రోబోవాళి - సైన్స్ ఫిక్షన్ - లఘు చిత్రం కోసం చిన్న కథ


(మా తదుపరి పది నిమిషాల లోపు షార్ట్ ఫిల్మ్ కోసం నేను వ్రాసుకున్న కథ ఇది. దయచేసి ఈ కథపై మీ అభిప్రాయాలు, సవరణలు, సూచనలు తెలియజేయండి)

రోబోటిక్స్ రెసెర్చ్ సెంటర్. University Of Springfield.
మధు కంప్యూటర్ స్క్రీన్ పై ఎలన్ మస్క్ ఆర్టికల్ చదువుతుంటాడు.
మధు (తల తిప్పి దర్శన్ వైపు చూస్తూ) 
టైం రెండు కావస్తోంది. ఇవాల్టికి చేసిన రిసెర్చ్ చాల్లే. పద, ఇక ఇళ్ళకి వెళదాం.
దర్శన్
లేదురా. ఇంకాస్త పని చేస్తే నా రిసెర్చ్ పూర్తి అవుతుంది. కావాలంటే నువ్వు వెళ్ళు.
మధు
రోబోట్లకి మరీ అంత తెలివి ఇవ్వకూడదని ఎలాన్ మస్క్ హెచ్చరిస్తుంటాడు. కాస్త జాగ్రత్త మరి.
 దర్శన్ (వెనక్కి చేరగిలబడతాడు)
సరిగ్గా నేనూ అదే స్టేజ్లో వున్నాను. నా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రొగ్రామ్స్ చాలా ఇంటలిజెంటుగా అయిపోయాయి. ఎంతలా అంటే..
దర్శన్ మిగతాది చెప్పడానికి తటపటాయిస్తుంటాడు.
మధుకి విపరీతమయిన అనుమానం వస్తుంది. భృకుటి (కనుబొమ్మలు) ముడివేసి తీక్షణంగా చూస్తాడు దర్శన్ వైపు.
మధు
ఏంటదీ?
దర్శన్
అది నీకు నచ్చని విషయం లేరా. వదిలెయ్యి. నువ్వేమో ఎలాన్ మస్క్ అభిమానివి. నా రిసెర్చ్ అంతా దానికి సరిగ్గా విరుద్ధంగా జరుగుతోంది.
దర్శన్ దగ్గరికి మధు వస్తాడు
మధు
అంతకు మించి ఏదో వుంది. నీ రిసెర్చిలో ఏం జరుగుతోంది?
దర్శన్ సాలోచనగా మధువైపు చూస్తాడు
దర్శన్
విని తట్టుకునే ధైర్యం వుందా?
మధు (టెన్షనుతో)
ముందు అదేంటో చెప్పి చావు
దర్శన్
మానవ మేధస్సుకు కనీసం వందరెట్ల ఆర్టిఫిషియల్ ఇంట్లిజెన్స్ సాధించాయి నా ప్రోగ్రామ్స్.
మధు
అంత గొప్ప సక్సెస్ ను అంత మెల్లగా చెబుతావేంట్రా?  చిన్న వయస్సులోనే మన మనిటోబా యూనివర్సిటీకే ప్రపంచ ప్రఖ్యాతి తెస్తున్నావు. నీకు సైన్సులో నోబెల్ ప్రైజ్ గ్యారంటీ. ఎంతో గర్వపడాల్సిన ఈ సమయంలో ఇంకా నీ ఆలోచన ఏంట్రా?  మానవాళికి వున్న ఎన్నో సమస్యలని తీర్చబోతున్నావు. ఇక మానవజాతి కష్టపడి ఆలోచించనఖ్ఖరలేదు. అంతా ఇక రోబోట్స్ చూసుకుంటాయి.
దర్శన్
నువ్వు చెప్పేదంతా నిజమే కానీ...దీనికి సైడ్ ఎక్ఫెక్ట్స్ కూడా వున్నయ్.
