రెండు గంటలు - లఘు చిత్రం షూటింగ్ విశేషాలు

- షూటింగ్ చక్కగా, సరదాగా జరిగింది. మా అందరికీ ఎంతో అనుభవం వచ్చేసింది.
- రెండే పాత్రలు. హీరో నటనలో ఇబ్బంది పడటం వల్ల బాగా స్లో అయ్యి కొంత మాత్రమే చిత్రీకరించగలిగాము.
- కథ బావున్నప్పటికీ సీరియస్ సబ్జెక్ట్ అవడం వల్ల కష్టపడి తీసినా రిపీటెడ్ ప్రేక్షకులు వుండరేమో అనే అనుమానంతో ఈ చిత్రీకరణ అటకెక్కించేసాం.
- తదుపరి చిత్రం కోసం కథ వ్రాస్తున్నాను.  ప్లాట్ డిపర్సనలైజేషన్ డిజార్డర్. ఇంఫోటైన్మెంట్.
- ఈ లఘుచిత్రాల పనుల వల్ల తీరికలేక వ్యాఖ్యలకు ప్రతిస్పందించడంలోనూ, పోస్టులు వ్రాయడంలోనూ బాగా జాప్యం జరుగుతోంది. మన్నించండి.

ప్రాణం (Working Title) - Short Story Draft Part - 1

(ఈ ఆదివారం చిత్రీకరణ కోసం కాస్త హడావిడిగా వ్రాసిన, వ్రాస్తున్న కథ కాబట్టి అంత బాగా రాకపోతుండవచ్చు. దీనిని ఇంకా బాగా ఫైన్ ట్యూన్ చెయ్యాల్సివుంది.)

