ఇద్దరి మనసులు కలిస్తే...కూడా ఇబ్బందే

చాలామంది పెళ్ళి అయిన జంటలని పరిశీలిస్తే అనిపిస్తూవుంటుంది... దంపతుల్లో ఇద్దరి మనస్థత్వాలు కొన్ని విషయాలలో అయినా మరీ ఒక్కటే అయినా ఇబ్బందే అని. ఆయా విషయాలపై ఇద్దరి ఆలోచనా ధోరణి ఒక్కటే అయినప్పుడు భిన్న కోణాలు స్పృశించే అవకాశం అంతగా వుండదు. ప్రతి దానికీ ప్రతిపక్షం లేకపోతే దూకుడు ఎక్కువవుతుంది. అది మరీ ఎక్కువయినప్పుడు బోల్తా పడొచ్చు. కొన్ని సార్లు బోల్తా పడుతున్నా అర్ధం కాకపోవచ్చు.  ఎందుకంటే బయటి వారు ఎంతమంది వున్నా అలారం బెల్స్ మ్రోగించే పార్ట్నర్ లేకపోతే గుడ్డెద్దు చేలో పడినట్లే వుంటుంది వ్యవహారం.  జత ఎద్దులలో ఒక ఎద్దు గుడ్డిదయినా మరొక ఎద్దుకయినా చూపు సరిగ్గా వుంటే వ్యవహారం బ్యాలన్స్ అవుతుంది. 

మా ఇంట్లో మా నాన్నగారు నాస్తికులుగా వుండేవారు, అమ్మ ఆస్తికురాలు. ఇద్దరూ నన్ను చెరో వైపుకి లాగుతూ 'బ్యాలన్స్' చేస్తుండేవారు! రెండూ తగినంతగా చూసాక మా నాన్న వైపే మొగ్గాననుకోండి. మా నాన్నకి మానవత్వం ఎక్కువ వుండేది. అందువల్ల ఉదారంగా కాస్త దానధర్మాలు చేస్తుండేవారు. అలాంటి వాటిని మా అమ్మ నిగ్రహిస్తుండేది. అలా అమ్మ ఆజమాయిషీ లేకపోతే మా కొద్ది ఆస్థీ హారతి కర్పూరం అయివుండేదేమో.

ఇప్పుడు మా ఇంట్లో మా ఇద్దరికీ అంతగా ఫినాన్షియల్ ఇంటలిజెన్స్ లేకపోయినదువల్ల ఆస్థి అంతగా కూడబెట్టలేకపోయాము. ఆ తెలివి కాస్తో కూస్తో తెచ్చుకుంటున్నా కూడా చిన్నచిన్న పొరపాట్లు జరుగుతూనేవున్నాయ్.  ఇద్దరమూ అలాంటి విషయాల్లో దద్దమ్మలము అవడం మూలాన ఇలాంటి ఇబ్బందులు వుంటాయి. నాకు లోకజ్ఞానం అంతో ఇంతో వున్నా అసలు విషయంలో అంతగా లేకపోయేసరికి ఆస్థులు అంతగా పెరగట్లేదు.   నాకు లేకపోయినా మా ఆవిడకు అయినా ఆ తెలివి వుంటే ఆ లోటుపాట్లు సవరించుకునేది. అంటే ఏదో అప్పుల్లో వున్నామనో, ఆర్ధిక ఇబ్బందుల్లో వున్నామనో కాదు గానీ ఇతరులతో పొల్చుకుంటే మాత్రం ఎక్కడో వున్నట్లుగా వుంటుంది. ఎవరితో పోల్చుకోకుండా వుంటే బాగానే వుంటుంది :)  మాకు క్రెడిట్ కార్డ్ బ్యాలన్సులు కూడా లేవండీ.     మరీ ఎక్కువ కాకపోయినా నా నెట్ సంపాదనలో  నెలకి  ఇరవై శాతానికి అటో ఇటో అయినా వెనకేస్తున్నా అనుకోండి.  (దాదాపుగా) ఒక్కడి సంపాదనతో ఒక్కత్తే పెళ్ళాం, ఇద్దరు పిల్లలు, రెండు కార్లూ, రెండు చేపలు గట్రా నిభాయించుకువస్తూ ఎక్కువగా పొదుపు చెయ్యాలంటే అవస్థగానే వుంది సుమండీ. ఇంకా నయ్యం ఇంకా నాకు చిన్నిల్లు లేదు :)) ఆ ఒక్కటి కూడా వుంటే మూలిగే నక్క మీద తాటి పండులా వుండేది. సర్లెండి, జస్ట్ కిడ్డింగ్.

కొన్ని కుటుంబాలలో ఇద్దరి మెంటాలిటీలు ఒక్కటే అవటం మూలాన ఇతర సమస్యలు కనిపిస్తుంటాయి. చదువు, విజ్ఞానంతో అతి జాగ్రతా అబ్బి అవి తమ పిల్లల మీద చూపిస్తుంటారు. అలా దంపతులిద్దరూ తమ పిల్లలని మరీ సుకుమారంగా ప్రతి దానికీ హెచ్చరిస్తూ, ప్రతి దానికీ ఖంగారు పడుతూ పెంచేస్తుంటారు. ప్రతీ సారి ఆర్ యు ఆల్రైట్ అని కనుక్కుంటుంటారు. పిల్లలు తప్పటడులు వెయ్యడం సాధారణం, నడక నేర్చుకోవాలంటే ముందు పడిపోక తప్పదు కదా. వీళ్ళ అతి ఎలా వుంటుందంటే ఎక్కడ పడిపోతాడో అని అవి కూడా వెయ్యనివ్వరు. పిల్లలు పెరుగెత్తొద్దు, ఎగరవద్దు, దుమకవద్దు, ఆడుకోవద్దు. ఏం చెయ్యాలి? పెద్దల్లా బుద్ధిగా ఏ టివినో, వీడియో గేమ్సో ఆడుతూ   గడిపెయ్యాలి. అప్పుడు పిల్లలు ఎంచక్కా స్క్రాచ్ ఫ్రీ గా పెరుగుతారు. 

