లాక్టోజ్ ఇంటోలరెన్సుతో ( Lactose Intolerance) నా యుక్తవయస్సు నుండీ అవస్థ పడుతున్నాను. అసలు విషయం అదని తెలియక ఇండియాలో వున్నప్పుడు ఎంతోమంది దద్దమ్మ డాక్టర్లకు నా సమస్య మొరపెట్టుకున్నాను. అదన్నారు, ఇదన్నారు కానీ ఒక్కడన్నా అది అయివుండొచ్చునేమో అని సూచనప్రాయంగా కూడా అనుమానం వెలిబుచ్చలేదు ఆ మా గొప్ప వైద్యులు. కెనడాకి వచ్చాక లాక్టోజ్ ఫ్రీ మిల్క్ చూసి అదేంటొ ఎయిడ్స్ ఫ్రీ మిల్క్ తరహాలో అనుకొని మనకెందుకులే అది అని పట్టించుకోలేదు. అలా గ్రోసరీకి వెళ్ళినప్పుడల్లా ఆ పాలు చూసి, చూసి ఆసక్తి పుట్టి నెట్టులో వెతికాను. అప్పుడర్ధమయ్యింది - నా లక్షణాలు అవేననీ, మన భారతీయులకే ఈ సమస్య ఎక్కువ వుంటుందనీనూ. ఆ పాలు తెచ్చుకొని పరీక్షించా - నా సమస్యకి తాత్కాలిక పద్ధతుల్లో పరిష్కారం లభించింది. కానీ ఆ పాలకి ధర ఎక్కువ. ఇంట్లో పెరుగు అందరికీ ఆ పాలతొ చెయ్యాలన్నా, లేక ఏ ఇతర పాల పదార్ధాలు తిన్నా ఇన్నేళ్ళుగా ఇబ్బందిగానే వుండేది. ఎంత నెట్టులో పరిష్కారం కోసం వెతికినా పాలు పక్కన పెట్టమనే కానీ ఓ పరిష్కారం దొరకలేదు. ఇక లాభం లేదని ఈమధ్య లా ఆఫ్ ఎట్రాక్షన్ ప్రయోగించా.
అద్భుతః! ఒక దేశీ హెయి కటింగ్ సెలూన్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక దేశీ హోమియో డాక్టర్ కార్డ్ కనపడింది. పట్టుకొని వచ్చి ఫోన్ చేసి కలుసుకొని నా సమస్యలన్నీ మొరపెట్టుకున్నా. ఒక్క పాలే కాకుండా ఇంకా ఏవేవో ఫుడ్ ఇంటోలరెన్సులు కూడా వున్నయ్ నాకు. లాక్టోజ్ ఇంటోలరెన్సుతో సహా వాటిల్లో చాలా వాటికి పరిష్కారం లభించింది. హాయిగా పాలు పెరుగుతో పాటు నాకు ఇష్టం అయిన అహారం అంతా ఎంచక్కా తినగలుగుతున్నాను కానీ గోంగూర మాత్రం ఇంకా పడట్లేదు. అది తిన్న రోజు దగ్గు, జలుబు వగైరాలతో ఆ రాత్రి నాకు నిద్ర పట్టదు. ఇది కూడా తీరితే బావుండును - ఎందుకంటే నాకు గోంగూర పచ్చడి అంటే బాగా ఇష్టం మరీ.
మీలో ఎవరికయినా లాక్టోజ్ ఇంటోలరెన్సు కానీ, ఫుడ్ ఇంటోలరెన్సులు కానీ, ఆస్మా లాంటివి కానీ వుంటే హోమియో మందులు వాడి చూడండి - మీకూ నయమై పోవొచ్చును.
నిజమో లేక నా భ్రమో కానీ ఇలా ఒక్కొక్క సమస్యా LOAతో తీరిపోతూవుంటే, అన్నీ ఒక దాని తరువాత ఒకటి కలిసివస్తుంటే జీవితం భ్రహ్మాండంగా సాగిపోదూ? ఇంకో ముఖ్యమయిన సమస్య తీరడానికి రెండు నుండి మూడేళ్ళ సమయం వుంది. నా బ్లాగు మొదట్నుండీ చదువుతూవున్న వాళ్ళు అదేంటో అర్ధం చేసుకోవొచ్చు ;) బయటకి ఎందుకులెండి చెప్పుకోవడం - మీరే చూస్తారుగా మున్ముందూ :))