సరిగ్గా అలాంటి ఇల్లే అప్పట్లో కెనడాలో కొన్నాను

కెనడాలో తొలి ఉద్యోగం చేస్తున్న రోజులవి. మా ఇంట్లో నేను ముందు ముందు కొనబోయే ఇల్లు ఎలా వుండాలో అలా నా కలల సౌధం పోస్టర్ లివింగ్ రూమ్ గొడ మీద అతికించుకున్నా. ఏదో గొప్ప ఇల్లు అని ఊహించుకోకండేం. ఏదో అప్పట్లో నా స్థాయికి తగ్గ విధంగా టవున్ హవుజ్ పోస్టర్ అతికించుకున్నా. అలా ఆ పోస్టర్ ను నేనూ, మా వాళ్ళూ ఎన్ని సార్లు చూసివుంటామో. ఆ తరువాత చాలా సార్లు ఇళ్ళూ మారేమూ, ఊర్లూ మారేమూ. సిల్లీగా అనిపించి మళ్ళీ అలాంటి పోస్టర్ అతికించుకోలేదు. 

కట్ చేస్తే 3, 4 ఏళ్ళ తరువాత నయాగరా ఫాల్స్ కి దగ్గరలో సరిగ్గా అలాంటి ఇల్లే కొన్నాను. కొద్దిమంది మిత్రులూ, శ్రేయోభిలాషులూ టవున్ హవుజ్ మళ్ళీ అమ్మితే మంచి ధర రాదనీ, ఇండివిడ్యుయల్  ఇల్లు కొనమని గట్టి సలహాలే ఇచ్చినా కూడా ఒక నెల ఆలస్యాన్ని భరించని మా ఆవిడ మంకుపట్టూ తదితర కారణాలన్నీ నన్ను టవున్ హవుజ్ తీసుకోవడానికే ప్రోత్సహించాయి. గృహప్రవేశం చేసిన రోజు రాత్రి పనులూ, పార్టీ అయిపోయాక విశ్రాంతి తీసుకుంటుంటే అప్పుడు గుర్తుకువచ్చింది ఆ పోస్టర్!

వార్నీ అనుకున్నా. మరి తెలిసి పెట్టానో, తెలియక పెట్టానో నాకు ఇప్పుడు గుర్తుకులేదు కానీ ఆ పోస్టర్ మా సబ్ కాన్షియస్ మైండ్స్ లో బలంగా నాటుకుపోయి సరిగ్గా అలాంటి ఇల్లే కొనడానికి పురికొల్పింది అని విశ్వసిస్తున్నాను. ఇల్లు కొనడం మంచి నిర్ణయమే అయినా ఆర్ధిక కారణాల వల్ల టవున్ హవుజ్ తీసుకోవడం అంత చక్కని నిర్ణయం కాదు. నేను అప్పుడు కానీ, ఆ తరువాత కానీ ఆ పోస్టర్ మార్చి ఇండివిడ్యుయల్ హవుజ్ పోస్టర్ అతికించుకొని వుంటే బావుండేది. అప్పట్లో నేను టవున్ హవుజ్ కొనడమే ఎక్కువ కాబట్టి అదే పెట్టుకున్నా - అలాగే జరిగింది. 

ఇందులో నేను నేర్చుకున్న గుణపాఠం ఏంటంటే మన అంతః చేతనకి మనం ఎలా ఆదేశం ఇస్తే, లేదా మనం ఎలా బలంగా విశ్వసిస్తే అలా పరిస్థితులు దారితీసేలా దోహదపడుతుంది. అందుకే మనం కలలు కనగానే సరిపోదు, సరి అయిన కలలు కనాలి - వాటిని అప్‌గ్రేడ్ చేస్తూ వుండాలి కూడానూ :) ఉదాహరణకి మీరు మీకు నచ్చిన కారు మీ ఇంటిముందు వుంటుందని బలంగా విశ్వసిస్తున్నారు అనుకోండి. ఏదో ఒకరోజు మీ పక్కింటోడు పొరపాటున ఆ కారు మీ ఇంటిముందు పార్క్ చేయవచ్చు :)) సో, మనం ఆ కారు టైటిల్ లేదా భీమా మన పేరున వుంటున్నట్లుగా కూడా విశ్వసించకపోతే అలాంటి చిత్రమయిన తప్పిదాలు జరిగిపోతూవుంటాయి. నా నాగుపాము కథ మీకు గుర్తుకువుంది కదా!

