వ్యాఖ్యానందం

(తెలుగులో బ్లాగింగ్ పుస్తకం కోసం)

మొత్తమ్మీద మీరు ఓ బ్లాగు ప్రారంభించారు. ఓ టపా వ్రాసేసారు. ఇప్పుడు మీ ఆదుర్దా మీ బ్లాగుకి వచ్చే హిట్స్ మీదానూ, వ్యాఖ్యల మీదనూ వుంటుండొచ్చు. హిట్స్ గురించి ఇదివరకే ప్రస్థావన వచ్చింది కాబట్టి ఇప్పుడు వ్యాఖ్యల గురించి చూద్దాం. మీరేదో శానా గొప్పగా వ్రాసేసినంత మాత్రాన మీకు ఇబ్బడిముబ్బడిగా వ్యాఖ్యలు వస్తాయనుకుంటే అది భ్రమ. ఎలాగయితే చాలా చక్కని చిత్రం తీసిన దర్శకుడు తన చిత్రం ఎందుకు హిట్టవలేదా    అని తల పట్టుకు కూర్చున్నట్టువంటి పరిస్థితి రావచ్చు. అంచేతా మంచి టపాకీ, బోలెడన్ని వ్యాఖ్యలకీ ఎప్పుడూ సంబంధం వుంటుందని అనుకోవద్దు.

మీరు కొన్ని బ్లాగుల్లోనయినా కామెంట్లు వేసివుంటే కామెంట్లు వెయ్యడం మరీ అంత సులభం కాదని మీకు అర్ధమయ్యివుండాలి. వ్యాఖ్య వెయ్యడానికి మీకు ముందుగా ఓపికా, తీరికా, మూడ్ వుండాలి. అవన్నీ కుదిరి మీరు కామెంటు చేద్దామంటే అపై ఎన్నో సాంకేతిక సమస్యలు రావచ్చు. ఒక్క కామెంటు వెయ్యడానికి ఎన్నో పేజీలు దాటుకుంటూ వెళ్ళాల్సి రావచ్చు. కొందరు కామెంట్లకి వర్డ్ వెరిఫికేషన్ పెడతారు. అంటే ఆ కామెంట్ పబ్లిష్ చెయ్యాలంటే అక్కడ వున్న కొన్ని పదాలను టైప్ చెయ్యాల్సి వుంటుంది. ఆ అక్షరాలు ఎవరికీ అర్ధం కాని రీతిలో కలగలిపి మన ఫ్యామిలీ డాక్టర్ గారి వ్రాతలా వుంటాయి. అవి అర్ధం చేసుకొని టైప్ చేసీ, సరిగ్గా వుంటే  అప్పుడు ఒక్కోసారి పబ్లిష్ చేసేముందు మన కామెంటు మనం చూసుకొనే అవకాశం వుంటుంది.   అన్నీ సవ్యంగా జరిగితేనే ఇన్ని కష్టాలు పడాలి. ఇబ్బంది వుంటే ఇంకొన్ని పేజీలు వస్తాయి. అలా కొన్ని కామెంట్లు వెయ్యలేక కొన్ని సార్లు నేను అలా మధ్యలో వదిలేస్తుంటాను.  అందుచేత మీ బ్లాగులో కామెంట్లు వేసేవారికి కొన్ని ఇబ్బందులు అయినా తగ్గించేందుకై మీ బ్లాగ్  సెట్టింగ్స్ లోకి వెళ్ళి కామెంటు సెక్షనులో వున్న వర్డ్ వెరిఫికేషన్ సెట్టింగ్ ఆఫ్ చెయ్యండి.

