పొలం దున్నాం - విత్తనాలు వేసాం

నిన్న మా పొలం (అనగా మా కిరాయి తోట స్థలం) పనులకి మేమందరమూ వెళ్ళేసరికి సాయంత్రం ఏడయ్యింది. మా మిత్రుడూ నేనూ కలిసి ఆ నేలంతా తవ్వి విత్తనాలు వేసేందుకు తగ్గట్టుగా చదును చేసాము. మా ఆవిడా, తన ఫ్రెండూ కలిసి విత్తనాలు వేసారు. వారికి మా అమ్మలూ, వాళ్ళబ్బాయీ సహకరించారు.  ఆ తరువాత 100 అడుగుల దూరం నుండి నీళ్ళు తెచ్చి విత్తనాలు వేసిన నేల తడిపాము.  అంత దూరం నుండి నీళ్ళు తెచ్చిపొయ్యాలంటే అవస్థగానే వుంది కానీ అంత పొడవు పైపు కొనాలంటే కాస్త ఖర్చు అవుతుంది. అందుకే ఆలోచిస్తున్నాం. ఈ వారాంతం ఆ పైపు కొనకపోతే ఇబ్బందే అవుతుంది. 

మా చుట్టూ వున్న గార్డెన్ ప్లాట్స్ చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఎంత చక్కగా, ఓపికగా అన్ని రకాల సౌకర్యాలు వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. చుట్టూ ఫెన్సులు వేసుకొని ఎంతో చక్కగా పొందిగ్గా మొక్కలు నాటారు. మా పక్కన వున్న ప్లాటు వళ్ళయితే మొక్కలు వేసి వాటి చుట్టూ ఎండుగడ్డి లాంటిది వేసి ఎంతో చక్కగా ప్రెజెంట్ చేసారు. వార్నీ ఇందులో కూడా ఇంత కళ వుందా అనుకున్నా. స్వంత ఇంట్లో అంటే వేరు కానీ ఇక్కడ కూడా ఇంత శ్రద్ధగా వాళ్ళు చేస్తుంటే అబ్బురం అనిపించింది. వాటితో మా తోటపని పోల్చుకుంటే పురాతనంగా అనిపిస్తోంది.  చుట్టూ వున్నవారిని చూస్తున్నాం కాబట్టి మేమూ ఎన్నోకొన్ని అమరికలు ముందుముందు ఏర్పాటు చేస్తుండవచ్చు.  

అయితే ఇందుకోసం పొరుగూరు వెళ్ళి రావాల్సి రావడం కాస్తంత అసౌకర్యంగానే వుంది. మా ఊరి కమ్యూనిటీలో కూడా ఇవి అందుబాటులో వుంటే ఇంకా బావుండేది. మొక్కలు పెరిగాక మా ఇతర మిత్ర కుటుంబాలని మా పొలం చూడటానికి ఆహ్వానిస్తాం. అప్పుడు ఫోటోలు తీసి మీకూ చూపిస్తాం.  అయితే పక్క ప్లాట్లు చూసి మా వాటిని వేళాకోళం చెయ్యొద్దండేం. మేం భారతీయ వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి మా పొలం చూడటానికి కాస్త మొరటుగానే అనిపిస్తుండొచ్చు. పక్క ప్లాట్స్ చూస్తుంటే ముచ్చటేస్తోంది - మా ప్లాట్ చూస్తుంటే మొట్టికాయ వెయ్యాలనిపిస్తోంది. బాగా సంస్కరించాల్సివుంది. ఇప్పుడే మొదలెట్టాం కదా - నెమ్మది నెమ్మదిగా అవన్నీ చెసేద్దాం లెద్దురూ.  ఆ స్థలాల్లో దూరంగా మన దేశీలు కూడా కనిపించారు. వాళ్ళు తెలుగు వారేమో కనుక్కోమని పిల్లలని పంపించాను. వాళ్ళూ తెలుగువారేనట, వచ్చేసారి వెళ్ళి పరిచయం చేసుకోవాలి. వాళ్ళేం పెంచుతున్నారో, ఎలా పెంచుతున్నారో చూడాలి. 

ఓ రెండు గంటలు శ్రమదానం చేసి తొమ్మిది గంటల తరువాత ఇంటికి బయలుదేరాం. ఇంటికి వచ్చి భోంచేసి వళ్ళు తెలియకుండా పడుకున్నాం, బాగా శరీర కష్టం చేసాం కదా - ఎంచక్కా నిద్ర పట్టేసింది. మన ఇంట్లో తోటపని కన్నా ఇలా బయటకి వెళ్ళి పని చెయ్యడం వల్ల కొన్ని ప్రయోజనాలు వున్నాయి. ఇంట్లో అయితే ఆ చెయ్యొచ్చులే అని అలక్ష్యం వుంటుంది. పైగా మాకు తోడు వుంది కాబట్టి ఎంచక్కా అందరం కలిసి వెళ్ళి సరదాగా తోటపని చేసి వస్తున్నాం.

