ఇక కొవ్వు కరిగించాల్సిందే!

అయిదు రోజుల క్రితం నా కొవ్వు శాతం చూసుకున్నప్పుడు 21.5 వుంది. నా వయస్సు వారికి 18 కి లోపుగా వుంటే చక్కగా వుంటుంది. అందువల్ల దాన్ని 17 కి దించే పనిలో పడ్డాను. తినే తిండి మీదా, నా బరువు మీదా నాకు కంట్రోల్ వచ్చింది కాబట్టి ఇక ఈ ఉపలక్ష్యం నాకో పెద్ద సమస్య కాబోదు. అయితే అటుపై 13% కి దించాలి. అది కాస్త సవాలే. చూద్దాం. విజువలైజేషనూ, సెల్ఫ్ టాకూ మొదలయిన టెక్కునిక్కులు ఉపయోగించి ఎంచక్కా నేను అనుకున్న చిన్న చిన్న విజయాలు సాధిస్తున్నా. నా అంతరాత్మ ఆదేశాలను (సబ్‌కాన్షియస్ మైండ్ సజెషన్స్) సరిగా వింటూ పాటిస్తూ ఎదుగుతున్నాను.

నా ప్రస్తుత కొవ్వు ఏవరేజి శాతంలోకి వస్తుంది. నా వయస్సుకి బాడీ ఫ్యాట్ 18% కి లోపుగా వుంటే ఫిట్ అన్నమాట. అందుకే ప్రస్తుతానికి 17 శాతానికి టార్గెట్ చేస్తున్నాను. 14 కి లోపుగా వుంటే ఆటగాడి శరీరం అన్నమాట. అందుకే అటుపై 13 కి టార్గెట్ చేస్తాను. అప్పుడు 2 ప్యాక్ అయినా బయటపడొచ్చు. అటుపై చాలా కష్టం కానీ 9 కి ప్రయత్నిస్తే 6 ప్యాక్ రావచ్చు. అంత దృశ్యం నాకు లేదు కానీ 13 సాధించాక వీలయితే అటు ఆలోచిస్తా.

ఈ తిప్పలన్నీ ఎందుకు మహాశయా, హాయిగా ఓ రెండు సినిమాలు వేసుకొని చూస్తూ కూర్చోక అంటారా? అలా మీరు కానివ్వండి. నాకు మాత్రం ఇష్టం అయింది కష్టంగా వుండదండీ - ఉత్సాహంగా, సవాలుగా వుంటుంది.

నేను వండుకు తింటున్న ఆకుకూరలు!

వారం క్రితం నా బరువు 55.3 కిలోలు. ఈరోజు 54.1 కిలోలు. అనగా 1.2 కిలోల బరువు తగ్గాను. పళ్ళూ, ఆకు కూరలూ బాగా తీసుకున్నాను. నోరు కట్టేసుకున్నానా? అబ్బే. నా ఆహార పరిమాణం పెద్దదే కాకపోతే కాలరీలే తక్కువా. రోజూ ఆఫీసు నుండి వచ్చి ఉత్సాహంగా ఆకు కూర వండేసుకుంటా. సరదాగా దాంట్లో ఎన్నో ప్రయోగాలు చేస్తుంటా. అలా నేను వండేసుకున్న కూరలు ఎంత కమ్మగా వుంటాయనీ. కాకపోతే మా వాళ్ళు నా కూర జోలికి రారనుకోండీ - అది వేరే విషయం.   అలా కూర వండాకా అన్నంలో కూర కలుపుకొని తినడానికి బదులుగా కూరలో అన్నం కలుపుకుని తింటా :)

ఇక నుండి రోజూ నా కూర ఫోటోలు షేర్ చేస్తా లెండి. ఏం ఆకుకూర అని నన్ను అడుగొద్దు సుమా. మా ఆఫీసు దగ్గరిలోని వాల్‌మార్ట్ కి వెళ్ళి కనపడ్డ ఆకుకూరలన్నీ పట్టుకొస్తా - పేర్లు నాకు తెలియవు, గుర్తుండవు. చెకవుట్ దగ్గర పేర్లడిగినా హు నోస్ అంటుంటా? ఒకే రోజు కనీసం మూడు రకాల ఆకులు వేసి వండేస్తుంటా. అంతేనా ఇంకా ఆ కూరలో వంటింట్లో వుండే తినదగ్గ పదార్ధాలు ఏవేవో వేస్తుంటా. కూర అయిపోయాక అంటు మిగలకుండా తినేస్తుంటా.
 
నా చిన్నప్పుడు నేనూ, నాకంటే 3 ఏళ్ళు చిన్నదయిన నా మేనకోడలూ కలిసి ఇంట్లో తినదగ్గ పదార్ధాలు అన్నీ వేసి వంట వండేవాళ్ళం. దానికి కిచిడీ తరహాలో డిచికీ అని పేరు పెట్టాం. ఏదీ మీరూ ఓ సారి డిచికీ వండి ఎలా వుందో మాకు చెబుదురూ!? దానికి రిసెపె పెద్దగా ఏమీ లేదు - ఇంట్లో వున్నవన్నీ తలో కాస్తా వేసి వండెయ్యడమే. అది తినబుల్ గా లేకపోతే బాధ్యత మీదే సుమా.

