స్టాండింగ్ డెస్క్

రోజులో ఎక్కువసేపు కూర్చొని వుండటం కన్నా నిలబడి వుండటం ప్రయోజనకరమని గత కొన్నేళ్ళ నుండీ చదువుతూనే వున్నా. నేను అటార్నీ ఆఫీసులో పనిచేస్తాను. వందలమంది అటార్నీలు వుంటార్లెండి. ఓ సందర్భంలో వాళ్ల ఆఫీసులు డెస్కులు పరిశీలించాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు కొంతమంది లాయర్లు ఎంచక్కా పెద్ద పెద్ద స్టాండింగ్ డెస్కులు ఉపయోగిస్తుండటం గమనించాను.  


నాకూ ఇంట్లో అలాంటిదేమయినా వుంటే బావుండు అనిపించింది. ఎలాగూ ఈమధ్య ఇంట్లో కూడా నవళ్లూ గట్రా వ్రాస్తున్నా కనుక అదొకటి వుంటే బావుంటుంది కదా. సో, పైన చిత్రంలో కనిపిస్తున్నది Techni Mobili Deluxe Rolling Laptop Cart with Storage, Chocolate అమెజానులో ఆర్డర్ చేసాను. ధర $63. నిన్ననే వచ్చింది.  మా అమ్మాయీ, నేనూ కలిసి గంటకు పైగా శ్రమించి అది బిగించాము. ఇకనుండీ ఏదయినా వ్రాయడం, చూడటంతో పాటుగా అప్పుడప్పుడు మా ఇంట్లో వారిని ఉద్దేశ్యించి ఉపన్యసించడానికి అది ఒక పోడియం లాగానూ ఉపయోగపడుతుంది. ఎవరయినా వింటారా లేదా అనేది వేరే లెక్క లెద్దురూ. 

రండి... కలిసి నడుద్దాం!

అమ్రికాకి వచ్చినప్పుడూ, కంప్యూటర్ కళాకారుడిని అయినప్పుడూ ఏదో పొడిచేసేనని అనుకున్నా. అలక్కాదనీ కొన్నేళ్ళలో అర్ధమయ్యింది లెండి. అందరూ వచ్చేసి అందరూ అయిపోయి అందరూ పొడిచేస్తున్నారు. మా ఫిఫ్టీన్ మినట్స్ ఆఫ్ ఫేమ్ పూర్తయ్యింది. కంప్యూటర్ ముందూ, సూర్యుడు కూడా కనపడని నాలుగ్గోడల లోపలా కూర్చొని కూర్చొని పని చేసీ చేసీ థూ ఇదా జీవితం - ఎదవ జీవితం అనుకుని ఎంచక్కా ఆశ్రమానికి వెళ్దామనుకున్నా కానీ కుమార్తెలను దృష్టిలో వుంచుకొని ఆ ఆలోచన ఇప్పటికయితే మానివేసా. ముందు ముందు చెప్పలేం.  అయితే ప్రత్యామ్నాయం ఆలోచిస్తూ వచ్చా. అప్పుడు దొరికిందిదీ.

డబ్బు సంపాదిస్తున్నంత కాలం మనం ఏం పని చేసినా పెద్దగా ఎవరు ఏమీ అనరు. ఎంత మోసం చేసి, అన్యాయం చేసి, అవినీతి చేసి సంపాదిస్తే అంత తెలివిగలవాడివంటుంది ఈ సమాజం. అన్ని తెలివితేటలు మన్దగ్గర లేవు కదా ఎలా? నాకు తెలిసిన విద్య ఒహటి వుంది. అదే రచనలు చెయ్యడం. తెలుగులో రచనలు చేసి సంపాదించేకన్నా కాటికాపరి ఉద్యోగం వెలగబెట్టి ఎక్కువ సంపాదించొచ్చు అనుకుంటా.  పదేళ్ళ క్రితం రామోజీరావు తన మాస పత్రిక చతురలో నా 'ఎవరు?' నవల వేసి ఓ అయిదువేల రూపాయలు చేతిలో పెట్టారు. అదే ఇంతవరకు నా నవలాదాయం. ఆదాయం అటుపోనీండు - నవళ్ళు వ్రాసీ, బ్లాగులు వ్రాసీ కొంతమంది ఆప్తులనీ, అభిమానులనీ సంపాదించుకున్నాను. అది చాలదూ? చాలదు! ఇంట్లోవాళ్ళకి అస్సలు చాలదు. మరి మాకేంటి అంటారు. 