అలా ఇన్ని కష్టాలేం పడతాములే బాసూ అని కొందరు కామెంట్లు వెయ్యరనుకుంటా. కామెంట్లు వెయ్యాలంటే ముందు మీ బ్లాగు అందరూ చదవాలి కదా. అందుకై మీ బ్లాగు ముందు కళ్ళకు ఇంపుగా వుండాలి. బ్లాగు ఎలా వుంటే బావుంటుందో మరో భాగంలో వ్రాస్తాను. మీరు వ్రాసేది కొంతమందికయినా నచ్చాలి. అలా నచ్చిన వారు కామెంట్లు వేసే అవకాశం వుంటుంది. అందరికీ నచ్చే లేదా చాలామంది ఐడెంటిఫై చేసుకునే ఆంశలు వ్రాస్తే కామెంట్లు ఎక్కువ పడతాయి. వివాదాస్పద ఆంశాలు వ్రాసినా కామెంట్లు ఎక్కువగా రావచ్చు కానీ అందులో మిమ్మల్ని  తిట్టెవే ఎక్కువ రావచ్చు లేదా వ్యాఖ్యాతలు ఒకరునొకరు తిట్టుకుంటున్నవి అవచ్చు. మంచిగా వ్రాసినంత   మాత్రాన ఎక్కువగా కామెంట్లు వస్తాయని చెప్పలేము   కాబట్టి మీరు మీ బ్లాగు ఎక్కువ హిట్స్ కోసం వ్రాస్తున్నారా, ఎక్కువ కామెంట్ల కోసం వ్రాస్తున్నారా లేక మీ సంతృప్తి కోసం వ్రాస్తున్నారా అనే తేల్చుకుంటే అందుకు తగ్గట్టుగా మీరు వ్రాయవచ్చు.

మీ ఆత్మ సంతృప్తి కోసం బ్లాగు వ్రాసుకుంటున్నప్పుడు మీ బ్లాగుని ఎంతమంది చూసారు, ఎంతమంది కామెంట్లు వేసారు పట్టించుకోనక్కరలేదు. కామెంట్ల కోసం వ్రాస్తున్నట్టయితే దానికి కొన్ని కళలుండాలి. మీలో చక్కగా వ్రాసే కళతో పాటుగా ఇంకో ఉప కళలు వుండాలి. మీ అంతట మీరు మీ బ్లాగు వ్రాసుకుంటూ  పోతే ఇతరులు కూడా మిమ్మల్ని పట్టించుకోవడం తక్కువవుతుంది కాబట్టి మీరు కూడా ఇతరుల బ్లాగుకి వెళ్ళి హలో చెప్పిరావాలి. అప్పుడు వాళ్ళు కూడా మీ బ్లాగుకి వచ్చి హాయ్ చెబుతారు. చర్చలు, వివాదాల్లో మీరు చురుగ్గా పాల్గొంటుంటే  మీ పేరు, బ్లాగు అందరికీ సుపరిచితం అయిపొతుంది. అప్పుడప్పుడు మీకు నచ్చిన బ్లాగుకి వెళ్ళి గోకాలి. అప్పుడు వాళ్ళు వచ్చి మీ బ్లాగు  గోకుతారు. అలా రెండు బ్లాగులకూ ఆనందం లభిస్తుంది. అలా అలా కామెంట్లు రాలాలంటే ఎన్నో చిట్కాలు వున్నాయి. ఇతర బ్లాగులని పరిశీలిస్తుంటే అవన్నీ మీకు అర్ధమయిపోతుంటాయి.

కామెంట్లు ఎక్కువ రావాలంటే బ్లాగు గ్రూపుల్లో వుండాలి. మీరే ఓ గ్రూపు మెయింటెయిన్ చేస్తే మరీ మంచిది. చచ్చినట్టు మీ అనుచరగణం మీరు టపాలు వ్రాసినప్పుడల్లా మీ బ్లాగులో వ్యాఖ్యలు వ్రాసి భక్తిప్రపత్తులు చాటుకుంటారు. ఇక్కడ ఒక గ్రూపు వారు మరో గ్రూపులో కామెంట్లు వెయ్యరు. ఒహవేళ పొరపాటుగా వేసాడో చచ్చాడన్నమాటే. అందుచేత ఒకవేళ మరీ మరో గ్రూపు బ్లాగులో కామెంట్లు వెయ్యాలనుకున్నా అజ్ఞాతంగా వేస్తారు. పొరపాటున విశాల భావాలతో మతి  చలించి గ్రూపుదేముంది, వ్రాత ముఖ్యం కనీ అనేసుకొని టపా బావుంటే కామెంటు వ్రాసేద్దామని కొందరు అనుకున్నా పక్కనున్న వాళ్ళు వాడి బ్లాగులో నువ్వు కామెంటు చెయ్యడం ఏంటన్నా అని కంగాళీ చేస్తారు. దాంతో మీ విశాల భావాలు మీరు కొండెక్కిస్తారు.

