మా మాంగోరి పచ్చటి పొలాల్లో నేను గొంతెత్తి పాడిన పాట!

గమనిక: కొందరు ఉత్తమ పురుషలకు ఈ టపా చవుకబారుగా అనిపించవచ్చు. అలాంటివారు బుద్ధిగా స్కిప్ చెయ్యొచ్చు!

ఆ ఊరిలో నా పెళ్ళి పత్రికలు ఇచ్చి మోటార్ సైకిళ్ళ మీద వస్తున్నాము అప్పుడు. ఆ ఊరు మా అత్తవారి ఊరు దాటాక వుంటుంది. "మామా మీ కాబోయే మామగారి పొలాలు ఇవే" అన్నాడు ఒక ఫ్రెండు రోడ్డు పక్కన పచ్చని పొలాలని చూపిస్తూ. "ఆగండి!" అని నేను గర్జించాను ఆ మాటలు వినగానే. ఏం కొంప అర్జంటుగా మునిగిందేమోనని ఆగిపోయారందరూనూ. "అలా మా మామగారి పొలాలను చూస్తూ చూస్తూ అలా వెళ్ళిపోవడమేనా?" అని వారిని నిలదీసి ప్రశ్నించాను.

వాళ్లందరూ అర్జంటుగా నాలుక్కొరుక్కున్నారు కానీ తరువాత ఏం చేయాలో తెలియక బిక్కముఖం వేసి "ఏం చేయమంటావు మామా? మన పాద ధూళితో పావనం చేద్దామా ఆ నేలని?" అని ప్రశ్నించారు. "అంతే కాదు. పాట కూడా పాడాలి. పాటతో నేల సస్యశ్యామలం కావాలి" అన్నాను చిద్విలాసంగా. అదే అదనుగా మావాడు ఒహడు ఓ అని గొంతెత్తాడు. "ఎహె నోర్ముయ్. పాటంటే ఆ పాట కాదు. కాలెత్తి పాడాలి ఈ పాట" అన్నాను చిరాగ్గా. మా వాళ్లంతా తమ అమాయకత్వానికి మరోసారి సిగ్గుపడి మరోసారి సమ్మగా నాలుక కొరుక్కున్నారు.

మోటార్ సైకిళ్ళు దిగి అందరూ ఠీవిగా రాజు వెడలె రవి తేజము లదరగా అన్నట్లు రోడ్డు దిగి ఆ పొలాలలోకి నడవనారంభించారు. నాకు మండుకొచ్చింది. "ఆగండి!" అని మళ్ళీ అరిచాను. మళ్ళీ ఏం కొంప మునిగిందేమోనని గిరుక్కున వెనక్కి తిరిగి క్వెషన్ మార్క్ ఫేస్ పెట్టారు. "ఎవరిదా నేల?" అని నిగ్గదీసి అడిగాను. "మీ మామగారిది" అన్నారు అమాయకంగా. "కదా! మరి ఎవరు పాట పాడాలి అందులో?" అని ఆయాసం అనిపించినా కాస్త శ్రమపడి గొంతు పెంచి అన్నాను. వాళ్ళకి తమ తప్పు తెలిసివచ్చి మరోసారి నాలుక కొరుక్కున్నారు. "కొరుక్కున్నకాడికి చాలు గానీ రోడ్డుకి ఆ వైపు మీరంతా పాట పాడండి" అని వాళ్ళను గెదిమాను.

ఆ తరువాత దర్జాగా ఆ పొలాల్లొకి నడిచి నా పాద ధూళితో పావనం చేసి తాపీగా గొంతెత్తి పాట పాడుకుంటూ పాటపాడి ఆ నేలను సస్యశ్యామలం చేసాను. మా మామ ఎప్పుడన్నా పంటలు బాగా పండినాయని చెప్పినప్పుడల్లా అది నా ఘనకార్యమే అని చెప్పాలన్న కోరికను ఆత్మనిగ్రహం మనకు ఎక్కువ కాబట్టి బలవంతంగా ఏదోలా నిగ్రహించుకునేవాడిని. వారి నాన్నారి పొలానికి నేను చేసిన సేవను మా ఆవిడక్కూడా ఎప్పుడూ చెప్పలేదు - మీకే ముందు చెబుతున్నాను. ఇది చదివాక మీకొక ప్రశ్న మనస్సులొ ఉదయిస్తుందని నాకు తెలుసు. ఎరువు గురించేనా? వద్దులెండి - అలాంటివి మాట్లాడుకుంటే మరీ బావోదు.

7 comments:

  1. టపా టైటిల్ గొంతెత్తి అని కాకుండా కాలెత్తి అని పెట్టాల్సింది.

    ReplyDelete
  2. ఈ టపా ద్వారా తెలిసిందేమంటే, మీ ఆవిడ ఇండియా వెళ్ళాక మీకు బొత్తిగా టైంపాస్ కావడం లేదని.

    ReplyDelete
  3. అవునన్దీ గొంతెత్తి అని కాకుండా...వుంటే బావుండేది గానీ టైటిల్ మార్చకండి మహాప్రబో..

    ReplyDelete
  4. inka song kuda pedutharemo mi amruthamyina kanta maadhuryanni vindam anukuni itu vachha :(

    ReplyDelete
  5. ఏమని పాడెదనో ఈ వేళా! :)
    జై జై యూరియా!!

    ReplyDelete
  6. @ హరేక్రిష్ణ - :))
    @ శ్రీనివాస్, కె వి ఎస్ వి - అలా టైటిల్ పెడదామనే అనుకున్నా కానీ మళ్ళీ పిల్లకాకి క్రిష్ణ ఏడుస్తారని పెట్టలేదు :))
    @ నచికేత్ - నిజమే :)
    @ స్వప్న - అలాంటి సాంగ్స్ బ్లాగుల్లో పెట్టేంత టెక్నాలజీ ఇంకా రాలేదు! వచ్చేక ఆలోచిస్తా :)
    @ కొత్తపాళీ - పోషక విలువలు మరీ :)

    ReplyDelete