పరిస్థితులు ఏవయినా సరే ఒక జంట ప్రేమలో వున్నారనుకోండి - వారి మధ్య చాలావరకు అన్నీ బాగానే వున్నట్లు అనిపిస్తాయి. ఒకరిలోని లోపాలు మరొకరికి ఆ మత్తులో తెలిసిరావు - తెలిసినా అవి అంత పెద్ద విషయంగా అనిపించవు. కానీ ఇది పెద్దలు కుదిర్చిన వివాహం కంటే చాలా బెటర్. దీనిలో కొంత అయినా ఒకరి మీద ఒకరికి అవగాహన ఏర్పడుతుంది. నిశ్చయం నుండి పెళ్ళి నిశ్చయింప బడ్డ జంట మధ్య వుండేది కూడా ప్రేమ, అనురాగం అనే అనుకోవాలి. కాబోయే భర్త/భార్య మీద చాలా మమకారం వుండటం సహజమే కదా.
డేటింగ్ వల్ల కూడా అంత లాభం లేదు. అయితే దానివల్ల పరస్పరం మరికొన్ని విషయాలు తెలుస్తాయి కానీ మనిషి మీద పూర్తి అవగాహన రాదు. మనిషి ఎక్కువగా తెలియకపోతే తను కాస్త నచ్చాక సాధారణంగా అన్నీ బాగానే అనిపిస్తాయి. మనిషి బాగా తెలిస్తే మాత్రమే అసలు మనిషి బయటపడుతాడు.
అసలు వ్యక్తిత్వం ప్రేమ లోనూ, డేటింగ్ లోనూ తెలియదు. సహజీవనంలోనో లేదా పెళ్ళి అయాకనో బోధపడ్తుంది. వీటిల్లో కూడా వెంటనే బయటపడవు - వీటిల్లోని తొలి మాధుర్యం కరిగిపోయాక, మబ్బులు విచ్చుకున్నాక పెళ్ళాం/మొగుడు పాత చింతకాయ పచ్చడి అయ్యాక అసలు రంగులు ఒకరికి ఒకరివి తెలుస్తుంటాయి. ప్రేమికులు ఇద్దరూ సహజీవనం చేస్తున్నా ఇది వర్తిస్తుంది.
కొన్నేళ్ళు పెళ్ళి అయాక లేదా కొన్ని ఏళ్ళు సహజీవనం చేసాక కూడా వారిలో అనురాగం వెల్లివిరుస్తూవుంటేనే అది నిజమయిన ప్రేమగా భావించవచ్చు. అంతేగాని ప్రేయసి ప్రియులు రోజుకొకసారి గంటకొకసారి తియ్యటి ఊసులు మాట్లాడుకున్నంత మాత్రాన అది నిజమయిన ప్రేమ అవ్వదు. తమది నిజమయిన ప్రేమ అనే భ్రమలో వుంటారు ఆ జంట. అందుకే ప్రేమించి పెళ్ళిచేసుకున్న కొన్ని జంటలు భ్రమలు కరిగిపోయి వాస్తవ వ్యక్తిత్వాలు బయటపడ్డాక విడిఫోతుంటాయి. ఒకసారి వెడ్‌లాక్ అయ్యాక ఇక వాళ్ళు జీవితాంతం లాక్ అయినట్లే కాబట్టి పెద్దగా చేసేదేమీ వుండదు. ధైర్యం వున్నవారు ఆ బంధం నుండి బయటపడుతారు - ధైర్యం లేని వారు తమ బంధాన్ని ఏదో రకంగా సమర్ధించుకుంటూ జీవితాలు ఏదోరకంగా లాగిస్తుంటారు.
మరి దీనికి పరిష్కారం? అందరికీ సాధ్యపడదు ఇది కానీ సాధ్యపడినవారు, ఇష్టపడిన వారు, ధైర్యం వున్న జంటలు ఇలా చేయొచ్చు. అదే సహజీవనం. కనీసం మూడు ఏళ్ళన్నా కలిసివుంటే అసలు వ్యక్తిత్వాలు బయటపడుతాయి. ఈ లోగానే మనస్సులు సరిపడవని బయటపడితే ఎంచక్కా విడిపోవచ్చు. ఓ మూడేళ్ళయాక కూడా వారిలో ఇంకా ప్రేమ వుంటే భేషుగ్గా పెళ్ళి చేసుకోవచ్చు. మరి ఆ తరువాత వారిలో విభేదాలు రావని గ్యారంటీ ఏమిటీ? నేను పెర్ఫెక్షనిస్టును కాను - ఇది గ్యారంటీ. మీరు కూడా పరెఫెక్షనిస్ట్ కాకండి - అదొక మానసిక జాడ్యం!
