డాక్టర్ గంభీరంగా నా వైపు చూసాడు

ఈ మధ్య కాలంలో ఈ బ్లాగుల గురించి కొంత ఆలోచిస్తున్నాను - వీటి ప్రయోజనం ఏంటా అని లేకపోతే వీటిని కనీసం నాకు అయినా ప్రయోజనకరంగా మలచుకోవడం ఎలా అని. అందువల్ల వచ్చిన ఆలోచనే ఈ టపాల పరంపర. నాకు తెలిసిన మంచి విషయాలని నేను రిఎంఫోర్స్ చేసుకోవడం ముఖ్య వుద్దేశ్యం. దానితో పాటు ఇతర బహుళ ప్రయోజనాలు నెరవేరితే మరింత సంతోషం. ఆ ఇతరాలు ఏంటి అనేది మరో సారి చూద్దాం.

అభివృద్ది చెందిన దేశాలలో ప్రజలు ఏడాదికి ఒక్కసారి అయినా రక్త పరీక్షలు చేసుకుంటారు. అలాంటిది చేయించుకొని ఓ రెండు ఏళ్ళు అయిందనుకుంటా నాకూ ఉబలాటం పుట్టింది. డాక్టర్ కి చెప్పాను - ఆయనకు నాకంటే ఉబలాటం. సరే అన్నాడు. పరీక్షలు అయిపోయాయి. ఫలితాల కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. టెస్ట్ రిజల్టులు చాలానే వున్నాయి. వాటికేసి చూస్తూ సంభ్రమంగా్ ఫీలింగ్ పెట్టాడు. కొంపలు మునిగాయి అనుకున్నాను. నిట్టూర్పులు విడుస్తూ ఆ బొత్తాం చూస్తూ పనికిరానివి చెత్తబుట్టలో వేస్తూ వున్నాడు. నా ముఖంలో ఆముదం తాగిన ఎఫెక్ట్ ఎక్కువ కాసాగింది.

కాసేపయాక వాటిని చూడటం ఆపి గంభీరంగా నా వైపు తిరిగాడు. నా పై ప్రాణాలు పైకే పోయినట్లు అనిపించింది. నాకు క్యాన్సరా? ఎయిడ్సా? క్యాన్సర్ అయితే ఫర్వాలేదు - ఎయిడ్స్ అయితే ఈ సుఖవాదికి తగిన సుఖ రోగం వచ్చిందని నా (అజ్ఞాత/ అజ్ఞాన) విమర్శకులు తెగ సంతోషించి బాణాసంచా కాల్చుకున్నా కాల్చుకోవచ్చు.ఊపిరి బిగపట్టి ఆయనేం చెబుతాడో అని చూస్తూవున్నాను.
"రాత్రి ఫుడ్డు బాగా మెక్కావు కదూ" అడిగాడు
"అహబ్బే - అదేమీ లేదే" నేను
" లేదు. మెక్కావు. రక్త పరీక్షల్లో పట్టుబడ్డావు. రక్త పరీక్షల ముందు రాత్రి పది గంటల తరువాత ఏమీ తినవద్దన్నానా!"
నేను మాటలు నములుతూ " అంటే డాక్టర్ గారూ - లిక్విడ్ ఫుడ్డు మాత్రం - అంటే పాలు మాత్రం ఖచ్చితంగా10 గంటలకి తీసుకున్నానండి" అన్నాను - నిజానికి బాగా అకలయ్యి పదిన్నరకి అవి గ్రోలాననే కఠిన వాస్తవం మరుగుపరిచి.
డాక్టర్ బుర్ర గోక్కున్నాడు. " పాలు అయితే రిజల్ట్ అలా కనిపించదే!"
"నిజం. మీమీద ఒట్టు - నాకే పాపం తెలియదు డాక్టర్ గారూ" అనబోయి మరీ ఓవరాక్షన్ అవుతుందని ఆగాను.
మరో సారి ఆ కాగితాలు తిప్పి చూసాడు.
ఆయన బుర్రలో లైటు వెలిగినట్లు నాకు అనిపించింది.
"వ్యాయామం చేయకుండా శుబ్బరంగా రోజులు లాగిస్తున్నావు కదూ"
"అబ్బే లేదండీ. రెండు వారాలు అయింది జిమ్ లో చేరి" చేతులు నులుపుకుంటూ చెప్పాను తరువాత ప్రశ్న ఏమయివుంటుందో ఊహిస్తూ.
అనుకున్నట్లే అడిగాడు " ఏమేం చేస్తుంటావక్కడ?"
"అంటే డాట్రు గారూ - సమయం లేక ఏమీ చేయడం లేదండి - స్టీం బాత్ మాత్రం చేసివస్తుంటాను" అని నిజం చెప్పబోయి నిగ్రహించుకున్నాను. అది చెబితే తలంటు పోస్తాడు - ఎందుకులెండి. "వ్యాయామం చేస్తున్నానంటే డాక్టర్ గారూ - ఇంకా పెద్ద ఎత్తున ఏమీ మొదలెట్టలేదండీ. మొన్నే కదండీ జాయిన్ అయ్యింది!" ఇదీ నేను చెప్పిన అవాస్తవం.
ఏ కళ నున్నాడో ఆపై వ్యాయామం గురంచి పెద్దగా రెట్టించలేదు. అసలు విషయానికి వచ్చాడు." కొలెస్ట్రాల్ లో ట్రైగ్లిసరాయిడ్స్ ఎక్కువ వున్నాయి"
అంతే కదా. లైట్ అనుకున్నా. అది మానవ సహజం - కాదంటారా. కొద్దిగా ఎక్కువో తక్కువో వుంటాయి. దానికింత ఖంగారు ఏమిటో!
నా ఫేసుకేసి చూసాడు.
ఏ ఫీలింగూ కనపడకుండా జాగ్రత్తగా జాగ్రత్తపడ్డాను.
అలా లాభం లేదనుకున్నాడో ఏమిటో అంకెలు చూపించాడు.
450
భుజాలు ఎగిరేసాను.
వళ్ళు మండి వుంటుంది. అడిగాడు " సాధారణంగా ఎంత లోపుగా వుండాలో తెలుసా?"
ఊహు.
150
నాకు ఠారెత్తి పోయింది. అంటే పోయేకాలం దగ్గరికి వచ్చిందా?
ఖంగారేమీ లేదని చెప్పి వ్యాయామం బాగా చేస్తూ ఆహార నియంత్రణ పాటించమన్నాడు. మరో ఆరు నెలల తరువాత మళ్ళీ పరీక్షిద్దామన్నాడు.

