తెలుగులో బ్లాగులు వ్రాయండిక - అది చాలా తేలిక...

... అన్న పేరుతో ఒక పుస్తకం వ్రాస్తే ఎలా వుంటుందా అని ఆలోచిస్తున్నా. అమ్ముడు పోతుందంటారా? తెలుగు బ్లాగులు పుట్టినప్పటినుండీ ఎందరో బ్లాగర్ మహానుభావులు తెలుగులో బ్లాగింగ్ ఎలా చెయ్యాలి అనీ, హిట్స్ ఎలా పెంచాలి అనే విషయమై అక్కడక్కడా, అప్పుడప్పుడూ వ్రాస్తూనేవున్నారు. ఈ విషయమై నా వ్రాతలతో పాటుగా ఆయా వ్రాతలనూ సేకరించి వారి అనుమతితో ఆ పుస్తకంలో పొందుపరచవచ్చును. తెలుగులో ఎలా వ్రాయడం లాంటి విషయాలూ ఈతెలుగు సైటు నుండి సేకరించి విపులంగా పొందుపరచవచ్చును. సరే, ఇవన్నీ చెయ్యవచ్చును కానీ అసలు ఆ పుస్తకం కొనేవాళ్ళుంటారా అనేది నా అనుమానం. మీరు ఏమంటారు?

ఆ పుస్తకంలో బ్లాగులు తెలుగులో ఎలా వ్రాయాలి అన్నది నేర్పడంతో బాటుగా బ్లాగులపై, బ్లాగావరణంపై తగు సూచనలు, సలహాలు ఏవో నాకు తోచినవి ఇవ్వదలుచుకున్నాను. అవి వ్రాసినప్పుడల్లా ముందు నా బ్లాగులో టపా వేస్తాను కాబట్టి మీరూ మీకు తోచినవి అందించవచ్చును. మీ సూచనలు బావుంటే పుస్తకంలో అవి కూడా వస్తాయి. బ్లాగు యుద్ధాలు, గొడవల గురించి కూడా నిష్పక్షపాతంగా ప్రస్థావించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చో చెబుతాను. వీలయితే కొద్దిగా బ్లాగు చరిత్ర కూడా ఇచ్చేద్దాం. తెలుగు బ్లాగుల కురువృద్ధుల నుండి కొన్ని వ్యాసాలు అడిగి అందులో వేద్దాం. ఇంకెవరన్నా ఉత్సాహవంతులు ఆ పుస్తకం కోసం వ్రాయదలుచుకున్నా బావుంటే అందులో వేద్దాం. ఇంకా ఆ పుస్తకంలో ఏఏ ఆంశాలు వుంటే సంపూర్ణంగా వుంటుందో మీరూ చెప్పండేం.

ఆ పుస్తకం ఓ సిద్ధాంత వ్యాసంగా వుండి నిరాసక్తత కలిగించకుండా కాస్త సరదాగానే వుండేట్లుగా చూసుకుందాం. అందులో మన బ్లాగావరణ మేరు నగర ధీరుల ఫోటోలూ కొన్ని వేద్దాం. పుస్తకం అంతా అయ్యాక ఈ పుస్తకంగా ముందు పెట్టీ అందరి సూచనలూ, సలహాలూ తీసుకొని సవరిద్దాం. పుస్తకం బ్యాలన్సుడుగా వుండేట్లుగా చూసుకుందాం. ఏమంటారు? ఈ ఆలోచన ఎలా వుందంటారు? అది వ్రాసుకొని మీరూ, నేనూ చదవడం మాత్రమే అవుతుందంటారా?

అంతర్ముఖి పుస్తకం డిటిపి దాదాపుగా అవొచ్చింది. మధ్యలో నేను మరికొన్ని పేజీలు అందించడంతో కాస్త ఆలస్యం అయ్యింది. అది పూర్తి అయ్యాక ఎలా వచ్చిందో ఒకసారి చూసుకొని ఇక ముద్రణకు అంగీకారం తెలుపడమే తరువాయి.

6 comments:

 1. Good idea
  You don't have to print a book.Whoever want to start a blog or improve on their blog have access to a computer and net.
  Compose the book and put it online for download, people are willing to pay for it.
  You can have feedback and interaction easily
  for further improvement.
  my 2 cents

  ReplyDelete
 2. శరత్ గారికి - బ్లాగులు గురించి పుస్తకం వేయాలన్న మీ ఆలోచన బాగుంది. ఏడాది క్రితం అమెరికాలో వున్నప్పుడు రాసిన బ్లాగు గుర్తొచ్చి పంపుతున్నాను.సరదాకు రాసింది కాబట్టి సరదాగా తీసుకోండి.-భండారు

  పాఠకులు కావలెను - భండారు శ్రీనివాసరావు  ఇది జరిగి నలభయ్ ఏళ్ళు కావస్తున్నది.