నా బరువు ఉపలక్ష్యం 52 కిలోలు. దాన్ని చేరుకోవడానికి గాను విజువలైజేషన్, సెల్ఫ్ టాక్ పద్ధతులు ఉపయోగిస్తున్నా. ఆల్రెడీ బరువు తగ్గినట్లూ, పొట్టతగ్గినట్లూ ఊహించేస్తున్నా, ఫీల్ అవుతున్నా, నటించేస్తున్నా. పొట్ట లోపటికి లాక్కుని నడుస్తున్నా. వాతాపి జీర్ణం లాగా కొవ్వు జీర్ణం అని బొజ్జ నిమురుకుంటున్న్నా. సన్నగా కట్టెపుల్లలా వుండే మగాళ్ళ నడుములు చూసి అది నా నడుమే అనుకుంటున్నా.  ఈ రోజు నుండీ కొవ్వు శాతం కూడా లేక్కేస్తున్నా, ఇవాళ 21.5% వుంది. దానికి 19 కి తగ్గించాలనేది నా ఉపలక్ష్యం. 13 కి తగ్గించాలనేది నా ప్రధాన లక్ష్యం.

అలా అనుకున్నా - అలాగే జరిగింది!?

10 రోజుల క్రితం. మా ఆవిడ ఐఫొన్ 6+ స్క్రీన్, LCD పగిలిపోయాయి. బయట అడిగితే $220 అన్నారు. వుడ్‌ఫీల్డ్ మాల్‌లోని Apple స్టోరులో కనుక్కుందామని వచ్చాము. ఎంత అని అడిగాము. $320 దాకా అవుతుండొచ్చు - పూర్తిగా పరీక్షించి చెబుతాము అని మళ్ళీ రమ్మనమని అప్పాయింట్మెంట్ ఇచ్చారు. ఓ అరగంట అయ్యాకా మళ్ళీ వెళ్ళాం. టెక్నీషియన్ పరీక్షిస్తున్నాడు. నాకేమీ ఖర్చు కావొద్దని మనస్సులో గట్టిగా అనుకున్నాను - అలా జస్ట్ ఒకటి రెండు నిమిషాలు విశ్వసించాను. ఇంతలోకే ఇప్పుడే వస్తాను అని అతను లోనికి వెళ్ళి వచ్చాడు. ఎంత అవుతుంది రిపెయరుకి అని మా ఆవిడ అడిగింది. జీరో అన్నాడు. నమ్మలేనట్లుగా 0? అని అడిగింది. అవును 0 అన్నాడు! నన్ను నేను నమ్మలేక ఎందుకలాగా అని అడిగా. "ఈ రోజు కొన్నిసాంకేతిక సమస్యలు వున్నాయి - అందుకే లోపలికి వెళ్ళి కనుక్కొని వచ్చాను.  ఉచితంగా ఇస్తున్నాం. సరి అయిన రోజు మీరు వచ్చారు" అన్నాడు నవ్వుతూ. మా ఫోన్ తీసుకొని కొత్త ఫోన్ ఇచ్చాడు. బిల్లు మీద సంతకం చేయించుకున్నాడు. బిల్లు $320 కానీ అది మినహాయింపు ఇచ్చారు కాబట్టి చివరికి బిల్లు 0 అని దాంట్లో వుంది! అతనితో కరచాలనం చేసి, బహుళ ధన్యవాదాలు చెప్పి బయటకి వచ్చాం.  

నన్ను ఏం చేయమంటారు చెప్పండి? ఇది నేను నమ్మాలా వద్దా? భ్రాంతియా, నిజమా? సెలక్టివ్ రీజనింగా, కాదా? నాకు తెలియదు. జరిగింది అదండీ. ఎవరు ఎలా అయినా అనుకోవచ్చు. నా +ve ఫ్రీక్వెన్సీ అతని మీదికి ప్రసరించిందా లేదా విశ్వం సహకరించిందా? ఏమో, నా దగ్గర అయితే వివరణలు లేవు.

ఇది  మా అమ్మాయికి చెబితే ఆ షాపులో వున్న MacBook ఉచితంగా వచ్చేసినట్టు విశ్వసించూ అని ఒకటే పోరూ!అది ఎప్పటినుండో అది కొనివ్వమని అంటోంది. నేనేం చెయ్యాలో నాకు అర్ధం కాలేదు.  నువ్వు నమ్మితే కొన్ని నెలల తరువాత వస్తుండొచ్చు అని నచ్చజెబితే రేపే రావాలి అంటుంది ఆ గడుగ్గాయి. నేనేం చెప్పేదీ?  నా దగ్గర జవాబు వుంటే కదా. నేనూ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా, పరీక్షిస్తున్నా. మొత్తం మీద తను విజన్ బోర్డ్ తెచ్చుకున్నాక ఆ ఫోటో దానిమీద పెట్టి ఎక్స్‌పెక్ట్ చెయ్యడానికి అంగీకరించింది. అలా పెట్టేసుకోగానే సరిపోదు - అందుకు తగ్గట్టుగా చర్యలు - అనగా ఇంకా బాగా చదువుకోవడం వగైరాలు వుండాలనీ చెప్పాను.