పొలం పనులు ప్రారంభిస్తున్నామోచ్

మా ఇంట్లో గార్డెన్ స్పేస్ లేకపోవడం వల్ల మా పొరుగూరు మున్సిపాలిటీ వారు కిరాయికి ఇస్తున్న భూమిని మేమూ, ఇంకో కుటుంబమూ కలిసి కిరాయికి తీసుకున్నాం. దానికి ముద్దుగా 'పొలం' అని పేరెట్టేసా. 25 ఇంటూ 30 అడుగులు వున్న ఆ స్పేసుకు ఈ సీజనుకు గాను కిరాయి $80. మా షేర్ $40. ఇవాళ సాయంత్రం అందరమూ వెళ్ళి ఆ క్షేత్రంలో వ్యవసాయం మొదలెడతాము. కూరగాయల మొక్కలూ, ఆకుకూరలూ పండించాలనేది మా అభిమతం.  అవి మొలకలు ఎత్తేదెప్పుడో, పెరిగేదెప్పుడో, కాయగూరలూ, ఆకుకూరలూ మాకు అందివచ్చేదెప్పుడో కానీ అందాకా అది మాకు చక్కని ఆరోగ్యకరమయిన  కాలక్షేపం అవుతుంది. మాకూ, మా పిల్లలకూ అహ్లాదకరమయిన వాతావరణంలో ప్రకృతి సిద్ధమయిన వ్యాయామాన్ని అందిస్తుంది. 

నాగరికత పెరుగుతూవున్నా కొద్దీ ప్రకృతికి దూరం అవుతున్నాం. అందుకే వీలయినంతవరకూ మట్టికీ, నీటికీ, చెట్టుకూ, పుట్టకూ, గాలికీ, వానకూ కొద్దిగానయినా దగ్గరగా మెలగాలని ప్రయత్నిస్తూనేవుంటాను.  పిల్లలూ అవి ఆస్వాదించేలా ప్రోత్సహిస్తూనేవుంటాను. మేము సూర్యాపేటలో వున్నప్పుడు మా నాన్న గారు గార్డెనింగ్ చేస్తూ సహాయం కోసం నన్ను పిలిచేవాడు. ఓ పది రూపాయలు పెట్టి కూరగాయల మార్కెట్లో కొనుక్కునే బదులు ఇంత కష్టపడాలా అని విసుక్కుంటుండేవాడిని. ఆ తరువాత హైదరాబాదుకి వచ్చేక తోటపని మీద ఆసక్తి కల్గింది, దానియొక్క ప్రాముఖ్యత తెలిసింది కానీ ఆ కిరాయి ఇళ్ళల్లో అంత దృశ్యం వుండేది కాదు. కొన్నేళ్ళ తరువాత  కెనడాలో స్వంత ఇల్లు కొనుక్కొని ఒక ఏడాది మాత్రం గార్డెనింగ్ చెయ్యగలిగాము. ఆ తరువాత అక్కడినుండి వచ్చాము కాబట్టి మళ్ళీ కుదరలేదు. మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత ఇప్పుడే.

అంచేతా మాకు దండిగా ఆకుకూరలూ, కాయగూరలూ పండాలని మీరూ కోరుకోండి మరి. మరీ విరగకాస్తే మీకూ పంపిస్తాం లెండీ. ఇక్కడ ఏ చెట్లు అయితే బాగా పెరుగుతాయో చెప్పండేం. మా పొలం పనుల ఫోటోలూ అప్పుడప్పుడు వేస్తుంటాగా.  

గబ్బర్సింగు

నిన్న రాత్రి గబ్బర్సింగు సినిమాకి వెళ్ళాలా వద్దా అనుకుంటూనే వెళ్ళాం. నిన్న తల్లుల రోజు కాబట్టి మా ఆవిడా ఓ తల్లే కాబట్టి ఆమె కోరిక కాదనలేక కూడా సై అన్నాను.  అక్కడికి వెళ్ళాక క్యూ చూస్తే టికెట్లు దొరుకుతాయా లేదా అని అనిపించింది. దొరికాక సీట్లు సరిగ్గా దొరుకుతాయా అని కంగారు. మొత్తమ్మీద మాకూ, మాతో పాటుగా వచ్చిన మరో ఫామిలీకి సీట్లు చక్కగానే దొరికాయి. ఆదివారం రాత్రి అయినప్పటికీ హాలు దాదాపుగా నిండిపోయింది. పవన్ ఇంట్రడక్షన్ సీన్.   హాలంతా కేకలూ, విజిళ్ళూనూ. నేను పవన్ వీరాభిమానిని కాకపోయినప్పటికీ నా నోటి వెంట కూడా విజిల్. పక్కనుండి కూడా విజిల్ వినపడేసరికి  ఉలిక్కిపడి చూసాను. మా ఆవిడ. ఉత్సాహంగా ఊగిపోతూ విజిల్ వేస్తోంది! నా కళ్ళను నేను నమ్మలేదు. ఏం చేస్తాం. పవనోత్సాహం అలా వుంది మరీ. అలా అని ఆమె పవనుకి వీరాభిమాని అని అనుకోకండి. 

