ఒక స్వాట్ టీం శిక్షకుడూ, ఒక స్వాట్ టీం మెంబరూ వచ్చి పోలీసులు పౌరులపై ఉపయోగించే బలప్రయోగం గురించి పౌర పోలీసు శిక్షణలో మాకు వివరించారు. విచక్షణారహితంగా పోలీసులు బలప్రయోగం చేసారనీ లేదా కాల్చారనీ లేదా కాల్చి చంపారనీ పలు వార్తలు వస్తుంటాయి కదా. వాటి వెనుక ఇతర నిజాలు ఎలా వుండటానికి అవకాశం వుందో వీడియోల ద్వారా వివరించారు. ఎలాంటి పరిస్థితుల్లో పోలీసులు బలప్రయోగం ఉపయోగిస్తారో ప్రదర్శిస్తూ చెప్పారు. అందుకు ఆబ్జెక్టుగా నన్ను కూడా వాడుకున్నారు. నన్ను నిజంగా దెబ్బలు కొట్టలేదు లెండి.
కొన్ని నిజాలు తెలిస్తే వళ్ళు గగుర్పొడిచింది. ఇక్కడి పోలీసులు మనల్ని కాల్చడానికి మన దగ్గర నిజంగా ఏ ఆయుధమో వుండక్కరలేదు - వున్నట్లు అనిపిస్తే చాలుట. ఉదాహరణకు పోలీసులు చేతులు వెనకపెట్టమని ఆదేశించినప్పుడు పొరపాటున మీకు గోక్కోవాలనిపించి తొడ మీది చేతులు పోనిచ్చినా మీరు గన్ను తీస్తున్నారేమో అని వాళ్లనుకునే అవకాశం వుంది. అనుకుంటే పర్లేదు కానీ ఎందుకయినా మంచిదని వాళ్ళు కాల్చేస్తారుట. పోనీ అలా కాకపోయినా పోలీసులు ఐడి అడుగుతున్నారనుకొని పర్సు తియ్యబోయినా మనము ఆయుధం తీస్తున్నారని వాళ్ళు అనుకొని కాల్చేసే ప్రమాదం వుంది. అంచేతా నాకు అర్ధమయ్యిందేమిటంటే ఇక్కడి పోలీసులు అతి జాగ్రత్తపరులు కాబట్టీ, ఎందుకయినా మంచిదని మనల్ని ముందుగానే కాల్చేసే ప్రమాదం వుంది కాబట్టి వాళ్ళు తటస్థించినప్పుడు బుద్ధిగా చెప్పినట్లు చెయ్యడం బెటర్. ఎందుకయినా వాళ్ళు మనల్ని అరెస్టు చేస్తున్నామంటే మారు మాట్లాడకుండా చేతులు వెనక్కి పెట్టి నిలబడటం మంచిది. ఎందుకు, ఏమిటి, ఎలా అనేవి తరువాత తీరిగ్గా తేల్చుకోవచ్చు కానీ ముందు ముందు తాపీగా మనం విచారించకుండా ఉపయొగపడుతుంది. ఇది నేను ఇస్తున్న బోడి సలహా కాదు లెండి - వాళ్ళే క్లాసులో అలా చెప్పారు.
మాకు ఒక నిజమయిన సంఘటన గురించిన వీడియో చూపించారు. అందులో ఒక యువకుడిని ఇద్దరు పోలీసులు టపటపా కాల్చేస్తారు. అది చూస్తే అయ్యో పాపం ఎందుకు అలా టపటపా కాల్చేస్తున్నారు అని అనిపించింది. అదే సంఘటణది ఇంకో వీడియో చూపించారు. అందులో పోలీసులు అరెస్టు చేస్తుంటే ఆ యువకుడు ప్రతిఘటిస్తూ గన్నుతో బెదిరిస్తుంటాడు. ఇంకేం వీళ్ళు టపటపలాడిస్తారు. తప్పదు కదా మరి. అదే సంఘటణకి చెందిన మరో వీడియో కూడా చూపించారు. అందులో పోలీసులు గన్ను అనుకున్నది అతగాడి సెల్ ఫోన్. అప్పట్లో సెల్ ఫోనులు పెద్దవిగా వుండేవి లెండి. ఇప్పుడు చెప్పండి ఎవరిది తప్పు? ఆ యువకుడు గన్నుతో బెదిరించకపోయినా కూడా పోలీసులకు మాత్రం అది గన్నులాగే అనిపించి ఆత్మరక్షణ కోసం కాల్చారు కాబట్టి వాళ్ళ తప్పేమే లేదని కోర్టు అందిట. మరి మీరేమంటారు?
ఇక ఒక దుండగుడు ఆయుధంతో సంచరిస్తూ హడావిడి చేస్తున్నాడు అనుకోండి. పోలీసులు వచ్చి గన్ను డ్రాప్ చెయ్యి అని వార్నింగులు గట్రా ఇవ్వరంట. అవతలివాడు అది వదిలెయ్యకుండా తిరగబడి వాళ్ళని కానీ, చుట్టుపక్కల వున్నవారిని కాల్చేస్తే? అందుకే ఎందుకయినా మంచిదని చడీచప్పుడు లేకుండా ముందే కాల్చేస్తారుట. వాళ్లకి గానీ, చుట్టు పక్కల వున్న పౌరులకు గానీ ఏమాత్రం ఇబ్బంది లేదనుకున్నప్పుడు మాత్రమే హెచ్చరిక చేస్తారంట.
మరోసారి పోలీసులు ఉపయొగించే టేజర్ గన్నుల గురించి చెప్పుకుందాం. అవునూ ఇండియా పోలీసులు టేజర్స్ ఉపయోగిస్తున్నారా?