తీరిక తక్కువయ్యింది!

ఇదివరలో ఇంటా, బయటా కాస్త తీరిక వుండేది కాబట్టి నా గోళ్ళు గిల్లుకోకుండా బ్లాగు పోస్టులు వ్రాస్తూండేవాడిని. ఇప్పుడు ఆఫీసులోనూ బాగా బ్యుజీ అయిపోయాను. ఇక ఇంటికి రాగానే రోజూ గంటన్నర జిమ్ముకి వెళుతూవుండటంతో అస్సలు సమయం దొరకడం లేదు. 

నా ఆరోగ్య మరియు వ్యాయామ సమస్యలన్నింటికీ ప్రొటీన్ కారణమేమో అని అనుమానం తీవ్రంగా వచ్చి అది క్రమంగా పెంచుతూ ఇప్పుడు రోజుకి కనీసం 100 గ్రాములు తీసుకుంటున్నాను. నాకు ఇష్టమయిన పీనట్ బటర్ ఫ్లేవర్ లో మాంఛి ప్రీమియం ప్రొటీన్ అనువయిన ధరకే దొరుకుతోంది. ఇంకేం కమ్మగా లాగిస్తున్నాను. అందువల్లనేమో కొన్ని ఆరోగ్య సమస్యలు కనుమరుగు అవుతున్నాయి. ఓవర్ ట్రైనింగ్ సిండ్రోమ్ ఇంతవరకూ రాలేదు. ఎంత వ్యాయామం చేసినా హాయిగా నిద్ర పడుతోంది. అయినా సరే ఎందుకయినా మంచిదని వళ్ళు దగ్గర పెట్టుకొని వ్యాయామం చేస్తున్నాను. నెమ్మది నెమ్మదిగా బరువులు పెంచేస్తున్నాను. ప్రస్తుతం వివిధ వ్యాయామాల్లో 50 పౌండ్లు (45 కిలోలు) వరకూ వాడుతున్నాను. నెమ్మదిగా 100 పౌండ్ల వరకూ పెంచేస్తా. అవి తట్టుకోగలిగితే మున్ముందు ఇంకానూ. 

ఇన్ని రోజుల నుండీ ఇండియాలో కానీ, కెనడాలో కానీ, ఈ యుఎస్ లో కానీ ఒక్క డాక్టర్ కూడా ప్రొటీన్ సరిగా తీసుకుంటున్నావా అని ఎందుకు నన్ను కనుక్కోలేదో అని బోల్డెంత విస్మయం చెందుతున్నా. ఏంటో. అంత ముఖ్యమయిన విషయం గురించి వాళ్ళెందుకు పట్టించుకోరో నాకర్ధం కాదు. అందరూ బాడీ బ్యుల్డర్లకే పోటీన్ అవసరం అనుకుంటారు కానీ అది నిజం కాదు. మనం ఎన్ని కిలోల బరువు వున్నామో కనీసం అన్ని గ్రాముల ప్రోటీన్ ప్రతి రోజూ అవసరం. అది సరిపోకే అందరికీ ఎన్నెన్నో ఆరోగ్య సమస్యలు. మంచి నీళ్ళ తరువాత ప్రధానమయినది ఇదే.   

మా స్నేహితుని కొడుకు కొద్దిరోజులుగా మా ఇంట్లోనే వుంటున్నాడు. అతను ఈమధ్యనే డాక్టర్ అయ్యాడు. ఒక సినిమాలో హీరోగా కూడా చేసేడు. అతనికీ జిమ్ అంటే బాగా ఆసక్తి. ఇద్దరం కలిసి వెళుతున్నాం.  

ఈ రోజుకూడా సమయం లేకపోయినా సరే మిమ్మల్నందరినీ పలకరించి చాల్రోజులయ్యిందనీ కొద్ది సమయం చూసుకొని వ్రాస్తున్నా. అన్నట్టు ఈ వారాంతం మా ఇంట్లో వాళ్ళు డెట్రాయిటుకి వెళుతున్నారు. ఓ వారం నాకు కాస్త తీరిక దొరుకుతుంది. మా వాళ్ళు అటెళ్ళగానే మేము ఇటు జెంట్స్ పార్టీ మా ఇంట్లో ఏర్పాటు చేసుకుంటున్నాం. 

త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అంతవరకూ సెలవ్. 

జిమ్ముకెళ్ళీ...బజ్జుంటా!

ఇలాంటి అవకాశం మీలో ఎంతమందికి వుంటుందో తెలియదు కానీ వ్యాయామం చేసేకా హాయిగా ఓ ఇరవై నిమిషాల పాటు హైడ్రో మసాజ్ బెడ్ మీద పడుకొని ఓ కునుకేస్తాను. దాని పని దానిదీ - నా పని నాదీనూ. ఇంకా వ్రాయాలని వుంది కానీ నిద్దరొస్తోందండీ. రాత్రి 11 కావస్తోంది మరీ.

రేపు 'మా ఆవిడకి తానా - నాకు తందానా' అనే పోస్ట్ వేస్తాను. డెట్రాయిట్ TANA సమావేశాలకి మా ఆవిడ వెళ్ళి ధుమధుమలాడుతూ తిరిగి వచ్చింది.  ఆ కబుర్లన్నమాట. తెలివైన వాడిని కాబట్టి నేను వెళ్ళలేదులెండి!

నాకు నచ్చిన ఓ చక్కటి బ్లాగ్



ఎంత చక్కగా వున్నాయీ ఆ వ్రాతలూ - ముచ్చటేస్తోంది. ఆవిడ/అమ్మాయి ఎవరో కానీ ఎంత స్వఛ్ఛంగా వ్రాస్తోందీ! ప్రకృతీ, పల్లెటూర్లూ, పచ్చదనమూ, ప్రశాంతతా అంటే ఎంతెంత ఇష్టం తనకీ - నామల్లే! ఈ రాత్రి నిద్రపట్టక అదో ఇదో చూస్తూ ఈ బ్లాగు కూడా చూస్తుంటే వాళ్ళ నాన్నగారి గురించిన పోస్ట్ చదివితే నా కళ్ళళ్ళో ఆర్ద్రత ఆగలేదు సుమా - ఇంకా చెమ్మగిల్లుతూనే వున్నాయి. మా నాన్నా నాకు గుర్తుకురాకుండా వుంటారా మరి. 

ఈ బ్లాగు పేరు ఇంగ్లీషులో కాకుండా తెలుగులో వుంటే ఇంకా బావుండేది - కదూ?