మా ఆవిడ కూడా మా పిల్లలని అతి సుకుమారంగా పెంచాలని మొదట్లో చూసేది కానీ నేను కుదరనిచ్చేవాడిని కాదు. అలా ఆ విషయం బ్యాలన్స్ అయిపోయేది. మన దేశీ తల్లుల్లాగానే  మా పిల్లలు క్లాసుల్లో ఫస్ట్ రావాలని కాస్త తాపత్రయ పడుతుంటుంది కానీ నేను అది బ్యాలన్స్ చేసేస్తుంటాను. మొదటి శ్రేణి కోసం ప్రోత్సహిస్తుంటాను కానీ మొదటగా వుండాలని పట్టుబట్టను. ఎందులోనయినా, తమకు ఇష్టం వచ్చిన ఒక విషయంలో మాత్రం ప్రతిభలో మొదటగా వుండాలని సూచిస్తుంటాను.  పెద్దమ్మాయికి అనైం ఆర్టులో మంచి ప్రతిభ చూపిస్తుంటుంది. తీరిక వున్నప్పుడల్లా  ఆర్ట్ గీస్తుంటుంది. చిన్నమ్మాయి విశేషమయిన ప్రతిభ ఇంకా ఎందులోనూ చూపించడం లేదు కానీ అందుకు తొందరేమీ లేదు.

ఇక కొన్ని విషయాల్లో నావి విప్లవాత్మక భావాలు, ఆమెవి సాంప్రదాయ భావాలు కాబట్టి ఇంట్లో అవి ఆమె బ్యాలన్స్ చేసేస్తుంది. నావి నాస్తిక భావాలు, ఆమెవి ఆస్తిక భావాలు కాబట్టి మా పెద్ద అమ్మాయి ప్రస్తుతానికి అగ్నోస్టిక్కుగా మిగిలిపోయింది. కొన్ని కుంటుబాలలో దంపతులిద్దరికీ మూఢభక్తి వుండటం గమనిస్తుంటాను. అలాంటప్పుడు వారి పిల్లలకి మరో విధంగా ఆలోచించే అవకాశం అంతగా వుండదు. వారితో పాటు వీరూ అస్థమానం పూజలు, పునస్కారాల్లో మునిగితేలుతుంటారు.  మా ఇంట్లో పరస్పర భావాలు వుంటాయి. అంతే కాకుండా మా పిల్లలకి తమకు నచ్చిన జీవన విధానాన్ని ఎంచుకునే స్వేఛ్ఛ కూడా వయస్సుకి, చట్టానికి తగ్గట్టుగా వుంటుంది.

స్వేఛ్ఛ అంటే ఒకటి గుర్తుకు వచ్చింది. ఈమధ్య మా పెద్దమ్మాయి ఇంట్లో  ఆల్కహాల్ వుందా అని అడిగింది. బీర్ వుంది అని చెప్పాను. నేను వాడవచ్చా అని అడిగింది. నా కళ్ళు బైర్లు కమ్మాయి. ఇదేంటి ఇలా హఠాత్తుగా మందు తాగుతా అంటోంది అని హాశ్చర్యపడిపోయాను.  చట్ట ప్రకారం పిల్లలు అల్కహాల్ సేవించడం ఇక్కడ నేరం అని చెప్పాను. అప్పుడు చెప్పింది - తాగడం కోసం కాదని. అదేదో ముందే చెప్పొచ్చుగా. ఆల్కహాల్, నెయిల్ పెయింట్ కలిపి గోర్ల మీద ఏదో చిన్న ప్రయోగం చెయ్యడానికిట. రక్షించింది.

భార్యాభర్తల మనస్థత్వాల మధ్య మరీ ఎక్కువగా తేడాలున్నా ఇబ్బందే, మరీ ఎక్కువగా కలిసినా కూడా ఇబ్బందే. 60 నుండి 80 శాతం మనస్సులు కలిస్తే మంచిది అనుకుంటా. అంతకంటే ఎక్కువ కలిసినా ఇంట్లోనూ, ఆలోచనల్లోనూ వైవిధ్యానికి ఆస్కారం వుండదు. మరీ ఎక్కువగా తేడాలుంటే వచ్చే ఇబ్బందులు ఏమిటో అందరికీ తెలిసిందే. కొంతమంది తెలివయిన వారు ఇంట్లో బ్యాలన్స్ లేకపోతే మరో చోట అనగా చిన్నిల్లు మరీ పెట్టి బ్యాలన్స్ చేసేస్తుంటారు :) అంటే ఇంట్లో వైవిధ్యం తక్కువయితే అక్కడ వెతుక్కుంటారు. ఇంట్లో ఆ వైవిధ్యమే ఎక్కువయితే అక్కడ తగ్గించి కానీ, తక్కువ వున్న వారిని చూసుకొని గానీ తృప్తిపడుతారు. అంచేత నేను చెప్పేడి ఏంటంటే ఇంట్లో బ్యాలన్స్ మెయింటెయిన్ చెయ్యడం అవసరం అని ;)

2 comments:

  1. So for everybody here is the free advice. If you and your bivi are atheists, please convert one of you. If you both are vegans, please start eating beef (no less). If you both are positive, please convert yourself to negative. That will do the trick.

    ReplyDelete
  2. @agnatha.last 2 lines made me rofl.thanks !

    ReplyDelete