  ఇప్పుడు నవ్య వారపత్రిక (ఆంధ్రజ్యోతి) లో ఉద్యోగ విజయాలు వారం వారం ఆసక్తికరంగా రాస్తూవస్తున్న రావులపాటి సీతారామారావు గారు, తన ఉద్యోగ జీవితం తొలినాళ్ళలో విజయవాడకు రూరల్ డీఎస్పీ గా వచ్చారు. అప్పుడు నేను ఆంద్ర జ్యోతిలో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నాను. వృత్తిరీత్యా సీనియర్ పోలీసు అధికారి అయినా ప్రవృత్తి రీత్యా రచయిత కావడంవల్ల సాటి రచయితలను కలుసుకోవాలనే ఆసక్తి వుండేది. విజయవాడ రచయితలకూ, ప్రచురణకర్తలకూ పుట్టినిల్లు కావడం మూలాన ఈ చిరు కోరిక తీర్చుకోవడం కష్టమేమీకాలేదు. ఇలా చిన్నా పెద్దా రచయితలను కలుసుకునే చక్రభ్రమణంలో ఒకరోజు మాకు అప్పటికే బాగా చేయి తిరిగిన బోలెడు పెద్ద నవలాకారుడు తారసపడ్డారు. ఉభయకుశలోపరి - పరస్పర పరిచయాలనంతరం సీతారామారావు గారు- ఆంద్ర పత్రిక వారపత్రికలో రాసిన కొన్ని కధలు గురించి నేను ప్రస్తావించాను.

  ‘నేను ఇతరులు రాసిన కధలు చదవనండీ” అని ఆయన కుండబద్దలుకొట్టినట్టు మొహం మీదే అనేశారు. ‘అలా చదవడం వల్ల వారి రచనల ప్రభావంతో మనం రాసేవాటిలో క్వాలిటీ తగ్గిపోయే ప్రమాదం వుంది’ అని ఒక ధర్మ సూక్ష్మం కూడా బోధించారు.

  ఇది జ్ఞాపకం రావడానికి ఒక నేపధ్యం వుంది. చదివేవాళ్ళు బొత్తిగా తగ్గిపోతున్నారని ఒక సంపాదక మిత్రుడు ఈ మధ్య మాటల సందర్భంలో అన్నారు. ఆయన ఆందోళన చెందడానికి వేరే కారణాలు వుండవచ్చు. ఇంతమంది ఇలా రెండు చేతుల్తో పుంఖానుపుంఖాలుగా రాసేస్తూ వాటిని ప్రచురణార్ధం పంపించేస్తూ (ఈరోజుల్లో పోస్ట్ ఖర్చుల బెడద కూడా లేదు – నెట్లో రాసేసి క్లిక్ చేస్తే చాలు - బంతి ఎడిటర్ కోర్టులో పడేసి చేతులు దులిపేసుకోవచ్చు) మా ప్రాణాలు తోడే బదులు వీరిలో కొంతమందయినా చదివే సద్బుద్ధిని అలవరచుకుంటే తమ పత్రిక సర్క్యులేషన్ పెరగకపోతుందా అన్నది ఆయన బాధలోని మరోకోణం కావచ్చు.

  ‘ఇలా రాసేసి అలా పంపేసి నా కధ వచ్చేవారం వీక్లీలో అచ్చేస్తారా’ అని వేధించుకు తినేవాళ్ళతోనే కాలం చెల్లిపోతోంది. ఇక మంచి కధల ఎంపికకు సమయం ఎక్కడ?’ అని కూడా సంపాదక మిత్రుడు బాధపడ్డాడు. నిజమే ఎవరి ఇబ్బందులు వారివి. పీత కష్టాలు పీతవి.

  ఒక వర్ధమాన రచయిత అభిప్రాయం వేరేలావుంది. “ఎన్నాళ్ళు ఇలా చదువుతూ గడుపుతాం గురూగారూ! ఆ మాత్రం మనం రాయలేమా అని ఓ మంచిరోజు చూసి కలం పట్టేసాను” అన్నాడతగాడు.

  “మనం రాసింది మనం చదువుకోవడానికే ఎక్కడి సమయం సరిపోవడం లేదు, ఇక వేరేవారి రచనలు చదివే వ్యవధి ఎక్కడుంది మాస్టారూ!” అని ఓ ముక్తాయింపు కూడా ఇచ్చాడు. ఏ పత్రికలో రాస్తుంటాడని మరీ హైరాన పడకండి. స్వయంగా రాసినవాటిని సొంతంగా చదువుకోవడానికి స్వయానా ఒక బ్లాగు పెట్టుకున్నాడు. రాసినవారికి రాసినంత – చదివేవారికి చదివినంత.

  ఓ పాతికేళ్ళ క్రితం రేడియోలో తాత్కాలిక ప్రాతిపదికపై వార్తలు చదివేవారిని సెలక్ట్ చేయడానికి ఇంటర్వ్యూ లు జరిగాయి. ఇసక వేస్తె రాలనంతగా అభ్యర్ధులు హాజరయ్యారు. వారిలో చాలామంది ‘లక్ష వొత్తుల నోము’ నోచుకోవాల్సినవారే వున్నారు. వొత్తులు పలకవు. ‘వార్తలు చదవాలనే ఉద్దేశ్యం ఎందుకు కలిగిందని ఒక అమ్మాయిని అడిగితే ‘ రోజూ రేడియోలో వార్తలు వింటున్నాను, ఆ మాత్రం నువ్వూ చదవగలవులే చిన్నా అని మా నాన్న పట్టుబట్టి పంపించాడు’ అన్నది ఆ చిన్నది. ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక తప్పదు కదా.

