ఎవరయినా బిట్‌కాయిన్ (భవిష్యత్) బిలియనీర్లు వున్నారా ఇక్కాడ?

ఈమధ్య సెలవులకి US వెళ్ళాను. (ప్రస్తుతం కెనడాలో వుంటున్నా లెండి). ఒక గృహప్రవేశానికీ వెళ్ళాను. సత్యనారాయణ వ్రతం జరుగుతోంది. పక్కనే వున్న మిత్రుడు ఒకరు నాతో అన్నాడిలా 'నేను కనుక బిట్‌కాయిన్ బిలియనీర్ అయితే కనుక నేనూ సత్యనారాయణ వ్రతం చేయిస్తా!'.  నేనన్నాను 'సత్యనారాయణ స్వామికి అలా లంచం పడేస్తున్నారా ఏంటీ?!'
అతనన్నాడూ 'తప్పేముందీ? అందరు ధనవంతులూ దేవుడికి ఇలా లంచాలు ఇస్తూనే వుంటారు కదా'. ఈస్నేహితుడు రిటైర్మెంట్స్ సేవింగ్స్ అన్నీ తీసి అందులో పెట్టాడు. అతను కొన్నప్పుడు బిట్‌కాయిన్ $4,000 వుండేది. మూడువారాల క్రితం అది దాదాపుగా $20,000 దాకా పెరిగి మళ్ళీ ఇప్పుడు $16,000 చుట్టుపక్కల వుంటోంది. ధర ఒకేసారి బాగా తగ్గినప్పుడు గుండె పట్టుకున్నాడు.

నేను US లో వ్యక్తిగతంగా కలిసిన మిత్రులందరూ బిట్‌కాయిన్స్ లో గానీ లేదా అలాంటి ఆల్ట్‌కాయిన్స్ (అన్నింటినీ కలిపి క్రిప్టోకరెన్సీ అనొచ్చు) లలో పెట్టుబడిపెడుతున్నారు లేదా పెట్టాలనుకుంటున్నారు. ఒక  నాకు తెలిసిన రెసిడెన్సీ చేస్తున్న డాక్టర్ తన ఆదాయాన్నంతా అందులోనే పెట్టేస్తున్నాడు. ఆ మిత్రులని అడిగి కొన్ని సందేహాలు తీర్చుకొని దీని సంగతేంటా అని రెసెర్చ్ మొదలెట్టా.

ఇప్పటిదాకా ఏదో వార్తల్లో చదవడమే కానీ మన బోటివాళ్ళు కూడా ఇలా వీటిల్లో పెట్టుబడి పెట్టొచ్చని నాకు తెలియదు. అన్ని రకాల సలహాలు పరిశీలించాను. వీటిల్లో రిస్క్ ఎక్కువ కాబట్టి మనం కూడబెట్టుకున్న డబ్బు అంతా తీసికెళ్ళి పెట్టడం మూర్ఖత్వం అంటున్నారు. కానీ అసలే ఇందులో పెట్టుబడి పెట్టకపోవడం కూడా మూర్ఖత్వమే అంటున్నారు మరి. అంచేతా... నేనూ ఓ క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారును అవుదాం అనుకుంటున్నా. మార్కెట్ అధ్యయనం చేస్తున్నా. బిట్‌కాయిన్ లాంటివి వందల కొద్దీ వున్నాయి. ఇక్కడి యువతలో మూడొంతులు వీటిల్లోనే పెట్టుబడులు పెడుతున్నారంట. నాకు బిట్‌కాయిన్ మీద ఆసక్తి లేదు. నాకు ఇథేరియం - Ethereum  (ఇథ్ కాయిన్ - Eth) ఆసక్తికరంగా అనిపిస్తోంది. ముందయితే అందులో పెట్టుబడి పెట్టి చూస్తా. మరీ ఎక్కువ కాదులెండి. నా నెట్ ఎర్నింగ్స్ లో 10%. రిస్క్ వుంది నాకు తెలుసు - ఈ మాత్రం పెట్టుబడి నేను కోల్పోయినా భరించేయగలను.    ఈ రిస్క్ కూడా తగ్గించుకోవడానికి నా ప్లాన్లు నాకు వున్నాయి.

నాకు స్టాక్స్ అర్ధం కావు కానీ ఇది ఆసక్తికరంగా వుండటంతో కాస్తంత అర్ధం అవుతోంది. మొత్తం మీద ఇది ఒక వ్యసనం లాంటిది అని అర్ధం అయ్యింది. ఈ అంటువ్యాధి తగిలితే కనుక వదలడం కష్టం. అందుకే మీకూ ఎక్కించాలని చూస్తున్నా :)) మీలో ఎవరికయినా ఈ వ్యాధి ఇప్పటికే అంటివుంటే వ్యాఖ్యల్లో చర్చిద్దాం రండి.