అందువల్లా...ఆశ్రమం అయినా వుండాలె లేదా ఆదాయం అయినా వుండాలే అని డిసైడ్ చేసిన. ఆశ్రమం అప్పుడేనా ఇంకా ఆనందించాల్సింది చాలా వుంది కనుక ఆదాయం వుండాలి. ఎలా? ఎవరికి వుండదూ - సన్నాసులకు తప్ప - ఓ సంపాదించెయ్యాలనీ. అప్పుడు దైవదూత లాగా ఓ మిత్రుడు రెండు మార్గాలు చెప్పాడు. అవి రెండూ నాకు ఎప్పటినుండో తెలిసినవే కాకపోతే రెండింటినీ కనెక్ట్ చేసుకోలేకపోయాను. హర్రే అనుకున్నా. ఇంకేం విజయరహస్యం తెలిసింది. ఇక అందుకోవడమే తరువాయి. 

చిన్న కేవియట్. అవి పనిచెయ్యలేదూ - పోయిందేముందండీ  - ఈ కప్యూటర్ కళ ఎలాగూ వుంది కదా. వంటింటి ఆడపడుచులు కూడా చేసే టెస్టింగ్ జాబ్ చేసో లేదా Uber తొక్కి అయినా సరే బ్రతుకు లాగించెయ్గల్ను. సో, ఇక అలాంటి పేదమాటలు మాటలు మానేసి దర్జాగా ఎలాగో బ్రతుకొచ్చో చూద్దాం.  బ్రతకడమంటే అలా ఇలా కాదు. మామూలుగా బ్రతకడానికి ఇప్పుడు చేస్తున్నది  చాలు. 

అంచేతా నేను విజయవంతమయిన రచయితను అయి తీరాలి. అప్పుడు ఏ బాదరాబందీలు, హడావిడులు లేకుండా క్రూయిజులల్లో ప్రయాణం చేస్తూ పగలు నేలమీది నక్షత్రాలనీ, రాత్రి ఆకాశంలోని నక్షత్రాలనీ చూస్తూ నన్ను నేను మైమరచిపోతూ రచించాలి. అదీ ప్రస్తుతానికి నా కలా, లక్ష్యమూనూ. ఆ తరువాతా ఇంకా చాలా చాలా ఆలోచనలు వున్నాయిలెండి. అబ్బో - సూపర్ ఆలోచనల్లెండి. అన్నీ నెరవేర్చుకుందాం. అటు ఆదాయమూ రావాలి - ఇటు ఆనందమూ పొందాలి. అదో నేనో తేలాలి. నాది ఇక మామూలు జీవితంగా వుండదు లెండి. ఇక ఇంకా కొన్ని నెలలే. ఎన్నో ఎన్నెన్నో ప్రయోగాలు, సాహసాలు. అవి నెరవేర్చుకునే దమ్మూ, ఆత్మవిశ్వాసమూ నాకున్నాయి. మీకూ కలలున్నాయా? నెరవేర్చుకోవాలనుకుంటున్నారా లేక ఇప్పుడున్నట్టే బ్రతుకుబండి లాగిద్దామనుకుంటున్నారా? మీలో కూడా ఉత్సాహమూ, ఉత్తేజమూ, మీలో మీకు విశ్వాసమూ వుంటే...రండి.. కలిసి నడుద్దాం. అలాంటి ఇలాంటి జీవితాలు మనకు వద్దు. ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సమృద్ధిగా బ్రతికేద్దాం. 

అందుకు ముఖ్యంగా మనం చెయ్యాల్సింది ఒక్కటే. మన మనస్సును మన బానిసగా చేసుకోవడం. కొన్ని నెలల దాకా నా మనస్సుకి నేను బానిసనై వుండిపోయా. అప్పటికీ ఇప్పటికీ అదీ తేడా మిత్రమా! దేన్ని ఏది కంట్రోల్ చేస్తోందో చూసుకోండి మరీ. మనస్సు అనే పొగరుబోతు అశ్వాన్ని అంత సులభంగా మచ్చికచేసుకోలేం.  అదెలాగో నాకు తెలుసు. అందుకే నా మీద నాకీ విశ్వాసం. మీమీద మరి మీకు ఆ నమ్మకం వుందా?    