సినిమా బావుంది. శ్రుతి హసన్ బావుంది. సినిమా ఓ సారి చూడొచ్చు. పవనాభిమానులకూ, మాస్ జనాలకూ సూపర్గా నచ్చేస్తుందేమో కానీ నాకు మాత్రం ఓ సమీక్షలూ, బ్లాగర్ల అభిప్రాయాలూ సెలవిచ్చినంత గొప్పగా ఏమీ అనిపించలేదు. ఓ కడుపు నొప్పి పుట్టేంత నవ్విస్తుందని కొందరు వ్రాసారు కానీ కాస్త నవ్వించింది. ఈమాత్రం సినిమా కోసం హాలుకి ఎందుకు వచ్చానా, శుబ్బరంగా కొన్ని నెలలు ఆగితే DVD వచ్చేది కదా అనుకున్నా. ఇప్పటికి ఈ సినిమా గురించి ఎందరో చెప్పేసారు కాబట్టి అవన్నీ వ్రాయడం లేదు కానీ కొన్ని వ్రాస్తాను. కేవ్వు కేక. హు. మలైకా అరోరా. హు హు.  అసలా కళాఖండం ఎవరికి నచ్చిందో కానీ వారికి ఆస్కార్ ఇవ్వచ్చు. బక్కగా, ఒక్కిగా, ముసలి ముఖంతో కెవ్వు కేక పుట్టించింది. పుట్టించదూ మరి.  మా ముగ్గురికి కలిపి 42 డాలర్లు అయ్యిందని గుర్తుకువచ్చింది మరీ. పవన్ కల్యాణ్ ఓ పిట్టల దొరలా మాటిమాటికీ పిస్టలిని కాల్చి కాల్చి పిస్టలు యొక్క పరువు తీసాడు. 

ఇలా ఈ మాస్సినిమా మరీ గొప్పగా అనిపించకపోతూవుండటంతో నేను కూడా ఓ మేధావినైపోతున్ననేమోనని నాపై నాకు దిగులేసింది. సినిమా చూసే కళ నాలో క్షీణిస్తోందేమోనని అనుమానం వేసింది. సినిమా హాలు నుండి బయటకి వచ్చాక మా ఆవిడనీ, మాతో పాటు వచ్చిన వారినీ అడిగాను. వారు కూడా నీరసంగా సో సో అన్నాకా నా బుర్ర మీద నాకు మళ్లీ నమ్మకం కలిగింది. మా ఫ్రెండ్ అయితే 'ఈ సినిమాలో విలన్ ఎందుకూ' అన్నాడు. ఇంకా నయ్యం హీరో ఎందుకూ అనలేదు. ఏ అంచనాలు లేకుండా వెళితే చాలా బాగనిపిస్తుందేమో తెలియదు కానీ, మించిన అంచనాల్తో వెళ్ళాం కాబట్టి మరీ అంతగా మెచ్చలేకపోయామేమో మరి.  

వైబ్ సట్ల సమీక్షలని ఎలాగూ నమ్మలేము కనుక నేను బ్లాగర్ల అభిప్రాయాల మీద ఆధారపడుతుంటాను. ఫలానా సినిమా ఎలా వుందని ఎవరయినా అడిగితే మా బ్లాగర్లు ఇలా వుందన్నారు అని నమ్మకంగా మిగతావారికి చెబుతుండేవాడిని. ఎవరయినా ఫలానా సినిమా బాగాలేదట కదా అన్నా కూడా మా బ్లాగర్లు బావుందన్నారు అని విశ్వాసంతో చెప్పేవాడిని. అయితే ఈ మధ్య రచ్చ సినిమా గురించీ, సింగు సినిమా గురించీ అలా నమ్మేసి దెబ్బ తినేసాను. ఈసారి నుండి కొంత అలెర్టుగా వుంటాను.  అభిమాన హీరోల సినిమాలు వస్తే సినిమా మామూలుగానే వున్నా రచ్చ చేసిపడేస్తున్నారని, కేకలు పుట్టిస్తున్నారనీ అర్ధమయ్యింది. నాలా ఇలాగే ఎవరి అభిప్రాయాలు వాళ్ళు, బావ కళ్ళలో ఆనందం చూడాలని కొందరూ  వ్రాస్తుంటారనుకోండీ. వాళ్లని తప్పుపట్టలేం కానీ ఇహపై నా జాగ్రత్తలో నేను వుంటాను.

