ఒక దీర్ఘకాల సమస్య తీరిపోయిందోచ్!

లాక్టోజ్ ఇంటోలరెన్సుతో ( Lactose Intolerance) నా యుక్తవయస్సు నుండీ అవస్థ పడుతున్నాను. అసలు విషయం అదని తెలియక ఇండియాలో వున్నప్పుడు ఎంతోమంది దద్దమ్మ డాక్టర్లకు నా సమస్య మొరపెట్టుకున్నాను. అదన్నారు, ఇదన్నారు కానీ ఒక్కడన్నా అది అయివుండొచ్చునేమో అని సూచనప్రాయంగా కూడా అనుమానం వెలిబుచ్చలేదు ఆ మా గొప్ప వైద్యులు. కెనడాకి వచ్చాక లాక్టోజ్ ఫ్రీ మిల్క్ చూసి అదేంటొ ఎయిడ్స్ ఫ్రీ మిల్క్ తరహాలో అనుకొని మనకెందుకులే అది అని పట్టించుకోలేదు. అలా గ్రోసరీకి వెళ్ళినప్పుడల్లా ఆ పాలు చూసి, చూసి ఆసక్తి పుట్టి నెట్టులో వెతికాను. అప్పుడర్ధమయ్యింది - నా లక్షణాలు అవేననీ, మన భారతీయులకే ఈ సమస్య ఎక్కువ వుంటుందనీనూ.  ఆ పాలు తెచ్చుకొని పరీక్షించా - నా సమస్యకి తాత్కాలిక పద్ధతుల్లో పరిష్కారం లభించింది. కానీ ఆ పాలకి ధర ఎక్కువ. ఇంట్లో పెరుగు అందరికీ ఆ పాలతొ చెయ్యాలన్నా, లేక ఏ ఇతర పాల పదార్ధాలు తిన్నా ఇన్నేళ్ళుగా ఇబ్బందిగానే వుండేది. ఎంత నెట్టులో పరిష్కారం కోసం వెతికినా పాలు పక్కన పెట్టమనే కానీ ఓ పరిష్కారం దొరకలేదు. ఇక లాభం లేదని ఈమధ్య లా ఆఫ్ ఎట్రాక్షన్ ప్రయోగించా.
   
అద్భుతః! ఒక దేశీ హెయి కటింగ్ సెలూన్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక దేశీ హోమియో డాక్టర్ కార్డ్ కనపడింది. పట్టుకొని వచ్చి ఫోన్ చేసి కలుసుకొని నా సమస్యలన్నీ మొరపెట్టుకున్నా. ఒక్క పాలే కాకుండా ఇంకా ఏవేవో ఫుడ్ ఇంటోలరెన్సులు కూడా వున్నయ్ నాకు. లాక్టోజ్ ఇంటోలరెన్సుతో సహా వాటిల్లో చాలా వాటికి పరిష్కారం లభించింది. హాయిగా పాలు పెరుగుతో పాటు నాకు ఇష్టం అయిన అహారం అంతా ఎంచక్కా తినగలుగుతున్నాను కానీ గోంగూర మాత్రం ఇంకా పడట్లేదు. అది తిన్న రోజు దగ్గు, జలుబు వగైరాలతో ఆ రాత్రి నాకు నిద్ర పట్టదు. ఇది కూడా తీరితే బావుండును - ఎందుకంటే నాకు గోంగూర పచ్చడి అంటే బాగా ఇష్టం మరీ. 

మీలో ఎవరికయినా లాక్టోజ్ ఇంటోలరెన్సు కానీ, ఫుడ్ ఇంటోలరెన్సులు కానీ, ఆస్మా లాంటివి కానీ వుంటే హోమియో మందులు వాడి చూడండి - మీకూ నయమై పోవొచ్చును.   

నిజమో లేక నా భ్రమో కానీ ఇలా ఒక్కొక్క సమస్యా LOAతో తీరిపోతూవుంటే, అన్నీ ఒక దాని తరువాత ఒకటి కలిసివస్తుంటే జీవితం భ్రహ్మాండంగా సాగిపోదూ? ఇంకో ముఖ్యమయిన సమస్య తీరడానికి రెండు నుండి మూడేళ్ళ సమయం వుంది. నా బ్లాగు మొదట్నుండీ చదువుతూవున్న వాళ్ళు అదేంటో అర్ధం చేసుకోవొచ్చు ;) బయటకి ఎందుకులెండి చెప్పుకోవడం - మీరే చూస్తారుగా మున్ముందూ :))  

కొవ్వు ఎక్కడ కరిగింది చెప్మా?