అంతకుముందు కొద్ది రోజుల క్రితం రెండు సార్లు చాలా చిన్న వాటి మీద పరీక్షిస్తే అవి జరిగాయి. దాంతో నేను అయోమయం చెంది, కాస్త కంగారు పడి, కలయా వైష్ణవ మాయయా అనుకుంటూ మళ్ళీ ఇప్పుడు మాత్రమే అలా చేసి చూసాను. మళ్ళీ ఇంతవరకూ అలా టెస్ట్ చెయ్యలేదు లెండి. ఎందుకంటే చెయ్యాలని అనిపించలేదు. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ కూడా ఒక కారణం లెండి. మరీ అర్జంటుగా అవసరం అయినప్పుడు ఆ ఆయుధం బయటకి తీసి చూద్దాం. ప్రస్థుతానికయితే చాలా స్వల్ప కాలిక, దీర్ఘ కాలిక ప్రణాలికల కోసం విజువలైజేషన్ ద్వారా ఆశిస్తున్నా, విశ్వసిస్తున్నా, కృషి చేస్తున్నా, ఎదురు చూస్తున్నా. అవి సిద్ధిస్తే చాలు. 

నా విజన్ బోర్డ్

- Hawaii Vacation by 2017. గత వారాంతం హవాయీ దీవుల పటాలు ఎక్కించాను. 2017 లో మా కుటుంబంతో కలిసి కనీసం రెండు వారాలు అయినా అక్కడ గడపాలనేది మా వాంఛ.

- Lexus GX 350 SUV by October 26, 2016 if not by April 2016.   ఈమధ్య సరదాగా ఓ రెండు  Lexus షోరూములు చూసివచ్చాం. ఇప్పటికిప్పుడే కొనాలని కాదు లెండి. కొన్నట్టుగా ఊహించుకోవడం కోసం - రంగు, రుచీ (జోకు), వాసనా అనుభూతి చెందడం కోసం. మా ఆవిడేమో కొనదల్చుకోకపోతే చూట్టం ఎందుకూ అనీ - చూస్తేనే మున్ముందు కొనగలం అనీ నేనూనూ.  మొత్తమ్మీద మూతి విరిచేసి వచ్చేసింది లెండి. నా స్నేహితులు RX మోడల్ సూచించారు కానీ నాకు GX నచ్చింది. ధర ఎక్కువే కానీ నచ్చేసింది. అది కొన్నట్లు ఊహించుకోవడానికి కూడా సంకోచించాను. నా అంతరాత్మని అడిగాను. ఇష్టమయినది కాస్త కష్టమయినా కొనాల్సిందే అంది. నీకెందుకూ నే చూసుకుంటాగా అంది.  సరేలే దానికి లేని నొప్పి నాకెందుకూ అని విజన్ బోర్డ్ మీదికి ఎక్కిచ్చేసా.

[అయితే ఒక ముఖ్యమయిన వ్యక్తి నుండి ఇంకో సూచన వచ్చింది. బెంజ్ 4matic SUV. వచ్చేవారం బెంజ్ షోరూమ్ కి వెళ్ళి ఆ ఫోటోలు తీసుకువచ్చి ఇది తీసేసి అది పెట్టేస్తాను. నా ఇష్టం కంటే ఒక్కోసారి నాకిష్టమయిన వాళ్ళ ఇష్టాన్నే నేను ఇష్టపడుతాను :)  ]   

ఈమధ్య మా ప్రాంతీయ వాట్సాప్ గ్రూపులో Lexus గురించిన చర్చ మొదలయ్యింది. మా ఇంటికి కొంచెం దూరంలో US లోనే పెద్ద Lexus షోరూమ్ ప్రారంభోత్సవం జరిగింది. చూడటానికి వెళ్ళాం. నా మిత్రులు కూడా వెళ్ళి చూసొచ్చారు. అబ్బో ఫైవ్ స్టార్ హోటల్ లాగా వుంది. కస్టమర్లు వేచి వున్నప్పుడు వినియోగించుకోవడానికి ఎన్ని సదుపాయాలో! 41 ఎకరాల స్థలంలో 16 ఎకరాలు కేవలం అమ్మే కార్ల కోసమే. ఒకతని డ్రీమ్ ప్రాజెక్ట్ అది. చక్కటి విజన్ తో తన కల నెరవేర్చుకున్నాడు.
http://www.dailyherald.com/article/20150715/news/150719310/

అప్పుడు కూడా మళ్ళీ GX నచ్చింది. ఈలోగా LOA (Law Of Attraction) నాకు సూచించిన మిత్రునికి కూడా అంతకు ముందు RX నచ్చినా ఇప్పుడు GX నచ్చింది కానీ ధర ఎక్కువగా వుండటంతో Audi కారు తీసుకుంటా అన్నారు. మేమంతా GX కే ప్రోత్సహించడంతో, వాళ్ళవిడకీ అదే నచ్చడంతో రైఠో అన్నాడు. +ve ఫ్రీక్వెన్సీలు ఇతరుల మీదకు కూడా ప్రవహిస్తుంటాయంటారు. దానికి ఉదాహరణ ఇదేనేమో. 

ఇంకో ఉదాహరణ: LOA గురించి ఒక దగ్గరి మిత్రుని ఇంట్లో ఒక శుక్రవారం రాత్రి వివరించాను. అతను బెంచ్ మీద వుండి ఒక ఫుల్ టైమ్ జాబ్ ఇంకా రాక కాస్త ఫస్ట్రేషనులో వున్నారు. మరుసటి రోజు శనివారం. సెలవు రోజు అయినా సరే అతని ఉద్యోగం ధ్రువపడింది. అతనూ విస్మయం చెందాడు - నా గురించి ఆలోచించారా అని నవ్వుతూ అడిగాడు. మరీ వెంటనే అలా తెలుస్తుందని ఊహించలేదు కానీ అతనికి ఆ జాబ్ వచ్చినట్లే  భావించాను. ఇవి కో-ఇన్సిడెన్సులా లేక నిజమా నాకు తెలియదు. +ve మైండ్ సెట్ వల్ల అన్నీ అద్భుతాలే అనిపిస్తున్నాయేమో మరి! 

