Let us go back to basics!

రెండేళ్ళ క్రితం అనుకుంటాను మా ఇంట్లో ఓ ప్రస్థావన చేసేను - ఒక్క రోజు యంత్ర పరికరాలు కానీ, విద్యుత్తు కానీ, విద్యుత్ పరికరాలు కానీ, ఆధునిక వస్తువులు కానీ ఏమీ ఉపయోగించకుండా గడుపుదామని. మా ఆవిడ సహజంగానే తిరస్కరించింది. మా పెద్ద పాప క్లుప్తంగా నోప్ అంది - కరెంటు లేకపోతే తన ఇంటర్నెట్ ప్రపంచం కూలిపోతుంది కదా - అందుకే. హ్మ్. మా చిన్న పాప చాలా ఉత్సాహ పడింది. కానీ ఇంట్లో ఇద్దరు ఒప్పుకొని ఇద్దరు ఒప్పుకోకపోవడంతో ఎటూ తేలలేదు.     

మరో రెండు రెండు రోజుల తరువాత నేను, అమ్మలు (చిన్న పాప) కలిసి ఇంట్లో మరోసారి ప్రస్థావించాము. ఈసారి మాఅవిడ మరింత ఖచ్చితంగా నో అంది. అలా అయితే ఏడుపుగొట్టు సీరియళ్ళు, సినిమాలు చూడలేదు కదా. వాటిని ఒఖ్ఖరోజయినా త్యాగం చేయడం ఇష్టం లేకపోయింది. మరీ ఎక్కువ ఒత్తిడి చేస్తే సినిమాలు, సీరియల్లు చూడనివ్వకుండా గృహహింస చేస్తున్నట్లు అవుతుందేమోనని వెనక్కు తగ్గాను. మా స్ని యథాప్రకారం నోప్ అంది కానీ తరువాత మళ్ళీ కన్విన్స్ చేస్తే వినవచ్చు.      

చిన్నది, నేను చాలా అసంతృప్తి పడిపోయాము. ఇంట్లో అందరూ అంగీకరిస్తే ఒక రోజు ఇలా చెయ్యాలనీ, అలా చేయ్యాలనీ, క్యాండిల్ లైటు వెలుగులో అందరం ఎంచక్కా కబుర్లు చెప్పుకుంటూ భోంచేయాలనీ అలా అలా ఎన్నో ఊహలు కన్నాము.  కనీసం మనమన్నా అలా గడిపేద్దాం డాడీ అంటూ అప్పుడప్పుడు చిన్నది గుర్తుకుచేస్తున్నా ఇంట్లో అందరూ ఒప్పుకోకపోవడంతో నాకూ ఆసక్తి తగ్గి వాయిదా వేస్తూవచ్చాను.  

ఇకనైనా ఒప్పుకోనివారిని వదిలేసి ఒక గదిలో అన్నా కరెంటు వెలుగు తీసివేసి సువాసనలు వెదజల్లే క్యాండిల్ లైటు వెలుగుల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయాలని ప్లాన్ చేస్తున్నాను. ఆ తరువాత ఆ వెలుగులో చిన్న పిల్లల కథలు చదువుతూ కాలక్షేపం చేస్తాం లేదా ఏవయినా బోర్డ్ గేమ్స్ ఆడతాం.   అలా మూలాల్లోకి వెళ్ళిన మా రోజు ఎలా జరిగిందీ తెలియజేస్తాం. మీరూ మీ ఇంట్లో ఓ రోజు అలా బేసిక్స్ కి వెళ్ళి చూడకూడదూ? వీలయితే ఏడాదికి కనీసం ఒక రోజన్నా అలా గడిపితే మనం ఏం కోల్పోతూవస్తున్నామో వాటిని కనీసం స్పృశించవచ్చును.   