ఆన్ రైటింగ్ - స్టీఫెన్ కింగ్

On Writing పుస్తకం చదువుతున్నా. రచనలు చెయ్యాలనుకునేవారు ఈ పుస్తకం చదవడం ముఖ్యమని వాట్‌పాడ్ లో చదివి ఈ పుస్తకం తెప్పించాను. ఇవాళ ఉదయం నుండే మొదలెట్టా. స్టీఫెన్ కింగ్ ది ప్రమాదకర హాస్యం :)) చదువుతూ వుంటే భలే నవ్వొస్తోందీ. ఇలాక్కూడా వ్రాస్తారా అనిపిస్తోంది. నేనెందుకు అలా వ్రాయకూడదూ?ప్రయత్నిస్తా. ఆ పుస్తకం ఒక ఆత్మకథ లాంటిది కూడా. కేవలం రచయితలే కాకుండా ఇతరులు కూడా ఎంచక్కా ఆ ప్రసిద్ధ నవలాకారుడి ఆ పుస్తకం చదివెయ్యొచ్చు. 

ఈ రచయిత రచనలు ఎప్పుడయినా చదివానో లేదో గుర్తుకులేదు కానీ ఆ మధ్య ఒకటి చదవడానికి ప్రయత్నించా కానీ ఎందుకో కొరుకుడు పడలేదు. మళ్ళీ ప్రయత్నిస్తా. పుస్తకాలు చదవకపోయినా ఇతగాడు నా అభిమాన, ఆదర్శ రచయిత.

Heinlein అయిదు సూత్రాలు

మీలో చక్కని రచయిత కావాలని ఆశిస్తున్న వారెందరో నాకు తెలియదు కానీ ఇది కనీసం నాకోసం వ్రాసుకుంటున్న పోస్ట్.

Robert A. Heinlein అనే సైన్స్ ఫిక్షన్ రచయిత ఈ అయిదు సూత్రాలను పేర్కొన్నాడంట.

రూల్ 1. తప్పక వ్రాయాలి.
రచయిత కావాలనుకున్న వాడు చచ్చినట్లు వ్రాయాల్సిందే - మరో మార్గం లేదు. ఓ వందమంది రచయితలం అవుదాం అనుకున్నారనుకోండి. సగం మంది అలా అనుకుంటూనే ...వుంటారు. మిగిలింది ఇక 50 మంది. 

రూల్ 2: మొదలెట్టింది పూర్తి చెయ్యాలి
అందులో సగం మంది ఏవో కారణాల వల్ల మధ్యలోనే ఆపేస్తుంటారు. అందువల్ల ఇక మిగిలింది 25 మంది.

రూల్ 3: సరిదిద్దడం చాలు, ఇహ ఆపెయ్యాలి. 
అందులో సగం మంది సరిదిద్దు...తూనే వుంటారు. ఇక మిగిలింది 12 మంది.  

రూల్ 4: ప్రచురణకర్తలకి పంపించెయ్యాలి
ఈ సూత్రం ఇండియా లోని రచయితలకి ఎంతవరకు పనికివస్తుందో నాకు తెలియదు కానీ ఇక్కడ అవసరం. సెల్ఫ్ పబ్లిష్ చేసుకోదలుచుకుంటే అది వేరు విషయం. పుస్తకం వ్రాసేసి అట్టే పెట్టేసుకోకూడదు - ప్రచురణ కర్తలకి పంపించాలి. బద్దకం వేసో, ధైర్యం చాలకో సగం మంది అయినా అలాగే అట్టే పెట్టేస్తారు. ఇక మిగిలింది 6 మంది.

రూల్ 5: ఎవరయినా ప్రచురణకర్తలు అంగీకరించేదాకా పంపిస్తూనేవుండాలి 
తిరస్కరణలు సర్వసాధారణం. అందువల్ల ఒకరి తరువాత మరొక పబ్లిషరుకి పంపిస్తూనే వుండాలి. ఒకటి రెండు తిరస్కరణలు రాగానే మూసుకొనేవారు సగం మంది అయినా వుంటారు. ఇక మిగిలేది ముగ్గురు. 

 Robert J. Sawyer అనే సైన్స్ ఫిక్షన్ రచయిత ఇంకో సూత్రమూ చెప్పారు. మూల వ్యాసమూ మరియు ఆ ఆరో సూత్రమూ తెలుసుకోవాలంటే ఈ క్రింది సైట్ చూడండి.  

Self Help Classics

ఏపిల్ యాప్ స్టోర్ నుండి SelfHelpCls యాప్ ను డవున్లోడ్ చేసుకోండి. ధర $1. ఆండ్రాయిడ్ వర్శనులో వుందో లేదో నాకు తెలియదు. విజయమూ, వ్యక్తిత్వ వికాసమూ, లా ఆఫ్ ఎట్రాక్షనూ వగైరాలకు సంబంధించిన క్లాసికల్ పుస్తకాలు ఎన్నో అందులో లభ్యం అవుతాయి. కావాలంటే ఆ యాప్ మీకోసం ఆయా పుస్తకాలని వినిపిస్తుంది. మీరు ఎంచక్కా వినెయొచ్చు.  ప్రస్తుతానికి అందులో The Master Key System అనే పుస్తకం Charles F Hannel వ్రాసింది చదివేస్తున్నా. ప్రఖ్యాత The Secret పుస్తకానికి, వీడియోకు ఈ పుస్తకమే ప్రేరణ!