మనం ఎంత ఎక్కువ హిట్స్ కోసం, కామెంట్ల కోసం ఆరాట పడితే అప్పుడు మన వ్రాతల్లో కూడా రాజీ పడాల్సిన అవసరం రావచ్చు. ఏం వ్రాస్తే ఎవరి మనస్సుకి నొప్పి కలుగుతుందో, ఇటు వైపు రాకుండా వుంటారేమో, వ్యాఖ్యలు వెయ్యరేమో అని కంగారు పడాల్సి వుంటుంది. అలా కాకుండా చూసేవారు చూస్తారు, నేను వ్రాసే విధంగా వ్రాస్తాను అనుకున్నప్పుడు మీలో సంతృప్తి పెరుగుతుంది. అలా అని మరీ కొద్దిమంది చదివినా, మరీ కొద్ది కామెంట్లే వచ్చినా మనకు రాయాలన్న ఆసక్తి రాకపోవచ్చు. మీరు సమర్ధవంతంగా వ్రాస్తూ వైవిధ్యమయిన ఆంశాలు ఎన్నుకుంటున్నప్పుడు మీ గుర్తింపు మీకే వస్తుంది.

అయితే మీరు ఎంత బాగా వ్రాసినా, మీ బ్లాగు ఎంత బాగున్నా కొన్ని టపాలు వ్రాయగానే వ్యాఖ్యలు వెల్లువలా రావు. మీరు తరచుగా వ్రాస్తుంటేనే మీ బ్లాగు అందరి దృష్టిలోకి వస్తుంది. చదువరులు నెమ్మదిగా మీ బ్లాగుకి అలవాటు పడి వ్యాఖ్యానించడం ప్రారంభిస్తుంటారు. అందుచేత బ్లాగుల్లో రాణించాలంటే మీకు కాస్తయినా ఓపిక వుండాలి. రెండు మూడు టపాలు వేసి ఎవరూ స్పందించడం లేదనుకొని నిరాశపడి బ్లాగుని మూసుకొని కూర్చోకూడదు.

5 comments:

 1. బ్లాగు రాసే విధానం గురించిన క్లాసులు బాగున్నాయి మాష్టారు, తెలుగులో ఇంత వివరంగా ఉండటం, అందరికి ఉపయోగమే మరి..

  ReplyDelete
 2. @ గాయత్రి
  ఈ సిరీస్ మీకు నచ్చుతున్నందుకు సంతోషం. ప్రతి ఒక్క ఆంశం గురించి ఇంకా వివరంగా వ్రాయాలని అనిపిస్తుంది కానీ పలు కారణాల వల్ల మరీ ఎక్కువగా వ్రాయలేకపోతున్నాను.

  ReplyDelete
 3. చింతకాయJuly 25, 2011 at 4:02 PM

  మనిషి ఎలాంటి వాడైతే వాడి బ్లాగు కూడా అలాంటిదే అవుతుంది లెండి.. వాడికొచ్చే కామెంట్లు వాడి రెస్పాన్సులూ... కొన్ని రోజుల్లో వాడెలాంటి వాడో తెలుస్తుంది..

  ReplyDelete
 4. sarath garu ,blog gurinchi baga rastunnaru...

  ReplyDelete
 5. @ చింతకాయ
  కొన్ని సార్లు లేదా కొందరిలో బయటి వ్యక్తిత్వానికీ బ్లాగు వ్యక్తిత్వానికీ తేడా వుంటుందండీ.

  @ సాయి
  ఈ సిరీస్ మీకు నచ్చుతున్నందుకు సంతోషం.

  ReplyDelete