నిన్నెక్కడో చూసినట్లుందే!

మీకు ఆమ్వే సంస్థ ఏజెంట్లు ఎప్పుడన్నా తటస్థపడివుండవచ్చు. షాపింగ్ మాళ్ళలోనన్నా, ఎక్కడన్నా మనని ఆపి "మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుందే" అని బోలెడంత ఆశ్చర్యపడుతారు. మనం బకరాలం అయివుంటే ఎంచక్కా ఆ మాటలకు పడిపోతాము. అలా వారు మనల్ని కూర్చోబెట్టి కబుర్లు చెప్పి ఇంటర్నెట్టు వ్యాపారం అంటో సుత్తి బయటకి తీస్తారు.  మా చిన్నమ్మాయికి ఆ సంస్థలో సభ్యత్వం ఏమీ లేదు కానీ ఆ టెక్నిక్ బాగనే ఉపయొగిస్తుంది. స్నేహాలు పెంచుకోవడానికి తన వయసు వారెవరన్నా కనపడితే ఆపేసి "నిన్నెక్కడో చూసినట్లుందే!" అని దీర్ఘం తీస్తుంది. లేకపోతే వారి తల్లితండ్రులతో "మీ పాపని ఎక్కడో చూసానూ" అంటుంది. అలా స్నేహం మొదలెట్టి ఆ పిల్లలతో చక్కగా ఆడుకుంటుంది. మంచి విషయమే. ఇతరులతో ఎంతో చక్కగా స్నేహాలు ప్రారంభిస్తావూ అని అమ్మలుతో అంటూవుంటాను.   పెద్దల్లో కానీ, పిల్లల్లో కానీ ఎవరిలోనన్నా మంచి విషయం కనపడితే తను ఎంతో బాగా ప్రశంసిస్తుంది.

వాళ్ళ ఫ్రెండు ఇంటికి Bonfire కి వెళ్ళిన మా పెద్దమ్మాయిని పికప్ చేస్తూ మా ఇంటికి దగ్గర్లోనే వుండే ఇంకో స్నేహితురాలినీ ఈమధ్య మా కారులో పికప్ చేసాను. క్రిస్టినా ఆమె పేరు. మా SUV లోకి ఎక్కడంతోటే పెద్దగా వుందే ఈ కారూ అని మెచ్చుకుంది. అలా ఆమె నన్ను గోకేసింది. బ్లాగుల్లో చూస్తేనే వుంటాం కదా ఒకరి వీపులు మరొకరం   గోక్కోవడం, కామెంట్లు గీక్కోవడమూనూ. మరి ఆమె వీపు కూడా నేను గోకెయ్యాలి కదా. మీ ఇంట్లో చాలా  కార్లు వుంటాయి కదా అన్నాను. అవును - ఆరు కార్లు వుంటాయీ అని అంటూ చెప్పుకువచ్చింది. వాళ్ళది చాలా పెద్ద ఇల్లు మరియు పెద్ద కుటుంబం మరి. అలా ఒకరి వీపు మరొకరు గోక్కోవడంలో తప్పులేదు. అయితే ఆ మెచ్చుకోళ్ళు హృదయపూర్వకమయినవీ, నిస్వార్ధమయినవీ అయివుండాలి. అప్పుడే అవి ప్రభావవంతంగా వుంటాయి. ఊరికే పొగిడేస్తే వచ్చే ప్రయోజనాలు అంత మంచివి కావు, దీర్ఘకాలంలో తేలిపోతాయవి.

క్రిస్టినా వ్యక్తిత్వ వికాసం పుస్తకాలేమీ చదివివుండకపోవచ్చు. ఇతరులను ప్రశంసించే సంస్కృతి ఆమెకు కుటుంబ వారసత్వంగా, కుటుంబ కల్చరుగా అందివచ్చియుండవచ్చు. ఆమె ఓ మెచ్చుకోలు ఇవ్వడానికి క్షణకాలం కూడా తటపటాయించలేదు, ఆలస్యం చెయ్యలేదు. మా కారు ఎక్కేసిందో లేదో మెచ్చేసుకుంది. అలా ఆమె వ్యక్తిత్వం నాకు నచ్చేసింది. అలా ఆమె నా మీద తనదైన తరహాలో పాజిటివ్ ముద్ర పడేసింది. ముందుముందు రోజుల్లో ఆమె సమక్షంలో ఆమె బాయ్‌ఫ్రెండో, భర్తో ఎల్లప్పుడూ అహ్లాదంగా గడపగలడనంలో నాకు సందేహం లేదు.

మెచ్చుకోళ్ళలో ధారాళంగానూ, విమర్శలలో పొదుపుగానూ వుండాలని పర్సనాలిటీ గురూలు      చెబుతూవుంటారు.

4 comments:

 1. "మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుందే" అని మా ఫ్రెండ్ ఒకడు రోడ్దు మీద ఒక అందమైన అమ్మాయిని అలాగే పలకరిస్తే "షటప్, చెప్పుతెగుద్ది" అన్నదంట. నాకు చెప్పుకుని ఏడ్చాడు.

  ReplyDelete
 2. @ అజ్ఞాత
  హ హ. అది అమ్మాయిల దగ్గర వుపయోగించే పాత టెక్నికే కాబట్టి ఆ పాచికలు అంతగా పారవు. అబ్బాయిలు అలా సర్వైవ్ కావాలంటే కొత్త టెక్నిక్కులు వాడాల్సిందే.

  ReplyDelete
 3. Nenu e Amway Bakarala chethilo Rendu sarlu Dorikipoya.....But i didnt joined

  ReplyDelete
 4. @ అజ్ఞాత
  వాళ్ళు మనల్ని బకరాలు చేస్తారు కానీ వాళ్ళు బకరాలేంటండీ బాబూ. నేను కూడా రెండు సార్లు బకరా అయ్యా కానీ బలి అవలేదు. మా క్లోజ్ ఫ్రెండ్ ఒకసారి వ్యక్తిత్వ వికాసం క్లాసులంటూ ఆ ఉపన్యాసాలకి తీసుకువెళ్ళేడు :( కొద్దిసేపయాక నా వ్యక్తిత్వం వికసించడం సంగతేమో కానీ ముడుచుకుపోవడం మొదలయ్యింది. మరో సారి ఈ టపాలో చెప్పినట్లు మిమ్మల్నెక్కడో చూసినట్లుందే కేసు అన్నమాటా.

  ReplyDelete