నాకు తెలిసిన ఒక కల్కి భక్త కుటుంబం వుంది. ఆ కల్కి అవతారుడు చెయ్యి కదిపినా, వేలు కదిపినా, కాలు కదిపినా సరే వాళ్ళకు అందులో ఏదో ఒక అద్భుతం కనిపిస్తూవుంటుంది. ఇప్పుడు నేనూ అదే స్థితిలో వున్నానేమో :) ఏమయినప్పటికీ ఏ దొంగ బాబాలనో, స్వాముల వారినో నమ్మి మోసపోకుండా నన్ను నేను నమ్మితే, అది అద్భుతంగా అనిపిస్తే, అది నన్ను, మా కుటుంబాన్నీ, నా శ్రేయోభిలాషులనూ సంతోషంగా వుంచితే, ముందుకే నడిపిస్తే మంచిదే కదా. నా హేతువాద మనస్తత్వం ఇవన్నీ మిరకిల్స్ అని ఒప్పుకోవడం లేదు కానీ వీటి వెనుక ఏదో లాజిక్కు వుండి వుంటుంది - Selective Thinking, Selective Reasoning, Filtering, Psychological Frequency etc.  LOA గురించి చాలామంది చెప్పేదంతా నమ్మట్లేదు - నాకు నమ్మకం అనిపించినంత మేరకు మాత్రమే తీసుకుంటున్నా. ఏవో కొన్ని లోపాలున్నాయని మిగతాదంతా త్రోసిపుచ్చడం సరి అయినది కాదు కదా. 

ఏంటో ఎక్కడి నుండి ఎక్కడికో వెళ్ళాను. మిగతావి మరోసారి వ్రాస్తాను.  

పాజిటివ్ తరంగాలు

ఈమధ్య చిన్న చిన్న మార్పులు కనపడుతున్నాయి. పాజిటివ్ మైండ్ సెట్ తో వున్నందున నాకు అవే కనిపిస్తున్నాయేమో. మంచిదే కదా. మా అమ్మాయి స్కూల్లో మంచి గ్రేడ్స్, మంచి రివ్యూస్ తెచ్చుకుంది. చక్కటి ఆత్మవిశ్వాసంతో చురుకుగా వుంటోంది. అబ్బెబ్బే, చాలామంది దేశీల్లాగా మేము క్లాసు ఫస్ట్ గట్రా రావాలని టార్చర్ ఏమీ పెట్టం లెండి కానీ మొదటి గ్రేడులో అయినా వుండాలని ప్రోత్సహిస్తాం. డాక్టర్లూ, ఇంజినీర్లూ కావాలనే ఒత్తిడి ఏమీ వుండదు. వాళ్ళకు ఏది ఇష్టమయితే అదీ.

మా అమ్మాయి బరువు ఎక్కువ. తగ్గించాలని ప్రయత్నాలు చేస్తున్నాం. పిల్లలని డైటింగ్ చేయించకుండానే బరువు తగ్గించాలి. ఈమధ్య రెండు మూడు నెలలుగా బరువు నిలకడగా వుంటోంది, పైగా ఎత్తు పెరుగుతోంది. వారం వారం తన బరువు చూసి క్యాలెండర్ మీద రికార్డ్ చేస్తుంటాను. గత వారానికి ఈ వారానికీ ఒక కిలో బరువు తగ్గింది. నమ్మలేకపోయాను. మరో రెండు సార్లు చూసాను. కరెక్టే.

బరువు అంటే గుర్తుకు వచ్చింది. కొన్ని వారాల క్రితం ఒక చిన్న ప్రయోగం చేసాను. ఇక్కడి సన్నిహిత కుటుంబాలను ఒక రెక్వెస్ట్ చేసాను. ఏంటంటే వాళ్ళు మా చిన్నమ్మాయి కనపడ్డప్పుడల్లా 'బరువు తగ్గుతున్నావే భలేగా' అని వ్యాఖ్యానించాలి.  ఎందుకంటే తనలో బరువు ఎక్కువగా వున్నానన్న బిలీఫ్ సిస్టమ్ నాటుకుపోయింది. దాన్ని తొలగించి పాజిటివ్‌గా తన నమ్మక వ్యవస్తను  ప్రోగ్రామ్  చేసేందుకై అలా చేసాను. ఆడవాళ్ళందరూ భలేగా సహకరించారు. "ఏంటే, బరువు బాగా తగ్గావు కదా" అని కనిపించినప్పుడల్లా పాజిటివ్ సజెషన్ ఇచ్చారు. ఒక్కరంటే నమ్మకపోయేదేమో గానీ  అలా  నలుగురు అన్నప్పుడు ఇహ నమ్మక తప్పుద్దా? నమ్మేసింది :) అప్పటినుండీ కాన్‌ఫిడెంటుగా వుంటూ వచ్చింది. తను బరువు తగ్గడంలో మిగతా కారణాలతో బాటుగా ఆ పాజిటివ్ ప్రోగ్రామింగ్ కూడా పనిచేస్తుండాలి. ఒక్క వారంలొ ఒబేసిటీ దశ నుండి అధిక బరువుకు దశకు వచ్చింది. ఇంకా పది కిలోలు తగ్గితే అధిక బరువు నుండి సాధారణ బరువుకి వస్తుంది.

