ఇండియాలో తెలుగు నడక కార్యక్రమానికి ఫణిబాబు గారు వస్తారని నాకు ముందే AP మీడియా రాము గారు చెప్పారు. వారు ఆ కార్యక్రమానికి రావడం, రాము గారితోనూ, ఇతరులతో మాట్లాడుతుండటం అప్పుడు గమనిస్తూనే వున్నాను కానీ వారితో మాట్లాడటానికి తీరిక దొరకలేదు.
నడక అంతా అయిపోయిన తరువాత పివి జ్ఞానభూమి వద్ద సన్న వర్షం పడుతుంటే ఫణి గారూ, మా అల్లుడు రవీ ఒక దగ్గర షెల్టర్ తీసుకున్నారు. వారిని నేను గుర్తించాను కానీ వారు నన్ను గుర్తించారో లేదో అని నా గురించి వారికి చెప్పమని సైగల ద్వారా రవికి చెప్పాను. అప్పుడు వారు నాకేసి నవ్వుతూ చూసి ఆల్రెడీ గుర్తుపట్టానన్నట్లుగా సైగ చేసారు. తరువాత వారితో మాట్లాడటానికి సమయం చిక్కింది. మీరు ఏమనుకోకండీ - సరదాగా అంటున్నాను - మీరు పెద్ద పెద్ద విషయాలు వ్రాస్తారు - చూడటానికి పిట్టంత వున్నారే అని అన్నారు. అందరూ ఇలా అనుకుంటారనే 'పేరు గొప్ప - ఊరు దిబ్బ' అనే టపా వ్రాసాను. అయితే ఆ టపా వారు చదవనట్లున్నారు. పిట్ట కొంచెం - కూత ఘనం టైపు లెండి మనం అని సరదాగా అన్నాను.
నిజానికి వారి ఫోటో నేను చూసి, గంభీరంగా పెట్టిన ఫేసూ చూసీ, చాలా భారీ విగ్రహం అని తలచి వారేదో ఆర్మీలో కల్నల్ గా పనిచేసి రిటైరయిన వారిలా వుంటారేమో అనుకున్నాను. అంతలేదు - అంత భారీ విగ్రహం కాదు :) ఆ విషయం అప్పుడే చెప్పి కౌంటర్ ఇద్దామనుకున్నాను కానీ కుదరలేదు :)) అందుకే ఇప్పుడు కౌంటర్ ఇస్తున్నాను!
అలా మేమిద్దరమూ ఆ సన్నటి వానలోనే తడుస్తూ బ్లాగాభిరామాయణం మాట్లాడుకున్నాం. ఆ మాటల్లోనే వారు నెలకొల్పిన ఇంటింటికీ పుస్తకాలు అందించే పుస్తకాలయం మరియి వెబ్‌సైటు గురించి తెలిపారు. వారు పూణేలో వుంటారు కాబట్టి అది పూణే తెలుగు వాస్తవ్యులకు మాత్రమే ఉపయోగకరంగా వుంటుంది. నెలకు కొంత రుసుము కడితే ఎప్పుడూ రెండు పుస్తకాలు పోస్టులో తెప్పించుకుంటూ, ఇచ్చివేయవచ్చు. సైటులోకి వెళ్ళి దానికోసం సభ్యత్వం తీసుకోవడమూ, అలాగే తదుపరి మీకు ఏం పుస్తకాలు కావాలో సూచించడమూ చేయవచ్చు. ఎవరయినా పూణే వాస్తవ్యులు కనుక ఇది చదువుతున్నట్లయితే ఆ సౌకర్యాన్ని ఉపయోగించుకోవడంపై ఆలోచించగలరు.
వివరాలు:
Email: phanibabu@tenderleaves.com
Phone: +91 9325508220
ఆ తరువాత ఆ చినుకుల్లో మేమందరం వేడివేడి టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు సుజాత గారు "ఈ నడక కోసం పూణే అంత దూరం నుండి ఫణి బాబు గారు వచ్చారు" అని అంటే నేను సప్త సముద్రాలు దాటి వచ్చాను దీని కోసం అని ఫణి గారితో నేను పోటీ పడ్డాను. అవును కదా, మీరే ఎక్కువ దూరం నుండి వచ్చారు కదూ అన్నారు సుజాత గారు. అయితే ఫణిబాబుగారు ఆ నడక కోసం ప్రత్యేకంగా పూణే నుండి వస్తే నేనేమో ఎలాగూ ఇండియా వచ్చాను కాబట్టి పాల్గొనగలిగాను. సో, ఫణిబాబు గారే గ్రేట్ కదా.
కొద్దిగా మా లైబ్రరీ హడావిడిలో ఉండి మీరు నాగురించి వ్రాసిన టపా చదవలేదు ముందర.నాగురించి మరచి పోయారేమో అనుకున్నంతలో ప్రత్యేకంగా ఒకటపా వ్రాసి ఆశ్చర్య పరిచారు!థాంక్స్.మీ కౌంటరు చాలా నచ్చేసింది! మా టెండర్ లీవ్స్ గురించి వ్రాసినందుకు ధన్యవాదాలు.
ReplyDelete