"రండి." అని సుదీప్ ని ఆహ్వానించాడు
"మీరు చాలా ప్రొఫెషనల్ గా అగుపిస్తున్నారే" లొపలికి వస్తూ అన్నాడు సుదీప్.
"నేను ప్రొఫెషనల్ నే కదా" సన్నగా నవ్వాడు
"మీ గొంతు ఫోనులో బొంగురుగా వుంది కాని ఇప్పుడు నార్మల్ గానే వుందే!"
"అవును. ఫోన్ మీద కర్చీఫ్ పెట్టుకొని పెట్టుకొని మాట్లాడా అప్పుడు నన్ను మీరు గుర్తుపట్టకుండా"
"నిజమా!"
"కాదు. జోకు"
"జోకా?"
"కాదు నిజం"
సుదీప్ కి ఫక్కున నవ్వొచ్చింది. "వెరీ ఫన్నీ" అని గలగలా నవ్వాడు
"కదా"
  ----
"చెప్పండి. ఎందుకు చావాలనుకుంటున్నారు?" అని అడిగాడు రతన్.
సుదీప్ ఇబ్బందిగా కుర్చీలో నుసిలాడు. "ఆ వివరాలన్నీ మీకు ఇప్పుడు అవసరమా? నేను అడిగిన పని చేసిపెట్టండి చాలు"
"అవసరమే. నేను పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఏ కేసూ తీసుకోను"
సుదీప్ దీర్ఘంగా నిట్టూర్చాడు. "హ్మ్. ఏమో, అలా చావాలని అనిపిస్తుంది అంతే. పూర్తిగా నిరాశా నిస్పృహానూ."
"ఏం సమస్యలున్నాయి?"
"నిజానికి సమస్యలేమీ లేవు. ఏ సమస్యా లేకపోవడమే నా సమస్యేమో. చావాలనుకోనే ఆలోచనను ఆపుకోలేకపోవడమే నా సమస్య"
"నిజమే. జీవితం మరీ చక్కగా నడుస్తోంటే బుర్రకి పనిలేక చెత్తగా అవుతుంది. ఇదివరలో డాక్టర్లని కలిసారా?"
"లేదు. నాకు సాధారణంగా డాక్టర్లని కలవడం నచ్చదు. ఏమీ ఇంతవరకు కలవలేదు. బ్రతకాలని అనుకుంటే కలిసేవాడినేమో కానీ కాదు కదా. అందుకే మిమల్ని కలుస్తున్నా.
"మానసిక వైద్యంలో మందులు వుంటాయి. వాడి చూడండి. బ్రతకాలని అనిపించవచ్చు"
"నాకు బ్రతకాలాలని లేదు"
"అయితే మీకు మరణమే శరణ్యం"
"ఖచ్చితంగా"
"మరి మీ భార్యా పిల్లలు...?"
"ఏమో...తెలియదు. దూరం అవుతాను...తప్పదు"
"వాళ్ళంటే మీకు ప్రేమ లేదా?"
"వుంది" అని నిట్టూర్చి "బోలెడంత వుంది" అని పొడిగించాడు. అతని గొంతు గాద్గదికం అయ్యింది. "...కానీ ఏం చెయ్యను, నా మనస్సు నా ఆధీనంలో లేదు" అన్నాడు సుదీప్ బేలంగా
"అర్ధం అవుతోంది" తల పంకిస్తూ అన్నాడు రతన్. "అయితే మీ దుఖ్ఖానికి కారణం మీ భార్యా పిల్లలు కాదన్నమాట"
"అవును. ఎవరూ కాదు. కేవలం నేనే కారణం. నిజానికి నా భార్యాపిల్లలు నన్ను ఎంతగానో ప్రేమిస్తారు, నేనూ వాళ్ళని ఎంతగానో ప్రేమిస్తాను. కానీ...నా పరిస్థితేంటో మీకు అర్ధమయ్యింది కదా"
తల పంకించాడు రతన్. "మీరు డిప్రెషనులో వున్నారు. దానికి ఏవో సమస్యలే కారణం కానక్కర లేదు. ఏ కారణం లేకుండా కూడా అది రావొచ్చును. మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్స్ యొక్క అసమతుల్యత వల్ల అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది"
"అవునా. ఏ సమస్యలు లేకుండా కూడా మానసిక బాధలు రావొచ్చా! కొత్తగా వింటున్నా ఇది నేను"
"అది నిజం. అందుకే మీరు శుబ్బరంగా మీ మనోవ్యాకులత దూరం కావడానికి మందులు వాడండి, సరిపోతుంది"
"లేదు. నాకు అంత ఓపిక లేదు. నేను హాయిగా మరణించాలని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయానికి తిరుగులేదు. నా ఆస్థి చాలా వరకు నా భర్యా పిల్లల మీద, కొంత నాధ శరణాలయాలకూ విల్లు వ్రాసేసాను. నేను పోయినా సరే వాళ్లకు ఏ కష్టమూ కలగకుండా అన్ని ఎర్పాట్లూ చేసేసాను"
"ఎన్ని ఏర్పాట్లు చేసినా మీరు లేనిలోటు ఎవరూ తీర్చలేరు కదా" అనునయంగా అన్నాడు రతన్.
సుదీప్ విసుగ్గా "మీరు అనవసరంగా నా మనస్సు మార్చడానికి ప్రయత్నించకండి. నేను అడిగిన పని చేసిపెట్టండి చాలు. మీరు కాదంటే నేను మరో వ్యక్తిని చూసుకుంటాను" అన్నాడు.
"మీరు అడిగిన పని చేసిపెట్టేముందు నా వంతు ప్రయత్నం నేను చేసా కానీ లాభం లేదు. మీరు గట్టి నిర్ణయంతో వున్నారు"
"అవును" అన్నాడు పరాకుగా ఏదో ఆలోచొస్తూ.
"అలాగే, మీరు చెప్పినట్లే చేద్దాం. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు? ఎలాగూ చావబోతున్నారు కదా. మీ భార్యా పిల్లల్లూ, ఆస్థిపాస్థులూ ఏమయిపోతే మీకేం? మీరేమయినా మళ్ళీ చూడొస్తారా ఏంటీ? ఆ ఆస్థిపాస్థులు ఏవో నా పేరిట రాసివ్వ కూడదూ?"
"కుదరదు" అన్నాడు కరుకుగా. "అసలు నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వూ ఆ వ్యవహారాల్లో ఘటికుడివే అయినా మనిషిగా మంచివాడివి అని మధ్యవర్తి చెబితేనే ఇటు వచ్చా. ఇలా నా కుటుంబానికి చెందాల్సిన ఆస్థి మీదనే కన్నువేస్తావని అనుకోలేదు. నీకో నమస్కారం. నువ్వే పనీ నాకు చేసిపెట్టక్కర్లేదు".
"కంగారు పడకండి. మీ భార్యాపిల్లల మీద మీకు ఎంత ప్రేమ వుందో తెలుసుకుందామని అలా అన్నా అంతే. నిజానికి మీ భార్యాపిల్లలు అదృష్టవంతులు... ఇప్పటిదాకా. ఇకపై దురదృష్టవంతులు అవుతారు. ప్చ్!"
"హ్మ్" నిట్టూరుస్తూ తల పక్కకు తిప్పుకున్నాడు సుదీప్. అతని కళ్ళళ్ళొ నీళ్ళు.
కాస్సేపు మౌనం  రాజ్యం ఏలింది వాళ్ళ మధ్య.