వెకేషన్ విశేషాలు

మిగతా విశేషాలకేమి లెండి గానీ అవన్నీ అందరికీ వుంటాయి గానీ ఒక విషయం మాత్రం మీతో పంచుకోనీండేం. మా పెద్దమ్మాయి అంతర్ముఖి. ఫోనులోనో సిస్టం లోనో ఏదో ఒకటి వీక్షిస్తూ కాలం గడిపేస్తూంటుంది. తనని మాతో పాటు వెకేషనుకి తీసుకెళ్ళినప్పుడూ పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. ఇంటికెప్పుడెళ్ళిపోదాం అని తరచుగా అంటూండవచ్చు అనుకున్నాను.

అలాంటిది స్కి జెట్టులో మా చిన్నమ్మాయిని వెనకాల వేసుకొని నీళ్ళళ్ళో రివ్వున దూసుకెళ్ళింది. 45 మైళ్ళ మ్యాగ్జిమం వేగంతో ఓ గంట ఆడేసింది. స్లింగ్‌షాటులో అకాశంలోకి పదేపదే దూసుకుపోయింది. స్నోర్కెలింగులో కీవెస్ట్ దగ్గరి సముద్రంలో అందరికంటే ఎక్కువగా అల్లంత దూరానికి వెళ్ళి ప్రపంచంలో మూడవ గొప్ప కోరల్ రీఫ్ ని ఓ గంట పరిశీలించింది. ఇంకా ఇలాంటివి మరికొన్ని. మా ఆవిడా నేనూ ఔరా అనుకున్నాం. మిగతావాళ్లకి ఇవి అంత గొప్పగా అనిపించకపోవచ్చేమో కానీ మా అమ్మాయికి అవి గొప్పవే. 

మా కుటుంబం కోసం ఇంకా ఇలాంటి సాహస కృత్యాలు ఏర్పాటు చెయ్యాలిక. స్కూబా డైవింగ్, వాటర్ బోర్డింగ్ తదితరాలు ఈసారి పలు కారణాల వల్ల కుదర్లేదు. క్రూయిజ్ కి వెళ్ళడానికి ఈసారి కూడా కుదర్లేదు. మా స్నేహితుడి కుటుంబ సభ్యులకు పాస్‌పోర్టులు  సిద్ధంగా లేకపోవడంతో అది వాయిదా వేసుకున్నాం. బహుశా మార్చిలో బహామాస్ వెళ్ళొచ్చు.  మీరూ ఎవరయినా వస్తారా?

పై వారం లాంగ్ వీకెండుకి లూయివిల్ (కెంటకీ) వెళ్ళాలనుకుంటున్నాం. మీలో ఎవరయినా అక్కడ కానీ చుట్టు పక్కల కానీ వున్నారా?    

నా కారు కల సాకారం అవుతుందా లేదా? చూద్దాం!

నా ఊహల (విజువలైజేషన్) ప్రకారం ఇంకో మూడు నెలల్లో నేను కోరుకున్న కారు నాది అవాలి. అది Lexus GX లేదా అలాంటిది. మీలో చాలామందికి అదో లెక్క కాదేమో కానీ అది నాకు ఒక మైలురాయి లాంటిదే. ప్రస్థుతానికి అయితే పరిస్థితులు దానికి దారి తీసేలాగే వున్నాయి.  Let's wait and see.

వెకేషనుకి వెళ్ళొచ్చాం

డేటోనా బీచులో వెకేషన్ హవుజ్ తీసుకొని ఓ వారం వున్నాం. అటూపై ఓర్లాండో, మియామీ, కీ వెస్ట్, అట్లాంటా తదితర ప్రదేశాలు చూసి పలు ఏక్టివిటీసులో పాల్గొని వచ్చాం. 12 సీట్ల వ్యాను తీసుకొని మరో కుటుంబంతో కలిసి వెళ్ళాం. అంతా చక్కగా జరిగింది. 

ఈమధ్య మా సక్సెస్ వాట్సాప్ గ్రూపులో చేరడానికి కొంతమంది ఆసక్తి చూపించారు. అలా అడిగిన వారినందరినీ అందులో చేర్చాననే అనుకుంటున్నా. ఎవరినయినా మిస్ అయితే దయచేసి వారు మళ్ళీ చెప్పండేం.