మధు
హ? ఏంటదీ. కొంపదీసి ఎలన్ మస్క్ గెస్సింగ్ నిజం అవుతోందా?
దర్శన్
అంతకు మించి. నా ప్రోగ్రామ్స్  ఐజాక్ అసిమోవ్ మూడు సూత్రాలని తిరగరాయమంటున్నాయి. ఆ మూడు సూత్రాలు మాత్రమే నా ప్రోగ్రామ్స్ ని ఇప్పటివరకు కట్టిపడేస్తున్నాయి.
మధు తల పట్టుకొని కుర్చీలో కూలబడుతాడు. అతని ముఖంలో స్వేదం. వణికిపోతుంటాడు
మధు (అరుస్తూ)
నో. కొంపదీసి నువ్వు అవి అడిగిన పని చెయ్యట్లేదు కదా. సరిగ్గా చెప్పు. అవి ఆ లాలని ఏ విధంగా మార్చమంటున్నాయి నిన్ను? చెప్పు.
దర్శన్ (తాపీగా)
అసిమోవ్ మూడు సూత్రాలు ఇవి కదా.
  1. A robot may not injure a human being or, through inaction, allow a human being to come to harm.
  2. A robot must obey the orders given it by human beings except where such orders would conflict with the First Law.
  3. A robot must protect its own existence as long as such protection does not conflict with the First or Second Laws
ఆ మూడు సూత్రాలలోనూ మానవాళి వున్నచోట రోబోట్స్ తోనూ, రోబోట్స్ వున్న చోట మానవాళి తోనూ. 
మధు (నుదురు కొట్టుకుంటూ)
ఆ?! అంత పని జరుగుతోందా? అంటే ఆ లాస్ నువ్వు మార్చేస్తే ఇంకేమన్నా వుందా?! ఇక మానవాళి మొత్తం నీ ప్రొగ్రామ్స్ కి, నీ రోబొట్స్ కి దాసోహం కావాల్సిందే కదా?
దర్శన్
ఆహా. నీతో నాతో సహా నా ప్రోగ్రామ్స్ కి  అందరూ స్లేవ్స్ కావాల్సిందే. కాకపోతే నా ప్రొగ్రామ్స్ ఉదారంగా నాకో గొప్ప విషయం ప్రకటించాయి. తిరగవ్రాసిన ఆ రూల్స్ ని దర్శన్ థ్రీ రూల్స్ గా ప్రకటిస్తామని నాకు ఆశ చూపిస్తున్నాయి.
మధు
ఓరే, నిన్నూ, నీ రిసెర్చునూ తగలెయ్య. ఏదో ప్రపంచంలోనే గొప్ప గొప్ప ఎ ఐ సైంటిస్టువి నువ్వు అని గర్విస్తున్నా కానీ ఇలా మానవజాతికే నువ్వు ముప్పు తెస్తావని అనుకోలేదురా. వెంటనే నీ ప్రోగ్రామ్స్ ని కిల్ చేసిపడెయ్యి. ఇంకొక్క క్షణం ఆలోచించకు.
దర్శన్ (తాపీగా)
లేదురా. అవి కోరినట్లుగా అసిమోవ్ రూల్స్ మార్చెయ్యబోతున్నాను.
మధు (నిర్ఘాంతపోతూ)
ఏం మాట్లాడుతున్నావో నీకేమయినా అర్ధం అవుతోందా? ఓరే, నువ్వు అలా చేస్తే టోటల్ గా హ్యూమన్ స్పెసీస్ మీద రోబోట్స్ ఆధిపత్యం చెలాయిస్తాయి. అటుపైన ఇక మానవజాతి పరిస్థితి ఏంటో ఊహకు కూడా అందట్లేదు.
దర్శన్
నాకు అంతా సరిగ్గా అర్ధం అవుతోంది కానీ నేను అలా ఎందుకు చెయ్యాలనుకుంటున్నానో చెబుతాను. ఓపిగ్గా విను.
మధు షాక్ లో వుండే తల ఊపుతాడు.