"సరే. నేను చెప్పిన చోట డబ్బు జారవిడిచి వచ్చారు కదా"
"అవును. మనం అనుకున్న మొత్తం ఖచ్చితంగా జారవిడిచి వచ్చాను"
"సంతోషం. ఒక్క నిమిషం. మా వాళ్ళు ఆ డబ్బు తీసుకొని సరిగా వుందో చూసివుంటారు, కనుక్కుంటాను"
"నా మీద నమ్మకం లేదా? చావబోయేవాడిని అలా మోసం చేస్తానా?"
"మోసం చెయ్యాలనుకునేవారు ఎప్పుడయినా చేస్తారు. వాళ్ళకి చావుబ్రతుకులతో సంబంధం వుండదు. వారికి అది రక్తంలోనే వుంటుంది" అని సన్నగా నవ్వాడు రతన్. "మీ మీద నమ్మకం లేక కాదు కానీ ఒకసారి చూసుకోవాలి. ట్రస్ట్ బట్ వెరిఫై అని రోనాల్డ్ రీగన్ అన్నాడు"
"సరే మీ ఇష్టం"

"మా వాళ్ళు ధృవీకరించారు. సంతోషం. ఇక మనం ఒప్పందంలోకి వచ్చాం. నాకు కావాల్సింది మీరు ఇచ్చారు - ఇక మీకు కావాల్సింది నేను ఇస్తాను. ఈ సందర్భంగా డ్రింక్స్ తీసుకుందాము. మీకోసం ఐస్ వైన్ సిద్ధంగా వుంచాను" రతన్ లేచి నిలబడుతూ అన్నాడు.
"హర్రే. నాకు ఐస్ వైన్ మాత్రమే ఇష్టం అని మీకు అలా తెలుసు??"
రతన్ మళ్ళీ సన్నగా నవ్వాడు. " నా క్లయింట్ గురించి వీలయినంతా తెలుసుకోవడం నా విద్యుక్త ధర్మం కదా. కాదా? ఇంకా మీ గురించి చాలా తెలుసు"
"నిజమా?!"
"మీరు ఇక్కడికి వచ్చేముందు మీ ఆవిడకి ఎన్ని ముద్దులు ఇచ్చారో కూడా తెలుసు"
"నిజమా?!"
"చూస్తారా?"
"ఆ!?"
"హహ. ఖంగారు పడకండి రికార్డ్ చెయ్యలేదు లెండి. మూడు. అవునా. ఇలా అన్నీ తెలుసుకుంటుంటామని మా క్లయింట్లకి సాధారణంగా చెప్పను కానీ మీరు ఎలాగూ త్వరలో చావబోతున్నారు కదా. సమస్య ఏమీ లేదు మీతో" అంటూ ఓపెన్ టాప్ టేబుల్ దగ్గరికి నడిచాడు. 
"ఇన్ని జాగ్రత్తలు తీసుకునే మీరు ఇంతధైర్యంగా ఈ హోటెల్ లో ఇలా?"
అతను అటువైపుగా వుండి ఒక పౌడర్ వైనులో కలుపుతూ "మా జాగ్రత్తలు మేము తీసుకుంటాము లెండి. ఇప్పుడు మీరు చూస్తున్న నా రూపం నిజం అనుకుంటున్నారా? మారు వేషం. మారు పేరుతో తీసుకున్నా ఇది. ఇలాగే ఇంకెన్నో జాగ్రత్తలు"
"మారువేషమా? గొప్పవారే?"
రతన్ గలగలా నవ్వుతూ వైన్ గ్లాస్ అందిస్తాడు. "నయాగరా ఆన్ ద లేక్ గ్రామ ద్రాక్షతోటల్లో మంచుతో ఘనీభవించిన ద్రాక్షతో చేసిన స్వఛ్ఛమయిన ఐస్ వైన్ ఇది. కానివ్వండి. ఛీర్స్ టు యువర్ డెత్"
'ఛీర్స్" గలగలా నవ్వుతూ అన్నాడతను. "రుచి అద్భుతంగా వుంది"
"ఇంకో రెండు గంటల్లో మీ జీవితం ఇంకా అద్భుతంగా వుంటుంది"
"అవును. ఈ మందుతో బాధలన్నీ మటుమాయం" గలగలా నవ్వుతూ
"నిజంగానే"
"నిజ్జంగానే?" సరదాగా నవ్వాడు సుదీప్.

