మొన్న ఓ ప్రముఖుడిని కలిసాను

మొన్న మా కుటుంబంతో కలిసి షికాగో తెలుగు సంఘం వారి పిక్నిక్కుకి వెళ్ళాను. అక్కడ కాస్త దూరంగా మాట్లాడుతున్న వ్యక్తిని చూసి తెల్సిన ముఖం లాగే వుందే అనుకున్నాను. ఆ తరువాత కొంత సేపయ్యాక చెట్టుకింద కుర్చీల్లో కూర్చొని తెలిసినవారితో మాట్లాడుతుంటే వారూ ఇతరులతో కలిసి అక్కడికి వచ్చి నా పక్కనే కూర్చున్నారు. దర్జాగా కాలుమీద కాలు వేసుకొని విలాసంగా కాలు ఊపుతూ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. ఎవరబ్బా ఇంత దర్జా మనిషీ అనుకున్నాను. ఓ ప్రముఖ వ్యక్తి లాగానే పోలికలు వున్నాయే అనుకున్నాను. నాకు మరో పక్క కూర్చున్న మరో వ్యక్తిని అడిగాను వారు ఎవ్వరని. చెప్పారు, ఆశ్చర్యపోయాను. వారిలా వున్నారనుకున్నాను కానీ సాక్షాత్తూ వారే ఇక్కడ, నా పక్కనే ప్రత్యక్షమవుతారని అనుకోలేదు. కస్సేపు వారి ముచ్చట్లు విని పనివుండి పక్కకు వెళ్ళిపోయాను.

ఆ తరువాత నాలో వున్న బ్లాగర్ దురద పెట్టడం మొదలెట్టాడు. ఆ తరువాత అవకాశం చూసుకొని వారిని కదిపాను. మీ పేరిట ఏమయినా వెబ్ సైట్ వుందా అని అడిగాను. లేదు కానీ ఇప్పుడు కాస్త తీరిగ్గానే వుంటున్నాను కాబట్టి ఒక వెబ్ సైటు కానీ బ్లాగు కానీ తెరిచే వుద్దేశ్యం వుంది అని తెలియజేసారు.   హమ్మయ్య దొరికారు అనుకొని వెబ్సైటు కంటేనూ బ్లాగు ప్రారంభించడం తేలిగ్గా వుంటుందని చెప్పాను. ఎలా మొదలెట్టాలో తెలియదు, మీ ఫోన్ నంబర్ వుంటే ఇవ్వండి, ఆ సమాచారం కోసం ఫోన్ చేస్తాను అన్నారు.  మహా సంతోషంగా నా విజిటింగ్ కార్డ్ తీసి ఇచ్చాను. అందులో నా ఫోన్ నంబర్, ఈమెయిల్, బ్లాగు పేరు వుంటుందని చెప్పి చూపించాను. చూసి శరత్ కలం అన్నారు. కాదు శరత్ కాలం కానీ కలం కూడా అనుకోవచ్చు అని అన్నాను.  ఈమెయిల్ ఇచ్చినా, ఫోన్ చేసినా బ్లాగు ఎలా తేలిగ్గా మొదలెట్టాలో చెబుతాను అని అన్నాను.

నేను వారి వెబ్ సైటు గురించి అడిగినప్పుడే తమ యొక్క ఈమెయిల్ బాధలు నాతో చెప్పుకున్నారు కాబట్టి వారి ఈమెయిల్ నేను అడగలేదు. వారికి టన్నుల కొద్దీ ఈమెయిల్స్ వస్తుంటాయిట. వాటినన్నింటినీ చదవడం కష్టంగా వుందని నాతో వాపోయారు. అంత ప్రముఖులకి ఆ మాత్రం అవస్థ సహజమే కదా. వారికి బ్లాగింగ్ మీద ఆసక్తి వుంటే వారే ఈమెయిల్ ఇస్తారని అనుకున్నాను. చూద్దాం. అయితే ఓ బ్లాగు మొదలవుతుంది కాకపోతే పోయింది నా ఒక్క విజిటింగ్ కార్డ్ అంతే కదా. వారు ఒక చక్కని బ్లాగు మొదలెడతారని, వారియొక్క ఆలోచనలూ, అనుభవాలూ మనతో పంచుకుంటారని ఆశిద్దాం.

వారెవరంటే విజయరామారావు గారు. మాజీ సి బి ఐ డైరెక్టర్. మాజీ రాష్టమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ ప్రముఖులు. వారికిప్పుడు 75 ఏళ్ళుట. అందుకే రాజాకీయాల్లో మరీ అంత చురుకుగా లేనని చెప్పుకువచ్చారు.

2 comments: