ముచ్చటగా నా మూడో డ్రైవింగ్ టెస్ట్ జరిగిన విధంబెట్టిదన...

అప్పటికి కెనడాలో రెండు సార్లు డ్రైవింగ్ పరీక్షలో విఫలం చెందాను. అలాంటి పరీక్షలు చేసే ప్రభుత్వ పరీక్షకులు అలా ఎందుకు ఓటమి చెందిస్తారనడానికి పలు కుట్ర కారణాలు వినపడుతుండేవి. రెండుసార్లు ఓటమి చెందినా వెరవక ముచ్చటగా మూడోసారి ఆ పరీక్షకి వెళ్ళాను. ఆ రోజున వచ్చిన ఎగ్జామినర్ నల్లతను. ఇంకేం నీ పండగ పండినట్టేపో అని చెప్పాడు నా శిక్షకుడు. ఆ నల్ల పరీక్షకుడు సులభంగా పాస్ చేయిస్తాడంట. అది విని నేను మహా ఆనందంగా పరీక్షకు వెళ్ళి కారులో డ్రైవర్ సీటులో కూర్చున్నాను.
 
ఎగ్జామినర్ వచ్చి కూర్చొని పద అన్నాడు. నేను ఉత్సాహంగా కారు పెడల్ నొక్కాను. కారు కదల్లేదు. మరింత ఉత్సాహంగా పెడల్ గాఠ్ఠిగా నొక్కాను.  అయినా కదల్దే! ప్రశ్నార్ధకంగా పరీక్షకుని వైపు చూసాను. అతను గుర్రుగా నావైపు చూస్తున్నాడు. ఏదో భయంకరమయిన పొరపాటు చేస్తున్నానని అర్ధమయ్యి ఒహవేళ పెడలుకు బదులుగా బ్రేక్ ఏమయినా నొక్కుతున్నానా అని కంగారుగా చూసాను. అదేమీలేదు. ఇహ నావల్ల కాదురా అన్నట్టుగా అతగాడివైపు చూసాను. అతను నిస్పృహ చెంది గుర్రుగా చూస్తూ "కారు స్టార్ట్ చెయ్యి" అని వీలయినంత కూల్గా చెప్పాడు. అప్పుడు నాలుక్కరచుకొని కారు స్టార్ట్ చేసాను. 
 
ఆ మాత్రం తెలియదా అని మీరనవచ్చు. ఒట్టు, అది నాకు తెలియదు. మన దేశీ కారు ట్రైనర్ అది మాత్రం నేర్పించలేదు. ఎప్పుడయినా సరే స్టార్ట్ చేసివున్న కారు నాకు ఇచ్చేవాడు. అంతకుముందు రెండు సార్లు పరీక్ష కూడా స్టార్ట్ చేసి వున్న కారుతోనే ఇచ్చాను. ఈసారి మాత్రం అంతకుముందు పరీక్షకి వెళ్ళిన మానవుడు పరీక్ష అయిన తరువాత కారును అలాగే వదలెయ్యకుండా ఆఫ్ చేసి దిగినట్లున్నాడు - దుర్మార్గుడు - ఎగ్జామినర్ ముందు నా పరువులు తీసేడు.   
 
సరే అయ్యిందేదో అయ్యిందని ఇహ జాగ్రత్తగా కారు డ్రైవ్ చెయ్యాలని నా బోధకుడు చెప్పిన అన్ని విషయాలు గుర్తుకు తెచ్చుకుని గేర్ మార్చాలి కదా అని గేర్ మార్చబోతే ఆ గేర్ రాడ్ కదల్దే! మళ్ళీ గట్ఠిగా ప్రయత్నించాను. ఊహు. అలా లాభం లేదని రెండు కాళ్ళూ కారుకి తన్ని పెట్టి గేర్ రాడును పట్టుకు వేళ్ళాడా కానీ ఊహు లాభం లేక పోయింది. ఎదవ నవ్వు నవ్వుతూ నా ఎగ్జామినర్ వైపు సిగ్గుతో చూసాను. అతను గుర్రుగా చూస్తూనేవున్నాడు. నేను హిహి అని ఇకిలించాను - ఇంకేం చెయ్యాలో తెలీక.  అతను నెత్తికొట్టుకొని గేర్ వేసేముందు బ్రేక్ నొక్కిపట్టి వుంచాలని, అలా చేస్తేనే గేర్ రాడ్ కదులుతుందనీ, అదో రక్షణ విధానమనీ వివరించుకొచ్చేడు.  నేను నాలిక్కరచుకున్నాను. ఆ తరువాత ఎగ్జాం బాగానే జరిగింది. చక్కగా చేస్తున్నావు అని చెప్పి ఎంచక్కా నన్ను ఫెయిల్ చేసాడు ఆ బ్లాక్ ఎగ్జామినర్.   
 