AP లాంటి కరెంట్ కట్ ప్రదేశాలలోని వారు అప్పుడప్పుడయినా బలవంతంగానయినా ఇలాంటి బేసిక్ జీవితాలు గడిపేస్తుంటారు కాబట్టి వారికి ఈ ప్రయోగాలు అక్కర్లేకపోవచ్చు! 

6 comments:

  1. "అప్పుడప్పుడూ కరెంటు పోతే ఎన్ని లాభాలో" అని టైటిల్ పెట్టి ఎప్పట్నుంచో పోస్టు రాద్దామనుకుంటున్నాను. ప్చ్...కెలుకుడులో పడి ఆ విషయాన్ని పక్కన పెట్టేశాను.

    నిజంగా రోజుకు గంట సేపైనా, పోనీ వారానికి ఒకరోజు కనీసం మూడుగంటలైనా కరెంటు పోతే బోల్డన్ని లాభాలు మరియూ చక్కని అనుభవాలూనూ. మా కాలేజీలో కరెంటు పోదుగానీ, ఒక్కసారి మాత్రం ఏదో సాంకేతిక సమస్య వచ్చి పోయింది. కంప్యూటర్‌లను వదిలేసి అప్పుడు గత్యంతరం లేక అందరూ కబుర్లలో మునిగిపోతే అబ్బ! ఆ రోజును తలచుకుంటుంటునే నవ్వొస్తోంది. అంతవరకూ ఎప్పుడూ కంప్యూటర్ ముందు కూర్చుంటాడు "ముద్దపప్పు గాడు" అని ముద్ర వేసుకున్నవాడు కూడా వాని చిన్నప్పుడు చేసిన చిలిపి పనులను చెబితే నోరెళ్ళబెట్టాము. కొద్దిమంది కొత్త ఫ్రెండ్స్ అయ్యారు. మూడు గంటల తర్వాత కరెంటు వచ్చినప్పటికీ అందరూ చాలా బాధపడ్డారు రూముకు వెళ్ళాలంటే.


    కానీ, ఏదైనా సహజంగా జరిగితేనే బాగుంటుంది. మీలాగా కృత్రిమంగా కరెంటు తీసేస్తే అదంత అందమైన అనుభూతిని ఇవ్వదు. అందుకే నామాట విని మీకు దగ్గర్లోని ట్రాన్స్‌ఫార్మర్‌ను పేల్చేయండి. అది కుదరకపోతే మీ ఇంట్లోనే షార్ట్ సర్క్యూట్ చేసేసి మొత్తం సప్లైనే దెబ్బతీయండి. అప్పుడుంటుంది అసలు సిసలైన అందమైన అనుభూతి. :)))

    ReplyDelete
  2. ఇంకా వేసవి రాలేదు అప్పుడే రోజుకు మూడు గంటలు కోత తొందరలోనే ఇది ఆరుగంటలయిపోతుందిలెండి.
    రేపటికి కావల్సినవన్నీ ఇవ్వాళే మిక్సీ వేసేసి పెట్టేసుకుంటాం కానీ , చస్తే రుబ్బురోలు ముట్టుకోం. మధ్యాన్నం నిద్ర కరెంటు వేళలకు అనుగుణంగా మార్చుకుంటాం . రాత్రి భోజనాలుకూడా అంతే ...కరెంటు కోతకు అంతలా మా జీవిత విధానాలు మార్చేసుకున్నాం. అసలు మీరు మే నెల్లో ఆంద్రా టూర్ పెట్టుకోండి . మళ్ళీ జన్మలో మూలాల్లోకి వెళ్ళే ఆలోచన చెయ్యరు