మీలో కూడా ఎవరయినా బరువు తగ్గాలనుకుంటే ముందు మీరు తగ్గినట్టుగా గట్టిగా నమ్మెయ్యండి. మనస్సు ఆ అవాస్తవాన్ని అంగీకరించడానికి మొరాయించినా సరే అలా సూచనలు ఇచ్చుకోండి. అలా కొద్దిరోజులు చేసాకా మీకే ఆకలి తక్కువవుతుంది, ఆరోగ్యకరమయిన ఆహారం తినాలనిపిస్తుంది, వ్యాయామం చెయ్యాలనిపిస్తుంది. వివరాల కోసం సెల్ఫ్ టాక్ పుస్తకాలు కానీ పాజిటివ్ సజెషన్స్ గురించిన పుస్తకాలు కానీ చదవండి.

నేను కూడా చిన్న చిన్నగా ఎదుగుతున్నాను. తెలుగులో రచయితలకి అంత ఆదరణ లేదు కాబట్టి ఇంగ్లీషులో రచయితగా ప్రయత్నాలు చేస్తాను. ప్రాక్టీసు తప్పింది కాబట్టి ముందు అయితే తెలుగులో మొదలెట్టా. పూర్తి అయ్యాకా తెలుగు పత్రికలకి పంపించి చూస్తా. ప్రస్థుతానికి అయితే ఒక థ్రిల్లర్ మొదలెట్టా. అది ఉత్సాహంగా నడుస్తోంది. అయిపోయాక కొద్దిమందికి పంపించి వారి అభిప్రాయాలు తీసుకొని సవరిస్తాను. 

ఇంకా చిన్నా చితకా మార్పులు ఏవో వున్నాయి లెండి. కొన్ని లేవు - కారణం ఆ మార్పుల మీద నాకు అంత ఆసక్తి లేదు, ఫోకస్ లేదు.  

నేను చెప్పిన పుస్తకాలు తెలుగులో ఇక్కడ దొరుకుతాయి


ఈమధ్య నేను ఉదహరించిన పుస్తకాలతో బాటుగా ఇతర మంచి పుస్తకాలు ఇక్కడ దొరుకుతాయి.

http://manjulindia.com/telugu.html

సరిగ్గా అలాంటి ఇల్లే అప్పట్లో కెనడాలో కొన్నాను

కెనడాలో తొలి ఉద్యోగం చేస్తున్న రోజులవి. మా ఇంట్లో నేను ముందు ముందు కొనబోయే ఇల్లు ఎలా వుండాలో అలా నా కలల సౌధం పోస్టర్ లివింగ్ రూమ్ గొడ మీద అతికించుకున్నా. ఏదో గొప్ప ఇల్లు అని ఊహించుకోకండేం. ఏదో అప్పట్లో నా స్థాయికి తగ్గ విధంగా టవున్ హవుజ్ పోస్టర్ అతికించుకున్నా. అలా ఆ పోస్టర్ ను నేనూ, మా వాళ్ళూ ఎన్ని సార్లు చూసివుంటామో. ఆ తరువాత చాలా సార్లు ఇళ్ళూ మారేమూ, ఊర్లూ మారేమూ. సిల్లీగా అనిపించి మళ్ళీ అలాంటి పోస్టర్ అతికించుకోలేదు. 

కట్ చేస్తే 3, 4 ఏళ్ళ తరువాత నయాగరా ఫాల్స్ కి దగ్గరలో సరిగ్గా అలాంటి ఇల్లే కొన్నాను. కొద్దిమంది మిత్రులూ, శ్రేయోభిలాషులూ టవున్ హవుజ్ మళ్ళీ అమ్మితే మంచి ధర రాదనీ, ఇండివిడ్యుయల్  ఇల్లు కొనమని గట్టి సలహాలే ఇచ్చినా కూడా ఒక నెల ఆలస్యాన్ని భరించని మా ఆవిడ మంకుపట్టూ తదితర కారణాలన్నీ నన్ను టవున్ హవుజ్ తీసుకోవడానికే ప్రోత్సహించాయి. గృహప్రవేశం చేసిన రోజు రాత్రి పనులూ, పార్టీ అయిపోయాక విశ్రాంతి తీసుకుంటుంటే అప్పుడు గుర్తుకువచ్చింది ఆ పోస్టర్!

వార్నీ అనుకున్నా. మరి తెలిసి పెట్టానో, తెలియక పెట్టానో నాకు ఇప్పుడు గుర్తుకులేదు కానీ ఆ పోస్టర్ మా సబ్ కాన్షియస్ మైండ్స్ లో బలంగా నాటుకుపోయి సరిగ్గా అలాంటి ఇల్లే కొనడానికి పురికొల్పింది అని విశ్వసిస్తున్నాను. ఇల్లు కొనడం మంచి నిర్ణయమే అయినా ఆర్ధిక కారణాల వల్ల టవున్ హవుజ్ తీసుకోవడం అంత చక్కని నిర్ణయం కాదు. నేను అప్పుడు కానీ, ఆ తరువాత కానీ ఆ పోస్టర్ మార్చి ఇండివిడ్యుయల్ హవుజ్ పోస్టర్ అతికించుకొని వుంటే బావుండేది. అప్పట్లో నేను టవున్ హవుజ్ కొనడమే ఎక్కువ కాబట్టి అదే పెట్టుకున్నా - అలాగే జరిగింది. 

