http://telugu.telugupost.com/
తెలుగు్‌పోస్ట్ నిర్వాహకులు తమ తెలుగు పోర్టల్ మీద సమీక్ష కోరినప్పుడు సహజంగానే నేను రోజూ చూసే ఒక 'గొప్ప' తెలుగు పోర్టలుతో తారతమ్యాలు ఏంటా అని పరిశీలించాను. దాన్ని వదిలి ఇది చూడాల్సినంత గొప్పదనం కానీ, ఆవశ్యకత కానీ ఏముందా అని పరిశీలించాను. అందులో కొన్ని వార్తలు చికాకు కలిగిస్తుంటాయి. వార్తా ప్రాధాన్యత లేని వాటిని కూడా హిట్స్ కోసం ఏవేవో వ్రాస్తూ అసహనం కలిగిస్తున్నా, ఇంకా కొన్ని లోపాలున్నా కూడా కొన్ని గొప్పదనాలు వున్నయ్ కాబట్టి ఆ పోర్టలు రోజుకి ఒకసారి చూడనిదే నాకు నిద్రపట్టదు. ముఖ్యంగా అందులో ఒకరు వ్రాసే ఆర్టికల్స్ అరటిపండు ఒలిచిపెట్టినంత సులభంగా, ఆసక్తికరంగా, విశ్లేషణాత్మకంగా, సరదాగా వుంటాయి. అవే కాకుండా వారి మోబయిల్ వెబ్సైట్ ఫాంట్ కానీ, అమరిక కానీ చాలా చక్కగా వుంటుంది కానీ వ్యాపార ప్రకటనలు ఎక్కువయ్యి మనం చదవాల్సిందెక్కడా అని ఆ పోర్టలులో వెతుక్కోవాల్సివస్తుంటుంది.
తెలుగుపోస్ట్ చూసినప్పుడు అలాంటి చెత్త పోస్టులు, రాతలు లేకుండా వ్యాసాలు పద్ధతిగా, హుందాగా, బ్యాలన్సుడుగా వున్నాయి. విశ్లేషణాత్మకంగా వ్యాసాలు వున్నాయి కానీ అంతా సీరియస్సుగానే వున్నాయి. అందులో కొన్నిటిలోనన్నా హాస్యం కనపడుతుందేమో అని చూసా కానీ అబ్బే లేదు. జనాలకి సమాచారం ఒక్కటే కాకుండా, వినోదం ఒక్కటే కాకుండా రెండింటినీ కలిపి ఇస్తే ఆ వ్యాసాలు ఇంఫొటైన్మెంటుతో ఆసక్తికరంగా, ఉపయోగకరంగా వుంటయ్. ఆ విషయాన్ని నిర్వాహకులు గుర్తించినట్లు లేరు. అలాంటివి కొన్ని అయినా ఇందులో వస్తుంటేనే బావుంటుంది. ఇందులో ఆర్టికల్స్ అన్నీ బావున్నప్పటికీ అన్నిటినీ ఒకరే వ్రాసేరా అన్నంతగా మూస పద్ధతిలో వున్నయ్. రచనా శైలిలో పెద్దగా వైవిధ్యం నాకు అయితే కనపడలేదు మరి. ఆ లోపాన్ని వీరు సరిచేసుకోవాల్సి వుంది.
ఇకపోతే ఇందులో కేవలం రాజకీయాలు, సినిమాలు మాత్రమే వున్నాయి. వేరే ఆంశాల మీద పెద్దగా వ్యాసాలు లేవు. ఈ రాజకీయాలూ, సినిమాలూ అన్ని పోర్టల్స్ లో, టివిల్లో, పత్రికల్లో వుండేవే కదా. అవి దాటుకొని నాబోటి వాడు ఈ వెబ్‌సైటుకి రావాలంటే కొత్తదనం కనిపించాలి మరి. వెబ్సైట్ ఫాంట్, అమరిక బాగానే వున్నప్పటికీ నాలాంటివారు ఎక్కువగా చూసే మొబయిల్ సైటులో ఫాంట్ కానీ, అమరిక కానీ అంత ఆహ్లాదంగా అనిపించలేదు. ప్రస్తుతానికయితే వ్యాపార ప్రకటనలు లేకుండా, ఆ ప్రకటనల మధ్య అసలు విషయం ఎక్కడుందా అని వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా హాయిగా వుంది ఈ తెలుగు పోస్ట్ చూస్తూ వుంటే.
ఈ సైటు చూస్తూ వుంటే క్వాలిటీ కంటెంట్ నిజాయితీగా, నిష్పక్షపాతంగా, హుందాగా చదువరులకు అందించాలనే తపన కనపడుతోంది. ఈ సైటు ఇంకా కొత్తదే కనుక మున్ముందు ఈ కమిట్మెంటుతో పాటుగా కొత్తదనాన్ని, వైవిధ్యాన్ని, ఇంఫొటైన్మెంటును వీరు అందించగలగితే మనకో చక్కని తెలుగు వెబ్ పోర్టల్ దక్కినట్లే.
ప్రస్థుతానికి అయితే పాస్ మార్కులే వేస్తున్నా ఈ సైటుకి.
http://telugu.telugupost.com/
మీరూ ఈ సైటు ని ఒక లుక్కేసి మీకెలా అనిపించిందో, నా అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారో లేదో చెబుదురూ.