కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ పనిచేస్తున్నట్లుగానే వుంది

మా ఆవిడకి ఏవేవో కీళ్ళ నొప్పులతో బాధపడుతుంటే ఎన్నో ప్రయత్నాలు చేసి ఓ రెండు నెలల క్రింద కైరోప్రాక్టిక్ (వెన్నుపూస నిపుణులు) చికిత్స లో చేర్పించాను. ఇదివరకులా నొప్పి నివారణ ఔషధాలు మింగడం, జాండూబాం లాంటివి పూసుకోవడం ఈమధ్య చెయ్యడం లేదు. నొప్పులు చాలావరకు తగ్గాయి. ఇదివరకు బాధా తీవ్రతతో పోలిస్తే ఇప్పుడు పది శాతం మాత్రమే ఆ నొప్పులు వున్నాయని చెప్పవచ్చు. ఇంకా ఒక నెల చికిత్స వుంది.

కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ ఏమయినా క్వాక్ ట్రీట్మెంటో లేక కల్ట్ ట్రీట్మెంటో అని ముందు సందేహించాను. కొన్ని అరుదయిన రిస్కులు వున్నా సిద్ధపడి చేర్పించాను. ఒక నెల తరువాత చూస్తే పెద్దగా ఫలితం కనపడలేదు. ఫలితాలు కనపడటం లేదని ఆ డాక్టరుని వివరంగా సంప్రదించాము. ఇంకా ఫలితాలు కనపడనందుకు అంతను కూడా కాస్త విస్మయం వ్యక్తపరిచాడు. మీ ఆవిడ చాలా సున్నితం బాబూ అందుకే చాలా సున్నితంగా చికిత్స చెయ్యాల్సివస్తోంది - అందుకే ఫలితాలు ఆలస్యమవుతున్నట్టున్నాయి అని వాపోయాడు. మా ఆవిడ సున్నితత్వం గురించి ఇదివరకు కూడా వాపోయాడు లెండి.

అయితే ఈమధ్య కొన్ని వారాలుగా మాత్రం తను తక్కువగా, తక్కువ సందర్భాల్లో నొప్పితో బాధపడటం గమనించాను. మా ఆవిడ కూడా గుణం కనిపిస్తోందని చెప్పింది. చికిత్స మొదట్లో ఎక్స్‌రేలు తీసి తన వెన్నుపూసలో ఎక్కడెక్కడ ఏ సమస్యలున్నాయో సవివరంగా చూపించారు. మూడు నెలల కోర్సు అయిపోయాక మళ్ళీ ఎక్స్‌రేలు తీసి అవి ఎంతవరకు సర్దుకున్నాయో చూపిస్తారు.

ఇహపోతే ఈ చికిత్సకు తోడుగా ఆర్థిరైటిస్ కోసం గానూ కొన్ని డైటరీ సప్లిమెంట్స్ వాడుతుండమని మా కుటుంబ వైద్యుడూ, నేనూ పదేపదే చెప్పాము కానీ ఆ చెవిన విని ఈ చెవిన వదిలేసింది. మా అమ్మలుతో కలిసి రోజూ ఆమె ముక్కు మూసి, నోట్లో నీళ్ళు పోసి అందులో మందుగుండు సామాగ్రి (అనగా టాబ్లెట్లు) వేసి మూతిమూస్తే ఎలా వుంటుందా అని ఆలోచిస్తున్నాను. ఇవాళ ఇంటికి వెళ్ళాక అమ్మలుతో ఈ కుట్ర గురించి చర్చించాలి. అంత బలవంతంగా ఎందుకులే ఆమె బాధేదో ఆమె పడుతుంది కదా అని ఊరుకోలేమండీ బాబూ. ఈ నొప్పులతో వాళ్ళ మూడు ఖరాబు అయి మన బుర్రల్ని తినేస్తుంటారు.

5 comments:

 1. @ అజ్ఞాత
  నాది కంపార్ట్మెంటల్ థింకింగ్. దేని దారి దానిదే. నా వ్యూహాలు బహుముఖాలుగా వుంటాయి. ఏది పనిచేస్తుందో ఎవరికి తెలుసు? అందుకే ఫలితం సాధించేదాకా అన్ని విధాలా ప్రయత్నిస్తూనేవుంటాను. ఉదాహరణకు మా ఆవిడ నొప్పులే తీసుకోండి. తన విపరీతమయిన బాధలతో మనస్సు ప్రశాంతంగా వుండక ఇంట్లో ఇతరులనీ ప్రశాంతగా వుండనివ్వదు. ఆ నొప్పులే తగ్గితే? ఇంట్లో మనశ్శాంతి పెరొగొచ్చు. అందువల్ల మరిన్ని సమస్యలు దూరం కావచ్చు. అలా అలా మనస్సులు కలిసిపోవచ్చు.

  మీరు అన్న విషయానికే వస్తే విషయానికి వస్తే ఆ ఆలోచన (ప్రస్థుతానికయినా) అటకెక్కించాను. మా మధ్య ఒక చక్కటి డీల్ కుదిరింది. ఎందుకో ఒక టపాగా - త్వరలోనే.

  ReplyDelete
 2. I know sarath. you are a very good father and a good husband too. And i suspect that you belive "Marriage is not for only physical relationship".
  Am i correct? :)

  ReplyDelete
 3. @ అజ్ఞాత
  పైన చెప్పడం మరిచాను. క్యారట్ అండ్ స్టిక్ అప్రోచ్ నాది.

  వైవాహిక జీవితంలో ఒక్క శారీరక సంబంధం లేకపోయినా ఫర్వాలేదేమో కానీ అసలే సంబంధమూ లేకపోతే? అందుకు కారణాలు ఏమయినప్పటికీ అక్కడే వస్తుంది చిక్కు. మనుషుల మధ్యా, మనస్సుల మధ్యా ప్రేమా, ఆప్యాయతా వున్నప్పుడు ఫిజికల్ రెలేషను అంతగా లేకపోయినా అంతగా ఇబ్బంది వుండకపోవచ్చు.

  ReplyDelete
 4. @అంత బలవంతంగా ఎందుకులే ఆమె బాధేదో ఆమె పడుతుంది కదా అని ఊరుకోలేమండీ బాబూ. ఈ నొప్పులతో వాళ్ళ మూడు ఖరాబు అయి మన బుర్రల్ని తినేస్తుంటారు....
  కరక్టే కదండీ...నెనెలా చస్తే నీకెందుకూ అంటారే గానీ...చివరాకరికి మనకేకదా ఎఫెక్ట్ అంతా..

  ReplyDelete