ఇందులో నేను నేర్చుకున్న గుణపాఠం ఏంటంటే మన అంతః చేతనకి మనం ఎలా ఆదేశం ఇస్తే, లేదా మనం ఎలా బలంగా విశ్వసిస్తే అలా పరిస్థితులు దారితీసేలా దోహదపడుతుంది. అందుకే మనం కలలు కనగానే సరిపోదు, సరి అయిన కలలు కనాలి - వాటిని అప్‌గ్రేడ్ చేస్తూ వుండాలి కూడానూ :) ఉదాహరణకి మీరు మీకు నచ్చిన కారు మీ ఇంటిముందు వుంటుందని బలంగా విశ్వసిస్తున్నారు అనుకోండి. ఏదో ఒకరోజు మీ పక్కింటోడు పొరపాటున ఆ కారు మీ ఇంటిముందు పార్క్ చేయవచ్చు :)) సో, మనం ఆ కారు టైటిల్ లేదా భీమా మన పేరున వుంటున్నట్లుగా కూడా విశ్వసించకపోతే అలాంటి చిత్రమయిన తప్పిదాలు జరిగిపోతూవుంటాయి. నా నాగుపాము కథ మీకు గుర్తుకువుంది కదా!

నిన్న మా చిన్నమ్మాయీ, నేనూ వెళ్ళి రెండు ఫోమ్ బోర్డులు తెచ్చుకున్నాం. వాటిని మా విజన్ బోర్డులుగా వినియోగిస్తాం. మా లక్ష్యాలని అందులో పొందుపరుస్తాం. ఆ లక్ష్యాలని ఆల్రెడీ అందుకున్నట్లుగా విశ్వసిస్తాం, ఊహల్లో వివరిస్తాం.  మేము కలలని కంటాం, విశ్వసిస్తాం, అందుకోసం అడుగులేస్తాం, నెరవేర్చుకుంటాం. అలాంటి ఇలాంటి కలలే కాదు - పెద్ద పెద్ద కలల్నే కంటాం. అలాంటి పెద్ద కలలని కనడానికి కూడా మీలో చాలామందికి లాగా తటపటాయించం. మనవల్ల కొంతే అవుతుందని చాలామందిమి అనుకుంటాం కానీ మనం మనల్ని ఎంత విశ్వసిస్తే అంతా చెయ్యగలమని ఈమధ్య ఇంకా బాగా తెలిసింది. ఇవన్నీ వ్రాస్తూ నేను నా సమయం ఏమీ వృధా చెసుకోవట్లేదండీ - నా మనస్సుకి ఇలా కూడా పాజిటివ్ సజెషన్స్ ఇస్తున్నాను.

ఇప్పటిదాకా నేను బెంజి కారుకి కూడా గతిలేని పేదోడిని!? (నిజానికి నేను ఇలాంటి పేద మాటలు వ్రాయకూడదు. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండుకి నేను జోక్ చేస్తన్నానా  లేక నిజ్జంగా అంటున్నా అనేది తెలియదు - ఏది అనుకుంటే అలా తీసుకుంటుంది.) - ఇకపై అలాక్కాదు. ఇలాంటి పేదమాటలు బయటకి (మరియు మనస్సుకీ) చెప్పుకోకూడదు కానీ మా ఆవిడ డైమండ్ నెక్లస్ కావాలని ఎప్పటినుండో అంటోంది. దాన్దేవుందీ - నేనూ వింటూనే వున్నా. నిన్నా అనింది, ముందు ముందు కూడా అంటూ వుంది. అబ్బే అలాక్కాదు - నీకు నేను ఆల్రెడీ అది కొనిచ్చేసినట్లుగా ఫీల్ అయిపో అన్చెప్పా - అబ్బే!   అలా విశ్వసించకపోవడమే తను ఎప్పటినుండో చేస్తున్న పొరపాటు. అలాంటి పొరపాట్లే మనం ఎన్నో చేస్తుంటాం. ఆశించడం అందరూ చేసేదే - కాదు - అవి మనకు కావాలీ అంటే అవి ఆల్రెడీ మనం అందుకున్నట్లుగా నమ్మాలి. అప్పుడు అవి మనవి అవుతాయి. అప్పుడు అవి అందుకోవడానికి మన మనస్సు దారిచూపుతుంది. అలా ఇలా కాదు - మనలో బర్నీంగ్ డిజైర్ వుండాలి - అది అందుకోవడానికి మనం తగిన సమయం నిర్దేశించుకోవాలి. అలా అని మా అమ్మాయిలాగా మన కలలు రేపే సాక్షాత్కారం కావాలన్నా కుదరదు కదా. ఏమో మీ కోరిక మరీ అంత గాఢంగా వుంటే అలాగే అవుతుందేమో కూడా - యూనివర్స్ పవర్ ని విశ్వసించేవాళ్ళు అదీ విశ్వసిస్తారు మరి. నాకు తెలియదు.    