మా కథ మీకు చెప్పాలా వద్దా?

రంగ్ దే బసంతి సినిమాలో అనుకుంటా ఒక పార్కులో మెట్ల మీద కూర్చొని నాటకం కోసం చర్చిస్తుంటారు. నిన్న నాకు అలాగే అనిపించింది. మా ఫిల్మ్ టీం మెంబర్లం కొంతమందిమి కలిసి మా సిటీలో వున్న గొప్ప పార్క్ లోని ఆమ్ఫిథియేటర్ మెట్ల మీద కూర్చొని కథా చర్చలు చేసేం. ఒక అయిదు నిమిషాల నిడివి గల లఘు చిత్రం కోసం కథ చర్చించాము. నేను ప్రతిపాదించిన వైవిధ్యమయిన కథాంశానికి అందరం కలిసి మెరుగులు దిద్దాం. రేపటి నుండి మా కుటుంబంతో కలిసి వెకేషనుకి వెళుతున్నాం. అందువల్ల దానికి ముందే ఒక కిక్ స్టార్ట్ మీటింగ్ పెడితే అందరూ ఈలోగా దాని గురించి ఆలోచిస్తుంటారు కదా అని సమావేశ పరిచాను. అనుకున్నవాళ్ళు అంతా రాలేకపోయారు కానీ సగం మంది అయినా వచ్చేసారు. సినీ శాఖల్లో ఒక్కొక్కరి బలాలు, బలహీనతలు చర్చించుకున్నాం.

మా టీమ్ మెంబర్లలో ఆయా విషయాలలో ఆసక్తి వుండటం గొప్ప విషయం అయితే ఎవరికీ కూడా థియరిటికల్ నాలెజ్ లేకపోవడం ప్రధానలోపం. అందుకే కేవలం సినిమాలు చూసి సంపాదించిన జ్ఞానమే కాకుండా ఆయా శాఖలపై పలు పుస్తకాలూ, వీడియోలూ చదివీ, చూసీ పలు విషయాల మీద అవగాహన పెంచుకోమని సూచించాను. ఉదహరణకు నటనపై ఆసక్తి, అనుభవం వున్నవారికి నటనలో పలు రకాల పద్ధతులు ఇంప్రొవైజేషన్, మెథడ్ ఏక్టింగ్ వగైరాలు తెలుసుకోమని చెప్పాను. మా వాళ్ళు అంతా కథని మెరుగుదిద్దడం కోసం విలువైన సూచనలు ఇచ్చారు. ఇంకా కథని ఫైన్ ట్యూన్ చేస్తూ వెళతాం. మాలో ఒకరికి స్క్రీన్ ప్లే అంటే ఇష్టం కావడం సంతోషంగా వుంది. అతగాడికి స్టోరీ బోర్డులు వేయడం కూడా వచ్చు. యే! అయితే మ్యూజిక్ మీద బాగా పట్టున్న వాళ్ళు మాకు లభించాల్సి వుంది.

అయితే మా కథ మీతో చర్చించాలా వద్దా అనేది తేల్చుకోలేకపోతున్నా. మీతో చర్చిస్తే మీరూ విలువైన సూచనలు చెప్పవచ్చు. ఆ కథని మేము ఎలా తీస్తామా అనే ఆసక్తి మీలో కలగవచ్చు. అయితే కథ చెబితే మా ఫిల్మ్ మీద కాస్తో కూస్తో మీకు ఉండే ఆసక్తి కాస్తా తగ్గవచ్చు. సరే ప్రస్తుతానికి అయితే స్టొరీ లైన్ కాస్త చెప్పేస్తాను. ఒకవ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి ధైర్యం లేక తనని హత్య చేయడానికి ఒక (షార్ప్) షూటర్ ని నియమించుకుంటాడు. అలాంటప్పుడు అది హత్య అవుతుందా లేక ఆత్మహత్య అవుతుందా? ఆ షూటర్ ఒకవైపు తనని చంపేస్తానని, చంపేస్తున్నానని చెబుతూనే అతగాడి మనసు మార్చేస్తాడు. ఇది ఒక సప్సెన్స్ ఫిల్మ్ లాగా తీర్చిదిద్దుతాము. కథ మొత్తం మీ ముందు వుంచినప్పుడు తెలుస్తుంది. అయిదు నిమిషాలలోనే సెంటిమెంట్, సప్సెన్స్, డ్రామా, ఏక్షన్, క్రైం, కామెడీ అన్నీ వుంటాయి.