జంటల మధ్య విభేదాలు రావడానికి అందులో ఇద్దరో ఒక్కరో దుర్మార్గులే కానక్కరలేదు. ఇద్దరు చాలా మంచివారయినంత మాత్రాన వారి మధ్య హార్మోనీ వుండాలని ఏమీలేదు - వైరుధ్యాలు రాకూడదనీ లేదు. రెండు జంటలు నిలబడాలంటే వారి మధ్య ముఖ్యంగా వుండాల్సింది మానసిక సారూప్యత - మంచితనమో, లేక ఏదోరకంగా గొప్పతనమో కాదు. ఒక జంటలో సారూప్యత వుందీ లేనిదీ తెలుసుకోవాలంటే దానికి అందుబాటులో వున్న పరిష్కారం సహజీవనమే కానీ ఇది చాలామంది ఒప్పుకోరు, అంగీకరించరు - దీనికంటే ఏదోలా బ్రతుకు లాగెయ్యడమే బెటర్ అంటారు. జావితాన్ని ఏదో ఒక విధంగా లాగించివేద్దాం అనుకునేవారికి ఇవన్నీ అవసరం లేదు - జీవితాన్ని జీవించేద్దాం అనుకునేవారు పెళ్ళి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పెళ్ళి చూపుల్లో ఓ గంట చూసి ఓ అరగంట మాట్లాడి అంతా అర్ధం అయ్యిందనుకుంటే మున్ముందు జీవితంలో వచ్చేది ఆనందం కాదు - అనర్ధం కూడా అవచ్చు.
కెనడాలో ఒక ఫ్యామిలీ వుండేది. ఆ జంట కొన్ని ఏళ్ళుగా నాకు బాగా పరిచయం. వారిది ప్రేమ వివాహం (ఒకే కులం). వారికి టీనేజీ పిల్లలు వున్నారు. ఒక రోజు భర్త ఫోన్ చేసి విడాకులు తీసుకోవాలనుకుంటున్నాము అని చెప్పి నా సలహా అడిగాడు. పెళ్ళి అయి ఇన్నేళ్ళుగా మీలో సర్దుబాటు లేనప్పుడు ఇంకా ఈ దాంపత్యాన్ని పొడిగించడం అనవసరం - తటపటాయించకుండా విడాకులు తీసుకోండి అని చెప్పాను. అదే రోజు భార్య కూడా నాకు ఫోన్ చేసి అదే విషయంలో నా సలహా అడిగింది. ఆమెకూ తన భర్తకు ఇచ్చిన సలహానే ఇచ్చాను. మొత్తం మీద వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. పిల్లలకి తండ్రి అంటే ఇష్టం లేదు - తల్లి దగ్గరే వుంటున్నారు. అతను మరో పెళ్ళి చేసుకున్నాడు. విడాకులు తీసుకోవడమే మంచి పని అయిందని ఇప్పుడు హాయిగా జీవితం వెళ్ళదీస్తున్నామనీ వారిద్దరూ నాకు చెప్పేవారు.
అసలు పెళ్ళే అవసరం లేదు - ఎంచక్కా సహజీవనం చేస్తూనే వుంటామనుకుంటే అది ఇంకా చక్కని విషయం. పెద్దగా బాదరబందీలు వుండవు. ప్రతి దాంట్లోనూ చిన్న చిన్న సమస్యలు వుంటాయి కాబట్టి ఎలాగోలా పరిష్కరించుకోవచ్చు.
సహజీవనంలో వీరికి పిల్లలు పుట్టాక విడిపోవాల్సి వస్తేనో? పిల్లల సంక్షేమం దృష్ట్యా ఎవరి దగ్గర వుంటే బావుంటుందో వారు ఎక్కువగా పిల్లల బాధ్యత తీసుకోవాలి. ఖర్చులు భరణం రూపేనా ఇద్దరూ భరించాలి. ఎలాగూ సహజీవనం చేస్తూ విడిపోయారు కాబట్టి భార్యకు ఇవ్వాల్సిన భరణం వుండదు. ఇద్దరిలో పిల్లలు ఒకరి దగ్గర వున్నప్పుడు మరొకరు పిల్లల భరణం చెల్లించాలి.
సహజీవనంలో వీరికి పిల్లలు పుట్టాక విడిపోవాల్సి వస్తేనో? పిల్లల సంక్షేమం దృష్ట్యా ఎవరి దగ్గర వుంటే బావుంటుందో వారు ఎక్కువగా పిల్లల బాధ్యత తీసుకోవాలి. ఖర్చులు భరణం రూపేనా ఇద్దరూ భరించాలి. ఎలాగూ సహజీవనం చేస్తూ విడిపోయారు కాబట్టి భార్యకు ఇవ్వాల్సిన భరణం వుండదు. ఇద్దరిలో పిల్లలు ఒకరి దగ్గర వున్నప్పుడు మరొకరు పిల్లల భరణం చెల్లించాలి.