పెళ్ళికి ముందు విజయసాధన పట్ల చాలా పట్టుదలగా వుండే వాడిని. అప్పటికి తెలిసిన కొన్ని పద్ధతులు పాటిస్తూ ఏవో చిన్న చిన్న విజయాలు నా ఖాతాలో వేసుకునేవాడిని. పెళ్ళయ్యాక రకరకాల కారణాల వల్లనూ, బాధ్యతల వల్లనూ, డిప్రెషన్ వల్లానూ, డిప్రెషన్ మందుల వల్లనూ పట్టుదల పడకేసింది. ఇన్నాళ్ళూ నా ఆరోగ్యం (అనగా నా హార్మోన్లూ, న్యూరోట్రాన్స్మిట్టర్లూ - మామూలుగా మనుషులకు వచ్చే రోగాలేవీ నాకు లేవు లెండి) మీద పోరాడి ఈమధ్యనే పూర్తి విజయం సాధించాను. సో, ఇక విజయం వైపు పయనమే. ఇది వరకు ఆరోగ్య విషయాల గురించి ఎక్కువ వ్రాస్తుండేవాడిని. ఇకపై విజయల గురించి ఎక్కువ వ్రాస్తుంటాను. అదీ నా పారడైమ్ షిఫ్ట్! ఈ సందర్భంలో ఒక చిన్న గమనిక. మీలో ఎవరయినా గనుక క్రుంగుబాటుకు SSRI టైప్ మెడిసిన్స్ వేసుకుంటే మోటివేషన్ మందగించే అవకాశం వుంది. డాక్టరూ, సైకియాట్రిస్టులూ శుబ్బరంగా అలాంటి మందులు ఇచ్చేస్తుంటారు - వాళ్ళకి పోయేదేంవుంది? DNRI టైప్ మందులు వాడితే మంచిది - అవి మీకు సెట్ అయితే. నేను చాలా ఏళ్ళు ఈ డాక్టర్లని నమ్మి అమాయకంగా అన్యాయం అయిపోయాను. పరిశోధించీ, పరిశోధించీ గురించి తెలుసుకొని నా కొత్త సైకియాట్రిస్టుకి మరీ చెప్పి మందు మార్పించుకున్నాను. ఇప్పుడు ఇక ఏ సమస్యా లేదు - ఇక రచ్చ రాంబోలానే! ఇలా కృంగుబాటు ఎందుకూ - మళ్ళీ మందులూ, మాకులూ ఎందుకూ అని మీరు మొదటికి వస్తే నేను ఇప్పుడు మళ్ళీ వివరించలేనండీ. నాది క్లినికల్ డిప్రెషన్ - మీరు సాధారణంగా అనుకునే సాధారణ కృంగుబాటు కాదు మరీ. మీరేం సలహాలు ఇవ్వబోతున్నారో నాకు తెలుసు - చాలా మంది ప్రయత్నించారు కానీ ఇక ఆపెయ్యండి. మీకంటే నాకు ఈ విషయం గురించి చాలా బాగా తెలుసు అని విశ్వసించండి. సరే, ఇక ఈ టాపిక్ వదిలేద్దాం. నిజానికి నేను ఇలాంటి నెగటివ్ విషయాలు ఇక ఎక్కువగా ఆలోచించవద్దు, ప్రస్థావించవద్దు కానీ పాఠకుల ప్రయోజనం కోసం కొన్ని సార్లు నా నియమాలకు మినహాయిపులు ఇచ్చుకోవాల్సివుంటుంది. నెగటివ్ విషయాలు మెన్షన్ చెయ్యకపోతే పాజిటివ్ విషయాలతో వాటికి వుండే కాంట్రాస్ట్ చూపించలేము కదా.    

ఇప్పటికే ఈ పోస్టులో చాలా వ్రాసాను. మరో పోస్టులో మా అమ్మాయి విజువల్ బోర్డులో ఏముంటుంది, నా విజువల్ బోర్డులో ఏముంటుంది అనేది చూద్దాం. బ్లాగుబద్దమయిన హెచ్చరిక - నా విజన్/విజువల్ బోర్డులోని విషయాలు తెలుసుకొని మూర్ఛపోకండేం - అలా అనీ పగలబడీ నవ్వుకోకండీ. నవ్విన నాపచేనే పండుతుంది - ఆల్రెడీ పండుతోంది కూడానూ! ఇహ మా అమ్మాయి విజువల్ బోర్డ్ ఏమో కానీ అది నాకు టార్చర్ బోర్డ్ లాగా అవుతోందని తనతో సరదాగా నిన్ననే అన్నా! ఎందుకంటే సబ్‌కాన్షియస్ మైండ్ ద్వారానో, యూనివర్సల్ పవర్ ద్వారానో కాకుండా తన కలలు నా ద్వారా తీర్చుకోవాలని విజువలైజ్ చేస్తోంది మరి. Grrr....తన కలలేంటో చూద్దాం. ఒక తన కలా, నా కలా చాలా చక్కగా కలిసిపోయింది - బహు బావుంది అది. అది ఏంటో, ఎలాగోనో  అదీ చూద్దాం మరి.  

మీతో మీరు ఏం మాట్లాడుకోవాలీ?

పాజిటివ్ సజెషన్లు, నెగటివ్ సజెషన్ల యొక్క ప్రభావం ఎంతో నాకు ఎన్నాళ్ళనుండో తెలుసు. విషయాలు తెలిసినంత మాత్రాన సరిపోదు కదా. వాటిని ఆచరించాలి కదా.  ఏదో అడపాదడపా అవి పాటించేవాడిని కానీ పెద్దగా పట్టించుకోలేదు. మళ్ళీ ఇన్నాళ్ళ తరువాత కుదురుతోంది. కారణం - ఈమధ్య తక్కువ కాలంలో ఎక్కువ విజయాలు సాధించిన ఒక మిత్రుడిని అతని విజయ రహస్యం అడిగాను. ఒకటి The Secret (Book/Video)  రెండవది ఈ పుస్తకం అన్నాడు. వెంటనే అమెజాన్ లో ఆర్డర్ చేసి తెప్పించాను. చదువుంటే బుర్రలో ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇన్నాళ్ళూ ఇంత చెత్తగా ఆలోచిస్తూ వస్తున్నానా అని అర్ధమయ్యింది. నేనొక్కడినే కాదు మీలో కూడా 99% మంది అంత చెత్తగానే ఆలోచిస్తూవుంటారు. మీకు గనుక విజయం పట్ల అయినా లేక మాంఛి వ్యక్తిత్వం పట్ల అయినా లేక మంచి ఆలోచనాధోరణి పట్లా అయినా ఏమాత్రం ఆసక్తి వున్నా క్షణం ఆలస్యం చెయ్యకుండా వెంఠనే ఈ పుస్తకం ఆర్డర్ చెయ్యండి లేదా కొనండి. పీరియడ్! 

