నరిశెట్టి ఇన్నయ్య గారిని, యార్లగడ్డ (LP) గారిని కలిసాను

ఇన్నయ్య గారి గురించి ఎన్నాళ్ళ నుండో వింటూ వున్నా కలవడం మాత్రం ఇదే తొలిసారి. నా చిన్నప్పుడు మా నాన్నగారి నోటవెంట వీరి పేరు తరచుగా వింటూవుండేవాడిని. వీరి ఉపాన్యాసాలకు మా నాన్నగారు వెళుతూవుండేవారు. కొద్దిరోజుల క్రితం వీరి ఆ నాటి గుంటూరు జిల్లా అనే అనువాద పుస్తకం అవిష్కరణ చికాగోలో జరిగింది. అందుకోసం ఆ పుస్తకం యొక్క మూల రచయిత ప్రొఫెసర్ రాబర్ట్ ఎరిక్ ఫ్రికన్‌బర్గ్ కూడా వచ్చారు. మృదువుగా, ఆప్యాయంగా సంభాషించే ఇన్నయ్య గారితో మాట్లాడుతూ మా నాన్న గారి స్మృతులు వారితో కలిసి నెమరువేసుకున్నాను.

ఫ్రికన్‌బర్గ్ గారితో కూడా సంభాషించాను. మాది సూర్యాపేట అని తెలియజేయగానే తాను అక్కడికి వచ్చాననీ తెలుగులో చెప్పి, నల్లగొండ జిల్లాలో ఏఏ ప్రాంతాలు, పట్టణాలు తిరిగారో వివరించుకువచ్చారు. వారి నోటి నోటి వెంట తెలుగు వినడం అబ్బురంగా అనిపించింది. వారు ఊటీలో పుట్టి గుంటూరు జిల్లాలో పెరిగారు. వారి యొక్క తండ్రి క్రైస్తవ మత ప్రచారకులుగా వుండేవారు.

ద్రౌపది నవల రచయితగా సాహిత్య ఆకాడమీ అవార్డ్ గ్రహీత మరియు మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారితో కూడా అదే సందర్బంలో క్లుప్తంగా సంభాషించాను. వారి ద్రౌపది పుస్తకం చదివాననీ, నచ్చిందనీ, నా బ్లాగులో కూడా వ్రాసాననీ చెప్పాను. వెంటనే నా బ్లాగు పేరు అడిగారు. విజిటింగ్ కార్డ్ ఇచ్చాను. వారి విజిటింగ్ కార్డ్ కూడా తీసి ఇచ్చారు. మీరూ ఓ బ్లాగ్ మొదలెట్టొచ్చుగా అని అడిగాను. ఎక్కడండీ, మా (రాజకీయ నాయకుల) సంగతి తెలిసిందేగా. అంత తీరికవుండదండీ అని చిరునవ్వుతో చెప్పారు. 

ఇక ఆ సందర్భానికి పంచ సహస్ర అవధాని మేడసాని మోహన్ గారు కూడా వచ్చారు కానీ వారు ఎందుకో నాకు అంతగా నచ్చలేదు. వారిలో అహమూ, అతిశయమూ కనిపించాయి కాబట్టి వారి జోలికి వెళ్ళలేదు.

ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం ట్రై స్టేట్ తెలుగు సంఘం వారి పిక్నిక్కులో భాగంగా జరిగింది. మా కుటుంబంతో సహా వెళ్ళాను. ఇన్నయ్య గారు వాషింగ్టనులో వుంటారంటే అమ్మలు అచ్చెరువొందింది. అవును ఒబామా వీరి పొరుగువారే అని నవ్వుతూ నేను అంటే ఇన్నయ్య గారు నవ్వారు. వారు ప్రసిద్ధ రచయిత అంటే తనకీ రచయిత్రి కావాలని వుంది అని అంది. ఇన్నయ్య గారు తనని ప్రోత్సహించారు.

చక్కని ఆహ్లాదకరమయిన వాతావరణంలో, ప్రియా రెస్టారెంటు వారి చక్కని తెలుగు భోజనం ఆరగిస్తూ అందరితో కబుర్లు చెప్పుకుంటూ  ఆ కార్యక్రమాన్ని ముగించాము.

3 comments:

  1. "అవును ఒబామా వీరి పొరుగువారే అని నవ్వుతూ నేను అంటే ఇన్నయ్య గారు నవ్వారు. " - ఒబామా పొరుగువారు నరిసెట్టి రాజు (ఇన్నయ్య గారి కుమారుడు). The Washington Post దినపత్రిక Managing editor గా ఉన్నారు. వీరి పత్రిక కార్యాలయాన్ని ఒబామ సందర్శించి (ఎన్నికలముందు) సంపాదకులని కలిశారు.

    షికాగో లో ఉంటూ శ్రీయుతులు ఇన్నయ్య, యార్లగడ్డలను మీరు కలవగలగటం ముదావహం. శ్రీయుతులు జంపాల, జయదేవ్, రామరాజ భూషణుడు యలవర్తి ప్రభృతులు షికాగో లో చక్కటి సాహితీ సేవ చేస్తున్నారు.

    ఆనాటి గుంటూరు జిల్లా ఇ-పుస్తకం ఈ దిగువ లింక్ లో లభ్యమవుతుంది.
    http://deeptidhaara.blogspot.com/2011/03/blog-post_17.html

    ReplyDelete
  2. తెలుగు వారు తెలుగులో స్పష్టంగా మట్లాడితే ఆశ్చర్యపోవాలి కాని, పక్క రాష్ట్రాల వారు మట్లాడితే మాముల్గానే అనుకోవాలి :D:P

    ReplyDelete
  3. @ సిబిరావ్
    పుస్తకాన్ని అక్కడక్కడా చదివాను. ఆసక్తికరంగా అనిపించింది. చరిత్ర ఇష్టం వున్నవారికి ఈ పుస్తకం తప్పకుండా నచ్చుతుంది. మా నాన్న గారు నా చిన్నప్పుడు చెప్పిన నైజాం పోరాటం కబుర్లు గుర్తుకువచ్చాయి. గుంటూరు జిల్ల చరిత్ర నల్లగొండా జిల్లా వాడిని నాకెందుకులే అనుకున్నాను కానీ ఈ పుస్తకం చదవాల్సిందే.

    @ గాయత్రి
    అచ్చ తెలుగు మాట్లాడటం ఈమధ్య ఫ్యాషన్ అయిపోతోంది లెండి. అందువల్ల మళ్ళీ తెలుగుకి మంచి రోజులు వస్తాయిలా వుంది - కనీసం మాట్లాడటం వరకయినా. ఇప్పుడు డాడీ, మమ్మీ అనకుండా అమ్మ, నాన్న అంటేనే ముద్దుగా అనిపిస్తోంది కదా. మా అమ్మలు అప్పుడప్పుడు అలా పిలుస్తుంది. మా మిత్రుల రెండేళ్ళ అబ్బాయి అమ్మా, నాన్న అనే పిలుస్తాడు. ఇహ మమ్మల్నేమో శిశి అమ్మ, శిశి నాన్న అని పిలుస్తాడు. మా అమ్మలు అసలు పేరు శిశిర అందుకే మమ్మల్ని అలా సంబోధిస్తాడు. అది అలవాటు అయ్యి ఇంట్లో అమ్మలు కూడా శిశి నాన్న అని నన్ను అప్పుడప్పుడూ పిలుస్తుంటుంది! అది విని నేనేమో మమ అంటాను. మమ అంటే ఆ రెండేళ్ళ బాబు భాషలో వన్స్ మోర్ అన్నమాట.

    ReplyDelete