నిన్న మా చిన్నమ్మాయీ, నేనూ వెళ్ళి రెండు ఫోమ్ బోర్డులు తెచ్చుకున్నాం. వాటిని మా విజన్ బోర్డులుగా వినియోగిస్తాం. మా లక్ష్యాలని అందులో పొందుపరుస్తాం. ఆ లక్ష్యాలని ఆల్రెడీ అందుకున్నట్లుగా విశ్వసిస్తాం, ఊహల్లో వివరిస్తాం.  మేము కలలని కంటాం, విశ్వసిస్తాం, అందుకోసం అడుగులేస్తాం, నెరవేర్చుకుంటాం. అలాంటి ఇలాంటి కలలే కాదు - పెద్ద పెద్ద కలల్నే కంటాం. అలాంటి పెద్ద కలలని కనడానికి కూడా మీలో చాలామందికి లాగా తటపటాయించం. మనవల్ల కొంతే అవుతుందని చాలామందిమి అనుకుంటాం కానీ మనం మనల్ని ఎంత విశ్వసిస్తే అంతా చెయ్యగలమని ఈమధ్య ఇంకా బాగా తెలిసింది. ఇవన్నీ వ్రాస్తూ నేను నా సమయం ఏమీ వృధా చెసుకోవట్లేదండీ - నా మనస్సుకి ఇలా కూడా పాజిటివ్ సజెషన్స్ ఇస్తున్నాను.

ఇప్పటిదాకా నేను బెంజి కారుకి కూడా గతిలేని పేదోడిని!? (నిజానికి నేను ఇలాంటి పేద మాటలు వ్రాయకూడదు. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండుకి నేను జోక్ చేస్తన్నానా  లేక నిజ్జంగా అంటున్నా అనేది తెలియదు - ఏది అనుకుంటే అలా తీసుకుంటుంది.) - ఇకపై అలాక్కాదు. ఇలాంటి పేదమాటలు బయటకి (మరియు మనస్సుకీ) చెప్పుకోకూడదు కానీ మా ఆవిడ డైమండ్ నెక్లస్ కావాలని ఎప్పటినుండో అంటోంది. దాన్దేవుందీ - నేనూ వింటూనే వున్నా. నిన్నా అనింది, ముందు ముందు కూడా అంటూ వుంది. అబ్బే అలాక్కాదు - నీకు నేను ఆల్రెడీ అది కొనిచ్చేసినట్లుగా ఫీల్ అయిపో అన్చెప్పా - అబ్బే!   అలా విశ్వసించకపోవడమే తను ఎప్పటినుండో చేస్తున్న పొరపాటు. అలాంటి పొరపాట్లే మనం ఎన్నో చేస్తుంటాం. ఆశించడం అందరూ చేసేదే - కాదు - అవి మనకు కావాలీ అంటే అవి ఆల్రెడీ మనం అందుకున్నట్లుగా నమ్మాలి. అప్పుడు అవి మనవి అవుతాయి. అప్పుడు అవి అందుకోవడానికి మన మనస్సు దారిచూపుతుంది. అలా ఇలా కాదు - మనలో బర్నీంగ్ డిజైర్ వుండాలి - అది అందుకోవడానికి మనం తగిన సమయం నిర్దేశించుకోవాలి. అలా అని మా అమ్మాయిలాగా మన కలలు రేపే సాక్షాత్కారం కావాలన్నా కుదరదు కదా. ఏమో మీ కోరిక మరీ అంత గాఢంగా వుంటే అలాగే అవుతుందేమో కూడా - యూనివర్స్ పవర్ ని విశ్వసించేవాళ్ళు అదీ విశ్వసిస్తారు మరి. నాకు తెలియదు.    

