ఆవలించిన మా ఈరో ఈరోయిన్లు

కొన్ని నెలల క్రితం నా సినిమా ప్రయత్నాల గురించి వ్రాసాను కదా. దాని తరువాయి భాగం ఇది. 

తుదిశ్వాస అనే బ్రెత్ కంట్రోల్ ప్లే (BCP) థీమ్ నవలని ఒక (వీడియో) సినిమాగా తీసే ప్రయత్నం ఇది. ఒక మాజీ ఎమ్మెల్యే ఇంట్లో వారి అనుమతి తీసుకొని వారి ఇంటి తోటలో ఒక బుల్లి వీడియో కెమెరాతో షూట్ చేస్తున్నాం కానీ మరో పక్క ఆ ఎమ్మెల్యే గారి భార్యామణి మాదో దరిద్రపు సంత అన్న తరహాలో గులుగుతూ వుంది. పాపం మా సంగతే ఇలా వుంటే ఆ మాజీ సంగతి ఏంటో అనుకొని జాలి పడ్డాం. అప్పుడు ఆయన గారు అక్కడ లేరు లెండి.

ఆ నవల చాలా చక్కగా రొమాంటిక్ గా వచ్చింది కానీ ఎక్కువ పాత్రలు వుండవు. హీరో హీరోయిన్లే చాలా సేపు మాట్లాడేసుకుంటారు. ఆ డైలాగులు చిత్రీకరిస్తుంటే మా హీరో హీరోయిన్లు ఆవలించడం మొదలెట్టారు. అప్పుడు అర్ధమయ్యింది ఈ సినిమా భవిశ్యత్తు ఏంటో. నటిస్తున్న వాళ్ళకే ఆవలింతలు వస్తే ఇక ప్రేక్షకుల పరిస్థితి ఎలా వుంటుంది? ఆయా సంభాషణలు నవలగా బాగా పనికివస్తాయి కానీ సినిమాగా ఉపయోగపడవు అని అర్ధం అయ్యింది. అయినా సరే కష్టపడి తీస్తే ఎవరూ చూడని ఆర్ట్ సినిమా అవ్వచ్చు. ఆ రోజు షూటింగ్ అంతా అయిపోయాకా రాత్రి అంతా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని మరుసటిరోజు ఉదయం మా టీం కు చెప్పాను - సినిమా క్యాన్సిల్ అని. సహజంగానే అందరూ విస్మయం చెందారు. వారికి పరిస్థితి వివరించాను. అందరికీ ముందుగా అనుకున్న ప్రకారం పూర్తిగా డబ్బులు చెల్లించాను. 

అన్నట్టు షూటింగ్ జరిగిన రోజు రాత్రి మా హీరోయిన్ గారు ఎటో వెళ్ళిపోయారు. ఎటెళ్ళిందబ్బా అని అనుకుంటుండగానే మా హీరో గారు కూడా మిస్సింగ్ అని తెలిసివచ్చింది. విషయం అర్ధం అయ్యింది. వార్నీ మా వాళ్ళు యమ ఫాస్టుగా వున్నారే అని మేము నవ్వుకున్నాం.

ఇక చతుర మాస పత్రికలో ప్రచురింపబడ్డ నా 'ఎవరు?' (Meta Fiction) నవల వీడియో ఫిల్మ్ గా తీస్తే ఎలా వుంటుందో ఆలోచించాను. అందులో ఎంతో మంది జంటలు, పాత్రలూనూ. అలా అది కష్టం. అలా కాకుండా ప్రాక్టీసు కోసం అందులోని ఒక జంట కథను మాత్రమే తీసుకొని ఫిల్మ్ గా తీస్తే ఎలా వుంటుందని కొద్ది రోజులు ఆ కథ మీద కసరత్తు చేసాను. వేరే కారణాల వల్లనూ మరియు నా దగ్గర పెద్దగా డబ్బులు లేనప్పుడు ఈ ప్రయాస అంతా ఎందుకని కూడానూ అప్పటికి ఈ సినిమా వ్యవహారాలు కట్టిపెట్టి కొద్ది వారాల్లో మళ్ళీ యుఎస్ కి వచ్చాను. 

యుఎస్ కి వచ్చాకా కొన్ని నెలలు బెంచ్ మీద వున్నాకా కన్సాస్ సిటీలో ప్రాజెక్ట్ వచ్చింది. అప్పటికి మా కుటుంబం ఇంకా ఇండియాలోనే వుంది. కాస్త తీరిగ్గానే వున్నా కదా అని మళ్ళీ సినిమా ఆలోచన చేసాను. నాకు తగ్గట్టుగానే నాకో మహా గొప్ప హీరో దొరికాడు. మా హీరో ఎంత గొప్పవాడంటే... ఇప్పుడెందుకు లెండి. అతగాడి విషయం మరో భాగంలో మరెప్పుడయినా చెబుతా. హీరోయిన్? అని అడుగుతున్నారా? సర్లెండి. మా హీరో కూడా అదే అడిగాడు లెండి!

No comments:

Post a Comment