అన్న దానికి షెడ్ చక్కని పరిష్కారం సూచిస్తారు. ఈ పుస్తకం చదివితే మీ ఆలోచనా ధోరణే మారిపోతుంది. తదుపరి టపాలో ఈ పుస్తకం గురించి మళ్ళీ చర్చిద్దాం. 

7 comments:

  1. తెలుగు అనువాదం ఉందండీ..మార్కెట్లొ..మీరు చెప్పినట్టు...కాస్తా చర్చిస్తే కానీ వంట పట్టేట్టు లేదు....

    ReplyDelete
  2. మీ పోస్టులు ఆసక్తికరంగా ఉన్నాయి. మీకు అభ్యంతరం లేకపోతే మీరు పుట్టిన తేదీ, నెల తెలుసుకోవచ్చా. నా పరిశోధనకి పనికివస్తాయి, అందుకు అడుగుతున్నాను (మీకు అభ్యంతరం లేకపోతేనే).

    ReplyDelete
  3. ninna edo video chusinattu gurthu mee blog lo.. yemaindi adi ?

    ReplyDelete
  4. చాలా బావుంది సర్ థాంక్సు.

    ReplyDelete
  5. @kvsv. ఇలాంటివి చదివి అవతల పారేస్తే ప్రయోజనం లేదండీ. చర్చిస్తూ ఉంటే బాగా ఆకళింపు చేసుకుంటాం. అటుపై వాడేస్తాం.

    తెలుగు పుస్తకం గురించి నా పాత పోస్టుల్లో ఉంటుంది. ఆసక్తి వున్నా వారు ఆర్డర్ చేసుకోండి.

    @ అజ్ఞాత
    ఎందుకండీ. జ్యోతిష్య పరిశోధనా? అందులో నాకు అంత నమ్మకం లేదు కానీ సరదాగా అనిపిస్తుంది. మీకేమయినా తెలిస్తే నాకూ చెప్పండేం :) ఇదివరలో ఇంకా ఆసక్తికరంగా వ్రాసేవాడిని. చాలా తీసేసా. ఏప్రిల్ 8 . చాలాండీ?

    ReplyDelete
  6. @ అజ్ఞాత.
    వీడియోలు ఇక వద్దనుకుంటున్నానండీ. ప్రయోజనకరంగా అనిపించడం లేదు. వ్రాతలే మీకూ నాకూ సౌకర్యంగా ఉండగలవు అనిపిస్తోంది. అందుకే పాతవి కొన్ని తీసేసా.

    @ శ్రీ
    ధన్యవాదాలు. ఇలా కొంతమందికయినా నచ్చుతుంటేనే వ్రాయబుద్దేస్తుంటుంది. 😊

    ReplyDelete
  7. bomma baavundi...vaadesukuntunnaa..naa fb lo...comment kaadu...meeku msg cheddaamani..

    ReplyDelete