నా దేశీ బోధకుని దగ్గరికి వచ్చి కారు ఎలా స్టార్ట్ చెయ్యాలో కూడా నేర్పించేది లేదా అని ధుమధుమలాడాను. అతను ఏదో సమర్ధించుకోబోయాడు కానీ కారులో వున్న నా తోటి కారు విద్యార్ధులు కూడా అతని పొరపాటుని విమర్శిస్తూ నాకు వత్తాసు పలకడంతో ఆగిపోయాడు.  ఇందులో మీరు నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే కారు నేర్చుకునేటప్పుడు కారు స్టార్ట్ చెయ్యడం కూడా నేర్చుకోవాలి. అలాగే అందులోని రక్షణ పద్ధతులు కూడా నేర్చుకోవాలి. గుడ్డెద్దు చేలో పడినట్లు మన దేశీ బోధకులను పెట్టుకొని నేర్చుకుంటే నాకు వచ్చిన అనుభవాల్లంటివే మీకు ఎదురు కావచ్చు. తక్కువ ధరకు బోధన అయిపోతుందని దేశీవారిని ట్రైనరుగా తెచ్చుకుంటాము గానీ వారు కారు నడపడం గురించి చెబుతారు కానీ సేఫ్టీ గురించి దాదాపుగా చెప్పరు. అలాంటప్పుడు మనం వేరే విధాలుగా కారు డ్రవింగులో రక్షణ గురించి తెలుసుకోవాల్సివుంటుంది. డెఫెన్సివ్ డ్రైవింగ్ మొదలయిన టెక్నిక్కులు మనం డ్రైవింగ్ స్కూలుకి వెళితే కానీ సాధారణంగా తెలియవు.          

6 comments:

 1. హహహ్హ... వెనకటికెవరో గుఱ్ఱపు స్వారీ నేర్పారట కానీ... గుఱ్ఱం దిగటం నేర్పలేదట.. వెనక్కి, వెనక్కి జరుగుతూ వెళ్ళి దిగితే తన్నుకు ఎగిరి పడ్డాడట..

  చిన్నప్పుడు సైకిల్ ఎంత దూరమైనా తొక్కేవాన్ని కాని.. ఆపేటపుడు గారంటీ గా పడేవాన్ని... కొన్ని రోజులకి .. సైకిల్ మాత్రమే పడేయటం అల వాటు చేస్కున్నా...
  ainaa ఎన్నోసారికి లైసెన్స్ వచ్చింది గురువు గారు...

  ReplyDelete
 2. @ కాయ
  మీ సైకిలు అనుభవం చెబుతుంటే నాకు ఓ సంఘటణ గుర్తుకువస్తోంది. 8వ తరగతో, 9వ తరగతో గుర్తుకులేదు కానీ భువనగిరిలో సైకిలు నేర్చుకుంటున్న రోజులవి. మా క్లాసులోని ఒక అందమయిన అమ్మాయి అరుణ ఒకరోజు ఆమె ఇంటిముందు వుంటే స్టైలుగా ఆమె ముందు సైకిలు నడపబోయి ఆమె చూస్తుండగానే బొక్కబోర్లాపడ్డాను :(

  మా క్లాస్మెంట్ అరుణ ఎర్రగా, బక్కగా ఎంతో బావుండేది. ఆమె అంటే నాకు బాగా ఇష్టంగా వుండేది. ఎందుకోగానీ ఆమె అంతగా నాకు క్లోజ్ అయ్యింది కాదు. స్కూల్ రోజుల మధురస్మృతులని గుర్తుకుతెచ్చారు :)

  నాకు లైసెన్స్ ఎప్పటికి వచ్చిందని ఎందుకు అడుగుతావులే బాబూ.

  ReplyDelete
 3. నిజమే, సైకిల్ గానీ బైక్ గానీ డ్రైవింగ్ చేస్తుంటే పడిపోయే పరిస్థితి వస్తే దాన్ని వదిలేసి సేఫ్ గా ల్యాండ్ అవాలి మనం, లేకపోతే వాటికన్నా మనకు ఎక్కువ దెబ్బలు తగులుతాయి.

  ReplyDelete
 4. Sharat, are yoou allowed to hire a car with your lerner's permit? If yes, please practice on your own before your next driving test.

  ReplyDelete
 5. అందుకే నేను ముందు జాగ్రత్తగా తెల్లోడి దగ్గర నేర్చుకున్నా.

  @"నాకు లైసెన్స్ ఎప్పటికి వచ్చిందని ఎందుకు అడుగుతావులే బాబూ."

  అంటే ఇంకా రాలేదా!

  ReplyDelete
 6. @ మిర్చిబజ్జి
  :)

  @ జై
  ఇది పదకొండేళ్ళ క్రితం సంగతి అని చెప్పడం మరచిపోయాను. పెర్మిట్ తీసుకొని కూడా అక్కడ డ్రైవింగ్ చేయడం మనలాంటి ఇమ్మిగ్రాంట్స్ కి కష్టం. కఠినమయిన నిబంధనలు దానికి కారణం. ఇహ శిక్షకుడే మనకు శరణ్యం.

  @ కన్నా
  ఓ అలా అర్ధం చేసుకున్నారా. అలా కాదులెండి. కొన్ని కష్టాలు పడి మొత్తానికి అప్పట్లోనే డ్రవింగ్ లైసెన్స్ తెచ్చుకున్నాను లెండి.

  ReplyDelete