కూరలొండుకుంటున్నా...

మరీ ప్రతిరోజు ఏమీ కాదు లెండి. అప్పూడప్పుడూనూ. ముఖ్యంగా వారాంతాల్లో. మరి ఏం చెయ్యను చెప్పండి. మా ఆవిడ వండే కూరలు నచ్చట్లేదు. ఎన్నాళ్ళని రుచీ, పచీ లేని కూరలు తినేసి బ్రతికెయ్యమంటారు? పోనీ వారాంతాలు ఏవయినా గెట్టుగెదర్లు జరిగినప్పుడు ఇతరులు వండిన కూరలయినా - పక్కింటి పుల్ల కూరల్లాగా బావుంటాయా అంటే అవీ అంతగా ఒకటీ అరా తప్ప నచ్చట్లేదు. ఈ ఆడాళ్లంతా కూడ బలుక్కున్నట్టు కూరలు వండటానికి ఒక్క ఫార్మూలానే ఉపయోగిస్తారా అని సందేహంగా వుంటుంది. కొంత కాలం క్రితం ఒకరు చేసిన సాంబారు తప్ప వేరే కూరలు ఏవీ నోరు ఊరించలేదు :(

ఇహ ఇలాక్కాదని స్వయంపాకం మొదలెట్టా. నాకు అసిస్టెంట్ షెఫ్ గా మా చిన్నమ్మాయి అమ్మలు. అయితే తానే మెయిన్ షెఫ్ అని అంటుంది (అనుకుంటుంది) - పోన్లెద్దురూ. ఎవరో ఒహరు. ముందు కూర తయారు కావడం ముఖ్యం కాదూ. మేము వండిన కూరలే బావుంటున్నాయి. అంటు కూడా ఊడ్చుకుని నాకేసి తింటున్నాం. మా ఆవిడ కూడా బాగానే వుంటున్నాయంటోంది. మెచ్చుకోకపోతే చచ్చావే అని వార్నింగులిచ్చాలెండి. 

ఈ సారి అందరం కలిసినప్పుడు మగాళ్ళే వంటలు చేసుకువస్తే ఎలా వుంటుందని అనుకుంటూనే వున్నా - ఈ లోగా ఓ సభ్యురాలు ఆ ప్రతిపాదన చెయ్యనే చేసింది. ఇంకేం. ఇలా అయినా వంటల పరంగా నా పంట పండినట్లే. ఆ రోజన్నా కాస్త తృప్తిగా భోంచేసి బ్రేవ్ మంటానేమో. అయినా ఆయా ఇండ్లల్లోని ఆడాళ్ళు మగాళ్లని అంత తేలిగ్గా వదులుతారంటారా? తమ పైత్యమూ, పాండిత్యమూ ప్రదర్శించి కూరలు చెడగొట్టరు కదా. అలా అనుమతించమని మగరాయుళ్ళ నుండి ప్రమాణాలు తీసుకొవాల్సిన ఆవశ్యకత వుందంటారా? అయితే ఆ పర్వ దినానికి ఇంకా తేదీ ఖరారు కాలేదు లెండి. ఈలోగా నేను ప్రయోగాలు చేస్తూ ఉద్దండపిండాన్ని అయిపోతాను. వంటల బ్లాగులు కూడా తిరగెయ్యాలనుకుంటున్నాను. (ఈమధ్య ఓ రుచుల బ్లాగులో ఓ ధర్మ సందేహం అడిగితే వారెవరో కానీ వివరణ ఇచ్చేరు కాదు. ఆవకాయ బిర్యానీ చెయ్యడం ఎలా అనేది నా ప్రశ్న.)    అలా ఎక్కువయినా కష్టమే. మా ఆవిడ వంట పోస్టుకి రాజీనామా ఇచ్చేసి నన్ను నియమించే ప్రమాదం వుండనే వుంది. అందుకే నలభీములకి, అందరికీ ఓ ప్రశ్న. నా వంట నాకూ, ఇతరులకి నచ్చాలి కానీ మా ఆవిడకి ససేమిరా నచ్చకూడదు. ఆ చిట్కా ఏమయినా వుంటే ఇటు పడేద్దురూ.