కంఫర్ట్ :(

మీరు చేస్తున్న ఉద్యోగంలో లేదా మీరు చేస్తున్న వృత్తిలో మీ కంఫర్ట్ లెవల్ ఎంత శాతం? నాది చెప్పనా? 99%. మరి మీది? మనం చేస్తున్న ఉద్యోగం ఎంత సౌకర్యంగా వుంటే ... అంత మంచిది కాదు...అంటారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. నిజమే. మనం చేస్తున్న పని పూర్తిగా కరతాలమకం (సరి అయిన పదమే కదా. కొన్నికొన్ని తెలుగు పదాలు మరచిపోతున్నా సుమీ) అయిపోయినప్పుడు మనం ఇంకా నేర్చుకోవడానికి ఏమీ వుండదు. అంతకు మించి అక్కడ రాణించేదేమీ వుండదు. జీవితంలో ఎదుగుదల కావాల్సినవారు అక్కడే అలాగే వుండిపోకూడదు. కొత్త ఉద్యోగానికి మారాలి - కొత్త విషయాలు తెలుసుకోవాలి, తన రంగంలో తాను అందరికంటే ఎక్కువగా నిష్ణాతులు అవాలి.

నా ప్రస్తుత ఉద్యోగంలో ఏడేళ్ళ క్రితం చేరినప్పుడు కంఫర్ట్ లెవల్ బాగా ఎక్కువే వుందని త్వరలోనే అర్ధమయ్యింది నాకు. ఎంత సౌకర్యం అంటే నాలాంటి అదృష్టవంతుడు కోటికి ఒక్కరు వుంటారేమో! దాదాపుగా పనే చెప్పకుండా అప్పణంగా వేలకువేల డాలర్లు నాకు గుమ్మరిస్తున్నారా అనిపిస్తుంటుంది. సరాసరిన నాకు మా ఆఫీసులో ఎంత పని వుంటుందో ఎవరయినా ఊహించగలరా? బహుశా మీ వల్ల కాదు. మీటింగులు గట్రా మినహాయిస్తే సరాసరిన నా పని వారానికి 5 నిమిషాలు!! ఆ అయిదు నిమిషాల పనిని రోజుకి ఒక నిమిషం చొప్పున భాగించి పని చేస్తుంటాను. ఈమధ్య కొద్దిగా ఎక్కువయ్యింది లెండి. అంత సౌకర్యంగా వుంది కాబట్టే వాళ్ళు పీకేసేదాకా వుంటున్నా.  

నిజానికి నా అదృష్టానికి నేను మురిసిపోవాలి కానీ కంఫర్ట్ లెవల్ ఎక్కువయితే వచ్చే సమస్య లేంటో ముందు నుండీ నాకు బాగా తెలుసు. పనే లేకపోతే అనుభవం ఎలా వస్తుంది? వున్న అనుభవం పోతుంది. సరిగ్గా అలాగే అయ్యింది నాకు. ఇప్పుడు ఉద్యోగం మారాలంటే అవస్తగా వుంది. మీరు వైవా అనే తెలుగు షార్ట్ ఫిల్మ్ చూసేవుంటారు. చూడకపోతే చూడండి - చాలా ఫన్నీగా వుంటుంది. ఆ విధంగా ఇంటర్వ్యూలలో నేను సమాధానాలిస్తుంటే ఎవడు నాకు ఉద్యోగం ఇస్తాడు చెప్పండి? ఇన్నేళ్ళ అనుభవం వుండి చిన్నచిన్న బేసిక్ విషయాలకు కూడా సమాధానం చెప్పలేకపోతుంటే నాకే సిగ్గేసి ఇహ ఇంటర్వ్యూలు అటెండ్ అవడం మానివేసాను. ముందు సబ్జెక్ట్ దుమ్ము దులిపాక మళ్ళీ అటెండ్ అవుతాను. 

అయితే ఇన్ని తెలిసిన నేను ఇన్నేళ్ళుగా ఈ ఉద్యోగంలో ఎందుకు స్టక్ అయ్యాను? కారణాలు లేక కాదు. జీవితం మీద విరక్తితో రోజులు అలా అలా నెట్టుకువచ్చా అంతే. ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయా? ఊహు. మారింది నా ఆలోచనా విధానం. కిందా మీదా పడి సరి అయిన మందూ మాకూ వాడి మొత్తం మీద నా ఆలోచనా విధానం మార్చుకున్నాను. చుట్టూ వున్న పరిస్థితులను భూతద్దంలో నుండి చూడకుండా సమస్యలను మించి నేనే మానసికంగా ఎదిగాను. అందువల్ల ఆ సమస్యలు చిన్నవి అయిపోయాయి. సరే, అవన్నీ వేరు విషయాలు. పక్కన పెడదాం. మొత్తం మీద నా జీవితంలో విలువయిన కొన్ని సంవత్సరాలు ఈ విధంగా వృధా చేసుకున్నాను. సరే. ఇక ముందేంటి మరి?

