ఆథ్లెటిక్ బాడీ పెంచాలిక

ఇది మళ్ళీ నా బరువు టపాలెండి. చదివితే చదవండి లేకపోతే వెళ్లిరండి.

డైటరీ సప్లిమెంట్లు మారుస్తున్న కారణాన నా వెయిట్ కంట్రోల్ ప్రాజెక్టుకి కొద్దిరోజులు విరామం వచ్చినా మళ్ళీ దారిలో పడ్డాను. గత వారాంతానికి ముందు 53 కిలోలు వుండగా వారాంతం ఊర్లు తిరిగినందున ఆరోగ్యకరమయిన ఆహారం తీసుకోవడం కుదరక ఓ కేజీ పెరిగి 54 అయ్యాను. పని వారం మొదలయిన దగ్గరి నుండీ రోజుకి ఓ అరకిలో తగ్గిస్తూ ఇవాల్టికి 52.5 కేజీలకి దిగాను. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగితే రేపు ఉదయానికల్లా నేను ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న, కృషి చేసున్న నా ఉపలక్ష్యం అయిన 52 కిలోగ్రాముల బరువుకి దిగుతాను.

అలా 52 కి దిగాక బరువు పరంగా నా అసలు లక్ష్యమయిన 50 కి దిగాలి. ఆ లక్ష్యం చేరుకున్నాక ఇక నా బరువుని ఎప్పుడూ 50 - 52 మధ్యనే వుంచగలగాలి. తక్కువ తినడమూ, ఆరొగ్యకరమయిన ఆహారం తీసుకోవడమూ అలవాటయ్యాయి కనుక అదేమంత పెద్ద సమస్య అవదనుకుంటున్నాను. ఇహ ఆ తరువాతా ఆథ్లెటిక్ బాడీ కోసం కృషిచెయ్యాలి. అదీ సాధిస్తే... ఆ... సాధిస్తే... అహ మీకు చెప్పలేనండీ బాబూ. నాకు సిగ్గేస్తోంది. బాడీ బ్యుల్డర్ అవాలి. ఇవన్నీ జరిగేపనులేనంటారా? ఎన్నో ఏళ్ళుగా నన్ను గమనిస్తున్నారుగా. అందుకే అది నేను సాధించగలనో లేదో మీరే చెప్పాలి :)

ఆథ్లెటిక్ బాడీ అంటే ఏమిటి? ఉదాహరణకు నా శరీరం సైజుకి ఎలాంటి కొలతలు వుంటే నా బాడీని అలా అంటారు లాంటి కబుర్లు త్వరలో వ్రాస్తాను. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకొని వాటిని సాధిస్తూ వెళుతుంటే మనలో ఉత్సాహమూ, మనమీద మనకు నమ్మకమూ పెరుగుతూవుంటాయి కదూ. మనలో మనకు ఎంతో సంతోషంగానూ, సంతృప్తిగానూ అనిపిస్తుంటుంది కూడానూ.  అందుకే నా ఆరోగ్యం గురించిన చిరు లక్ష్యాలు ఇవన్నీ. అలాగే మిగతా ఏరియాలల్లో కూడా ఉపలక్ష్యాలు నాకు వుండనే వున్నాయి. వాటిని కూడా కాస్తో కూస్తో సాధిస్తూనేవున్నాను.

2 comments:

  1. మీ బరువు 54 kg లేనా ?

    ReplyDelete
  2. @ అప్పి
    అది మొన్నామధ్యటి బరువు. ప్రస్తుతం 52.5. నా ఎత్తుకి ఎక్కువలో ఎక్కువ 58 కిలోల బరువు వుండాలి. 50 కి తగ్గించి మళ్ళీ 58 కి నా బరువు పెంచాల్సి వుంది. ఎందుకో ఒక టపాలో వివరిస్తాను.

    ReplyDelete