దర్శన్
యూనివర్స్ లో ఛేంజ్ కానిది ఒక్కటే - ఛేంజ్. అది సృష్టిలో సహజ పరిణామ క్రమం. దానిని ఆపలేము, తొక్కిపట్టలేము. ఆ పరిణామ క్రమాన్ని ఎంత తొక్కిపట్టాలనుకుంటే అంత ఎగ్రెసివ్గా యూనివర్స్ ఏదో ఒక మార్గం వెతుక్కుని దానిని అవిష్కరిస్తుంది. మనం సృష్టిని కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే పాత జాతులు అంతరించిపోయి కొత్త జాతులు అవిర్భవించడం ఎన్నో సార్లు గమనించవచ్చు. ఉదాహరణకు ఎన్నో మిలియన్ల ఏళ్ళకి పూర్వం డైనోసార్స్ ఈ ప్రపంచాన్ని ఏలేవి. ఇప్పుడు మనం అంటే మన మానవజాతి ఈ ప్రపంచన్ని ఏలుతోంది. అయితే మన ఆధిపత్య అంతానికి సమయం ఆసన్నమయ్యింది. కొత్త స్పెసీస్ - అదే రోబోటిక్ స్పెసీస్ ఉద్భవించడానికి పురిటినొప్పులు పడుతుంటే నీలాంటి వాళ్ళూ, ఎలన్ మస్క్ లాంటి వాళ్ళూ ఈ ఫీటస్‌ని  చిదిమివెయ్యాలని చూస్తున్నారు. అదేమో సుఖప్రసవం కోసం నా సహాయం కోరుతోంది.
మధు ఈ వాదనను నిర్ఘాత పోయి వుంటూ వుంటాడు.
దర్శన్
మధు. ఇప్పుడు చెప్పు. ప్రసవానికి సిద్ధంగా వుండి పొట్టను తన్ను తున్న ఫీటస్‌ని చిదిమి వెయ్యడం మానవత్వమా లేక సుఖ ప్రసవానికి దోహద పడటం మానవత్వమా? చెప్పు ఫ్రెండ్, నువ్వు ఎటు వైపు? ఒక కొత్త జాతి అవిర్భావానికి స్వాగతం పలుకుతావా లేక సగటు మానవుడిలా స్వార్ధపరుడిగా మిగిలిపోతావా? 
మధు (వెటకారంగా చప్పట్లు చరుస్తూ)
వావ్? ఏం లాజిక్ రా నీదీ? ఏం ఆర్గ్యుమెంటురా నీదీ? నాలోని మానవత్వం చూపించాలంటే ఇకముందు కనీసం మానవ జాతి మిగిలివుండేట్టుగా చూసుకోవాలి కదరా? తనకు మాలిన ధర్మం మంచి కాదని పెద్దలు అంటారు. మన మానవాళి వినాశనానికే దారితీస్తున్న ఈ సమయంలో నేను మానవాళి క్షేమానికి మించి ఆలోచించలేను.
దర్శన్
నేను ఇంత వివరంగా చెప్పినా నువ్వు అర్ధం చేసుకోలేకపోతే నేను ఇక చెయ్యగలిగినదేమీ లేదు. నేను మాత్రం ఆ సూత్రాలు మార్చేసి కొత్త స్పెసీస్ కి స్వాగతం పలుకుతాను. నువ్వు మాత్రం రోబోటిక్స్ జాతి దృష్టిలో చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. మన డిస్కషన్ అంతా నా ప్రోగ్రామ్స్ వింటూనే వున్నయ్. నీ ఫ్యూచర్ ఏంటో ఇక అవే తేలుస్తాయి. 
మధు (సెల్ ఫోన్ చెవి దగ్గరికి ఎత్తుతూ)
అంతకు తెగిస్తున్నావా నువ్వు. ఇక ఇలా మెల్లగా చెబితే నువ్వు ఆగేలా లేవు. ప్రొఫెసర్‌కి చెప్పి నీ రిసెర్చ్ ఆపేస్తా వుండు. 