జిమ్ కి వెళ్ళి స్తీమ్ రూమ్ లో కూర్చోని రావడమే కాకుండా కాస్తన్నా వ్యాయామం చేయాలని మనసులో కంకణం కట్టుకున్నాను.

మీరు అంతా ఇది చదివారు - బాగానే వుంది - ఖేల్ ఖతం? అబ్బే బొమ్మాళీ - మిమ్మల్ని వదలను గాక వదలను. మరి మీరు చేయాల్సిన పని ఏంటి? మీరు నా శ్రేయోభిలాషులా కాదా? అయితే నన్ను ప్రోత్సహించండి - ఆ ఆవిరి గది వదిలి కాస్త వ్యాయామం చేసి కొవ్వు అదేనండి కొలెస్ట్రాల్ - అదేనండి ట్రై గ్లిసరాయిడ్స్ కరిగించేలా! మరో ఆరు నెళ్ళకి అవి 150 కి లోపుగా వుండకపోతే మా డాక్టర్ కి చెబుతాను ఏమనుకున్నారో ఏమిటో - నేరం నాది కాదు, నా (బ్లాగ్) శ్రేయోభిలాషులదనీని!

ఈ టపాతో మనం నేర్చుకున్న నీతి: వ్యాయామం పేరు చెప్పి ఆవిరి గదిలో కూర్చొని కాలక్షేపం చేయరాదు. నిజంగా వ్యాయాం చేయవలయును. వ్యాయామం చేయనిచో ట్రైగ్లిసరాయిడ్స్ 150 కన్నా ఎక్కువ అగును. అది ఆరోగ్యానికి ప్రమాదకరం. గుండె జబ్బు వచ్చి పైకి టపా కట్టి ఇలాంటి బ్లాగు టపాలు వ్రాసే మాహా అవకాశాలకి దూరం అవుదురు.

నేను జిం లో చేరిన విధంబెట్టిదన

ఎన్నో ఏళ్ళుగా రకరకాల వ్యాయామాలటొ, జిమ్ములతో కుస్తీ పడుతున్నా ఏనాడూ సరిగ్గా చేసిన వాడిని కాదు. రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్!ప్రొద్దుటే లేచి జిమ్ముకి వెళ్ళాలంటే నీరసం - పైగా చలి - షికాగో కదా. సాయంత్రం వెళ్ళాలంతేనేమో నీరసం - ఆఫీసునుండి కాళ్ళు, చేతులు వేలాడేసుకొని వస్తాను కాబట్టి ఇక బరువులు ఎత్తే ఓపిక ఏముంటుంది.

ఇక ఆలోచించి - చించి ఒక ఉపాయం కనిపెట్టా. ఆఫీసుకు దగ్గర్లో జిమ్ములో చేరి అటునుండి అటే వెళ్ళడం. ఇదేదో బావుందనుకొని ఒక జిం ని సంప్రదిస్తే వాళ్ళు రమ్మన్నారు. వెళితే అంతా తిప్పి చూపించారు. ఫర్వాలేదు - జిమ్ము చేస్తున్న అమ్మాయిలు అందంగానే వున్నారు. చేరాలనే కఠిన నిర్ణయం వెంఠనే తీసుకున్నాను. జిమ్ముచేసే పరికరాలు ఏవేవో చూపించారు - హు కేర్స్?సానా గది, స్టీం రూం గది చూపించారు. యూకలిప్టస్ వాసనతో అరోమా కూడానట. అది బావుంది. ఇదే జిమ్ములో చేరాలని మరింత కఠినంగా నిర్ణయించాను.ఒక ఉచిత ఫిట్నెస్ పరీక్ష మరియు ఇంకొక ఉచిత జిం సలహా సెషన్ అన్నారు. బావుంది. వాటిని జరపడానికి శిక్షకుడు మగ కావాలా, ఆడ కావాలా అని అప్లికేషన్ ఫార్మ్ లో అడిగారు. అర్జంటుగా ఆడ అని పెట్టేసాను. ఇదీ బావుంది కాదూ.

నీతి: ఉదయం, సాయంత్రం జిమ్ముకి వెళ్ళడానికి వీలుకాకపోతే ఆఫీసు దగ్గర్లో జిం లో చేరితే లంచ్ అవర్లో వెళ్ళి ఆవిరిగదిలో కూర్చొని రావచ్చును.