పెళ్ళికి ముందు విజయసాధన పట్ల చాలా పట్టుదలగా వుండే వాడిని. అప్పటికి తెలిసిన కొన్ని పద్ధతులు పాటిస్తూ ఏవో చిన్న చిన్న విజయాలు నా ఖాతాలో వేసుకునేవాడిని. పెళ్ళయ్యాక రకరకాల కారణాల వల్లనూ, బాధ్యతల వల్లనూ, డిప్రెషన్ వల్లానూ, డిప్రెషన్ మందుల వల్లనూ పట్టుదల పడకేసింది. ఇన్నాళ్ళూ నా ఆరోగ్యం (అనగా నా హార్మోన్లూ, న్యూరోట్రాన్స్మిట్టర్లూ - మామూలుగా మనుషులకు వచ్చే రోగాలేవీ నాకు లేవు లెండి) మీద పోరాడి ఈమధ్యనే పూర్తి విజయం సాధించాను. సో, ఇక విజయం వైపు పయనమే. ఇది వరకు ఆరోగ్య విషయాల గురించి ఎక్కువ వ్రాస్తుండేవాడిని. ఇకపై విజయల గురించి ఎక్కువ వ్రాస్తుంటాను. అదీ నా పారడైమ్ షిఫ్ట్! ఈ సందర్భంలో ఒక చిన్న గమనిక. మీలో ఎవరయినా గనుక క్రుంగుబాటుకు SSRI టైప్ మెడిసిన్స్ వేసుకుంటే మోటివేషన్ మందగించే అవకాశం వుంది. డాక్టరూ, సైకియాట్రిస్టులూ శుబ్బరంగా అలాంటి మందులు ఇచ్చేస్తుంటారు - వాళ్ళకి పోయేదేంవుంది? DNRI టైప్ మందులు వాడితే మంచిది - అవి మీకు సెట్ అయితే. నేను చాలా ఏళ్ళు ఈ డాక్టర్లని నమ్మి అమాయకంగా అన్యాయం అయిపోయాను. పరిశోధించీ, పరిశోధించీ గురించి తెలుసుకొని నా కొత్త సైకియాట్రిస్టుకి మరీ చెప్పి మందు మార్పించుకున్నాను. ఇప్పుడు ఇక ఏ సమస్యా లేదు - ఇక రచ్చ రాంబోలానే! ఇలా కృంగుబాటు ఎందుకూ - మళ్ళీ మందులూ, మాకులూ ఎందుకూ అని మీరు మొదటికి వస్తే నేను ఇప్పుడు మళ్ళీ వివరించలేనండీ. నాది క్లినికల్ డిప్రెషన్ - మీరు సాధారణంగా అనుకునే సాధారణ కృంగుబాటు కాదు మరీ. మీరేం సలహాలు ఇవ్వబోతున్నారో నాకు తెలుసు - చాలా మంది ప్రయత్నించారు కానీ ఇక ఆపెయ్యండి. మీకంటే నాకు ఈ విషయం గురించి చాలా బాగా తెలుసు అని విశ్వసించండి. సరే, ఇక ఈ టాపిక్ వదిలేద్దాం. నిజానికి నేను ఇలాంటి నెగటివ్ విషయాలు ఇక ఎక్కువగా ఆలోచించవద్దు, ప్రస్థావించవద్దు కానీ పాఠకుల ప్రయోజనం కోసం కొన్ని సార్లు నా నియమాలకు మినహాయిపులు ఇచ్చుకోవాల్సివుంటుంది. నెగటివ్ విషయాలు మెన్షన్ చెయ్యకపోతే పాజిటివ్ విషయాలతో వాటికి వుండే కాంట్రాస్ట్ చూపించలేము కదా.    

