దర్శకత్వం వెలగబెట్టేసాను. ఇక ఇదీ...

గత ఏడాది షార్ట్ ఫిల్మ్స్ మొదలెట్టి అందరం కలిసి కొన్ని నెలలు బాగా కష్టపడ్డాము కానీ కొన్ని కారణాల వల్ల ఇది ఇప్పట్లో జరిగే పని కాదని పక్కన పెట్టాం. మరి ఎలా ఇక? మన బుర్ర ఖాళీగా వుండదు కదా. దానికి పని లేకపోతే చాలా చాలా పనికి మాలిన ఆలోచనలు వస్తాయి. అది చాలా డేంజర్ :)) అందుకే బుర్రకి మళ్ళీ పని పెట్టేసా.

నా బుర్రలో చాలా స్టోరీ ఐడియాలు తిరుగుతూ వుంటాయి. ఫిల్మ్ ఇండస్ట్రీ లో పనిచేసేవారికీ, పని చెయ్యాలనుకునేవారికీ సాధారణంగా వుండే జబ్బు లెండి అది. ఎవడి స్టోరీ వాడికి బహు గొప్పగా అనిపిస్తుంది - అందులో విచిత్రం ఏముందీ. నా స్టొరీలు వినే నాధుడు కనిపించడంలా. అందుకే యూట్యూబ్ వీడియోల్లో షేర్ చేసి జనాల్లోకి వదలాలని డిసైడ్ అయ్యా.  ఎవరికయినా కనెక్ట్ అవుతే అవుద్ది లేకపోతే లేదు. నాకయితే నష్టం లేదు - కాస్తంత కాలక్షేపం తప్ప. ఏదో రకంగా ఏదో ఒక స్టొరీ ఐడియా ఎవరికన్నా నచ్చి వెబ్ సిరీస్ కానీ సినిమా కానీ తియ్యాలనుకుంటే బహు సంతోషం - లేకపోతే లేదు. ఈ రకంగా స్టొరీ ఐడియాలు పంచుకునే యూట్యూబ్ ఛానళ్ళు నాకయితే తెలుగులో కనిపించలేదు. కొంత కాలం ఇలా ప్రయతించి చూస్తా. ఎవరన్నా చూస్తున్నారనిపిస్తే కొనసాగిస్తా - లేకపొతే మానేస్తా.    

బాబ్బాబూ, మీకు కాస్త తీరిక వుంటే ఓపిక చేసుకొని నా స్టొరీ ఐడియాలు చూసి తగు సలహాలూ, సూచనలూ మరియూ అభిప్రాయాలూ ఇద్దురూ. అలాగే పనిలో పనిగా నా ఛానల్ కి సబ్స్క్రయిబ్ చెయ్యండి. ఓ పని అయిపోద్ది మీకూ. మీకు గనుక ఏదయినా స్టొరీ ఐడియా అద్భుతంగా అనిపిస్తే మీకు తెలిసిన సినిమా లేదా లఘుచిత్రాల జనాలకి ఫార్వార్డ్ చేద్దురూ. ఏమో, గుర్రం ఎగరావచ్చు! నా ఐడియాలు నచ్చకపోతే నాకు చెప్పండి - నచ్చితే నలుగురికీ చెప్పండి. 

మొత్తం ఐడియా అంతా పెట్టెయ్యనులెండి - జస్ట్ పైలట్ లాగా కొంత మాత్రమే పెడుతూవుంటాను. ఇలాగే దీనిమీద ఇంకా చాలా ఆలోచనలు వున్నాయి. ఒక్కొక్కటీ చేసి చూద్దాం. సో, ఇకమీద కొన్నాళ్ళ పాటూ నా బ్లాగులో అలాంటి వీడియోలు చూస్తారు - సీట్ బెల్టులు పెట్టుకోండి మరీ. 

మీ జీవితాల్లో కనుక ఒక సినిమాకు పనికివచ్చే కథ(లు) వుంటే నాకు చెప్పండి లేదా మీ దగ్గరానూ స్టొరీ ఐడియాలు వుంటే నాతో పంచుకోండేం.