ఇక కిక్కే కిక్కు! తధాస్తు!

కొన్ని నెలల క్రితం దాకా పొద్దునే లేవగానే ప్రకృతి పిలుపులకి హాజరు అవుతూ ఎదవ జీవితం అని నాలో నేను పళ్ళు నూరుకునేవాడిని. ఈమధ్య కొన్ని పుస్తకాలు చదివాకా అది ఎంత దరిద్రమయిన విషయమో అర్ధం అయ్యి తీరిగ్గా నాలుక్కరచుకున్నా. మన మనస్సు తధాస్తు దేవత లాంటిది. ఎలా అనుకుంటే అలాగే పాటిస్తుంది - అలాంటి సూచనలే మనకు ఇస్తుంది - అలా మన జీవితాన్ని మార్చేస్తుంది. మన జీవితం ప్రస్తుతం ఎలా వున్న పలు విధాలుగా గొప్పగా వుందనుకోవాలి. గొప్పదనాలను వెలికితీసి మనకు మనం సెబ్బాసో అనుకోవాలి. మనం ఎలా అవాలనుకుంటున్నామో అలా అయిపోయినట్లు గాఠ్ఠిగా అనుభూతి చెందాలి. అప్పుడు అప్పుడు... అలాగే అవుతాం మరీ. అలా ధనాత్మకంగా ఆలోచిస్తున్న రోజుల నుండీ నా జీవితం అద్భుతంగా సాగుతోంది. ఇంకా ఒకటి రెండు విషయాలు దారిలోకి రావాలనుకోండి - వస్తాయి. రాకపోయినా దిగుల్లేదు - అలాంటివి వంద సాధించుకునే సత్తా నాలో వుందిప్పుడూ. 

సెబాశ్ రా శంకరా! ( మా అమ్మమ్మ నన్ను అలాగే పిలిచేది). 

సో, పొద్దునే లేవగానే మీ జీవితాన్ని మీరు తిట్టుకుంటున్నారో, మెచ్చుకుంటున్నారో ఓ సారి తర్కించుకోండి. తిట్టుకుంటున్నట్లయితే ఎక్కడొ ఏదో లోపం వుందనే కదా అర్ధం. సవరించుకోవాలి మరీ. నన్ను చూసి నేర్చుకోండేం. మిమ్మల్ని మీరు తిట్టుకోకుండా, మెచ్చుకోకుండా ఉదాసీనంగా వుందా మీ జీవితం? హ్మ్. అలా అయితే ఎలాగండీ బాబూ. మనకున్న జీవితం కొద్దిదే. అది మనం అనుకున్నట్లు చచ్చినట్లు జరగాల్సిందే.

మన అంతఃచేతనకి ఏది జోకో ఏది నిజమో తెలియదు. మనం అనుకున్నది మనం పాటించేలా చూస్తుంది. అందుకేనేమో మన పూర్వీకులు సరుకులు ఏవయినా అయిపోతే అయిపోయాయని అనేవారు కారు. సరుకులు లేదా డబ్బులు 'నిండుకున్నాయి' అనేవారు! 

4 comments:

  1. ఇప్పుడు అన్నీ నిండుకున్నయ్...

    ReplyDelete
  2. @kvsv
    ఇంకా మనకు నిండా నూరేళ్ళు 'నిండుకోలేదు' కదా. నయ్యం కాదూ. ఇంకా సమయం వుంది - అన్నింటినీ చక్కదిద్దుకోవడానికి.

    పరిస్థితులు అన్నీ ప్రతికూలంగా వున్నప్పుడు పాజిటివ్ గా ఎలా ఆలోచిస్తామని ఇదివరకు కొట్టిపారేసేవాడిని. ఇప్పుడర్ధమవుతున్నది ఏంటంటే అలాంటప్పుడే పాజిటివ్గా ఆలోచించాలి. అంటే ఏదో మంచి జరిగిపోద్ది అని ఆశించడం కంటే ఆల్రెడీ మంచి జరిగినట్లే నమ్మాలి, భావించాలి. ఇదివరకటి నా ఆలోచనా విధానానికీ, ఇప్పటిదానికీ తేడా అదీ. ఇదివరకు పాజిటివ్ థింకింగ్ అంటే కేవలం అంతా మంచి జరుగుతుందని 'ఆశించడం' అనుకునేవాడిని. అది పొరపాటు. ఆల్రెడీ అంతా మంచి జరిగిపోతున్నట్లుగా భావిస్తూ వుంటే అలా అన్ని విషయాలు చక్కగా దారిలోకివస్తాయి. వివరాల కోసం వీలయితే నేను చెప్పిన పుస్తకాలు చదివేసెయ్యండి.

    ReplyDelete
  3. ఎందుకు పెట్టారో చదివాం.. ఇక మళ్ళీ మళ్ళీ ఈ టైటిల్ చదవకుండా.. మాంచి గాల్లో లేచే టైటిల్ ఏదైన పెట్టండి..

    ReplyDelete
  4. @ కాయ

    తధాస్తు! ఆ టైటిలేదో మీరే సూచిస్తే బావుండేదిగా.

    ReplyDelete