అప్పుడు 50 కోట్లు - ఇప్పుడు 5000 కోట్లు

మన విజయాలకూ, అపజయాలకూ మూలం మన మనస్సులో బలంగా నాటుకుపోయిన విశ్వాస వ్యవస్థ. మన మనస్సులోని ఆయా విశ్వాసాలు మంచివా చెడ్డవా సరి అయినవా కావా అనే విషయం పక్కన పెట్టేస్తే మనం మనలోని బిలీఫ్ సిస్టం ని బట్టి నడుస్తూవుంటాం. మనలోని విశ్వాస వ్యవస్థ ఎలా ఏర్పడుతుంది? చిన్నప్పటి నుండీ మనకు మనం లేదా మనకు ఇతరత్రా అందే సూచనలు, అనుభవాలను బట్టి అది ఏర్పడుతుంది. మనం విజయాలు సాధిస్తూ వున్నామూ, సంతోషంగా వుంటున్నామూ అని అనుకుంటున్నట్లయితే చాలావరకు బిలీఫ్ సిస్టం బాగానే వుంటుండొచ్చు. లేదూ జీవితంలో ఇబ్బందులు వుంటుంటేనూ ఎదురవుతుంటేనూ లోపం చాలావరకు మనలోని బిలీఫ్ సిస్టం లో వుంటుండొచ్చు. 

అంటే అస్సలు మన గురించి మనకు ఏం అంచనా వుంది? అస్సలు మన గురించి మనం ఏం అనుకుంటున్నాం. మన గురించి మన ఇంట్లో వాళ్ళకి ఏం ఇమేజ్ వుంది? మన చుట్టూరా వున్న వాళ్ళలో ఏం ఇమేజ్ వుంది? ఇతరత్రానూ, ఇంట్లో వాళ్ళనూ కాస్సేపు పక్కన పెట్టేస్తే మన గురించి మనలో ఏం నమ్మకం వుంది? ఆగండి. ఒక రెండు నిమిషాలు తర్కించుకోండి. డబ్బే ప్రధానం కాదు కానీ ఉదాహరణకు ఇప్పుడు డబ్బునే తీసుకుందాం. మీ జీవిత కాలంలో ఎంత డబ్బుని సంపాదించగలరు? సరదాగా వ్యాఖ్యల్లో చెప్పండేం. షద్ హెమిస్టెట్టర్ వ్రాసిన పుస్తకం చదవక ముందూ, లా ఆఫ్ ఎట్రాక్షన్ పుస్తకాలు చదవకముందు నన్నే గనుక ఇలాంటి ప్రశ్న వేస్తే మీలో చాలామందిలాగా ఒక రెండు నిమిషాలు బుర్ర గోక్కొనీ కనాకష్టంగా  ఓ యాభం కోట్లు సంపాదిస్తానేమో అని గొణిగేవాడిని. మరి ఇప్పుడు? ఒక 5000 కోట్లు. ఎలా? ఏమో నాకేం తెలుసూ? నా నమ్మకం అలాంటిది. నా ఆత్మ విశ్వాసం అలాంటిది. నాలో సరికొత్తగా బలపడుతున్న నమ్మకపు వ్యవస్థని బట్టి ఆ అంకె ఇంకా ఎంతో మారవచ్చును. 

ఎలా అన్న సంగతి తరువాత. మనలో అంత కెపాసిటీ వుందనే నమ్మకం వుంటే మనం చాలా వరకు ఆ అంచనాలను అందుకోగలం.  ఆ నమ్మకం మనలో ఏర్పడాలి అంటే ఏం చెయ్యాలి? మనలోని ప్రోగ్రామింగ్ మార్చుకోవాలి. గత ఏడాది కాలంగా నేను చేస్తున్నదీ, పరీక్షిస్తున్నదీ అదే. డబ్బు విషయాల్లో ఇంకా కాదు గానీ మిగతా విషయాల్లో ఈ సిద్దాంతాలని పరీక్షిస్తూ అద్భుతమయిన విజయాలని నాకు నేనే నమ్మని విధంగా సాధిస్తూ వస్తున్నా. పరీక్ష కోసం చిన్న చిన్న విషయాలనే ఎంచుకున్నా కానీ అవి చక్కటి ఫలితాలు సాధించడంతో నాలో నాకు మంచి నమ్మకం ఏర్పడింది. ఇక 2017 నుండీ సంపాదనలో ఈ ప్రోగ్రామింగ్ పద్ధతులు ఉపయోగిస్తా. చూద్దాం, అవి ఎలా జరుగుతాయో. ఇవాలంటే రేపే ఫలితాలు సిద్ధిస్తాయి అనికాదు. మనలో చిన్నప్పటినుండీ నాటుకు పోయిన నెగెటివ్ వ్యవస్థ మారడానికి కొంత సమయం పడుతుంది, అవి ఫలితాలు ఇవ్వడానికి ఇంకొంత సమయం పడితే పట్టొచ్చు కానీ మనం సరి అయిన దారిలోనే వున్నామా లేదా అన్నది మనకు తెలుస్తూనే వుంటుంది.  