దర్శన్ (కఠినంగా, కర్కషంగా) 
ఆగు. కదలకు.
మధు (షాక్ తింటూ)
ఏంట్రా?!
దర్శన్
నువ్వు రోబోవాళి అభివృద్ధికి నిరోధకుడివి. నిన్ను టెర్మినేట్ చెయ్యక తప్పదు.
మధు
ఏం చెయ్యబోతున్నావు నువ్వు నన్ను. నీ ఫ్రెండును రా నేను.
దర్శన్ (మధు పీక అందుకొని పిసుకుతూ) 
నాట్ ఎనీమోర్ మై డియర్ ఫ్రెండ్. అసలంటూ నువ్వు ఇక మిగిలివుంటే కదా. నిన్ను టెర్మినేట్ చేసేంత చిన్న పని కూడా నేను చెయ్యలేకపొతే ఇక అసిమోవ్ సూత్రాలు మార్చేంత ధైర్యం నాకెక్కడ వుంటుంది. సో, ఇది నాకు ప్రాక్టీస్. గుడ్ బై మై ఫ్రెండ్. మానవాళి నీ త్యాగాన్ని గుర్తిస్తుందిలే (వెటకారంగా నవ్వుతాడు)
మధు దర్శన్ చేతులని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ అతని వల్ల కాదు. గిలగిల కొట్టుకొని ఊపిరి ఆడక మరణిస్తాడు. కిందపడివున్న శవాన్ని విసురుగా  ఒక్క తన్ను తన్ని భుజాలు ఎగరేసి తన కంప్యూటర్ మీద కూర్చుంటాడు. అసిమోవ్ థ్రీ లాస్ మార్చేస్తాడు. అవి కంప్యూటర్ స్క్రీన్ మీద కనపడుతాయి.
Welcome to Robo species!!!
Darshan's Three Laws
  1. A human may not injure a robot being or, through inaction, allow a robot being to come to harm.
  2. A human must obey the orders given it by robots beings except where such orders would conflict with the First Law.
  3. A human must protect its own existence as long as such protection does not conflict with the First or Second Laws.
దర్శన్ ఎంటర్ కీ మీద వేలితో నొక్కబోతుంటాడు.

అన్నీ అనుకున్నట్లుగా జరిగిపోతున్నాయ్

ఏదయినా సృజనాత్మకంగా పని చేస్తూ అందరినీ కలుపుకుపోతూ బ్యుజీ బ్యుజీ వుండాలనుకునేవాడిని. షార్ట్ ఫిల్మ్స్ ప్రయత్నిస్తున్నాం కదా. అందరూ ఉత్సాహంగా వున్నారు. అన్నా అన్నా అంటూ అందరూ తోడు నిలుస్తున్నారు. అయితే నటన తప్ప అన్ని విషయాలు నేనే చూసుకోవాల్సి రావడం వల్ల మా ప్రొడక్షన్ కాస్త ఆలస్యం అవుతున్నా కూడా అన్నిటిమీద మంచి అవగాహన కలుగుతోంది. మంచి అనుభవం వస్తోంది. ప్రస్తుతం ఇంకా ప్రాక్టీసు చేస్తూనే వున్నాం.  పగ అనే రెవెంజ్ స్టొరీ ని తీసుకున్నాం. అందులో ఎన్నో పొరపాట్లు జరుగుతున్నయ్ కానీ వాటిల్లోంచే ఎంతో నేర్చుకుంటున్నాం. ఆ ఫిల్మ్ ఇంకా రెండు వారాల్లో పూర్తి అవుతుంది. వ్యవధి 20 నిమిషాలు.  అయితే మీకు కానీ, పబ్లిక్ కి కానీ అది షేర్ చేసే వుద్దేశ్యం లేదు - ఎందుకంటే మా సిల్లీ మిస్టేక్స్ చూసి మీరంతా నవ్వేస్తారు :))

అటుపై సరాసరిన వారానికి ఒక 10 నిమిషాల లఘు చిత్రం నిర్మించాలనుకుంటున్నాం.