నాకు చిన్నప్పటి నుండీ వ్యాయామం అంటే వ్యామోహమే కానీ నా బాడీ తట్టుకోక తేలిగ్గా ఓవర్ట్రైనింగ్ సిండ్రోం (Overtraining Syndrome)  వచ్చేది. అసలు అది వస్తోందని కూడా తెలియక దాంతో చాలా అవస్థలు పడ్డాలెండి. ఆఖరుకి దానికి సరి అయిన పరిష్కారం ఈమధ్యే అర్ధమయ్యింది. వెయిట్స్ చేసాకా  ప్రోటీనుతో పాటూ కార్బోహైడ్రేట్స్ కూడా బాగా తీసుకోవాలని. బిక్కుబిక్కుమంటూ వెయిట్స్ చేస్తూ అలా కార్బోహైడ్రేట్స్ తో ప్రయొగాలు చేసా. ఫర్వాలేదు - ఫలించాయి. హమ్మయ్య ఇక భేషుగ్గా వెయిట్స్ చెయ్యొచ్చు కానీ వ్యాయామం వారాంతాలలో ఖచ్చితంగా ఆ రెండు రోజులూ చెయ్యగలుగుతున్నా కానీ వివిధ కారణాల వల్ల ఇతర వారం రోజుల్లో పెద్దగా కుదరడం లేదు. ఆ విషయాన్ని నేను సరి చెయ్యాల్సి వుంది.

వెయిట్స్ చేస్తూ సిక్స్ ప్యాక్ చెయ్యాలనే అత్యాశలేమీ లేవు కానీ ఫ్యామిలీ ప్యాక్ తగ్గించుకోవాలన్న ఉబలాటం మాత్రం వుంది.  నా బరువు సమస్య లేదు - ఎంత కావాలంటే అంత పెంచగలనూ - తగ్గించగలనూ. కాకపోతే బుల్లి బొజ్జ మాత్రం వుందండొయ్. తస్సాదియ్యా ఎంత ప్రయత్నించినా అది మాత్రం పోలేదు. సో, దానిమీద పడ్డా ఇకా. ఆ బుల్లి బొజ్జ రావడానికి ఓ కథ వుందిలెండి. నా యుక్త వయస్సులో బాహ్గా బక్కగా వుండేవాడిని. అలా లాభం లేదని చెప్పి బరువు, లావు పెరగాలనీ బాగా బీర్లు లాగించడమే కాక పెరుగులో నెయ్యి వడ్డించుకొని మరీ భోజనం చేసేవోడిని. అలా బరువు సంగతేమో కానీ బుల్లి బొజ్జ మాత్రం పెరిగిందండీ - మళ్ళీ తగ్గలేదు.

అయితే ఈమధ్య కాలంలో వారాంతాలో క్రమం తప్పకుండా వెయిట్స్ చేస్తూ దాని మీద దృష్టి పెట్టాను.  రోజూ ఉదయమే నా బరువూ, నా బాడీ ఫ్యాట్ % చూసుకుంటూ వుంటా. ఆ ప్రకారం నా శరీరంలో కొవ్వు క్రమంగా తగ్గుతోంది కానీ... కానీ.. బొజ్జ మాత్రం పెరగసాగింది. వా...! ఎక్కడ వుంది లోపం అని చూసా. వెయిట్స్ చేసినప్పుడు పలు కారణాల తాత్కాలికంగా బొజ్జ పెరగొచ్చు. ఓక్కే. అది సరే కానీ మరి కొవ్వు ఎక్కడ తగ్గుతోంది చెప్మా? జీన్స్ వగైరాలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కో ప్రదేశంలో ముందు తగ్గొచ్చు. మరి నాకు ఎక్కాడ? త్వరలోనే అర్ధమయ్యింది - జతొజడల్లో అని - ఐ మీన్ తోడల్లో. కండలు క్రమంగా బయటపడుతున్నాయి. సర్లెండి. ఎక్కడో చోట మొదలయ్యింది కదా, అదే సంతోషం. నెమ్మదిగా టమ్మీ ఫ్లాట్ అవుతుంది లెండి. మొత్తం కొన్ని వారాల్లో 1.5% బాడీ ఫ్యాట్ తగ్గించా. నా ఏజికి, గేజికి 13% నుండి 22% వుంటే సాధారణం. నాకు 21% వుండేది. ఈరోజు 19.5% వుంది. నా లక్ష్యం ప్రస్థుతానికి సరాసరిన 17.5%. నెమ్మదిగా బెల్లీ కూడా తగ్గుతున్నట్లుగానే వుంది. ఇవాళ ఒక బెల్ట్ రంధ్రం తగ్గించా మరి. 

మిగతా వారం రోజుల్లో కూడా చేస్తే ఇంకా మెరుగుదల బాగా వుండొచ్చు - ప్రయత్నిద్దాం. శని ఆది వారాల్లో ఉదయమే వెళ్ళి వస్తుంటారు. దగ్గర్లో వుండే యూనివర్సిటీ జిం చాలా బావుంటుంది - అలాంటి పెద్ద, మంచి జిం ఇంతవరకూ చూడలేదు. వారాంతాలల్లో ఉదయం 8 గంటలకి తెరుస్తారు. వెళ్ళి ఒక పదినిమిషాలు వార్మప్ కోసం ఏరోబిక్స్ చేసి, ఇక 50 నిమిషాలు ఎనరోబిక్స్ మీద పడుతాను. అలా గంట చేసేకా కొంత సమయం సానా (Sauna) లో గడిపి సేదతీరి ఇంటికి వచ్చి ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ పడేస్తుంటాను.  అటుపై కూడా ప్రోటీన్ పై శ్రద్ధ పెట్టి తగిన ఆహారం తీసుకుంటూవుంటాను. అనుకున్న లక్ష్యం నెరవేరుతోంది - సంతోషం కాదూ.