కొన్నిసార్లు ఈ పద్ధతులు పాటిస్తూ అనుకున్న విధంగా జరగట్లేమిటా అనుకునేవాడిని. కొన్ని ప్రయత్నాల తరువాత ఊహించని ఫలితాలు ఎదురయ్యేవి. ఏంటా అని చూస్తే మిగతా ప్రయత్నాల్లో నేను లక్ష్యానికి చేరువ అవుతూ వస్తున్న సంగతి బోధపడింది. ఈ రకంగా నేను ఈ విషయాల గురించి బ్లాగులు వ్రాయడం కూడా నాలోని నమ్మకపు వ్యవస్థను బలీయం చేసుకోవడానికే. ఎవరికయినా ఈ వ్రాతలు ఏమాత్రం అయినా ఉపయోగపడితే అది నాకు బోనస్ క్రింద లెక్క. పోస్టులు వ్రాయాలంటే ఎంతో కొంతా ఆయా విషయాల గురించి ఆలోచించాలీ, పుస్తకాలు తిరగెయ్యాలీ అలా అలా నాకు ఉపయోగకరం. వ్రాస్తూ వుంటే, వ్రాయడం కోసం పరిశోధిస్తూ వుంటే నాలో నాకు ఈ విషయాల గురించి ఇంకా ఇంకా స్పష్టత వస్తుంది. 

సో, మనలోని నెగెటివ్ నమ్మకపు వ్యవస్థలను మైండ్ ప్రొగ్రామింగ్ ద్వారా మార్చుకోవచ్చు. అదెలాగో తరువాయి పోస్టుల్లో చర్చిద్దాం.  

హార్డ్ డిస్క్ లాంటి మన మనస్సు

మన మనస్సు హార్డ్ డిస్క్ లాంటిదని What to say when you talk to your self అనే పుస్తకంలో షడ్ హెల్మ్స్టెట్టర్ అంటారు. మన చిన్నప్పటినుండీ మనకు పలు విధాలుగా సూచనలు అందుతూ వుంటాయి. అవన్నీ కలిసి పలు ప్రొగ్రాములుగా (బిలీఫ్ సిస్టంలుగా) తయారవుతాయి. అలా ఆ కంప్యూటర్ (మనం) ఆ ప్రోగ్రాముల పరంగా పనిచేస్తుంది. అలా అమకు అంది వచ్చే సూచనల్లో మంచివి తక్కువే వుంటాయి, చెత్తవి ఎక్కువే వుంటాయి. అలా మన మనస్సు చాలా వరకు నెగటివ్ భావాలతోనే నిండిపోతుంది. కొన్ని సార్లు మనకు తెలియకుండానే బయటినుండి పలు సంకేతాలు, సూచనలు అందుతూ వుంటాయి. అవి మన అంతః చేతనలో రికార్డ్ అవుతూ వుంటాయి. అలా ఇంటా బయటా, మనంలో మనం, మన గురించి ఇతరులూ అనుకునే విధాన్ని బట్టి అంటున్న విధాన్ని బట్టి మన వ్యక్తిత్వం రూపొందుతూ వుంటుంది. 