    ReplyDelete
  3. ఈ మూలాల్లోకి వెళ్ళే పని మేము రోజూ చేస్తూనే వున్నాం.మా ఇంట్లో టి.వి లేదు. వీలైనప్పుడంతా బోర్డ్ గేంస్, షటిల్ ఆడతాం.కారు లేదు ఇప్పట్లో కొనే ఉద్దేశం లేదు. నా రోజువారి పనులకు నేను సైకిల్ వాడతాను. మా బాబు ని బడి నుండి తీసుకురావడం కూడా సైకిల్ మీదే.విద్యుత్ వాడకం చాలా తక్కువ. వాషింగ్ మెషీన్ ని అత్యవసరం అయితే తప్ప వాడను. వీలైనంత వరకు బట్టలు చేత్తోనే ఉతుకుతాను. ఈ మధ్య మిక్సీ, గ్రైండర్ వాడకం తగ్గించి రోట్లో రుబ్బడం మొదలు పెట్టాను.ఇవన్ని నేను ఎదో గొప్పపని చేస్తున్నననో, భూతాపం తగ్గిస్తున్ననానో బడాయిగా చెప్పడం లేదు. ఈ పనులు చేయడం మొదలు పెట్టక నాకు బాగా నచ్చేసాయి అందుకే చేస్తున్నా.

    ReplyDelete
  4. @sneha: where do you live ? Surprised and happy to know you don't have TV.I used to feel a little sad when my family watched TV during my exams in childhood.Your children are fortunate for that reason,but might be missing on cartoons other times ! :-)

    not able to paste telugu comments here.don't know why.

    @sarat: Like your profile picture a lot now !

    Good idea about a basic day, meeru ammulu gaaroo ;-) alaa tappakundaa try chesi, post raayandi.

    ReplyDelete
  5. @ నాగప్రసాద్
    నిజమే, ఏదయినా సహజంగా వుంటేనే బావుంటుంది. బ్రతుకులు కృత్రిమం అయ్యాయి కాబట్టే కదా ఈ అవస్థలు! అలా అని నేనెళ్ళి ట్రాంస్ఫార్మర్ పేల్చేస్తే నన్ను టెర్రరిస్టు అనుకొని పోలీసులు కాల్చేస్తారు. ఇంట్లో కరెంటు తీసేస్తే మా ఆవిడ కాల్చేస్తుంది.

    ReplyDelete
  6. @ లలిత
    తెలుసండీ. మీ కరెంటు సమాచారం వార్తల్లో మేము చూస్తూనేవుంటాం. ఇండియాలో 13 ఏళ్ళ క్రితం మేము వున్నప్పుడు ఆ ఇబ్బందులన్నీ అనుభవించినవే. ఇక్కడేమో అప్పుడప్పుడన్నా కరెంటు పోతే బావుండు అనిపిస్తుంది.

    @ స్నేహ
    అర్జంటుగా మీ ఆయన్నొకసారి ఇటు పిలవండి - మీరిన్ని కష్టాలు పడుతుంటే ఏం చేస్తున్నారు వారు - గృహ హింస కేసెయ్యాలి :)

    మీ ఇంట్లో టివి లేకపోతే మీ పిల్లల మనోభావాలు ఏమీ దెబ్బతినడం లేదు కదా :)

    అభినందనలు. మీలాంటి వారు అరుదు. బడాయి కోసం కాకపోయినా మనం చేసే మంచి పనులు అందరికీ తెలియపరచాలండీ. అప్పుడే మిగతావారికి కూడా ప్రేరణ వుంటుంది. మీ జీవన విధానం గురించి వివరంగా ఒక టపా వ్రాస్తే తెలుసుకోవాలని వుంది. ఆల్రెడీ వ్రాస్తే సూచించండి.

    @ అజ్ఞాత
    తెలుగులో వ్యాఖ్యానించలేకపోతున్నామని ఇతరులు కూడా తెలిపారు. పరిష్కారం నోట్ ఇంతకుముందే కామెంట్ బాక్సులో పెట్టాను - చూడండి.

    ప్రొఫయిల్ పిక్ - కొంతకాలం ఆ ఉద్యమం మీద ఫోకస్ పెట్టడం లేదు - అందుకే మార్చా :)

    బేసిక్ డే: తప్పకుండా - ధన్యవాదాలు.

    ReplyDelete