Reviews in Amazon:

కెనడా కొత్త ప్రధాని నుండి కేసీఆర్ నేర్చుకోవాల్సింది ఇదీ!

కెనడా కొత్త మంత్రివర్గంలో 15 మంది పురుషులు, 15 మంది స్త్రీలు! మరి తెలంగాణా మంత్రివర్గంలో ఎంత మంది స్త్రీలు వున్నారు??

నాకో నాగుపాము కనిపించిన విధంబెట్టిదన!

ఆరో తరగతి చదువుకుంటున్నా అనుకుంటా. నాకు అప్పుడే 'లా ఆఫ్ ఎట్రాక్షన్' వగైరా పేర్లు తెలియదు కానీ నేనేం తలుచుకుంటే అది జరుగుతుందనే ఓ వెర్రి నమ్మకం అయితే వుండేది. అయితే అది నిరూపణ అవాలి కదా? అంచేతా నాకో నాగుపాము కొన్ని రోజుల్లో కనిపించాలని తీర్మానించుకున్నాను. నా అదృష్టం బావుండి ఇంకా గాఠ్ఠిగా నిరూపణ అయ్యేందుకు గానూ అది నన్ను కరవాలని కూడా నిర్ణయించుకున్నాను కాదు. బ్రతికిపోయాను. అయినా కింగు కోబ్రా కనిపించి తీరాలనే మహత్తరమయిన ఐడియా నాకెందుకొచ్చిందో నాకిప్పుడు గుర్తుకురావడం లేదు సుమీ. అలా అని నాకు పాములంటే ప్రేమేం లేదు - చచ్చేంత భయ్యం. బహుశా మా ఇంటిపేరు ఆ పాము పేరుకి కాస్త దగ్గర కాబట్టి అలాంటి చక్కని నిర్ణయం నేను అమాయకంగా తీసుకొని వుండొచ్చు. 

ఓ మూడు వారాలు నేను తపస్సు అనగా విజువలైజ్ చెయ్యగా చెయ్యగా అది ఎంచక్కా కనపడింది. ఆ దృశ్యం నాకింకా స్పష్టంగా గుర్తుకువుంది. పేద్ద పొడవయిన తాచుపామును చంపి మెడలో వేసుకొని మా ఊరిలో మావీధి గుండా ఒకతను వెళుతున్నాడు. అతని పక్కనే అతని సహచరుడూ వున్నాడు. అందరూ ఆసక్తిగా వాళ్లనీ, ఆ పామునీ గమనించసాగారు.  

నేను బిక్కచచ్చిపోయాను. నేను అలా చచ్చిన పాముని చూస్తా అనీ నేను కలలో కూడా అనుకోలేదు. పాముని చూడాలన్న నా కోరిక నెరవేరింది కానీ అలా అని చచ్చిన పాముని చూస్తా అని అనుకోలేదు. నేను ఏది తలుచుకుంటే అది జరుగుతుంది అనే నమ్మకం మరి నిజమా కాదా అని నాకు అర్ధం అవక బుర్ర గోక్కొని ఇహ ఆ నమ్మకాన్ని పక్కకు పడేసాను.  

కొన్నేళ్ళ తరువాత కాస్త ఈ విషయాల మీద జ్ఞానం వచ్చేకా విశ్లేషించుకుంటే నా పొరపాటు నాకు అర్ధం అయి నాలుక కరచుకున్నా. నేను పాము కనపడాలని ఊహించుకున్నా కానీ బ్రతికివున్న పాము కనపడాలని అనుకోలేదు కదా. అందుకే యూనివర్స్ నా కోరికను నేను కోరిన విధంగా నెరవేర్చింది. అందుకే మనకేం కావాలో మనం స్పష్టంగా నిర్వచించుకొని మన సబ్ కాన్షియస్ మైండ్ కి అనుజ్ఞ ఇవ్వాలి. అప్పుడు అది తన కర్తవ్యం తాను నిర్వర్తిస్తుంది.   

Law Of Attraction


LOA గురించి మీలో ఎవరికయినా తెలుసా? ఎవరయినా పాటిస్తున్నారా? ఆసక్తి వుంటే గూగుల్ చేసి తెలుసుకోండి. The Secret వీడియో చూడండి. Netflix, YouTube లో కూడా అది వుంది. 

నేను పాటిస్తున్నా. లాజిక్కులు కాస్త పక్కకు పెట్టి పాటిస్తున్నా, అద్భుతంగా వుంది. వివరాలు త్వరలో. 

దీని గురించి నేనో చిన్న వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసాను. మీకు ఆసక్తి వుంటే మీ మొబయిల్ ఫోన్ నంబర్ ఇవ్వండి. చేరుస్తాను.