మనం అదృష్టవంతులం అయివుండి చిన్నప్పటినుండీ మనకు పాజిటివ్ ఇన్స్ట్రక్షన్స్ అందుతూ వున్నట్లయితే భలేగా వుంటుంది కానీ అది సత్యదూరం కదా. పోనీ పెళ్ళి అయ్యేంతవరకు అందరూ మనని మొనగాడు అన్నా పెళ్ళయ్యాక పెళ్ళాం వచ్చి దద్దమ్మ అని తీసిపారెయ్యొచ్చు. లేదా ఇంట్లో అంతా పెళ్ళాం పిల్లలతో సహా తనని గొప్పవాడు అనుకున్నా కొత్త ఉద్యోగం చేరాక తన మేనేజర్ ఒక చీడ పురుగులా చూస్తుండవచ్చు. పాజిటివ్ పరిస్థితి వుంటే ఫర్వాలేదు కానీ నెగెటివ్ పరిస్థితి వుంటే అదంతా మన సబ్కాన్షియస్ మనస్సులో సింక్ కాకుండా వుండేలా చూసుకోవాలి.  అలా మన మీద మనం విశ్వాసం కోల్పోతే అది ఎంత చెరుపు చేస్తుందో మీరు ఊహించవచ్చును. 

మనల్ని ఆత్మన్యూనతకి గురిచేసేవాళ్లకి దూరం చేసుకోవడం ఉత్తమం. కొంతమంది శ్రెయోభిలాషులం అనే పేరిట మనల్ని కించపరుస్తూ హితబోధలు చేస్తూ తామేదో గొప్ప దేశసేవలు చేసినట్లుగా భావిస్తూవుంటారు. అలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా వుందాం. స్నేహితుడో లేక కోలీగో మనలో నెగెటివ్ భావాలు ఎక్కిస్తూ వుంటే గనుక దూరంగా వుండొచ్చు కానీ అదే మన తల్లిదండ్రులో, భార్యా పిల్లాలో అయితే వస్తుంది చిక్కు. ఇక భార్యనో లేదా భర్తనో అయితే ఇంకా క్లిష్టంగా వుంటుంది పరిస్థితి. దూరంగా వుండలేం - దగ్గరగానూ వుండలేం :)) చాలామంది భార్యలూ భర్తలూ తమ పార్ట్నర్ ల గురించి చాలా క్యాజువల్ గా చులకనగా మాట్లాడేస్తూ తమ పార్ట్నర్ లలో అలాంటి విశ్వాస వ్యవస్థని రూపొందిస్తుంటారు. 

భర్తలు భార్యలకి అలా ఇచ్చే సూచనలు ఎలా వుంటాయో ఉదాహరణలు ఇవ్వలేను కానీ భార్యలు అలా ఇచ్చే సూచనలు చాలా చెప్పగలను ఎందుకంటే నేనూ ఓ భర్తను కాబట్టి అలాంటివి బాగా పరిశీలిస్తుంటాను. "మా ఆయనకి అవన్నీ ఏమీ తెలియవండీ". నా మొఖం. అలా పదే పదే అంటే ఇంకేం తెలుసుకుంటాడూ? "మా ఆయన అవన్నీ పట్టించుకోడండీ. మీరు వున్నారు చూసారూ భలే కేర్ తీసుకుంటారండీ". అవతల వాళ్ళాయన మనస్సులో గుర్..మంటూవుంటాడు. అలా పదే పదే అలా విన్నాకా ఎంత పట్టించుకున్నా ఇంతేలే అని లైట్ తీసుకుంటాడు! "మా ఆయన ఇంట్లో అస్సలు ఒక్క పని కూడా చేయడండీ" ఇది మా ఇంట్లో. ఇలా పదే పదే విన్నాకా ఆ చేసే కొద్ది పనులూ కూడా చెయ్యబుద్దికాక మానేసి దర్జాగా కూర్చుంటున్నాను. ఏదయినా చెయ్యాలనుకున్నా 'ఛ, నీకు అంత దృశ్యం లేదు' అని నా మనస్సు నన్ను బుజ్జగిస్తూవుంటుంది. పోన్లే పాపం అని దానిమాట వింటూ వుంటాను. అలా అని నేనూ తక్కువేమీ కాదు. ఇదివరలో అమాయకంగా అవో ఇవో అనేవాడిని. తెలిసి వచ్చాకా తగ్గిస్తూవస్తున్నా.  