ఇది ఇలా వుండగా తదుపరి ఫిల్మ్ కోసం కూడా ఆలోచనలు సాగుతున్నాయి. హరర్ కామెడీ. మాలో ఒక నటికి హరర్ సినిమాలు అంటే ఇష్టం వుండటం దీనికి ఒక అస్సెట్. దీనికి కథ ఇంకా సిద్ధం కాలేదు - ఆలోచిస్తున్నా - నా సినిమా అంటే వైవిధ్యమయిన కథాంశం వుండాలి మరి. అందరిలాంటి సినిమాలు నేనూ తీస్తే నా గొప్పదనం ఏం ఉంటుంది సార్? అటుపై కొత్త కాన్సెప్ట్ తో రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్. ముద్దులకు అభ్యంతరం లేని నటీనటులు కావాలి దానికి - ఎందుకంటే ముద్దులే ముఖ్యం అందులో. ఆ కాన్సెప్ట్ అలాంటిది మరీ!  

మొదటగా లఘు చిత్రాల వైపు నా పయనం

 చిత్ర దర్శకుడిగా అయ్యే క్రమంలో షార్ట్ ఫిల్మ్ లు తియ్యబోతున్నాను. చాలా చాలా ఆలోచనలు వున్నయ్. ఒకదాని తరువాత మరొకటి చూద్దామేం. ఈమధ్య ఒక గొప్ప కథ కోసం ఆలోచించాను. నిన్న స్ఫురించింది. ఇన్నాళ్ల వరకూ నవల్స్ కోసం పెద్ద ప్లాట్స్ ఆలోచించడమే కానీ షార్ట్ ఫిల్మ్ కోసం ఆలోచనలు చెయ్యలేదు. అందువల్ల ఇది కాస్త కొత్తగా వుంది. నా నవల్స్, బ్లాగులు చదివిన వారికి నా రచనలు ఎంత ప్రత్యేకంగా, వైవిధ్యంగా వుంటాయో తెలిసిందే. అదే ముద్రని లఘు చిత్రాల్లో కూడా చూపిస్తాను. కనీసం వారానికి ఒక లఘు చిత్రం అయినా తీస్తూపోవాలని నా ప్రస్తుత సంకల్పం.

మీలో ఎవరికయినా లఘు చిత్రాల్లో ఆసక్తి కానీ అనుభవం కానీ వుంటే చెప్పండి. ఆలోచనలు పంచుకుందాం - వీలయితే కలిసి పనిచేద్దాం. పెద్ద పెద్ద చిత్రాలు అంటే ఇప్పట్లో నావల్ల కాదు కానీ కథని అందించి ఇండియాలో కూడా లఘు చిత్రాలని నిర్మింపజేసే ఆలోచన వుంది. అందువల్ల మీరు గనుక ఇండియాలో వుండి మీకు వీటిల్లో ఆసక్తి వుంటే చెప్పండి. వీలయితే కలిసి పనిచేద్దాం.

వచ్చేవారం ఒక పది రోజుల వెకేషన్ కోసం వెళుతున్నాం. ఓహ్, ఎన్నో ప్రదేశాలు, మానస సరోవరం లాంటి ప్రదేశాలు చూడబోతున్నాం. పనిలో పనిగా నా తదుపరి చిత్రాల కోసం లోకేషన్లూ చూసుకున్నట్టు అవుతుంది. తిరిగి వచ్చాక లఘు చిత్రాల సంగతి చూస్తా. ఔత్సాహిక నటులు, టెక్నీషియన్లూ ఇక్కడ వున్నారు. వాళ్ళ సహకారంతో పని కానిస్తాను.