ఇకపై ఎక్కువగా సమయం వృధా చెయ్యకుండా నా ప్లాట్‌ఫార్మ్ లో నేను పూర్తిగా నిష్ణాతుడిని అవదలుచుకున్నాను. ఎలా అంటే దేశంలో నా రంగంలో నా అంత మొనగాడు మరొకడు వుండకూడదు. అంతగా ఎదగాలి. కలల్లో కూడా ఆ సబ్జెక్టులే కనిపించాలి. అప్పుడు మాత్రమే మన మనస్సు పూర్తిగా ఆయా విషయాల మీద నిమగ్నమయినట్టుగా అనుకోవచ్చు. మనస్సు ఇతర విషయాల మీదకు మళ్ళకుండా తగిన చర్యలు తీసుకొని అవి పక్కకు పెట్టాను. నిన్నటి నుండి నా సబ్జెక్టులు ప్రాక్టీసు చెయ్యడం మొదలెట్టాను. ఆసక్తిగా, ఏకాగ్రతతో నడుస్తోంది నా కృషి. ప్రతి యొక్క చిన్న విషయాన్నీ క్షుణ్ణంగా అధ్యయనం చెయ్యదలిచాను, ప్రాక్టీసు చెయ్యదలిచాను. మా మేనేజర్ చాలా మంచిది. కొత్త ఉద్యోగం వెతుక్కోవడం కోసం ప్రస్తుత పనికి అడ్డం లేనంత వరకు ఎంతయినా ఎలా అయినా సిద్ధం అవమని ఎప్పుడో చెప్పింది.

నా సంగతి సరే. మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. మీరు చేస్తున్న పనిలో మీ కంఫర్ట్ లెవల్ ఎంత? చాలా బాగా వుందని మురిసిపోకండి. నా సంగతి చూసేరుగా. జాగ్రత్త పడండి. జీవితంలో ఎదగాలంటే, ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే మన రంగంలో మనం మరింత మరింత నిష్ణాతులం అవుతూ వుండాలి. మన పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు సాన పెడుతూ వుండాలి కాదూ? మొండి కత్తి తీసుకొని యుద్ధానికి వెళితే ప్రయోజనం వుండదు సరి కదా మన తలే తెగి పడవచ్చు. బహు పరాక్! జీవితం ఎక్కడ వేసిన గొంగళిలా వుండాలనుకునేవారికి ఇవన్నీ ఏమీ అవసరం లేదు కానీ డైనమికుగా జీవించాలంటే మాత్రం మార్పుని ఆహ్వానించాలి. 

ఈ కంఫర్ట్ లెవల్ అనేది ఒక్క ఉద్యోగానికే కాదు ఇతర విషయాలకూ వర్తిస్తుంది. పదిహేడేళ్ళ క్రితం హైదరాబాదులో DILT (Diwakar Institute of Leadership Training) క్లాసులకు వెళ్ళాను. అందులో దివాకర్ గారు ఈ కంఫర్ట్ లెవల్ గురించి ఎంతో చెప్పారు. ఉదాహరణకు మీరు మీ ఇంటి చుట్టుపక్కల వారితో కంఫర్టబుల్ గా వున్నారా? హ్మ్. అయితే జీవితంలో ఎదగాలనుకునేవారికి అది సమస్యే. సన్నాసి సన్నసి రాసుకుంటే ఏం రాలుతుందీ - బూడిద! అలాగే ఇది కూడానూ. మీరు మీకు అసౌకర్యం కల్గించేటువంటి ఏరియాకు మారండి. అనగా మురికివాడకు మారమని నా అర్ధం కాదు! మీకంటే కొద్దిగా ధనవంతుల ఏరియాకు మారాలి. అప్పుడు వారిని, వారి జీవన విధానాన్ని చూసి మనం స్పూర్తి పొందుతాం. అనుకోకుండానే వారిలా మనమూ సంపాదించాలనే కోరిక, ఉత్సాహం, పట్టుదలా వస్తాయి. ఇలా ఈ విషయం తెలుసు గానీ నేనేమీ ఇప్పట్లో మా ఇల్లు మారను కానీ కొత్త ఉద్యోగం రాగానే మారేస్తానేం.  

4 comments:

 1. నాదీ దాదాపుగా మీలాంటి కేసే. అయితే సబ్జెక్స్ట‌లో నేను నిష్ణాతుడిగా ఉన్నప్పటికీ నా attitude, adjustment problemsవల్ల నా తోటివాళ్ళలాగా ఉన్నత స్థానాలకు చేరుకోలేక వెనకబడిపోయాను. నేనుకూడా మీలాగే నా ఆలోచనావిధానాన్ని మార్చుకుని, అందరితో సత్సంబంధాలు కలుపుకుంటూ ముందుకెళ్ళాలనుకుంటున్నాను. అయితే ఇప్పుడు నా యాటిట్యూడ్ మార్చుకుని సత్సంబంధాలు పెంచుకోవాలంటే నా బంధుమిత్రులు నన్ను పాజిటివ్‌గా తీసుకుంటారా అనేది చూడాలి.

  keep blogging

  SS

  ReplyDelete
  Replies
  1. సత్సంబంధాలు పెంచుకోవడం కోసం ఓ మాంఛి పుస్తకం వుంది. అది చదివారా? తప్పక చదవండి.
   How to Win Friends and Influence People - Written by Dale Carnegie.

   http://en.wikipedia.org/wiki/How_to_Win_Friends_and_Influence_People

   Delete
 2. atlast you are in the correct line.all the best.^

  ReplyDelete
 3. @ అజ్ఞాత 11 మార్చి, 2015 10:46 [AM]
  Thank you.

  ReplyDelete