  దీనికి కొసమెరుపుగా ఆ రోజు న్యాయనిర్ణేతగా వచ్చిన ఒక పెద్దమనిషి – ఆ అమ్మడు చదివిన ‘న్యూస్ బులెటిన్ ను భద్రపరచమని’ చెప్పాడు. ‘అంత బాగా చదివిందా’ అని అడిగితే – ‘కాదు. బులెటిన్ ఎలా చదవకూడదో భవిష్యత్ తరాల న్యూస్ రీడర్లకు తెలియచెప్పడానికి పనికివస్తుంద’ని ఆయనగారు వాకృచ్చారు.
  (25-08-2010)

  ReplyDelete
 3. manchi aalochana kaani book baaga ammudupotundani nenu anukovadam ledu . blog unna vaaru chadavaru, leni vaaru book koni chaduvutaarane nammakam ledu takkuva copylato oka prayogam chesi chuste tappemi ledu

  ReplyDelete
 4. @ అజ్ఞాత
  బ్లాగులు ఎలా వ్రాయాలి అనే విషయమై నెట్టులో ఎలాగూ కొన్ని వ్యాసాలు వున్నాయి. నెట్టులో చదివేవారు అవి చదువుతారు కానీ నాలాంటి వారికి పుస్తక రూపేణా చదవడమే నచ్చుతుంది. అలాంటివారికోసం ఇలాంటి పుస్తకం ఉపయోగపడవచ్చు.

  @ భండారు శ్రీనివాసరావు
  నా బ్లాగులో మీ కామెంట్ తొలిసారి అనుకుంటాను. ఆహ్వానం.

  మీ పోస్టులోని విషయాలు నిజమే :) చాలామంది పుస్తకాలు అచ్చేయిస్తున్నవాళ్ళు చివరికి వారి పుస్తకం వారు చదువుకోవడమే అయిపోతుందనుకుంటా. కథలు, కవితల పుస్తకాలు ఎన్నో కనపడుతుంటాయి. ఇవన్నీ ఎవరు చదువుతారబ్బా అనిపిస్తుంది.

  @ బుద్ధా మురళి
  అవునండీ - ప్రయోగమే చెయ్యాలి.

  మీరు మీ ఈమెయిల్ ఐడి ఇవ్వడం కానీ లేకపోతే నాకు ఈమెయిల్ ఇవ్వడం కానీ చెయ్యగలరు. పుస్తకాలకి సంబంధించిన విషయాలలో మీ సలహాలు కావాలి.
  నా ఈమెయిల్ ఐడి:sarathn at hotmail dot com

  ReplyDelete
 5. అంతర్జాలంలొ తెలుగు వాడుక పెరగాలంటే ఇలాంటి పుస్తకాలు అవసరమే. నేను బ్లాగులు చదువుతున్నాను భవిష్యత్తులో వ్రాయవచ్చు. కాని తెలుగులొ మార్గదర్శకాలు అందుబాటులో లేవు. మీ ద్వార తీరవచ్చు. మీరు ముందుకు వెళ్లండి. ఇటువంటి మంచి పుస్తకాలు గ్రంధాలయాలకు అమ్ముకోవచ్చు నష్టం లేకుండ. వెయ్యి మంది చదివితే పది మంది బ్లాగులు చదవడం మొదలు పెట్టొచ్చు. ఇద్దరు ఇతరులతో చర్చించవచ్చు. కనీసం ఒక్కరు రాయొచ్చు. ఐనా ఫలితం దక్కినట్లే. పుస్తకాల ద్వారా డబ్బు సంపాదించే ఉద్దేశ్యం ఉంటే మీరు తెలుగులో రాయటం నష్టదాయకం కావచ్చు కూడ. రాయదలిస్తే సాంకేతిక నిపుణులు కాని వారిని ద్రుష్టిలొ పెట్టుకుని రాయండి.

  ReplyDelete
 6. @ అజ్ఞాత
  మీరు గ్రంధాలయాలు అంటే ఎప్పుడూ మరచిపోతున్న విషయం గుర్తుకువచ్చింది. మా దగ్గరి బంధువు సీనియర్ లైబ్రేరియన్. పుస్తకాల కొనుగోళ్ళలో కూడా పాత్ర వహిస్తారనుకుంటా. వారితో రేపే మాట్లాడి వివరాలు కనుక్కొని నా పుస్తకాలు గ్రంధాలయాలకు అమ్మించే బాధ్యత వారి నెత్తిమీద వెయ్యాలి. పుస్తకాల ద్వారా డబ్బు రాకపోయినా కనీసం నేను గబ్బుపట్టి పోకుంటే చాలు. అనగా కనీసం లాస్ కాకూడదనేది నా అభిమతం. మీరు చెప్పినట్లుగానే సరళమయిన భాషలోనే పుస్తకం అందిస్తాను.

  ReplyDelete