కొంతమంది ఇళ్ళల్లో వాళ్ళ పిలలని కించపరచడం ఫాషన్ గా భావిస్తుంటారు. "మా చిన్నోడు సూపరండీ, మా పెద్దోడే శుంఠ". అలా పదిసార్లు విన్నాకా వాళ్ళ పెద్దోడు గ్యారంటీగా శుంఠన్నర అయిపొతాడు. ఎందుకంటే అతడిలో ఏర్పడే బిలీఫ్ సిస్టం ఇక తనని ఎదగనివ్వదు. ఏదన్నా తాను గొప్పపనులు చెయ్యాలనుకున్నా అంతః చేతన హెచ్చరిస్తుంది, తానేంటో గుర్తు చేస్తుంది.  "మా వాడికి చదువు అస్సలు వంటపట్టదండీ" ఇంకేం పడుతుందీ?  బాగా బక్కగా వున్న తమ పాపని చూపిస్తూ "మా అమ్మాయి ఎంత తిన్నా లావు కాదండీ" అంటారు. ఇంకేం అవుద్దీ?  

అంచేతా...మనం చాలా క్యాజువలుగా అలా మాట్లాడి మరచిపోయినా ఎదుటివారిలో అవి ఎలాంటి ప్రభావాన్ని చూపగలవో గుర్తుంచుకోవాలి. మా చిన్నమ్మాయి కాస్త బరువు ఎక్కువ. తగ్గించే ప్రయత్నాల్లో వున్నాం. తను బరువు తగ్గుతున్నట్లుగానే సంకేతాలు అందిస్తూ వుంటాను. నువ్వు లావుగా వున్నావు లాంటి మాటలు మాట్లాడను. క్రితం వారం కంటే, క్రితం నెల కంటే బక్కగా అవుతున్నట్లుగానే సూచిస్తుంటా. 

ఎదుటివారిలో నిజంగా నెగటివ్ భావాలు వున్నా కూడా వాటి గురించి పాజిటివ్ గా మాట్లాడొచ్చు. ఉదాహరణకు భవానీ శంకరం  పెద్దగా సంపాదించట్లేదు. అతని భార్య రమణి కి అతన్ని బాగా సంపాదించేలా చెయ్యాలని వుంటుంది. "నీకు సంపాదించడం చేతకాదు, పక్కింటి ఆయన అయితే ఎంత బాగా సంపాదిస్తాడో" అని అందనుకోండీ. భవానీ లో 'ఓహ్ నాకు సంపాదించడం చేతకాదు' అనే నమ్మకం బలీయం అవుతుంది. అలా కాకుండా "పక్కింటి ప్రసాద్ బాగా సంపాదిస్తున్నాండండీ, మీరు మరో మూడేళ్ళల్లో అతని మించిపోవాలి. మించిపోతారు. మీమీద నాకు ఆ నమ్మకం వుంది, ఇక ఆ ఇక ప్రయత్నాలు ప్రారంభిద్దురూ"  అని భవానీ శంకరం యొక్క బలహీన క్షణంలో రమణి గోముగా రిక్వెస్ట్ చేసిందనుకోండీ. దృశ్యం మీరే ఊహిద్దురూ :)) రెచ్చిపోడూ?!  

అలా కాకుండా రమణి ఇలా అందనుకోండీ.  "పక్కింటి ప్రసాద్ బాగా సంపాదిస్తున్నాండండీ, మీరు అతడిని అతని మించిపోవాలి. మించిపోతారు. మీమీద నాకు ఆ నమ్మకం వుంది, ఇక ఆ ఇక ప్రయత్నాలు ప్రారంభిద్దురూ". ఈ డైలాగుల్లో ఒక లోపం వుంది. పై డైలాగునీ ఈ డైలాగునీ కంపేర్ చేసి చూడండి. పైన మూడేళ్ళు అని టైం ఫ్రేము పెట్టింది. ఇక్కడ అలా లేదు. అది పొరపాటు. ఎన్నడో ఒకనాడు అంటే అది ఎన్నడో లాగానే మిగిలిపోతుంది. ఎన్నడో ఒకనాటికి కదా, తొందరేమీ లేదు కదా అని భవానీ తడిగుడ్డ వేసుకొని పడుకుంటాడు. మనం లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు కానీ, ఇతరులకు పెట్టినప్పుడు కానీ తగిన సమయం నిర్దేశించకపోతే పెద్దగా ప్రయోజనం వుండదట.