ఇప్పటికే ఈ పోస్టులో చాలా వ్రాసాను. మరో పోస్టులో మా అమ్మాయి విజువల్ బోర్డులో ఏముంటుంది, నా విజువల్ బోర్డులో ఏముంటుంది అనేది చూద్దాం. బ్లాగుబద్దమయిన హెచ్చరిక - నా విజన్/విజువల్ బోర్డులోని విషయాలు తెలుసుకొని మూర్ఛపోకండేం - అలా అనీ పగలబడీ నవ్వుకోకండీ. నవ్విన నాపచేనే పండుతుంది - ఆల్రెడీ పండుతోంది కూడానూ! ఇహ మా అమ్మాయి విజువల్ బోర్డ్ ఏమో కానీ అది నాకు టార్చర్ బోర్డ్ లాగా అవుతోందని తనతో సరదాగా నిన్ననే అన్నా! ఎందుకంటే సబ్‌కాన్షియస్ మైండ్ ద్వారానో, యూనివర్సల్ పవర్ ద్వారానో కాకుండా తన కలలు నా ద్వారా తీర్చుకోవాలని విజువలైజ్ చేస్తోంది మరి. Grrr....తన కలలేంటో చూద్దాం. ఒక తన కలా, నా కలా చాలా చక్కగా కలిసిపోయింది - బహు బావుంది అది. అది ఏంటో, ఎలాగోనో  అదీ చూద్దాం మరి.  

5 comments:

 1. పాకిస్థాన్ నీ భారతదేశాన్నీ కలిపేసి, వాఘా బోర్డర్ తీసేసి, ఎవరి ప్రధానిని వారు ఎన్నుకునేలాగా చేసి (తెలంగాణా - ఆంధ్రా లాగా) అఖండ్ భారత్ ని "స్వచ్చ భారత్" చేయాలని కలలు కంటున్నాను. (సీరియస్ గానే సుమా !) ఇవన్నీ చేయడానికి ప్రధాని లేదా రాష్ట్రపతి పదవి నాకు కావాలి లేదా ఎవరో ఒక వ్యక్తి సాయం కావాలి. నాకు సాయం చేసినవాడే నాకు దేవుడు. దేవుడికి స్త్రీలింగాన్ని వాడడం లేదు ఎందుకంటే పెద్ద పెద్ద పనులెపుడూ పురుషులే చేస్తారని నా చుట్టూ ఉన్నవాళ్ళు ఊదరగొట్టేస్తుంటే నా మనసుకి అదే ఎక్కేసింది. సాయం చేసే స్త్రీ(సత్యభామలాంటి) వారు కూడా కనపడడం లేదు.

  ReplyDelete
 2. గురువు గారూ!!.. సంవత్సరాలు గడచినా మీ బావ తీరు మారలేదు.. ఈ మధ్య బ్లాగుల్లో ఆత్మలా తిరుగుతూ వీలైన అందరినీ ఆవహిస్తున్నాడని నా అనుమానం.. మీ బావ ..

  జై సీకాకుళం సిన్నోడికి..జై జై..
  ..సాహో సాహో..

  ReplyDelete
 3. @ నీహారిక
  భారత్ ని స్వఛ్ఛ భారత్ చేస్తే చెయ్యండి కానీ దాని పేరిట మళ్ళీ పన్నులు మాత్రం వడ్డించకండేం :)

  @ కాయ
  ఓ పాట వుంది కదా ' మనిషి మారలేదూ, అతని మమత తీరలేదూ ' అలాంటిదేదో. బావకి బ్లాగర్ల మీద మమత ఇంకా తీరనట్టుంది. వేరే బ్లాగులేమీ చదవట్లా. అందుకే నాకు తెలీట్లా.

  అవునూ బ్లాగిల్లు కొత్త సైట్ ఏంటో చెబుదురూ.

  ప్రస్థుతానికి నాకు కూడలి ఒహటే దిక్కయ్యింది.

  ReplyDelete
 4. మన అంతః చేతనకి మనం ఎలా ఆదేశం ఇస్తే, లేదా మనం ఎలా బలంగా విశ్వసిస్తే అలా పరిస్థితులు దారితీసేలా దోహదపడుతుంది. అందుకే మనం కలలు కనగానే సరిపోదు, సరి అయిన కలలు కనాలి - వాటిని అప్‌గ్రేడ్ చేస్తూ వుండాలి కూడానూ :)

  ReplyDelete